[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
కదలని ఓ శిలనే అయినా..
తృటిలోన కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట?
నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా
ఓ ప్రశ్నయి ఉంటానంటున్నా
తమిళంలో పాటతో తెలుగు పాటను పోలిస్తే ‘96’ తమిళ సినిమాకూ, ‘జాను’ తెలుగు సినిమాకూ దృక్కోణంలో తేడా తెలుస్తుంది. తమిళం సినిమా పేరులో ‘వ్యక్తి’ లేడు. ‘వ్యక్తిగతం’ లేదు. కథ ఇద్దరు ప్రేమికులకు చెందినదే అయినా మొత్తం తరగతికి సంబంధించిన సినిమా అన్న భావన కలుగుతుంది. తెలుగులో ‘జాను’ అనటంతో ఒక పాత్ర ప్రాధాన్యం అన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం సినిమా ఆరంభంలో వచ్చే పాట చిత్రీకరణ స్పష్టం చేస్తుంది.
తమిళ సినిమా పాట చిత్రీకరణ పూర్తిగా భారతదేశంలోనే జరిగింది. ‘అండమాన్ నికోబార్’ దీవులలో ‘ఎలిఫెంట్ బీచ్’, ‘రాస్ ద్వీపాలు’, ‘గుజరాత్’లో ‘రాణ్ ఆప్ కచ్’, ‘రాజస్థాన్’లో ‘థార్ ఎడారి’, ‘హిమాచల్ ప్రదేశ్’ లోని ‘జోగిని జలపాతం’, ‘మనాలి’ వంటి ప్రాంతాంలో పాటను చిత్రీకరించాను. పాట దృష్టి ప్రకృతి దృశ్యాలను అందంగా చూపించటం పైన ఉన్నా, వాటికి నాయకుడి స్పందనను, నాయకుడి వ్యక్తిత్వాన్ని చూపటంపై కూడా ఉంటుంది.
తెలుగు పాట పూర్తిగా విదేశీ లోకేషన్లలో చిత్రితమయింది. ‘టాంజనియా’లోని ‘కిలిమంజారో పర్వతం’, ‘సెరింగేటి నేషనల్ పార్క్’, ‘కెన్యా’లోని ‘క్రిసెంట్ ఐలాండ్ గేమ్ సాంక్చురీ’, ‘లేక్ నవీషా నేషనల్ పార్క్’, ‘డియానీ బీచ్’ వంటి ప్రాంతాలలో పాటలోని సన్నివేశాలు చిత్రితమయ్యాయి. అంటే, తమిళ రామ్‌ది లోకల్ స్థాయి ఫోటోగ్రఫీ అయితే, తెలుగు రామ్‌ది అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రాఫీ అన్న మాట.
తమిళ పాట భావానికి, తెలుగు పాట భావానికి కూడా చాలా తేడా ఉంది. తమిళ పాట అనుభవం నేర్పిన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తే, తెలుగు పాట పాత్ర వ్యక్తిత్వంలోని తాత్వికతను ప్రదర్శిస్తుంది. కానీ చిత్రీకరణలో ఆ తాత్వికత కనబడదు.
పాట ఆరంభంలో వెంటవెంటనే కెన్యా సాంక్చువరీ లోని జంతువుల షాట్స్ కనిపిస్తాయి. తమిళంలో లానే సరిగ్గా గిటార్ తంత్రులు మ్రోగే సమయానికి వెనుక నుంచి హీరో కనిపిస్తాడు, ‘జీబ్రా’లను ఫోటో తీస్తూ, వయోలిన్ మ్రోగే సమయానికి కిలిమంజారో పర్వతం ఫోటో కోసం సరైన కోణాన్ని వెతుకుతూ కెమేరా వైపు పరుగెత్తి వచ్చి ఫోటో తీస్తాడు. ఈ మధ్యలో సైడ్ ఫోజులో, హీరో ఆలోచనగా దృశ్యాలను చూస్తున్న క్లోజ్ అప్ కొన్ని సెకన్లు కనిపిస్తుంది.
పాట ఆరంభమయ్యే సరికి లాంగ్ షాట్‌లో కారులో కెమెరాతో నుంచుని కనిపిస్తాడు. హీరో. పాటలో ‘జీవితాన్ని ఎలా ఉంటే అలా స్వీకరించాను నేను’ అన్న భావం కనిపిస్తుంది. ఏది లభిస్తే దాన్ని ప్రశ్నంచకుండా స్వీకరించానన్న ఆలోచన కనిపిస్తుంది. అంటే, హీరో ఎదురునిలచి పోరాడటం కన్నా, అందిన దాన్ని స్వీకరించటం, లేని దాన్ని మరచి ముందుకు సాగటం లక్ష్యంగా కలవాడని తెలుస్తుంది. తమిళం పాటలో నీటిలో, అడవుల్లో తిరిగితే, అందుకు భిన్నంగా తెలుగు హీరో మైదానాల్లో, చెట్లు లేని పర్వత ప్రాంతాలలో తిరుగుతాడు. బహుశా అతని ఒంటరితనాన్ని, ప్రేమరహిత జీవితాన్ని నేపథ్య దృశ్యాలు చక్కగా ప్రతిబింబిస్తాయని భావించారేమో! తమిళ హీరో జింకకు బ్రెడ్డు తినిపిస్తే, తెలుగు హీరో జిరాఫీకి దాణా తినిపిస్తాడు. హాట్ ఎయిర్ బెలూనింగ్ చేస్తాడు. ‘మసైమరా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్’ లో స్థానిక ట్రైబల్స్‌తో కలసి నవ్వుతూ ఎగుర్తాడు.
నేపథ్యంలో వినిపించే పాట తాత్వికంగా ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి అన్నట్టు ‘ప్రతి నిద్ర మరణం లాంటిది. నిద్ర మెలకువ రావటాన్ని నూతన జన్మగా భావించి గతం అంతా మరచి ఏ రోజు కా రోజు కొత్త జన్మలా భావించాలి’ అన్న భావాన్ని ‘ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా’ అన్న పదాలు పొందుపరచుకుంటాయి. అయితే, తెరపై కనబడే దృశ్యాలకు నేపథ్యంలో పాటకు నడుమ సంబంధం కనిపించదు. పైగా హీరో నిర్లిప్తంగా ఆ క్షణాన్ని అనుభవిస్తున్నట్టు కాక ఆనందిస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో, నేపథ్యంలో వినిపిస్తున్న పాటకు, కనబడే దృశ్యాలకు, నాయకుడి హావభావాలకు నడుమ పొంతన కుదరదు. కానీ సంగీతం, భావం కనబడే దృశ్యాలు, ముఖ్యంగా నాయకుడి ఒంటరితనం, స్వేచ్ఛగా ‘గాలివాటం లాగా ఆగే అలవాటు లేక’ కాలు ఎక్కడా నిలవకపోవటం ప్రేక్షకుడికి అర్థమయితాయి.
పాటలు రెండూ అత్యుత్తమ స్థాయిలో ఉన్నా, చిత్రీకరణ కూడా చక్కని సాంకేతికతతో ఉన్నా, దృశ్యాలు అందంగా ఉన్నా, తమిళ పాట ప్రభావం తెలుగు పాటకన్నా భిన్నంగా ఉంటుంది. బహశా తమిళ పాటలో హీరో స్థానిక స్థాయి, తెలుగు పాటలో ఫైవ్‍స్టార్ స్థాయిల వల్ల ఈ తేడా వచ్చి ఉంటుంది. తెలుగు నాయకుడి కన్నా తమిళ నాయకుడు సహజంగా అనిపిస్తాడు. ప్రకృతికి సన్నిహితంగా ఉన్నట్టు తోస్తాడు. నటుడిలో పాత్ర కనిపించటానికి, పాత్రలో నటుడు కనిపించటానికీ ఉన్న తేడా ఈ రెండు పాటల ప్రభావం పట్టి ఇస్తుంది.
(‘ఏ దారెటుపోతున్నా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=ClSu6QbltLk )
అయితే, రీమేక్ సినిమాలు మూలంగా ఎంచుకున్న సినిమాను మక్కికి మక్కీ అనుసరించాల్సిన అవసరం లేదు. కేవలం మూల కథను తీసుకుని కళాకారులు దాదాపుగా స్వంత, స్వతంత్ర సినిమాను నిర్మించినట్టు నిర్మించవచ్చు.
హిందీలో సూపర్ హిట్ సినిమా ‘దోస్తీ’కి తెలుగు పునర్నిర్మాణం ‘స్నేహం’ను దాదాపుగా స్వతంత్ర సినిమాలా రూపొందించారు బాపు, రమణలు.
కోయీ జబ్ రాహా న పాయే
మేరే సంగ్ ఆయే
కె పగ్ పగ్ దీప్ జలాయే
మేరీ దోస్తీ మేరా ప్యార్..
హిందీలో మహమ్మద్ రఫీ చాలా గొప్పగా పాడిన ఈ పాట నాటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నది. స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్తున్నది. “ఎవరికయినా దారి లభించకపోతే అంటే భవిష్యత్తు శ్యూన్యం అయితే, ఒంటరివారయితే, నాతో రండి దారంతా అడుగడుగునా స్నేహ దీపాలు వెలిగిస్తూ పోదాం.. నా స్నేహం నా ప్రేమ..” అంటుంది హిందీ పాట.
(‘కోయీ జబ్ రహా న పాయే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=Nn_brPYTjpc )
తెలుగు సినిమా పూర్తిగా భిన్నం. కథ అదే. కానీ కథనం భిన్నం. హిందీలో లేని పాత్రలున్నాయి. హిందీ సినిమాతో సంబంధం లేని సందర్భాలున్నాయి. కానీ కొన్ని పాటలు కలుస్తాయి. అలాంటి పాటలలో ‘మేరీ దోస్తీ మేరా ప్యార్’ అన్న పాటతో సారూప్యం కల పాట ‘నీవుంటే వేరే కనులెందుకు’.
నీవుంటే వేరే కనులెందుకు?
నీవుంటే వేరే బ్రతుకెందుకు?
నీ బాటలోని అడుగులు నావే
నా పాటలోని మాటలు నీవే..
రెండు పాటలూ పూర్తిగా భిన్నమైనవి. హిందీ పాట స్నేహతత్వాన్ని, ప్రేమతత్వంతో ముడిపెట్టి వ్యక్తిగత భావన కన్నా సార్వజనీక భావానికి ప్రాధాన్యం ఇస్తుంది. ‘దోస్తీ హై భాయీ, తో బహెనా హై ప్యార్’ అంటుంది. స్నేహం సోదరుడు, ప్రేమ సోదరి అంటూ స్నేహం ప్రేమల నడుమ ఉండేది సోదర సోదరీ సంబంధం అంటోంది హిందీ పాట. తెలుగు పాట స్పష్టంగా స్నేహంలోని ప్రేమ గురించి మాట్లాడదు. ప్రేమలోని స్నేహం ప్రదర్శిస్తుంది. ఈ పాట సినిమాలో ఇద్దరు స్నేహితుల నడుమ పాటగా అని తెలుసుకోకుండా వింటే, ఇది ప్రేయసీ ప్రియుల పాట అని పొరబడే వీలుంది. ‘నీ చేయి తాకితే తీయని వెన్నెల.. అలికిడి వింటనే తొలి పొద్దు’ అన్నది కళ్లు కనబడని పాత్రకు సరిపోతుంది. ఆ సందర్భం తెలియకుండా వింటే ప్రేయసి ప్రియుల భావనలు అనిపిస్తాయి. చిత్రీకరణ కూడా పూర్తిగా భిన్నం.
(‘నీవుంటే వేరే కనులెందుకు?’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=0HN0IDOun8k )
హిందీ సినిమా తక్కవ బడ్జెట్ సినిమా. అంతా స్టూడియోలో తీసేశారు. రోడ్డు మీద అడుక్కుంటు పాడతారు. తెలుగులో ‘నీ వుంటే వేరే కనులెందుకు’ పాటనూ ఇద్దరూ నడుస్తూ పాడుతూ పాడతారు. కుంటి అబ్బాయి భుజం మీద చేయి వేసి గుడ్డి అబ్బాయి నడుస్తూ పాడతాడు. అందమైన చెట్ల నడుమ, చక్కటి లొకేషన్లలో నడుస్తూ పోతూ పాడతారు. పాట బాగుంది. దృశ్యాలు బాగుంటాయి. ఫోటోగ్రఫీ బాగుంటుంది. పాటలో భావాలు బాగున్నాయి. కానీ ప్రధానంగా హీరో పాడేది అడుక్కోటానికి. అడుక్కోగా వచ్చిన డబ్బులతో జీవితం గడుస్తుంది. స్నేహితుడిని చదివిస్తాడు. కానీ తెలుగులో అడుక్కోవటం ‘నవ్వు వచ్చిందంటే కలకల’ పాటలో పరోక్షంగా కనిపిస్తుంది. మిగతా సినిమాలో కనబడదు.
‘నవ్వు వచ్చిందంటే కలకల’ పాటలాంటి సందర్భం హిందీలో ‘జానేవాలో జరా, ముడ్ కె దేఖో ముఝే, ఏక్ ఇన్‌సాన్ హూఁ, మై తుమ్హారీ తరహ్’ – నేను మీలాంటి మనిషినే నా వైపు దృష్టి సారించండి – అంటూ వీధిలో నిలబడి పాడతాడు. డబ్బులు సంపాదిస్తాడు.
(‘జానేవాలో జరా, ముడ్ కె దేఖో ముఝే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=MMSdd9aViVs )
‘మేరీ దోస్తీ మేరా ప్యార్’ అడుక్కుంటూ పాడే పాట. ఆ సందర్భంలో చివరలో అక్క పేరు ఎవరో పిలవటం వింటాడు. ఇలా సినిమాలో ‘పాట’కు అడుక్కోవటానికీ విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ పాత్ర అడుక్కునే పాత్ర అని తప్ప మరో ఆలోచన రాదు. తెలుగులో అలాంటి భావన రాదు. ఇద్దరూ తోటల్లో పాడుతూ పోతారు. ఆనందిస్తారు. బహుశా, పాటలు బాగున్నా, తెలుగు సినిమా అంతగా ప్రజాదరణ పొందకపోవటానికి హిందీ సినిమాలో ఉన్న సహజత్వం, తీవ్రత, తెలుగు సినిమాలో లోపించటం కావచ్చు. అనవసరమైన పాత్రలు, సన్నివేశాలు కూడా సినిమా తీవ్రతను తగ్గించే అంశాలు. పాటలకు సరైన సందర్భాలు లేకపోవటం కూడా తెలుగు సినిమాకు బలహీనం చేసిన ప్రధాన అంశం.
హిందీ సినిమాలో రఫీ పరిణతి చెందిన స్వరం లేలేతగా కనిపిస్తున్న పాత్రకు అస్సలు సరిపోలేదు. తేడా తెలుస్తూంటుంది. తెలుగులో అలా కాదు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో మృదువుగా పాటలు పాడేడు. స్వరంలో వయసు కనిపించనీకుండా పాడాలని ప్రయత్నించాడు. కానీ, హిందీ సినిమాలో పాటలు సినిమా గమనంలో అంతర్భాగం. తెలుగులో పాటలకు సినిమా గమనానికి సంబంధం లేదు. ఒక్క ‘సరే సరే ఓరన్నా పిలిచి పిలిచి ఇంకా వేధించలేనులే’ అన్న పాట సందర్భం హిందీలోని సందర్భమే.
(‘సరే సరే ఓరన్నా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=loPJMLWCAf8 )
పిలిచి పిలిచి నిన్నింకా వేధించనులే
గుండె కలచి కలచి నిన్నూ బాధించనులే..
ఈ పాట హిందీలో ఇదే సందర్భంలో వచ్చిన సూపర్ హిట్ పాట.
చాహూంగా మై తుఝే సాంఝ్ సవేరే
ఫిర్ భి కభీ అబ్ నామ్ కో తేరే
ఆవాజ్ మై న దూంగా
హిందీ పాట చిత్రీకరణలో హీరో ఒంటరిగా రోడ్ల వెంబడి పాడుతూ నడుస్తుంటాడు. రోడ్డు ఎవరో దాటిస్తారు. చెట్టును కొట్టుకుంటాడు. కారు క్రింద పడబోతాడు. రాళ్లకు కొట్టుకుంటాడు. తెలుగులో హీరో పచ్చటి పైర్ల నేపథ్యంలో పాడతాడు. కొండల్లో తిరుగుతూ పాడతాడు. హిందీలో ‘మిత్‌వా, మేరే యార్, తుఝ్‌కో బార్ బార్ ఆవాజ్ మై న దూంగా’లో ఉన్న ఆర్తి, విషాదం, వేదనలు తెలుగు పాటలో లోపించాయి. చిత్రీకరణ కూడా ఆ విషాదాన్ని, తోడు అలవాటయి తోడు కోల్పోయిన గుడ్డివాడు పడే వేదనను చిత్రించదు. ముఖ్యంగా మనుషుల మధ్య పాడతూ అడుక్కునే వ్యక్తి హిందీలో కనిపించినట్టు తెలుగులో కనిపించడు. దాంతో హిందీలో కలిగినట్టుగా పాత్రల పై సానుభుతి కలగదు.
(‘చాహూంగా మై తుఝే సాంఝ్ సవేరే’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://youtu.be/dcuvSh6V9gM?list=RDdcuvSh6V9gM )
హిందీలో ‘మేరా తో జో భీ కదమ్ హై వో తేరీ రాహ్ మే హై’ అనే మరో సూపర్ హిట్ పాట ఉంది. తెలుగులో ఇదే సందర్భంలో ‘నీవుంటే వేరే కనులెందుకు’ విషాదం పాట వస్తుంది. అయితే, తెలుగులో హిందీలో పాట సందర్భాన్ని కాస్త అటు ఇటు చేయటం వల్ల హిందీలో బాగా పండిన సెంటిమెంటల్ డ్రమటిక్ ఎలిమెంట్ తెలుగులో పండలేదు.
హిందీలో గుడ్డి అబ్బాయి జ్వరంతో పడుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది తన స్నేహితుడికి ఆశ్రయమిచ్చిన మాస్టారు మరణించాడనీ, ఫీజు కట్టలేక స్నేహితుడు పరీక్ష రాయటం లేదని. దాంతో, ఎందరు వారించినా వినకుండా, అంత జ్వరంలో బయలుదేరతాడు హీరో.
మేరా తో జో భీ కదమ్ హై
వో తేరీ రాహ్ మే హై
కె తూ కహీఁ భీ రహే
తూ, మేరీ నిగాహ్ మే హై
ఇక్కడ కూడా రఫీ పరిణత స్వరం లేత బుగ్గల నునులేత యవ్వనపు పిల్లవాడికి సరిపోదు. కానీ పాట చిత్రీకరణ పాత్రపై సానుభూతి పెంచుతుంది. ఒంటరిగా నీరు నిండిన గుంటల్లోంచి నడుస్తాడు. వర్షంలో తడుస్తూ పాడతాడు. ఎవరూ లేని వీధుల్లో పాడతాడు. ఉన్నవారు, అటూ ఇటూ పోతూ వర్షంలో పరుగులిడుతూంటారు. ఎవ్వరూ పట్టించుకోరు. ఒకరిద్దరు డబ్బులిస్తారు. ఆ డబ్బులు పోగేసి, స్నేహితుడి ఫీజు కట్టిటానికి వస్తాడు. వర్షంలో తడిసినందుకు అతడి ఆరోగ్యం మరింత పాడైందని తెలుస్తుంటుంది. ఫీజు తీసుకోవటానికి నిరాకరిస్తే, దాదాపుగా ఏడుస్తూ, దగుఉతూ ‘ఐసా న కహియే. బడీ ముసీబత్ మే దిన్ రాత్ ఏక్ కర్‍కే మై యే రూపియా జమా కీ హై’ అంటాడు. ప్రేక్షకుల హృదయం ద్రవిస్తుంది. అయినా డబ్బులు తీసుకోకపోతే ‘లీజియేనా’ అని ఏడుస్తాడు. ప్రేక్షకుల కళ్లు చెమరుస్తాయి.
(‘మేరా తో జో భీ కదమ్ హై’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=tP0D6ZJll1M&vl=en )
ముఖ్యంగా ‘దిన్ రాత్ ఏక్ కర్‍కే’ అన్నప్పుడు ‘మేరా తో జో బీ కదమ్ హై’ పాటలో డబ్బులు సంపాదించేందుకు అతడు పడ్డ కష్టం తలపుకు వస్తుంది. సెంటిమెంట్, డ్రామా పుష్కలంగా పండుతాయి.
తెలుగులో స్నేహితుడు ఫీజ్ కట్టలేకపోతున్నాడని తెలియగానే, అనారోగ్యంగా ఉన్నవాడు లేచి పరుగెత్తుతాడు. ఫీజు కట్టి వస్తూ పాట పాడతాడు ‘నీవుంటే వేరే కనులెందుకు?’ విషాదంగా. అంతకు ముందు పరీక్ష ఫీజుకు డబ్బుల్లేవని తెలియగానే బోషాణం నుంచి డబ్బు తీసుకుని బయలుదేరతాడు గుడ్డబ్బాయి. డబ్బు కట్టేప్పుడు కూడా ‘నా మీద కొంచెం అలిగాడు’ అంటాడు, అంతే. హిందీ లోని డ్రమటిక్ ఎలిమెంట్, కంట తడి పెట్టించే సెంటిమెంటు – ‘దిన్ రాత్ ఏక్ కర్‌కే’ తెలుగులో మిస్సింగ్. తెలుగు ‘స్నేహం’కూ హిందీ ‘దోస్తీ’కి ఇదీ తేడా. ఒక సన్నివేశాన్ని నాటకీయంగా మలచటం, పాత్రల కష్టాలను హృదయం ద్రవించే రీతిలో చూపటం, సెంటిమెంట్ లను తట్టి లేపటం వంటి అంశాలు స్క్రిప్టు రచనలో ప్రధానాంశాలు. ‘మెలోడ్రామా’ అని అలాంటి అంశాలను పట్టించుకోకపోతే ‘రక్తి కట్టే సన్నివేశాలు, కంట తడి పెట్టించే సన్నివేశాలు’ పేలవంగా, మామూలుగా సాగిపోతాయి. పైగా ‘విషాదంపాట’ – ‘నీవుంటే వేరే కనులెందుకు’ పాటలో తర్కం ఉపయోగిస్తాడు గుడ్డి అబ్బాయి.
చూపులేని కన్నుంది కానీ, కన్నులేని చూపుందా?
కొమ్మలేని చెట్టుంది గానీ, చెట్టు లేక కొమ్మ ఉందా?
నేను లేని నీవున్నావు గానీ, నీవు లేక నేనుంటానా?
పాటలో ఉన్న ఈ సెంటిమెంటు, డ్రామా, సన్నివేశంలో లేకపోవటం ‘స్నేహం’ సినిమా ‘బాగుంది’ అనిపించినా ‘గొప్పగా ఉంది’ అనిపించలేకపోవటానికి ప్రధాన కారణం. ముఖ్యంగా హిందీ సినిమాతో పోలిస్తే, హిందీ సినిమాలో, పాటల్లోని సెంటిమెంట్లు తెలుగు పాటల్లోనూ పుష్కలంగా ఉన్నా, సన్నివేశాలు, సందర్భాలు, చిత్రీకరణ పాటలకు బలాన్ని ఊపిరిని ఇవ్వకపోవటం గమనించవచ్చు. తెలుగులో పాటలలో సాహిత్యం గొప్పగా ఉన్నా, స్క్రిప్టు సినిమాను పాటలను దెబ్బతీస్తుంది.
(‘నీవుంటే వేరే కనులెందుకు’ విషాదం పాట యూట్యూబ్‌లో వినవచ్చు
https://www.youtube.com/watch?v=uQsx_AZqZcQ )
చుపా హువా థా ముఝీ మె హై తూ కహీఁ ఏ దోస్త్
మేరీ హఁసీ మే నహీఁ హై, తో మేరీ ఆహ్ మే హై
నీవు నాలో ఎక్కడో దాగి ఉన్నావు స్నేహితుడా! నా నవ్వులో లేకపోతే నా నిట్టూర్పు (విషాదం) లో ఉన్నావు.
పాటలు ఎంత గొప్పగా ఉన్నా బలమైన స్క్రిప్టు తోడవకపోతే సినిమా బలహీనమవటాన్ని హిందీ ‘దోస్తీ’తో తెలుగు ‘స్నేహం’ను పోలిస్తే అర్థమవుతుంది. అయితే హిందీతో సంబంధం లేకుండా, పోల్చకుండా చూస్తే చక్కగా అనిపిస్తుంది. ‘స్నేహం’.
(మళ్ళీ కలుద్దాం)