[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
‘జాను’ సినిమాలో ఈ పాట సినిమా ఆరంభంలోనే వస్తుంది. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల మనస్సులను మురిపించి, స్పందింప చేసి, ఆలోచనలు రేకెత్తించిన అద్భుతమైన పాట ఇది. ఈ పాట చిత్రీకరణ కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. సమాజంలో అనేక యువతీ యువకులే కాదు మధ్య వయసు వారితో పాటు, ప్రతి ఒక్క వ్యక్తి మనస్సులో ఉండే ఒక ఊహను, కలను, నిరాశను అత్యంత సున్నితంగా ప్రదర్శిస్తుందీ పాట. ఈ సినిమాకు మాతృక తమిళంలో ’96’ అనే సినిమా. దాంతో ఈ పాటకు కూడా మూలం తమిళం పాటలో ఉంది.
సముద్ర తీరం చేరిన తరువాత
సముద్రాన్ని ప్రేమిస్తాను
తల నెరసిన తరువాతనే
ప్రపంచం అర్థమవుతుంది
నిన్నటి ఆనందాలన్నీ ఏకమై
ఈ రోజు, ఈ క్షణాన అర్థవంతమవుతాయి
రేపు బోధపడతాయి
నేను జీవించలేని నా జీవితాన్ని జీవిస్తూ
భరిచలేక ముందుకు సాగుతున్నా
అంతులేని కోరికలను,
ఇప్పుడు ఇక్కడ రగిలించేందుకు,
ఇక్కడ, ఇప్పుడు దాని లో మైమరచిపోతున్నా
ఇది తమిళ పాట ఆరంభంలో ప్రదర్శితమయ్యే భావం.
తెలుగు సినిమా తమిళ సినిమా ‘రీమేక్’ కాబట్టి రెండు సినిమాల కథ ఒక్కటే.
నాయకుడు, నాయిక స్కూలులో ఉన్నప్పుడు ఇష్టపడతారు. వారి ఇష్టం స్వరూపం బోధపడే వయసు కాదు వారిది. ఓ రోజు పరిస్థితుల వల్ల నాయకుడి కుటుంబం ఊరు వదలి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇద్దరి మనస్సులలో చిన్నప్పటి అస్పష్ట భావన, తీవ్రత వారితో పాటు పెరిగి పెద్దదవుతుంది. ఆమెకు వివాహం అవుతుంది. తన మనసులోని అర్థం కాని కోరిక కలిగిస్తున్న అలజడిని, అశాంతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో అతడు ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. ఒంటరిగా ఉంటాడు. మళ్లీ క్లాస్‌మేట్లందరూ కలసే సందర్భంలో నాయికను కలుస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా ఇష్టపడుతున్నట్టు గ్రహిస్తారు. అపోహలు, విధి వారిని దూరంగా ఉంచాయని గ్రహిస్తారు. కానీ ఆమె ఇప్పుడు వివాహిత. అతడు ఆమెకు నడుమ కలవాలని ప్రయత్నించినా ఆమె ఎవరో అనుకుని తరిమేస్తుంది. ఇప్పుడు అపోహలు దూరమౌతాయి. కానీ తీవ్రమైన ప్రేమ వారి జీవితాలు, దారులు వేరయ్యాయి. దాంతో ప్రేమను మనసులోనే అణచి పెట్టుకుని ఒకరికొకరు వీడ్కోళ్లు చెప్పుకుంటారు. టూకీగా అదీ రెండు సినిమాల కథ.
తెలుగులో కానీ, తమిళంలో కానీ, ఈ సినిమా చూస్తూవుంటే, ఆంగ్లంలో ప్రసిద్ధి పొందిన సినిమా ‘ ది బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ’ గుర్తుకువస్తుంది. దాంలో హీరో ‘నేషనల్ జాగ్రఫిక్’ పత్రిక ఫోటోగ్రాఫర్. ఫోటొలు తీసేందుకు ఆ ప్రాంతానికి వస్తాడు. ఆ సమయానికి నాయిక భర్త పిల్లలు ఓ వారానికి ఊరెళ్తారు. ఈవారంలో హీరో హీరోయిన్లకు పరిచయం అవుతుంది. ప్రేమ కలుగుతుంది. వారం రోజుల తరువాత ఆమె భర్త పిలలు తిరిగివచ్చే సమయానికి హీరో వెళ్ళిపోతాడు. వెళ్ళేముందు ఆమెని తనతో వచ్చేయమంటాడు. ఆమె కుటుంబాన్ని వదలి రాలేనంటుంది. ఆ తరువాత వాళ్ళుకలవరు. ఆమె మరణించిన తరువాత ఆమె సూట్ కేసులో అతని ఉత్తరాలు, అతను పంపిన పత్రికలు భద్రంగా ఆమె దాచుకున్నదని తెలుస్తుంది. వారిద్దరి అమర ప్రేమగాథ తెలుస్తుంది. ఈ ఆంగ్ల సినిమాను భారతదేశ పరిస్థితులకు, సాంఘిక, సాంస్కృతిక, మానసిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి తీసిన సినిమా ఇది అనిపిస్తుంది. ఆంగ్లచిత్రంతో ఈ సినిమాల పోలికలు, మెలికల చర్చ అప్రస్తుతం. కాబట్టి దృష్టిని మన సినిమాలపైనే కేంద్రీకరించాల్సివుంటుంది.
ఇప్పుడు సినిమాకి ఆయివుపట్టు లాంటి, సినిమా కథను మొత్తం ప్రతిబింబిస్తూ నాయకుడి వ్యక్తిత్వాన్ని, జీవితంలో అతను రాజీ పడిన విధానాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ఈ రెండు భాషలలో పాటలను, పాటల చిత్రీకరణను విశ్లేషిస్తే జనాత్మక కళాకారుల వ్యక్తిత్వం సృజనలో ప్రతిబింబించటం, అది సినిమా రూపురేఖలను ప్రభావితం సృజనాత్మకతను గమనించే వీలు చిక్కుతుంది. ముఖ్యంగా ఈ పాటలు సంపూర్ణంగా అర్థం కావాలంటే సినిమా పూర్తిగా చూడటం తప్పనిసరి అన్న విషయం దృష్టిలో ఉంచుకుని విశ్లేషించాల్సి ఉంటుంది.
తమిళ పాట ‘పల్లవి’ లోనే మనకు నాయకుడి దృక్పథం సినిమా సందర్భంలో స్పష్టం అవుతుంది. కానీ భావం సంపూర్ణంగా బోధపడాలంటే సినిమా మొత్తం చూడాల్సి ఉంటుంది.
మనిషి జీవితంలో ఏదైనా సంఘటన సంభవిస్తున్నప్పుడు దాని ప్రాధాన్యం ప్రభావాల గురించిన సృహ ఉండదు. ఆ సంఘటన సంభవించిన కొన్నాళ్ళ తరువాత కానీ దాని ప్రాధాన్యం తెలియదు. ఈ అనంతమైన సృష్టిలో మానవ జీవితకాలం ఒక నీటి చుక్కలో వెయ్యవ వంతు కన్నా తక్కువ. కాబట్టి ఒక మనిషి తన చర్యల ప్రభావం తన జీవితకాలంలో గ్రహించలేకపోవటంలో ఆశ్చర్యంలో లేదు. కొన్ని సంఘటనల ప్రభావం కాలక్రమేణా తెలుస్తుంది. ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్‌గా ఉన్న వ్యక్తిని; వేరే ఎవ్వరూ లేరని అవసరం కోసం వికెట్ కీపర్‌గా ఒక్క రోజు కోసం నియమించినప్పుడు భవిష్యత్తులో ఆ వ్యక్తి ప్రపంచంలో నెంబర్ వన్ వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ఎదిగి భారత క్రికెట్ భవిష్యత్తును నిర్దేశిస్తాడని ఎవరూ ఊహించరు. అలాగే, మూడేళ్లప్పుడు సంగీతం నేర్పటం ఆరంభించినప్పుడు అదే తన భుక్తి అవుతుంది భవిష్యత్తులో ఆమే 70 ఏళ్లు హిందీ సినీ సంగీత ప్రపంచానికి తిరుగులేని మహారాణిగా ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇలా చెప్తూ పోతే ప్రతి వ్యక్తి జీవితంలో అనేక సంఘటనలు ఇలాంటివి ఉంటాయి. ఏదో ఓ ఉద్యోగానికి పరీక్ష రాస్తున్నపుడు అదే తన జీవితం అవుతుందని ఏ వ్యక్తి ఊహించలేడు. ఒక అమ్మాయి తన జీవన సహచరి అవుతుందని నమ్మకంతో ఉన్న వ్యక్తి అనూహ్యమైన పరిస్థితులలో మరో స్త్రీని జీవితంలోకి ఆహ్వానించి ఆమెతో సుఖంగా బ్రతకవచ్చు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చూపించవచ్చు. తమిళ పాట ఈ విషయాన్ని చెప్తోంది.
సముద్ర తీరం చేరిన తరువాతనే సముద్రం పై ప్రేమ వస్తుంది. ఏదైనా విషయం అనుభవిస్తున్నప్పటి కన్నా తరువాత వెనుతిరిగి చూసి ఆలోచిస్తేనే అనుభూతి స్వరూపం తెలుస్తుంది. అందుకే జీవితం అంటే ఏమిటో తల నెరసిన తరువాతనే అర్థమవుతుంది. తమిళ పాట ఇదే భావాన్ని ప్రదర్శిస్తుంది. సంఘటన సంభవిస్తున్నప్పటి కన్నా తరువాత దాని విలువ తెలుస్తుంది. కాబట్టి, అనుభవిస్తున్నప్పుడు సంఫూర్ణంగా అనుభవిస్తానంటున్నాడు నాయకుడు. అంటే, ప్రతిక్షణం విలువైనదని, ఈ అనుభవం చేజారితే మళ్లీ రాదని, ఇప్పుడు సంపూర్ణంగా లోతులలోకి వెళ్లి అనుభవించకపోతే తరువాత ఆ అనుభవం సంపూర్ణంగా బోధపడదు. ఆనందం సంపూర్ణం కాదు. అందుకని కోరికలను ‘ఇప్పుడు ఇక్కడ రగిలించి లోతులలో మునిగి మైమరిచి పోతున్నా’ అంటున్నాడు నాయకుడు. ఇది అతని వ్యక్తిత్వం.
పాట చిత్రీకరణ కూడా పదాలు ప్రదర్శించిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఈ పాట ఇంతగా ప్రజలను ఆకర్షించటంలో చిత్రీకరణ ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాటను చూస్తూంటే మరో లోకానికి వెళ్లిన భావన కలుగుతుంది. సంగీతం కూడా పాట భావాన్ని ఇనుమడింప చేస్తూ, తెరపై కనబడే దృశ్యాన్ని సంగీత రూపంలో ప్రదర్శిస్తూ పాట ప్రభావాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సినిమాలో ఇదే ప్రథమ దృశ్యం. మనకు హీరో తెలియడు. అతని నైపుణ్యం తెలియదు. జరిగినది తెలియదు, జరగబోయేది తెలియదు. ఇదే ఆరంభం.
మొదటి పది సెకన్లు మనకు ‘బీట్’ మాత్రమే వినిపిస్తుంటుంది. తెరపై నీటి ఉపరితలం పై వెలుతురు మిల మిల లాడుతూ కనిపిస్తుంది. తెరంతా చీకటిగా ఉండి, తెర పై సముద్ర గర్భం నుండి ఉపరితలం పై కెమెరా ఫోకస్ చేసి, పైకి వెలుతురు కనిపించటంతో మనసులో ఆనంద వీచిక కదలాడుతుంది. నేపథ్యంలో ‘కాజోన్’ (cajon) అనే ఓ ప్రత్యేకమైన ‘డ్రమ్ బీట్’ జానపదాల ‘బీట్’ను పోలి వినిపిస్తుంది. హృదయం ఊగుతుంది. ఓ రకమైన రహస్యం తెలుసుకోబోతున్నామన్న ఉత్సాహ భావన, సస్పెన్స్ కలుగుతాయి. దాదాపుగా 10 సెకన్ల దాకా ఇదే బీట్ వినిపిస్తూంటుంది.
కానీ తెరపై సముద్ర గర్భంలోని అందమైన దృశ్యాలు కనిపిస్తూ ఆనంద పరవశుల్ని చేస్తాయి. వినిపిస్తున్న ‘లయ’ చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించి, నరనరాన రక్తంతో పాటు పరుగులిడుతూ మనసునూ తనువునూ ఊపుతాయి. ఒక గొప్ప synchronized effect ఇది. శబ్దం చెవుల ద్వారా, దృశ్యం కళ్ల ద్వారా హృదయలో చేరి కలసి మనసునూ, శరీరాన్నీ ఊపుతాయి. రెండు కళ్లు ఒకే దృశ్యాన్ని వేర్వేరు కోణాలతో చూస్తూ కలసి ఒకే దృశ్యాన్ని చూసినట్టు (binocular vision).
‘Underwater’ దృశ్యాలు, రంగురంగుల చేపలు, మన మెదడు గ్రహించేంత సేపు కొన్ని సెకన్లే ఉండి మారిపోతుంటాయి. ఈ లయ ‘జీవిత లయ’ అనిపిస్తుంది. తెరపై భగవంతుడి సృష్టిలో చిత్ర విచిత్ర జీవుల ‘అద్భుతం’ కనిపిస్తుంటుంది.
ఇంతలో దృశ్యం మారుతుంది. లయకు గిటార్ తంత్రుల లయబద్ధమైన నాదం తోడవుతుంది. ఒక వ్యక్తి నీళ్లలోకి దూకుతాడు. కెమెరాతో సముద్ర గర్భంలో అద్భుతాలను చిత్రిస్తూంటాడు. క్లోజప్పులోకి అతడు రాగానే ఈ డ్రమ్స్, గిటార్ లకు వయొలిన్ తోడవుతుంది. పాటను నిర్మించిన పద్దతి, చిత్రీకరణను ఊహించిన పద్దతి, ఒకో స్థాయి మారుతున్నప్పుడు ఒకో వాయిద్యం, అదే లయతో జత కలవటం అనేక ఆలోచనలను కలిగిస్తుంది.
సముద్రం నుంచి దృశ్యం హఠాత్తుగా అడవుల్లోకి మారుతుంది. బ్యాగు భుజాన వేసుకుని, కెమెరా చేతిలో పట్టుకుని, మాములు ప్రయాణ దుస్తుల్లో హీరో కనిపిస్తాడు. ఇక్కడ కూడా చక చకా దృశ్యాలు మారుతాయి. ఓసారి కెమెరా వైపు నడుస్తాడు. మరోసారి కెమెరా నుంచి దూరం నడుస్తాడు కెమెరా భుజం పై పెట్టుకుని. చివరికి క్లోజప్పులో ఫోటో తీస్తూ కనిపిస్తాడు. వెంటనే దృశ్యంలో పెద్ద చెట్లు, పచ్చదనం నడుమ కెమెరాను తుపాకీలా పట్టుకుని పైకి చూస్తూ కనిపిస్తాడు.
పాటలో ఒక్క పదం కూడా వినబడలేదు. అంతా ప్రిల్యూడ్, ఆరంభ సంగీతమే. కానీ ప్రేక్షకులకు హీరో, ఫోటోగ్రాఫర్ అనీ, ప్రకృతి ఫోటోగ్రాఫర్ అనీ అర్థమయిపోతుంది. తరువాత దృశ్యంలో క్లోజప్పులో కెమెరా భుజంపై వేసుకుని కనిపిస్తాడు. ఈ ఫోటోల నడుమ ఆకాశాన్ని తాకే వృక్షాలను చూపిస్తారు. ఇదంతా చూస్తూ మనసు ఆనందమయిపోతుంది. కానీ ‘హీరో’ గురించిన ఆలోచనల్లో ఓ సందిగ్ధం చోటు చేసుకుంటుంది. హీరో ముఖంలో ఆనందం కనబడదు. ప్రకృతి ప్రేమికుడు ఇలాంటి దృశ్యాలను చూసి పరవశించి పోవాలి. తన్మయుడై పోవాలి. కానీ హీరో సీరియస్‌గా ఉంటాడు. క్లోజప్పులో చూపించినప్పుడు విషాదం కూడా కనిపిస్తుంది. వెనుక వినిపిస్తున్న పాట భావాన్ని బట్టి, ఏదో కోల్పోయాడని, కోల్పోయిన దాని విలువ తెలుసనీ, దాన్ని కప్పిపుచ్చేందుకు ఒంటరిగా అడవుల్లో, సముద్రాల్లో, ఎడారుల్లో తిరుగుతూ తనని తాను మభ్యపెట్టకుంటున్నాడనీ అర్థమవుతుంది. ముఖ్యంగా, అడవిలో చెట్టును పట్టుకుని వ్రేలాడటం, సముద్రాన్ని సీరియస్‌గా చూస్తూండటం, ఒంటరిగా రాళ్లు విసరటం ఈ ఆలోచనను బలపరుస్తాయి. ఒక దృశ్యంలో సముద్రం, దాని లోకి ఒంటరిగా చొచ్చుకు వచ్చి నిలుచున్న కొండ కోణం నుంచి చూపించటం ఈ నిజాన్ని బలపరచే ప్రతీక.
పాటలో ఈనాటి ఆనందాలు రేపు బోధపడతాయని, జీవించని జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగటం లాంటి భావాలన్నీ తెరపై ఒకదాని వెంట ఒకటి కనబడే దృశ్యాలు బలపరుస్తాయి. అంతులేని ఆనందం కలిగించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కూడా, మనిషి మనసులో విషాద వీచికలుంటే, సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించనీయవన్న భావన కలుగుతుందీ దృశ్యాలు చూస్తుంటే.
ఈ పాట ప్రతి వయసు వారికీ, తరంతో సంబంధం లేకుండా నచ్చటం వెనుక ప్రతి మనిషి జీవితంలో అంతర్లీనంగా ఉండే అసంతృప్తి ప్రధాన కారణం. రాజీ పడందే జీవితం లేదు. మనిషి ఇంతగా రాజీ పడినా మనసు ఏదో ఒక క్షణంలో రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్టు ఆచరించి ఉంటే అన్న ఆలోచనను కలిగిస్తుంది. అదీ గాక, తెరపై కనిపిస్తున్న ఆ ప్రదేశాలకు, వెళ్లి సుందర ప్రకృతిలో పసిబాలుడై పొర్లాలన్న కోరిక ప్రతి వ్యక్తి మనసులో ఉంటుంది. అది తీరదు పలు కారణాల వల్ల. ఆ తీరని కోరిక ఇలా దృశ్యాలను చూడటం వల్ల, ఒంటరిగా హీరో చేస్తున్న ప్రయాణంలో తనని తాను ఆపాదించుకోవటం వల్ల సంతృప్తి చెందుతుంది. What could have been, what is ల నడుమ సాగే పోరాటం మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.
తెరపై కనిపిస్తున్నంత వరకూ హీరో తన మనసులో గూడు కట్టి ఉన్న తీరని కోరక వల్ల జీవిస్తున్న విషాదాన్ని అదిమిపట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి అనుభవాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని అనుభవించాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది. తెరపై హీరో వదనంలో కనిపించే విషాదం ఈ భావనను బలపరుస్తుంది. చెట్టున పట్టుకుని వ్రేలాడటం, వర్షం నీటి బిందువుల కోసం నాలికను చాపటం, జింకకు బ్రెడ్డు తినిపించి సంతోషించటం వంటి దృశ్యాలు, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు కూడా అతడు ఎంతో పెద్దవిగా భావించి సంపూర్ణంగా అనుభవిస్తున్నాడని చూపిస్తాయి. అతని మనసు గతంలోనే ఘనీభవించి ఉందని బోధపడుతుంది.
భౌతికంగా రామ్ పలు భౌగోళిక ప్రాంతాలలో ప్రయాణిస్తున్నా, అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూన్నా, మనుషుల నడుమ తిరుగుతున్నా అతని మానసిక వ్యవస్థలో మార్పు ఏమీ లేదని పాటలో భావం, చిత్రీకరణ, సంగీతం తెలుపుతుంటాయి. ఆయన ఒంటరిగా తిరుగుతూండటం నిత్య జీవితంలోని నిజానిజాల నుంచి పారిపోవటం అన్న ఆలోచన కలుగుతుంది. అంతే కాదు, ఒక స్థలానికో, ఒక వ్యక్తికో, పరిమితమై ఉండటం అతడికి ఇష్టం లేదని అనిపిస్తుంది. అంతే కాదు, ఒక స్థలానికి ఒక వ్యక్తికి పరిమితమైతే, అంటే ప్రయాణం అగిపోతే, ముంచెత్తుతున్న జ్ఞాపకాల వెల్లువ నుంచి తప్పించుకోలేనన్న భయంతో బాధ పడుతున్నట్టు అనిపిస్తుంది. దృశ్యాలు ఈ భావనను స్థిరపరుస్తాయి.
నాయకుడు ‘ట్రావెల్ ఫోటోగ్రాఫర్’గా స్థిరపడటం కూడా ఆధునిక సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. గతంలో భగ్న ప్రేమికులకు ‘తాగుడు’ ఒక ఉపశమనం. లేకపోతే, నాయకుడు దూరంగా పోవటం ఒక పద్దతి. ఇలా పోయిన వాళ్లు అధికంగా అధ్యాపక వృత్తిలో స్థిరపడేవారు. నాయిక అయితే నర్సు అయ్యేది, టీచర్ కాకపోతే. ఇప్పుడు ఉద్యోగాల స్వరూపం మారింది. ఇప్పుడు పలు రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. దాన్ని ప్రతిబింబిస్తూ హీరో ‘ఫోటోగ్రాఫర్’ అయ్యాడు. ‘ఫోటోగ్రాఫర్’ అవటం కూడా నాయకుడి మానసిక స్థితికి ఒక ప్రతీక.
జీవితంలోని అమూల్యమైన క్షణాలను ఘనీభవింపచేసి ప్రదర్శిస్తుంది కెమెరా. ఇది గతంలో ఘనీభవించిపోయిన హీరో మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒక ప్రతీక. ‘జాను’ సినిమాలో నాయకుడు ఒక సన్నివేశంలో ‘నేనెప్పటికీ 37 ఏళ్ల వాడిగానే ఉంటాను’ అని ఫోటో తీసే అమ్మాయితో అంటాడు. అది ‘ఫోటోగ్రఫీ’ పట్ల అతని అభిప్రాయాన్ని తెలుపుతుంది. అతడు ప్రకృతి దృశ్యాలలో మమేకమవ్వాలని ప్రయత్నించటం తన బాధను కప్పిపుచ్చుకోవటానికే.
కెమెరా దృశ్యాలను ఫ్రేమ్ చేసిన విధానం, రూపొందించిన విధానం ఈ ఆలోచనను ప్రదర్శిస్తుంది. నేపథ్యంలో పర్వతాలు, సముద్రాలు ఉంటాయి. ఒంటరిగా నాయకుడు వాటిని చూస్తూ కనిపిస్తాడు. సముద్రాన్ని చూస్తూంటాడు. ఇది అతని ఒంటరితనాన్ని సూచిస్తుంది. పాట ఆరంభంలో ఒక దృశ్యంలో ఆవిరితో నిండిన కారు అద్దాన్ని వైపర్లు తుడిచి ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఇది అతని మనసులోని గతాన్ని, వర్తమానానికి నడుమ తేడా చెరిగి జ్ఞాపకాలను వర్తమానంలో చూపిస్తుంది.
పాట అంతా భారతదేశంలోని పలు ప్రదేశాలలో చిత్రీకరించారు.
(లైఫ్ ఆఫ్ రామ్ తమిళ పాటని ఈ లింక్‌లో యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=6LD30ChPsSs )
తమిళ పాటను చూసిన తరువాత తెలుగు పాట వైపు దృష్టి సారిస్తే తెలుగు పాటను ప్రత్యేకంగా, భిన్నంగా రూపొందించటం తెలుస్తుంది
ఇప్పుడు మనం, తెలుగు పాటవైపుకు దృష్టిని మళ్ళిద్దాం!
(మళ్ళీ కలుద్దాం)