Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-13

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఈ ఉదయం, నా హృదయం
పురులు విరిసి ఆడింది
పులకరించి పాడింది..

ఒకప్పుడు హీరో పరిచయ పాటలు భావుకతకు, ప్రకృతిని చూసి పులకరించే నాయికా నాయకుల సున్నిత హృదయాలకు ప్రతిబింబంలా ఉండేవి. పాటతో హీరో పరిచయం అవుతూనే ఒక చక్కటి మధురమైన, మృదువైన, భావాలతో ప్రకృతిని చూసి పరవశిస్తూ హీరో పాడగానే చూస్తున్న ప్రేక్షకుడి మదిలో ఆనందం వెల్లువయ్యేది. ప్రశాంత భావన, ప్రకృతి వర్ణనలతో, అందమైన దృశ్యాలతో ఆనంద పరవశమయ్యేది. పాటతో, నటుడితో దృశ్యాలతో ఒక అపురూపమైన  అనుబంధం ఏర్పడేది. ఇలాంటి పాటలు ప్రయాణాల సమయంలో మరీ మరీ గుర్తుకు వచ్చి ఆనందం కలిగిస్తాయి. ప్రయాణంలో ఈ పాటలు పాడుతూ ప్రకృతి దృశ్యాల సౌందర్యాన్ని కళ్ల నిండుగా నింపుకుని కళ్లు నిండిన తరువాత గుండెల నిండుగా నింపుకుని నిరంతరం ఆనందించే అనుభూతిగా మిగులుతుంది.

సుహానా సఫర్ ఔర్ యే మాసమ్ హసీన్
హమే డర్ హై  హమ్ ఖో నా జాయే కహీ..

మధుమతి’ సినిమాలో దిలీప్ కుమార్ పరిచయ పాట ఇది. ఉద్యోగం కోసం ఓ  మారుమూల ప్రకృతి  ఒడిలో, కొండల నడుమ ఉన్న పల్లెకు బయలు దేరతాడు హీరో. కాలినడకన, అడవుల్లోంచి, కొండల్లోంచి, వాగుల్లోంచి పోతూ, పాట పాడతాడు.

“ప్రయాణం అందమైనది. వాతావరణం కూడా హాయిగా ఉంది. ఈ అందమైన ప్రకృతి దృశ్యాలు, హాయిగొలిపే వాతావరణంలో ప్రయాణిస్తూ నన్ను నేను మరచిపోతానన్న భయం ఉంది” అంటున్నాడు హీరో. ఇక్కడ ‘మౌసమ్’ అంటే వాతారణం అన్నది ఆ పదానికి అర్ధం. భావం తీసుకుంటే ‘అందమైన ప్రకృతి’ అన్న ఆలోచన వస్తుంది. హీరో నడుస్తున్న దారులు ఎంత  అందంగా ఉన్నాయంటే, హీరోకు తాను మైమరిచిపోయి అక్కడే ఉండి పోతాడామో ననిపిస్తుంది. పాటలో పరుగెత్తే నదులు, దూరంగా నేల పైకి వంగే ఆకాశం, నవ్వే పువ్వులు.. వంటి చక్కటి వర్ణనలుంటాయి. చివరలో ‘మేరీ దునియా, మేరే సప్నే మిలేంగే షాయద్ నహీఁ’ అంటాడు. అంటే, అతడి ప్రపంచం, అతని కలలు అన్నీ ఈ ప్రాంతంలోనే ఫలవంతమవుతాయన్న ఆశ వ్యక్తపరుస్తాడు.

(‘సుహానా సఫర్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=aSU74fpWsfQ )

అతడు ఊహించుకున్నట్టుగానే నాయిక, పాట పాడుతుంది.

ఆజారే పర్‌దేశీ, మై తో కబ్ సే ఖడీ ఇస్ పార్’ అంటూ మరో అద్భుతమైన పరిచయ పాట పడుతుంది.

ఈ రెండు పరిచయ పాటలు ఈ సినిమాకే హైలెట్లు. ముకేష్ పాటల జాబితా ఎవరు తయారు చేసినా తప్పకుండా ఉండే పాట ఇది. లతా పాటల జాబితా ఈ పాటలేకపోతే పూర్తికాదు.  అలాగే ఎప్పుడూ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా మదిలో మెదిలే పాట ఇది.

(‘ఆజారే పర్‌దేశీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=sB-QK_QN3BI )

పాటలో ప్రకృతిని చక్కగా వర్ణించి, చివరలో సినిమా కథ ప్రాసంగితకు తగ్గట్టు మలచినా, పాటకు సార్వజనీనతను ఆపాదించి, సినీ సందర్భ పరిధిని దాటి ఎదిగిస్తాయి పాటలోని పదాలు, భావాలు. ఇక్కడ నాయకుడు ప్రకృతిని చూసి పరవశిస్తున్నాడు తప్ప ప్రేయసి గురించి రొమాంటిక్ ఆలోచనలు లేవు.

కన్నెమనసులు’ సినిమాలోనూ నాయికుడి పరిచయ పాట ఇది. ప్రకృతిని చూసి పరవశిస్తూ పాడే పాట. కానీ పాటలో ప్రకృతిలో యువతి రూపాన్ని దర్శిస్తూ ‘పురులు విప్పి ఆడిన హృదయం’లోని శృంగార భావాలను వొలకబోస్తాడు నాయకుడు.

పడుచు పిల్ల పయ్యెదలా.. పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో.. కొత్త వలపులూ చూసినది

పాట చిత్రీకరణ – ఆహ్లాదకరమైన సంగీతం, ఆకాశాన్ని కప్పిన చెట్ల కొమ్మలు తెరపై అందంగా కదలుతుంటే ఆరంభమవుతుంది. పిట్టల పాటలు వినిపిస్తాయి. చక్కటి వేణునాదం వినిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఆనందిస్తున్న హీరో వదనం కనిపిస్తుంది. ఆ తరువాత లాంగ్ యాంగిల్‌లో మైదానంలో పశువులు కనిపిస్తాయి. ఇంతలో ఓ కొండపై నుండి లయ బద్ధంగా ఈల వేస్తూ గుర్రంపై హీరో కనిపిస్తాడు.

సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ పాటను ఆరంభించిన పద్ధతి అమోఘం అనిపిస్తుంది.

సుహానా సఫర్’ పాట ముందు పశువుల కాపరి పశువులను అదిలించే శబ్దం వినిపిస్తుంది. అడుగుల సవ్వడి వినిపిస్తుంది. ఓ మార్చింగ్ సాంగ్‌లా పాట ఆరంభమవుతుంది. హీరో ప్రకృతిని చూసి పరవశిస్తూ ఆపుకోలేక హఠాత్తుగా పాట ఆరంభించినట్టుంటుంది. అంటే స్వచ్ఛందంగా, గుండె లోతుల్లోంచి ఎగసి పడ్డ ఆనంద తరంగాలకు   పదాల ద్వారా భావం ఇచ్చి వ్యక్త పరచాడన్నమాట. పాట పెల్లుబికి వచ్చింది.

తెలుగులో మహాదేవన్ పాట బాణీ వైపుకు తీసుకెళ్లే ఆరంభ సంగీతాన్ని  నిర్మించిన తీరు ఎంతో ఆలోచనతో అవగాహనతో, చిత్రీకరణను దృష్టిలో ఉంచుకుని చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా వాడిన వాయిద్యాలు, వేణువుతో చేయించిన విన్యాసాలు అలరిస్తాయి. పాట ఆరంభం ఒక పక్క వచ్చే అలను, మరో ముందుకు దుకుతున్న అల తాకి రెండు కలసి ముందుకు సాగిన రీతిలా సాగుతుంది. ఆరంభం సంగీతం seamless గా పాట ఆరంభంలో కలసి పోతుంది. గుర్రపు పరుగుతో రిథమిక్‌గా వినిపించే గిటార్ తంత్రుల నాదం లయబద్ధంగా ఊపుతుంది.

అంతా మృదువుగా, మంద్రంగా సాగుతున్న సమయంలో ఘంటసాల స్వరం మృదుగంభీరంగా ‘ఈ ఉదయం‘ అంటూ పాటను ఎత్తుకోవటంతో గుండె ఝల్లుమంటుంది. ఘంటసాల పాట ఎత్తుకునే సమయానికి  లాంగ్ షాట్‌లో కొండ, దూరంగా గుర్రంపై హీరోను చూపించటం దర్శకుడుతో ఆలోచించి చేసిన పని అనిపిస్తుంది. ఎందుకంటే నాయకుడు ఇంకా యువకుడే. ఘంటసాల స్వరంలోని గాంభీర్యం ఒకేసారి అతడి వదనాన్ని క్లోజప్పులో చూపితే, అంతగా నప్పదు. కాబట్టి, ప్రేక్షకుడు ఆ స్వరానికి అలవాటు పడేందుకు కొన్ని సెకన్ల సమయం ఇచ్చి అతడు పాడుతూ దగ్గరకు వస్తున్నట్టు చూపించటంతో ప్రేక్షకుడు హీరో పాడుతున్నాడని మనసుకు చెప్పుకుంటాడు. తెరపై హీరోను ఆ దృష్టితో చూస్తాడు.

సుహానా సఫర్’ పాటలో అడుగులు శబ్దాలు పొదల్లో వినిపిస్తున్నప్పుడు హీరో తెరపైకి ఆనందంతో నవ్వుతూ వస్తాడు. కెమోరా వైపు రెండు అడుగులు వేస్తాడు. హీరో కనబడటంతో ప్రేక్షకుడు హీరో పాడతాడని మానసికంగా సిద్ధమై పోతాడు. అయుదు సెకన్ల సమయం చాలు – హీరో ముకేష్ స్వరంలో పాడితే ప్రేక్షకులు ఆమోదించేందుకు. అదీ గాక, గతంలో కొన్ని సినిమాలలో దీలీప్ కుమార్‌కు ముకేష్ పాటలు పాడటం అలవాటయింది. కాబట్టి ప్రేక్షకులు ఆమోదిస్తారు.

‘కన్నెమనసులు’ సినిమాలో హీరోకు ఇమేజీలేదు. ప్రేక్షకులకు అలవాటు కాలేదు.   పైగా దేవ్ ఆనంద్ ను పోలి ఉంటాడు. అందుకని ముందుగా ఓ సారి హీరోను చూపించి, కాస్త విరామం ఇచ్చి, ఘంటసాల పాట గొంతు వినిపించి, నెమ్మదిగా ముఖానికి స్వరానికి అనుసంధానం చేశారన్న మాట. అందుకే హీరో ముఖాన్ని క్లోజప్పులో రెండోసారి ‘పురులు విడిచి ఆడింది‘ అనే వరకూ చూపించరు. అప్పటికీ ఘంటసాల గొంతులో గాంభీర్యం కన్నా మార్దవం, పరవశత్వం అధికంగా అవుతాయి. మళ్లీ ఘంటసాల ‘ఈ ఉదయం’ అని ప్రతిధ్వని ఎఫెక్టు ఇచ్చే సమయానికి ‘లాంగ్ షాట్’లో చూపిస్తారు. ప్రతిధ్వనిని  కొండలు, కోనల్లో  చూపిస్తుంది కెమెరా.

(‘ఈ ఉదయం నా హృదయం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=2Re-W9y2_Nk )

ఇక ఆ తరువాత పాట పాడేటప్పుడు హీరోని నిస్సంకోచంగా క్లోజప్పులో చూపిస్తారు. అప్పటికి ప్రేక్షకుడు పాట మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆనందంలో ఉంటాడు. పాటలోని పదాల భావాన్ని అనుభవిస్తూ మురుస్తుంటాడు. ‘పలుచని వెలుగును’ పడుచుపిల్ల పయ్యెదతో పోల్చటం, ‘కొండల కోనల మలుపులు’ కొత్త వంపులు చూపటం – రెండు వైపులా పదునైన కత్తి లాంటి సభ్యతా హద్దులు దాటని మధురమైన శృంగార భావాల వర్ణన. ప్రకృతి వర్ణన ఒక వైపు, ప్రకృతిలో పడుచు పిల్ల శారీరిక లావణ్యాన్ని దర్శింపచేయటం మరో వైపు.. అత్యంత చమత్కారభరిత గేయ రచన పద్దతి ఇది.

హిందీలో ‘జీనే కీ రాహ్’ అనే సినిమాలో జితేంద్ర పరిచయ పాట కూడా  హీరో ప్రకృతిలో ప్రేయసిని చూసి మురుస్తూ పాడే పాట..

ఆనే సే ఉస్ కే ఆయే బహార్
జానే సే ఉస్ కే జాయే బహార్
బడీ మస్తానీ హై మేరీ మహబూబా
మేరీ జిందగానీ హై మేరీ మహబూబా

‘మహమ్మద్ రఫీ’ గొంతులో ప్రకృతిలో ప్రేయసిని చూసి పరవశిస్తున్న భావన, చిలిపితనంతో కూడిన ఆనంద ఆహ్లాద భావనలు పరిమళిస్తాయి. పాటలో ఆమె చంచలత్వాన్ని పర్వతాల నుండి జాలువారే జలపాతాలతో, వసంతంలో విరిసే పూతోటతో పోలుస్తాడు.

కానీ చివరలో ‘పూఛోతో కౌన్ హై వో, ఋత్ యే సుహానీ హై మేరీ మహబూబా’ అని మనసు ఝల్లుమనే చమత్కారంతో పాట ముగిస్తాడు. అంటే అంతకు ముందు అతను ప్రేయసి అని వర్ణించినది ప్రకృతిని  అన్న మాట.

(‘ఆనే సే ఉస్ కే ఆయే బహార్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Ode9h3g3xrE )

చిరుగుకులతో చిరుగాలీ సరసాలాడీ వచ్చినది
చక్కలిగింతలు పెట్టినది.. వేసవికే చలివేసినది

ఇక్కడి దాకా చక్కగా ఉన్న పాట, చివరి చరణం దగ్గరకు వచ్చే సరికి, ఈత కొడుతున్న నాయికను చూస్తూ, నాయకుడు పాట పాడటం దగ్గర కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సాధారణంగా యువతులు స్నానమాడే చోటికి పురుషులు వెళ్లకూడదు. వెళ్లినా అలా కళ్లప్పగించి చూస్తూ పాట పాడకూడదు.

సరస్సున జలకాలాడే దెవరో.. తేటిని వెంట తిప్పేదెవరో
రేయిని సింగరారించే కలువో.. పగలే వగలు రగిలే కమలమో..

పాట ఊహ బాగుంది. ‘తేటి’ అంటే తుమ్మెద. ఆమె సరస్సులో పూవు. ఆమె చుట్టు తేనెటీగ తిరుగుతోంది. ‘పగలే వగలు రగిలే కమలమో..’ ‘అద్భతం’ అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని భావాలు పలికేప్పుడు ఘంటసాల స్వరంలో మృదుత్వం తీపి పానకంలా జాలువారటం మనసును ‘తేటి’ ని చేసి ఘంటసాల స్వరంలోని తేనె భావన చుట్టుతిరిగేట్టు చేస్తుంది.   కాని, ఓ యువతి అలా స్నానం చేస్తూంటే, అపరిచితురాలైన ఆమెని చూస్తూ పాడటం (మమ్మల్ని మోరల్ పోలీసులని మ్రోత మోయించినా సరే) కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తరువాత ఆమె నీటి బయటకు వచ్చి తిడుతుందన్నది వేరే విషయం. కానీ ప్రకృతి వర్ణన ద్వారా నాయకుడి భావుకతను పరిచయం చేసే పాటల్లో అగ్రశ్రేణిలో నిలుస్తుందీ పాట. ‘నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో’ పాట పరిచయ పాటల శ్రేణిలోకి రాదు. అది నాయిక పై ప్రేమ ఉదయించిన నాయకుడి హృదయ గానం. ఆ కేటగిరీ పాటల గురించి చర్చ భవిష్యత్తు వ్యాసాలలో.

నాయకుడు గుర్రపు స్వారీ చేస్తూ, ప్రకృతిని చూసి రొమాంటిక్ భావనలతో పరవశిస్తూ పాడే పాట హిందీలో ఉంది. ‘లాట్ సాహెబ్’ సినిమాలో శమ్మీ కపూర్ పరిచయపు పాట అది.

జానే మేరా దిల్ కిసే ఢూంఢ్ రహా హై
ఇన్ హరీ భరీ వాదియోఁ మే..
కభీ న కభీ తో టక్‌రాయేగా దిల్ సే
ఇన్హీ  ఆబాదియోఁ మే

అందమైన ప్రకృతి దృశ్యాలలో అతడి హృదయం ఎవరినో వెతుకుతోంది. ఆమె ఇక్కడే అతడిని కలుస్తుంది.

(‘జానే మేరా దిల్’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=N_jR91DF6HQ )

ఈ పాటనూ, ‘ఈ హృదయం’ పాటనూ పోల్చి చూస్తే ఇమేజీ లేని హీరోకు పాటను సృజించటం, ఇమేజీ ఉన్న హీరోకు పాటను సృజించటంలో తేడా తెలుస్తుంది. ఈ రెండు పాటలనూ ‘సుహానా సఫర్’ పాటతో పోలిస్తే, గేయ రచయిత, దర్శకుల ‘దృష్టి’, పాటలను మలచే తీరు తెలుస్తుంది.

‘బిమల్ రాయ్’ దృష్టి అధికంగా ప్రకృతి దృశ్యాలపై ఉంటుంది. బిమల్ రాయ్ సినిమాలో పూలు, నీళ్లు, వాగులు, వంకలు నటీనటులతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గేయ రచయిత శైలేంద్ర అలతి అలతి పదాల్లో అనంతమైన భావాలు పొదుగుతాడు. దిలీప్ కుమార్ ‘సీరియస్ హీరో’. ఒక మేధావి ఇమేజ్ కలవాడు. అతడికి రూపొందించిన పాటలో రొమాన్స్ కన్నా ‘ఆలోచన’ ఎక్కువ ఉంటుంది. అందుకని ‘ఈ పూలల్లో నవ్వేదెవరు?’, ‘ప్రియుడిని కలిసే తొందరలో పరుగులిడే యువతుల్లా ఉన్నాయి నదులు’ వంటి భావాలు పాటలో పొదిగాడు. చివరికి ‘నా కలలిక్కడే నిజమౌతాయేమో’ అంటూ ఒక ఆశతో ఆలోచనతో ముగుస్తుంది పాట.

‘కన్నెమనసులు’లో రామ్మోహన్‌కు ఇమేజీ లేదు. కాబట్టి పాట ద్వారా ఇమేజీని సృష్టించాల్సి ఉంటుంది. కానీ అప్పటికే ఘంటసాల అంటే రామారావు, నాగేశ్వరరావులు. ఇక ఎవరిపైనైనా పాట బాగుటుంది. కానీ ఘంటసాల గొంతు ద్వారా ఇమేజీని సృష్టించటం కుదరదు. అందుకని పాటను పూర్తిగా ప్రకృతిలో పడతిని దర్శించే పాటగా మలచి చివరికి నాయికను పరిచయం చేశారు.

శమ్మీ కపూర్‌కు ‘లాట్ సాహెబ్’ సినిమా వచ్చేసరికి ఇమేజీ స్థిరపడింది. అతడిపై రఫీ స్వరం తప్ప మరొకరి స్వరాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు అభిమానులు. పైగా శమ్మీ కపూర్ అంటే శంకర్ జై కిషన్ సంగీతం ఉండాల్సిందే. రొమాంటిక్ పాట అయితే హస్రత్ జైపురీ రాయాల్సిందే. అందుకే ‘ఈ ఉదయం’ పాటలో హీరో హృదయం ప్రకృతిని చూసి పులకరించి పాడి, ప్రకృతిలో పడతిని చూడాలని తపిస్తే, ‘జానే మేరా దిల్’ పాటలో శమ్మీ కపూర్ ఆరంభంలోనే ప్రకృతిలో ప్రేయసి కోసం వెతికటం ఆరంభించాడు. ప్రకృతి వర్ణన లేదు పాటలో. ఎవరి ఆలోచన నన్ను ఇలా ఒక స్థలం నుంచి మరో స్థలానికి తిప్పుతోంది, అడవిలో స్నానమాడే కన్నెలు  నా హృదయాన్నెందుకు దోస్తూన్నారు? ఊహిస్తేనే ఇంత గొప్పగా ఉంది ఇక చూస్తే ఏమైపోతానో అంటూ ప్రేయసి పరంగా, శమ్మీ కపూర్ ‘లవర్ బాయ్’ ఇమేజీ పరంగా సాగుతుంది పాట. పాట అలరించటంలో కూడా శంకర్ జైకిషన్ – రఫీ – శమ్మీ కపూర్‌ల ఇమేజీ తన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ‘లాట్ సాహెబ్’ సినిమా తయారయ్యే సరికి శంకర్ జైకిషన్ మ్యాజిక్ త్రీవత తగ్గడం మొదలయింది. రఫీ స్వరంలో మార్దవం,  ఫ్లెక్సిబిలిటీ తగ్గటం ఆరంభమయింది. శమ్మీ కపూర్ కొలతలు మారిపోసాగాయి. అయినా పాట అలరిస్తుంది.

అయితే, ఇటీవలి కాలంలో తెలుగులో ‘జాను’ అని ఓ సినిమా వచ్చింది. తమిళంలో హిట్ అయిన ‘96‘ అనే సినిమాకు , ‘జాను’ రీమేక్. ఈ సినిమా ఆరంభమే హీరో పరిచయ పాటతో ఆరంభమవుతుంది. అదీ హీరో ప్రకృతి ప్రేమ పరిచయం పాట.

రెండు సినిమాల ఆరంభంలో అత్యద్భుతమైన సంగీతం, దృశ్యాలతో కూడుకున్న తాత్విక భావనల పాట వస్తుంది. రీమేక్ అయినా రెండు సినిమాలలో పాట చిత్రీకరణ వేర్వేరుగా ఉంటుంది. ‘భావం’ ఒకటే అయినా తాత్వికత ప్రదర్శనలో, లోతులో మార్పు ఉంటుంది. కథనాయకుడి వ్యక్తిత్వం ఒకటే అయినా తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో శర్వానంద్‌ల వ్యక్తిత్వాన్ని,  నటన పద్ధతులను బట్టి పాత్ర ప్రవర్తనలో మార్పు వస్తుంది. తదనుగుణంగా చిత్రీకరణలో తేడా వస్తుంది.

ఈ పాట గొప్పతనం ఏమిటంటే, నేపథ్యంలో వచ్చే ఈ పాట పూర్తయ్యే సరికి కథానాయకుడి వ్యక్తిత్వం మనకు బోధపడిపోతుంది. సినిమాలో నాయిక అడిగిన ప్రశ్నలకు నాయకుడు మౌనమే సమాధానం అన్నట్టుంటాడు. కానీ, ఆ ప్రశ్నలన్నిటికీ  సమాధానాలు సినిమా ఆరంభంలో నేపథ్యంలో వచ్చే ఈ పాటలో లభిస్తాయి.

ఏ దారెదురైనా.. ఎటు వెళుతుందో అడిగానా?
ఏం తోచని పరుగై.. ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా?
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

(‘ఏ దారెదురైనా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=2a34XyiZO14 )

రెండు పాటలకూ దృశ్యాలను, పాటలో భావాలనూ, పరిశీలించి పోలిస్తే, దర్శకుడు, గేయ రచయిత, నటుల వ్యక్తిత్వాలు ఒకే సందర్భంలో ఒకే వ్యక్తిత్వాన్ని వర్ణించే పాటల్లో ఎంత తేడా కలిగిస్తాయో బోధపడుతుంది.

నాన్ ఎన్బు దు యారో, పెరుంథిరనిలె యేడే
నాన్ ఎణ్బదై  వీసీ, ఎళిందినే మనమే

థాణెణ్బదు పోగుమ్, పెరుణ్గనాథినిలె కూవి

వా వెండ్రు ఒరు వాళ్కై అరులాఐ పేసా

తీరాన్ని చేరిన తరువాత సముద్రాన్ని ప్రేమిస్తాను. తల నెరసిన తరువాతే ప్రపంచం అర్థమవుతుంది. నేననేది ఎవరో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. నేను అన్న దాన్ని విసిరి వేశానే మనసా, నేను అన్నది చెల్లిపోతుంది. ఒక పెద్ద క్షణంలో పాడుతూ.. రా రమ్మంటూ ఒక జీవితం. ఒక సన్నని గొంతుతో ప్రేమతో పలికింది.

( ఈ  పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=6LD30ChPsSs )

రెండు పాటల రాగం ఒకటే. సందర్భం ఒకటే. నాయకుడి వ్యక్తిత్వం ఒకటే. సినిమా ఒకటే. కానీ తెలుగులో, తమిళంలో పాట భావంలో ఎంతో మార్పు ఉంది. నాయకుల వ్యక్తిత్వ ప్రదర్శనలో తేడా వచ్చింది..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version