[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యునికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికీ ప్రణామం
‘జనతా గారేజ్’ సినిమాలో శంకర్ మహదేవన్ అత్యంత ఉత్సాహంగా, ఉత్తేజితంగా పాడిన ఈ పాటను రచించింది రామజోగయ్య శాస్త్రి. సంగీతం దేవీశ్రీ ప్రసాద్. ఈ పాట నాయకుడి పరిచయ పాటల విభాగంలోకి వస్తుంది.
‘నాయకుడి పరిచయ పాటలు’ మన సినిమాలకే ప్రత్యకమైనవి. విదేశీ సినిమాలలో నటుడి ఇమేజీ కన్నా ‘కథ’కు, కథనానికి అధిక ప్రాధాన్యం. అక్కడ కూడా నటుడి ఇమేజీ ఆధారంగా సినిమాలు రూపొందించినా, అధిక శాతం సినిమాలలో నటుడి ఇమేజీ కన్నా ‘పాత్ర’ కే ప్రాధాన్యం ఉంటుంది.
మన సినిమాలు ఇందుకు పూర్తిగా భిన్నం. మన సినిమా పరిశ్రమలో ఒకరిద్దరు సూపర్ స్టార్ నటులుంటారు. కొన్ని దశాబ్దాలు వారు రాజ్యం ఏలుతారు. దాంతో ఇతర నటులు వీరి నీడను దాటి ఎదిగి తమకంటూ ప్రత్యేక ఇమేజీని ఏర్పాటు చేసుకోవడం కష్టం అవుతుంది. అదీ గాక, మన సినిమా రంగంలో ‘హిట్’ చిత్ర నిర్మాణానికి పెద్ద పీట. కాబట్టి, కొత్తవారితో, కొత్త కథలతో, కొత్త రకం సినిమాలతో ప్రయోగాలు చేసేకన్నా అందరూ నడిచీ నడిచీ నలిగిన దారిలో నడవటానికే ఇష్టపడతారు తప్ప కొత్త దారులు తొక్కి, దారులు తప్పి, కష్టపడేందుకు అంతగా మొగ్గు చూపరు. ఇటీవలి కాలంలో, సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చే పరిస్థితులు నెలకొనటంతో పరిస్థితి కాస్త మారుతోంది. విభిన్నమైన కథలు, కథన పద్దతులు, ప్రయోగాలు సంభవిస్తున్నాయి. కానీ ‘పెద్ద సినిమా’ అంటే ‘నలిగిన బాట, నలిగిన పాట, నలిగిన ఆట’ అన్న ధోరణిలో మాత్రం ఇంకా మార్పు రాలేదు.
ఒక నటుడు హీరోగా ఎదిగి, ప్రజల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం సినిమా వ్యాపార విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, స్రీన్ ప్లే రచయిత, సంగీత దర్శకుడు, గేయ రచయితలంతా కలసి నటుడికి ఇమేజీ సృష్టించేందుకు ఎంతో కష్టపడేవారు. ఇటీవలి కాలంలో సినిమా హీరో పాత్ర కూడా వారసత్వం అవుతూండటంతో ప్రత్యేక ఇమేజీ కన్నా, హీరోఇజం వైపే దృష్టి పెడుతున్నారు. ఇందుకు భిన్నంగా గతంలో నటులకు ఇమేజీ సృష్టించేందుకు , వారికొక ప్రత్యేక గొంతు ఇచ్చేందుకు తపన పడేవారు. నటుడికి ఇమేజీ నిచ్చేందుకు నటుడు తెరపై రాగానే ఓ పాట ద్వారా పాత్ర వ్యక్తిత్వం పరిచయం చేసేవారు.అది సినిమా టోన్ సెట్ చేసేది.
పరిచయ పాటవల్ల పాత్ర పరిచయం అయిపోతుంది. పాట ద్వారా వ్యాపార విలువలు పెరుగుతాయి. పాట వల్ల నాయకుడికి ఇమేజీ వస్తుంది. గాయకుడి, హీరోల బంధం స్థిరపడుతుంది. ‘పాట’ కాబట్టి పదే పదే పాడతారు ప్రేక్షకులు. పాట చిత్రీకరణలో నటుడు తన ప్రత్యేకతను నిలుపుకుంటే పాట విలువతో పాటు సినిమా వ్యాపార విలువ కూడా హెచ్చుతుంది. మన సినిమాలో ‘పరిచయ పాట’ ప్రాధాన్యం గ్రహించి, తద్వారా తనకుంటూ ఓ ఇమేజ్‍ని సృష్టించుకుని దేశ ప్రజల హృదయాలలోకి కాదు, ప్రపంచ సినీ చరిత్రలో తన పేరు లిఖించుకున్నవాడు రాజ్ కపూర్.
‘ఆవారా’ సినిమాలో నాయకుడి వ్యక్తిత్వ పరిచయ పాట ‘ఆవారా హూఁ’ తో వ్యక్తిత్వ పరిచయ పాట వ్యాపార విలువతో పాటు అనేక ఇతర లాభాలను కూడా స్పష్టం చేసింది. అంతుకు ముందు వ్యక్తిత్వ పరిచయం పాటలు అరుదుగా ఉండేవి.
(‘ఆవారా హూఁ’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=DvDqw7eyfss )
1927లో ‘డర్టీ హండ్స్, డర్టీ ఫేస్’ అన్న పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ‘బొంబొ’ అన్న నాటకం లోనిదీ పాట. పాట ప్రజాదరణ వల్ల 1927లో ‘ది జాజ్ సింగర్’ అన్న సినిమాలో వాడుకున్నారు. ఒక తండ్రి, తన కొడుకును పరిచయం చేస్తూ అతని వ్యక్తిత్వం చెప్పే ఈ పాట తండ్రి కొడుకుల నడుమ ఉండే ప్రేమను అతి గొప్పగా ప్రతిబింబిస్తుంది. ఎంతో ప్రజాదరణ పొందిందీ పాట. అయితే, హాలీవుడ్ మ్యూజికల్స్ అధికంగా సామూహిక నృత్యాలు, చిత్ర విచిత్ర విన్యాసాలకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాత్రల వ్యక్తిత్వ పరిచయం పాటల పట్ల అంతగా శ్రద్ద పెట్టలేదు. పైగా, నటీనటులు పాటలు పాడటం పై కన్నా సందర్భాన్ని, మూడ్‌ను అనుసరించి నేపథ్యంలో పాటలు వినిపించటం పైననో, లేక, ప్రతి పాత్రకు ఒక గుర్తింపు సంగీతాన్ని సృజించటం పైనో దృష్టి పెట్టటంతో మన సినిమాల్లో లాగా, పాత్రల వ్యక్తిత్వ పరిచయం పాటలు ఎదగలేదు.
‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమా ఆరంభంలో నాయిక పరిచయం ‘వ్యక్తిత్వ పరిచయం పాట’తో అవుతుంది.
My day in the hills
Has come to an end. I know
A star has come out
To tell me its time to go
పాట ఆరంభనికి ముందు మనోహరమైన, ఆహ్లాదకరమైన, ఉత్సాహకరమైన సంగీతం వినిపిస్తుంటుంది. ఆ సంగీతం తెరపై కనిపించే అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ధ్వని రూపంలా ఉంటుంది. సంగీతం, దృశ్యాలను మరింత అర్థవంతంగా, ఉత్తేజితంగా చేస్తూ కెమెరా ప్రేక్షుడిని కొండలు ఎక్కిస్తుంది, లోయల్లోకి దింపుతుంది. వంపులు తిరిగే నదుల వెంట పరుగులు తీయిస్తుంది. అలా ఆనందాన్ని ఆహ్లాదాన్నీ కలిగిస్తూ, ఆ సుందరమైన ప్రకృతి దృశ్యాలు చూస్తూ మైమరచిపోతూ, ఆనందాన్ని పట్టలేక గొంతెత్తి హృదయ లోతుల్లోంచి గానం చేస్తున్న నాయికను ముందు లాంగ్ షాట్‌లో ఆపై దగ్గరగా చూపించే సరికి ప్రేక్షకుడికి వ్యక్తిత్వం అర్థమైపోతుంది. ప్రేక్షకుడు సైతం మమేకం చెందుతాడు పాత్రతో.
The hills fall my heart
With the sound of music
My heart wants to sing
Every song it hears
అని నాయిక ఆనందంతో తన్మయమై పాడుతుంటే పర్వతాలకు వినిపించే సంగీతాన్ని అనుభవిస్తూ నాయిక గొంతుతో గొంతు కలపాలనిపిస్తుంది.
I go to the hills
When my heart is lonely..
అని నాయిక అనటం స్వాభావికం అనిపిస్తుంది. ఆ తర్వాత సినిమాలో జరిగే అన్నంటికీ ప్రాతిపదిక ఏర్పడిపోయింది. నాయిక పాత్ర వ్యక్తిత్వం, ఆలోచన విధానం, స్వేచ్ఛా ప్రకృతి, సున్నిత హృదయం వంటివన్నీ ప్రేక్షకుడికి బోధపడిపోతాయి.
(‘My day in the hills’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=tI0iG05pnus )
‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమాలో 1965లో వచ్చింది. అప్పటికీ మన సినిమాలలో పాత్రల వ్యక్తిత్వ పాటలు ఒక ‘కళ’గా ఎదిగాయి.
1941లో పంకజ్ మల్లిక్ పాడిన ‘ఆయీ బహర్, ఆజ్ ఆయీ బహార్’ అంటూ రైల్లో ప్రయాణం చేస్తూ గుండె నిండుగా ఆనందం నింపుకుని గొంతెత్తి పాడిన పాట పాత్ర వ్యక్తిత్వ పరిచయం పాటలలోఅత్యంత ప్రజాదరణ పొందిన ప్రథమ పాట. ‘డాక్టర్’ సినిమాలో ఈ పాట పాత్ర ఆదర్శాన్ని, ఏదో సాదించాలన్న తపనను, ప్రజాసేవ చేయాలన్న దృక్పథాన్ని ప్రేక్షకుడికి చేరువ చేస్తుంది.
(‘ఆయీ బహర్, ఆజ్ ఆయీ బహార్’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=kHEajkqb_oE )
అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో, సినిమా మీడియా పై పట్టు సాధించిన కళాకారులు, పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతోనే అపరిమితమైన కళా ప్రదర్శన చేశారు. అతి అందమైన పాటను మనోహరమైన రీతిలో అందించారు.
పాట ఆరంభంలో చెట్టు పై ఓ పిల్లవాడు ప్రశాంతంగా వేణువు వాయించుకుంటుంటాడు. ఇంతలో అతడు ఉలికిపడి చూసేట్టు ‘ఆ ఆఆ’ అన్న పిలుపు వినిపిస్తంది. ‘ఆయీ బహార్’ అంటూ పాట ప్రారంభమవుతుంది. వేగంగా పరుగిడుతున్న రైలు కనిపిస్తుంది. పాటలో వాయిద్యాలు లయబద్ధంగా వేగంగా ఉంటాయి. రైలు బోగీ మెట్ల పై నుంచుని నాయకుడు పాట పాడుతుంటారు. అతని స్నేహితులు వంత పాడుతుంటారు. పరిమితమైన కెమెరా కోణాలతో అద్భుతమైన ఎఫెక్టు సాధించారు.
ఓ వైపు రైలు, మరో వైపు ఎడ్లబండి.. ఒకే దృశ్యంలో.. నవ యువకులు, సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉత్సాహంతో, భవిష్యత్తుపై ఆశలతో, అత్యంత ఉత్సాహంతో పల్లెలకు రావటాన్ని అత్యంత ప్రతీకాత్మకంగా చూపిస్తుందీ పాట.
ఆ కాలంలో సినిమాలలో పురుషుల కన్నా స్త్రీల పాటలు అధికంగా, పురుషులకు సోలో గీతాలు కూడా తక్కువగా ఉండేవి. యుగళగీతాలు అధికం. పంకజ్ మల్లిక్, సైగల్, దుర్రానీలు పురుషుల ‘సోలో’లకు పేరు తెచ్చుకున్న వారు. కానీ, స్త్రీల పాటలే అధికంగా ఉండేవి. దాంతో వ్యక్తిత్వ పరిచయం పాటలు పెద్దగా కళాకారులు ‘దృష్టిని ’ఆకర్షించలేదు. గమనిస్తే, సినిమాలలో సైగల్ ప్రవేశం పాటతో అయినా అది సినిమా కథలోని అంశాన్ని చెప్పేదిగా ఉండేది తప్ప వ్యక్తిత్వ పరిచయం గీతం అయ్యేది కాదు. ‘దేవదాసు’ సినిమాలో సైగల్ ‘బాలమ్ ఆయే బసో..’ అంటూ పాడుతూ కనిపిస్తాడు. అది అతని ప్రేమ భావనను తెలుపుతుంది. నాయిక కోసం ఎదురు చూపులను తెలుపుతుంది. సైగల్ కన్నా ముందు అతని పాట వినిపిస్తుంది. ఆ కాలంలో సైగల్ అంత పాపులర్. ఇలాంటి సందర్భాలన్నీ తరువాత సినిమాల్లో ఎంతగానో వాడుకున్నారు. నాయకుడి పాట వినిస్తుంది. నాయకుడు కనిపించడు. నాయిక పాట వినిపిస్తుంది. నాయకుడు ఆమె కోసం వెతుకుతాడు.
1949లో ‘ఆవారా’ తో రాజ్ కపూర్ పాత్ర వ్యక్తిత్వ పరిచయ పాటలకు వ్యాపార విలువలు అద్దాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ వ్యక్తిత్వ పరిచయం పాటలు సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
హిందీలో రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, శశికపూర్, జితేంద్ర, రాజేంద్రకుమార్, ధర్మేంద్ర, బిస్వజీత్, జాయ్ ముఖర్జీ, ఒకరా.. ఇద్దరా.. ప్రతి నటుడూ తెరపైకి వస్తూనే పాట పాడాలి. ఆ పాట సూపర్ హిట్ అవ్వాలి. ఒక్కో నటుడుకీ అతడికే ప్రత్యేకమైన పంథాలో పాట రూపొందించాలి. అలా గాయకుడి పాటల ప్రాధాన్యం హెచ్చింది. నాయికకి సైతం పరిచయ పాటలు తప్పనిసరి అయ్యాయి. ముఖ్యంగా కొత్త నటిని పరిచయం చేస్తుంటే ఆమెకు ఓ గుర్తింపు పాటగా ఎదిగే పాట తప్పనిసరిగా ఉండేది. సైరాబాను తొలి సినిమా ‘జంగ్లీ’ లో ‘జజజ మేరే బచ్‌పన్’, షర్మిలా ఠాగూర్ తొలి సినిమా ‘కశ్మీర్ కీ కలీ’లో ‘బల్మా ఖులీ హవామే’.. ఇలా 1960 దశకంలో హీరోయిన్ల పరిచయం పాటతో, నృత్యంతో అయ్యేది.
1969లో ‘మేరే సప్నంకీ రాణీ కబ్ ఆయేగీ తూ’ తో రాజేష్ ఖన్నా సూపర్ స్టార్‌గా ఎదగటంతో, 1980 దశకంలో మాధురీ దీక్షిత్ ‘ఏక్ దో తీన్’ పాటతో దేశాన్ని ఉర్రూతలూపటంతో; ‘పాపా కహతే హై బడా నామ్ కరేగా’ అంటూ అమీర్ ఖాన్ సినీ ప్రేమికుల హృదయాలలో అడుగు పెట్టడం, ఇలా.. పాత్రల వ్యక్తిత్వ పరిచయం పాటలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోకుండా కొనసాగుతూ వస్తున్నాయి.
తెలుగు సినీ రంగంలో ‘హిందీ’ లో లాగా కాక అధిక శాతం, ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులు అధిక కాలం కేంద్రీకృతమయి ఉండటంతో హిందీలో అంతగా పాత్ర వ్యక్తిత్వ పరిచయం పాటలు అభివృద్ధి చెందలేదు. ‘నిండు సంసారం’ సినిమాలో గట్టు మీంచి దూకి ఎన్టీయార్ ‘ఎవరికీ తలవంచకు, ఎవరినీ ఆశించకు’ అంటూ పాడటం పాత్ర వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను అత్యద్భుతంగా పరిచయం చేస్తుంది. అంతే కాదు, చక్కటి వ్యక్తిత్వ వికాస గీతాల జాబితాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పాటకు రామారావు నటన, హావభావాలు చూస్తే అప్పటికే ఆయనకు ఇమేజ్ స్థిరపడిందని స్పష్టంగా తెలుస్తుంటుంది.
(‘ఎవరికీ తలవంచకు, ఎవరినీ ఆశించకు’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=9MgbbfKZVPY )
‘తోడికోడళ్లు’ సినిమాలో ‘కారులో షికారుకెళ్లే’ పాట నాగేశ్వర రావు పాత్ర వ్యక్తిత్వాన్ని, ఆలోచననా విధానాన్ని చక్కగా తెలుపుతుంది. అతడో అభ్యుదయ కవి అనీ, ఆదర్శభావాలున్న సమసమాజ సమర్థకుడనీ సులభంగా గ్రహించవచ్చు. పాట చిత్రీకరణ కూడా వీలయినంత వరకూ నాయకుడి ముఖ కవళికలు, హావభావాలను ప్రదర్శిస్తుంది.
(‘కారులో షికారుకెళ్లే’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=9EjJuKnoobA )
‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణ పాత్ర పరిచయంతోనే ‘గువ్వలా ఎగిరి పోవాలి’ అంటూ ఎగురుతూ గెంతుతూ పాడే పాట సైతం పాత్ర వ్యక్తిత్వాన్ని, తెలుపుతుంది.
(‘గువ్వలా ఎగిరి పోవాలి’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=uGscQ4OT3d8 )
‘కోడెనాగు’ సినిమాలో ఆవేశంగా శోభన్ బాబు పాడే పాట ‘నాగుపాము పగ పన్నెండేళ్ళు’ ఆ పాత్ర ఆవేశాన్ని, వ్యక్తిత్వాన్ని, మాట పడని తత్వాన్ని, మోసం సహించని నైజాన్ని చక్కగా చూపిస్తుంది. పాట బాణీ ఎంత వేగంగా ఉంటుందో, పాటలో పదాలు అంత చక్కగా ఉంటాయి. చిత్రీకరణ కూడా వేగవంతంగా ఉంటుంది. కెమెరా, వేగంగా నడుస్తున్న శోభన్ బాబుతో పాటు పరుగిడుతుంటుంది.
ఘంటసాల ఎంతో వీరత్వాన్ని, క్రోధాన్ని స్వరంలో ప్రతిఫలిస్తూ పాడిన ఈ పాట చిత్రీకరణలో పాము బుసకొట్టగానే కెమెరాను వేగంగా శోభన్ బాబు పాత్రకు క్లోజపులో తేవటం, అప్పుడే పాత్ర లేచి పాట అందుకోవటం అద్భుతమైన ఎఫెక్ట్ నిస్తుంది. పాత్ర ఆవేశాన్ని స్పష్టం చేస్తుంది. రాయి మీద హాయిగా చేరగిలబడి, భయం లేదు ఏ విషయంలో అన్నప్పుడు, నిర్లక్ష్యంగా పడుకున్న శోబన్ బాబు పాత్రను టాప్ యాంగిల్ షాట్‍లో చూపించటం అతని నిర్భయత్వాన్ని ప్రేక్షకుడు అనుభవించేట్టు చేస్తంది.
(‘నాగుపాము పగ పన్నెండేళ్ళు’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=4BjvyhnFt58 )
అలాగే ‘అభిమానం త్యజించలేను,. అవమానం సహించలేను’ అంటున్నప్పుడు టాప్ యాంగిల్ నుంచి చూపిస్తూ ‘సహించలేను’ అన్నప్పుడల్లా, జెర్క్ ద్వారా దగ్గరకు తీసుకురావటం, ‘హహ్హ’ అన్నపుడు క్లోజప్పులో చూపిస్తూ, ఎగరటం, ‘పాయింట్ ఆఫ్ వ్యూ’ నుంచి ‘లో యాంగిల్’లో హీరో వెనుక కొండలు, ఆకాశం కనబటం ద్వారా హీరో ఎంతో ఎత్తున ఉన్న భావనను కలిగిస్తూ గొప్ప ఎఫెక్టు సాధిస్తుంది కెమోరా.
‘కొండవీటి దొంగ’లో ‘జీవితమే ఒక ఆట’ బాణీ పరంగా , పాటలో భావాల పరంగా, చిత్రీకరణ పరంగా అతి చక్కటి పాట. పాత్ర వ్యక్తిత్వాన్ని గొప్పగా పరిచయం చేస్తుంది.
(‘జీవితమే ఒక ఆట’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=L1B4Iay9hxg )
అయితే.. తెలుగులో అప్పటి కన్నా ఇప్పుడు హీరో ఆరాధన అధికంగా ఉండటంతో పాత్రల వ్యక్తిత్వ పరిచయ పాటలు, ఇమేజ్ పాటలు ఇప్పుడు పాత్రల ‘ఎలివేషన్’ పాటలుగా మారేయి.
ముఠా మేస్త్రీ, గ్యాంగ్ లీడర్, పంజా, దూకుడు, పోకిరీ, సినిమాల టైటిల్ పాటలు, సాహో, బాహుబలి వంటి పాటలు, శ్రీమంతుడులో ‘రామా రామా’ పాట; ‘కంత్రీ’లో ‘వన్ టూ త్రీ, నేనొక కంత్రీ’ వంటి పాటలు, ‘అన్న నడిచొస్తే మాస్’; ‘కింగ్’ సినిమాలో ‘నడిచే స్టైలేమో రాకింగ్‘, ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు’ లాంటి పాటలు హీరోయిజమ్‌కు స్తోత్ర పాటలు.
హీరోయిజమ్‌ను ప్రదర్శిస్తున్నా, వీటికి భిన్నమైన పాట ‘ప్రణామం ప్రణామం’ పాట. ఈ పాట హీరో పరిచయ పాట. ఇందులో హీరో గొప్పతనం కాదు, అతని ఆలోచనలు, ఆదర్శాలు కనిపిస్తాయి. పాట చిత్రీకరణ ఆరంభంలోనే ఆకట్టుకుంటుంది.
పాట ఆరంభ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. సంగీతం మంద్ర స్థాయిలో కాబోయే ఉదయాన్ని ఆహ్వానిస్తున్నట్టుంటుంది. షాట్లు వేగంగా మారవు. అలాగని కొన్ని సెకెన్లే ఉంటాయి. పిట్ట బోటు పై నుంచి ఎగరటం, కట్ చేసి విద్యార్ధులు పరుగెత్తుతూ రావటం, ‘ఓం ధిరన’ అంటు పాట వినిపించటం, పాటకు చక్కటి ఊపునిస్తుంది. తరువాత షాట్లు వేగంగా మారతాయి. చివరికి లయబద్ధంగా నృత్యం చేయటం, కెమెరా కదలికలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. పెద్ద సూర్యబింబం, ‘ప్రణామం’ అంటూ ప్రభాత సూర్యునికి నమస్కరించటం, లాంగ్ షాట్లు – పాట పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనకలవాటయిన ట్రెండ్- లాజిక్, సీన్‌ల నడుమ సమన్వయం, అర్థాలు వెతకకపోతే పాట చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ పాటలోని భావాలలోని సున్నితత్వాన్ని చిత్రీకరణ ప్రతిబింబించదు. లయ, వేగం ఉద్వేగం, సృష్టించటం కోసం తెరపై నిరంతరం కదలికలు, జంప్ కట్‌లు, మాంటేజ్‌లు, ఫాస్ట్ కట్‍లు.. ఊపిరాడనీయకుండా, ఆలోచించనీయకుండా దృశ్యాలు మారుతూంటాయి.
సీతార్ సుందరంగా వినిపిస్తున్నప్పుడు ఫోర్ గ్రౌండ్‌లో బైక్‌లూ, హీరో నడుస్తూ రావటం, దృశ్యానికి సంగీతానికి సంబంధం తెగిన భావనను కలిగిస్తుంది. అలాగే ‘ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం’ అన్నప్పుడు ఆ ఎగరటం ఎందుకో అనిపిస్తుంది. కానీ సంగీత వాయిద్యాల వేగం, వేగంగా మారుతున్న దృశ్యాలు, ముఖ్యంగా, ప్రణామం అన్నప్పుడల్లా ప్రవాహంలా వినిపించే సితార్ అలరిస్తాయి. ఒక చక్కటి పాటను చూసిన అనుభూతిని కలిగిస్తుందీ పాట.
(‘ప్రణామం ప్రణామం ప్రణామం’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=lFAiFov5pP8 )
పరిచయ పాటలు, వ్యక్తిత్వ పరిచయ పాటలకు ఇది పరిచయం వ్యాసం మాత్రమే. వచ్చే వారం నుంచీ ఇలాంటి పాటల గురించి ఇంకాస్త లోతుగా, ఇంకాస్త విపులంగా చర్చించుకుందాం.
(మళ్ళీ కలుద్దాం)