Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-10

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే
వయసూ మనసూ పరుగులు తీసే,  అమ్మమ్మా..

ఇది మనకే ప్రత్యేకమైన సందర్భం.

నాయిక తన ప్రేమను అమోదించగానే, నాయకుడు వర్షంలో గెంతుతూ పాడే పాటలు ఉన్నాయి. ఇప్పుడు, నాయకుడు తన ప్రేమను ఆమోదించినందుకు, వర్షంలో తడుస్తూ, నృత్యం చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేయటం నాయిక వంతు. ‘కథానాయకుడు’ సినిమాలో నాయకుడు విద్యావంతుడు. నాయిక పళ్లు అమ్మే అమ్మాయి. నాయకుడు ఆమె ప్రేమను ఆమోదిస్తాడు. నాయిక అనందం పట్టలేదు.

నాయిక సంతోషంతో, పట్టలేని అనందంతో ఆవేశంగా, ఆనందంగా నృత్యం ఆరంభిస్తుంది. ఇక్కడే సన్నివేశాన్ని చక్కగా అర్థం చేసుకుని, నాయిక మనోభావాలను, పట్టలేని ఆనందాన్ని అర్థం చేసుకున్న సంగీత దర్శకుడు పాట బాణీని రూపొందించటం గమనించవచ్చు.

నాయిక కన్నీళ్లతో నాయకుడి పాదాలను తాకుతుంది.

తరువాత నాయకుడు చూస్తూండగానే మందు గదిలోకి పరుగెత్తుకు వస్తుంది. అప్పుడు నేపథ్యంలో వచ్చే సంగీతం వేగవంతంగా, ఆనందాన్ని ప్రదర్శించేదిగా ఉంటుంది. వయోలిన్లు నాయిక నృత్యానికి ప్రేరణనిచ్చినట్టుగా ఉంటాయి. ఇంతలో సంగీతం ఆమె నృత్యానికి తాళం వేస్తుంది. అత్యద్భుతమైన సంగీత రూపకల్పన ఇది. సంగీత దర్శకుడు టి.వి.రాజు అత్యంత ప్రతిభావంతుడయిన సంగీత దర్శకుడు. ఆయన అధికంగా హిందీ సినిమా పాటల బాణీలను అనుకరిస్తాడన్న అపవాదు ఉంది. కానీ ఆయన స్వతంత్ర బాణీలు అంతర్జాతీయ స్థాయివి. ముఖ్యంగా ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాట ఒక్కటి చాలు, ప్రపంచంలో ఏ గీత సృజన కూడా దానికి సాటి రాదు. ఆ పాట రూపకల్పన ముందు నిలవలేదు.

ఈ పాటలో ఆరంభంలో వినిపించిన వయోలిన్ల నుండి స్ఫూర్తిని అందుకుని, నాయిక హృదయలోతుల్లోంచి దూకి పడే సంతోష జలపాతాల దూకుడిని ప్రతిబింబిస్తూ గాయని సుశీల రాగాలాపాన చేయటం, మనసును ఆనంద తరంగాల శృంగాలపై నిలుపుతుంది. ఆరంభంలోనే పాట ఆకర్షిస్తుంది. అద్భుతం అనిపిస్తుంది. మెరుపులతో మెరుపుగా ఆరంభమైన ఆలాపన అలరింప చేస్తుంది. ఊర్రూతలూగుతుంది. ఆనందంతో పిచ్చి పట్టిన దానిలా నర్తిస్తున్న నాయిక హృదయోద్వేగం లయతో లయ కలుపుతుంది.

ఆకాశం చినుకు చేమంతులు కురిపిస్తున్నట్టుగా పాట ఆరంభమవుతుంది. గేయ రచయిత దాశరథి వర్షాన్ని వర్ణించేందుకు ఎంచుకున్న పదాలు సులభతరం. వినగానే పట్టేస్తాయి. ‘ముత్యాల జల్లు, రత్నాల మెరుపు’. నీటి బిందువులను ముత్యాలతో పోల్చటం ఎంత సహజమో, రత్నాలను మెరుపుతో పోల్చటం అంత సమంజసం. పాట బాణీ, సన్నివేశం, నృత్యం కలసి ఈ పదాలతోను ఒక రకమైన ఆనందాన్ని, ఉద్వేగాన్ని ఆపాదిస్తాయి. మాములుగా ధ్వనించే పదాలు కూడా సుశీల స్వరంలో ఒదిగి ముత్యాలు, రత్నాలుగా మెరుస్తాయి. ముఖ్యంగా, ఆరభంలో వచ్చిన ‘ఆ ఆ’ అన్న ఆలాపన ప్రభావాన్ని మరింత పెంచుతూ ఈ పదాలు ‘గేట్లు తెరవగానే డ్యాముల నుంచి దూకే నీటి ధారల్లా’ అనిపిస్తాయి.

‘వయసూ, మనసూ పరుగులు తీసే’ అన్నది అనుభవిస్తాడు శ్రోత ప్రేక్షకుడు. ‘అమ్మమ్మా’ అనటం పాటకే వన్నె తెస్తుంది. నిజానికి ఈ ఇక్కడికి వచ్చేసరికి ప్రేక్షకుడు తనువూ, మనసూ పరుగులు తీసే స్థాయికి వస్తాయి ఆనందంతో. నృత్యం చేసే నాయిక నృత్యపు లయతో ఊగిపోతాడు ప్రేక్షకుడు. నాయిక జయలలిత నృత్యం నేర్చుకున్నది కావటంతో ఆమె కదలికలు స్వాభావికంగా సహజంగా అనిపిస్తాయి. ఎక్కడా తెచ్చి పెట్టుకున్ననట్టు అనిపించవు. దీనికి తోడు, పాటలో వేగం, తన ప్రేమ ఆమోదం పొందిన ఉద్వేగంతో కలసి మరింత ఉద్వేగభరితం అవుతుంది. ఆనందం అర్ణవమైతే ‘ముత్యాల జల్లు, రతనాల మెరుపు’లా ఉంటుందనిపిస్తుంది.

ఇక్కడ కెమెరా కోణాలను గమనించాల్సి ఉంటుంది.

నాయిక నాయకుడిని వదలి పరుగెత్తుకుంటూ రావటాన్ని దూరం నుంచి చూపిస్తాడు. నాయిక కెమెరా దగ్గరకు వస్తుండగానే కెమెరా కదలుతుంది. నాయిక నృత్యం ఆరంభించటం చూపి ‘కట్’ చేసి కొద్దిగా లోలెవెల్ యాంగిల్‌లో నాయిక నృత్యాన్ని చూపుతాడు. ఇలాంటి కోణం నాయిక ఆనందాన్ని అధికంగా చూపిస్తుంది. ఆ పై నాయిక నృత్యాన్ని వెంబడిస్తుంది కెమెరా. తరువాత ‘షాట్’లో మెరుపులు కనిపిస్తాయి. ఇక్కడే కెమెరామెన్, దర్శకుడు సన్నివేశాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకుని, పాట చిత్రీకరణకు ఎలా పథకం వేసుకున్నారో అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఇంత వరకూ నాయికను చూపించిన కోణానికి ఇప్పుడు చూపించే కోణానికి తేడా వస్తుంది.

ఇప్పటి వరకూ నాయిక ఆనందాన్ని దగ్గర నుంచి చూసి ప్రేక్షకుడికి ఆమె ఆనందాన్ని సన్నిహితం చేసిన కెమేరా, ఇప్పుడు నెమ్మదిగా ‘హై లెవెల్’ కోణానికి కదులుతుంది.

నాయిక ఇంటి నుంచి బయటకు వచ్చ ఆగి కెమెరా వైపు పరుగెత్తుకుని వస్తుంది. కెమెరా నెమ్మదిగా పైకి వెళ్తుంది. ఇప్పడు కూడా నాయిక ఆనందం ప్రేక్షకుడు అనుభవిస్తుంటాడు. కానీ ఈ కోణంలో చూపించటం వల్ల ‘ఆ ఆ ఆ’ అని రాగం తీస్తూ నాయిక నృత్యం చేయటం మరింత ప్రతిభావంతంగా ఉద్వేగాన్ని ప్రదర్శించే వీలు చిక్కుతుంది. అంతే కాదు, ఈ కోణం వల్ల వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపించే వీలువుతుంది. సంగీతం ఆరంభమయినప్పటి నుంచి ఇక్కడి వరకూ సమయం కేవలం 20 సెకనులే. కానీ ఈ 20 సెకెన్లలో నాయిక పరవశం, పట్టలేని ఆనందం, కట్ట తెగిన ఉద్వేగం సర్వం ప్రేక్షకుడు అనుభవిస్తాడు. కెమెరా ఆమె ఆనందాన్ని చేరువ చేస్తుంది. ఆమె ఊగితే ఊగుతుంది. ఆమె తూగితే తూగుతుంది. చివరికి ఆమె ఆలాపన దగ్గరకు వచ్చే సరికి హై యాంగిల్‌లో చూపటం ద్వారా ఉచ్చస్థాయికి చేరిన ఆమె ఆందాన్ని ప్రేక్షకుడు అనుభవించేట్టు చేస్తుంది. ఈ 20 సెకన్ల దృశ్య చిత్రీకరణ వెనుక ఎంత శ్రమ, ఎంత ఆలోచన, ఎన్ని రిహార్సెల్స్ ఉన్నాయో ఆలోచిస్తే కళాకారుల శ్రమ, సృజనాత్మక మాధ్యమంపై పట్టు బోధపడుతాయి. ప్రేక్షకుడు ఇవేవీ గమనించడు. కానీ వీటి వల్ల కలిగే అనుభూతిని అనుభవిస్తాడు.

నాయిక పాట అందుకునే సరికి నాయికకు ‘హై లెవల్’ కోణంలో చూపిస్తాడు. వెనుక వర్షం, చెట్లు తడవటం కనిపిస్తుంటాయి. తెరపై నాయిక ‘ముత్యాల జల్లు కురిసే’ అంటూ పాట అందుకుంటుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడు ‘ముత్యాల జల్లుతో’ తడిసి ముద్దయిపోతాడు. పాదం మధ్యలో నాయిక క్లోజప్పులు చూపుతూ ఆమె భావాల్ని మరింత చేరువ చేస్తుంది కెమెరా. మళ్లీ ‘వయసూ, మనసూ పరుగులు తీసే’ అని నాయిక కెమెరా వైపు పరుగెత్తుకు వస్తుంటే కెమెరా దూరం వెళ్తూ నాయిక  దగ్గరకు వచ్చే దాకా చూపిస్తుంది. ఇలా లాంగ్ షాట్, క్లోజప్, హై లెవల్ యాంగిల్స్‌తో, నాయిక వేగవంతమైన కదలికలను వెంబడిస్తూ పాట వేగాన్ని, ఉద్దేశాన్ని, ఆనందాన్ని , పారవశ్యాన్ని ప్రేక్షకుడికి చేరువ చేస్తుంది కెమెరా. ముఖ్యంగా ‘ఆ ఆ’ అంటూ రాగం తీసినప్పుడల్లా నాయిక ఎంత వేగంగా ముందుకు పరుగెత్తుతూ వస్తుందో, కెమెరా అంత వేగంగా వెనక్కు వెళ్తూ పాట వేగాన్ని అనుభవానికి తెస్తుంది. నాయిక ఆనందావేశాన్ని స్పష్టం చేస్తుంది. ‘మల్లె పూల పల్లకిలో ఒళ్లు మరచే నమ్మా’ అన్నప్పుడు క్లోజప్పులో చూపిస్తూ, మల్లెలా  పడే వర్షాన్ని సూచిస్తూ మల్లెల మాలల నడుమ సిగ్గుతో కూర్చున్న నాయిక దృశ్యాన్ని ‘డిజాల్వ్’ చేయటం గొప్ప ఎఫెక్ట్ నిస్తుంది.

షహనాయీ వేగం అద్భుతం. మళ్లీ క్లోజప్పులోకి తెచ్చి చూపి, రాగం తీసేప్పుడు ‘లాంగ్ షాట్’ చూపిస్తాడు. ఈ రకంగా ఈ పాటలో సంగీతం, స్వరం, నృత్యాలతో పాటు తాను ఒక అంశమై కెమెరా సంగీతం లయలను అనుసరిస్తూ, నాయిక నృత్యంతో నర్తిస్తూ, పాట భావాన్ని ప్రదర్శిస్తూ పాట ప్రభావాన్ని పెంచుతూ, నాయిక భావాలను ప్రేక్షకులకు చేరువచేస్తుంది. అత్యద్భుతమైన పాటకు అంత చక్కనైన చిత్రీకరణ ఇది.

(ఈ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=38xXQVmq_kU )

పాటలో నాయిక వర్షంలో తడిసినా ఎక్కడా అసభ్యత లేదు. పైగా అవకాశం దొరికినప్పడల్లా, లైటింగ్‌ను చక్కగా వాడుకుంటూ, నాయిక వదనాన్ని క్లోజప్పులో చూపిస్తూ, ఆమె మరింత అందంగా కనబడేట్టు చూపుతుంది కెమెరా. ఈ రకంగా సినీ నిర్మాణంలో ఎన్నెన్ని  రకాల అంగాలున్నాయో అన్నీ కలసికట్టుగా పని చేసి పాటను ఒక మరుపురాని పాటగా నిలిచాయి.

సినిమాల గొప్పతనం ఏమిటంటే, తెర  వెనుక కష్టం ప్రేక్షకుడికి తెలియకున్నా, సాంకేతిక పరిజ్ఞానం ఏ మాత్రం లేకున్నా, తెరపై కనబడే దృశ్యాలను చూస్తూ ప్రేక్షకుడు,  కళాకారులు ఎలాంటి అనుభూతిని కలిగించాలనుకుంటున్నారో, అలాంటి అనుభూతిని పొందుతాడు. పాత్రల ఉద్వేగాలను తనవిగా చేసుకుని తన్మయత్వం చెందుతాడు. ఇక్కడే ఇతర కళలపై సినిమా తన ఆధిక్యాన్ని  నిరూపించుకుంటుంది. నాటకానికి పరిమితులున్నాయి. అధికంగా సంభాషణలపై ఆధారపడి ఉంటుంది. సంభాషణలను ప్రేక్షకుడు అందుకోలేకపోతే నాటకం నచ్చదు. రచనలలో  కూడా పాఠకుడు  అక్షరాలు, పదాలు స్పష్టించే దృశ్యాన్ని ఊహించుకోవాల్సి ఉంటుంది. వాటిని మనస్సు తెరపై దర్శించాల్సి ఉంటుంది. గానం తెలియని వారు ఆనందం అనుభవించినా గానం కలిగించే అనుభూతికి సాహిత్యం తోడవకపోతే సామాన్యుడికి అసంపూర్ణమే. కానీ సినిమా అలాగ కాదు. ఏమీ తెలియకున్నా, ఏమీ అర్థం కాకున్నా అనుభవిస్తాడు ప్రేక్షకుడు. ఏమీ అర్థం కాకున్నా కనబడే దృశ్యాల ద్వారా అర్థం చేసుకోగలుగుతాడు.

ఇలా ప్రేమను ఆమోదించగానే నాయిక వర్షంలో తడుస్తూ పాడటం హిందీ సినిమా ‘నయా జమానా’ లోనూ చూడవచ్చు. ధర్మేంద్ర తన ప్రేమను ఆమోదించాడని నాయిక హేమమాలినికి తెలుస్తుంది. ఆమె ధనవంతురాలు. విద్యావంతురాలు. కాబట్టి మాములు వారిలా వర్షంలో ఆనందంతో గెంతలేదు. కాబట్టి వేరే పాత్ర పాట ఆరంభిస్తుంది. నాయిక తనను తాను ఆ పాత్రలా ఊహించుకుంటుంది. నృత్యం చేస్తుంది.

రామా రామా గజబ్ హుయీ గవా రే
హాల్ హమారా అజబ్ హుయీ గవా రే..

అంటూ పాట పాడుతుంది. పాట బాణీ బాగుంటుంది. పాటలో భావం బాగుంటుంది. పదాలు బాగుంటాయి. లత గానం అద్భుతంగా ఉంటుంది.

కానీ ఆ సమయంలో నాయిక ప్రదర్శించాల్సిన ఆనందం, ఆవేశం, ఉత్తేజితమై చేసే గానం ఈ పాటలో ఉండవు. మామూలుగా ఉంటుంది. చిత్రీకరణ కూడా సాధారణంగా ఉంటుంది. ఎలాంటి భావోద్వేగాలను కలిగించదు. ముత్యాలజల్లు కురిసేలాంటి   సందర్భమే అయినా ఎలాంటి ప్రత్యేక ప్రభావం చూపించదీ పాట.

(ఈ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=RDfq3Rpvd7U )

‘కథానాయకుడు’ సినిమా హిందీలో ‘అప్నా దేశ్’ అన్న సినిమాగా మారింది. రాజేశ్ ఖన్నా, ముంతాజ్‌లు హీరో హీరోయిన్లు. అప్పటికి రాజేశ్ ఖన్నా సూపర్ హిట్ స్టార్. ముంతాజ్, రాజేశ్ ఖన్నాలు అంతకు ముందు ‘దో రాస్తా’ అనే సూపర్ హిట్ సినిమాలో కలసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరూ వర్షంలో తడుస్తూ ‘ఛుప్ గయే సారే  నజారే ఓయ్ క్యా బాత్ హూయీ’ అన్న యుగళ గీతం పాడుతారు. అది సూపర్ హిట్ అయింది. దాంతో ‘ముత్యాల జల్లు కురిసే’ సందర్భం అదే అయినా, హిందీలో అది ‘యుగళగీతం’ అయింది.

నాయకుడిని వదలి నాయిక సంతోషంగా బయటకు వచ్చిన  దృశ్యం కెమోరా కోణంతో సహా ‘కథానాయకుడి’ లోదే. కానీ ఆ తరువాత నుంచి హిందీ పాట పూర్తిగా భిన్నం. నాయిక పరుగెత్తుతూ భోరున కురిసే వర్షంలోకి   వస్తుంది. నాయకుడు వెంట వస్తాడు.

కజ్రా లగాకె, గజ్‌రా సజాకె
బిజలీ గిరాకె జయ్యోనా
నైన్ మిలాకె చైన్ చురాకె
నిందియా ఉడాకె జయ్యోనా.

ఇదీ పాట. సందర్భంలోని ఉద్వేగం, వేగం, ఉత్తేజం, ఉత్సాహం అన్నీ చచ్చిపోతాయి. మామూలు సందర్భం అయిపోయింది. కాటుక పెట్టుకుని, పూలు ముడుచుకుని, మంత్రముగ్ధుడిని చేసి వెళ్లవద్దంటాడు నాయకుడు. కళ్లు కలిపి, అశాంతి కలిగించి నిద్ర పోగొట్టి వెళ్లవద్దంటోంది నాయిక.

(ఈ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=YwFDkOSHtwI )

ఎంతో ఎత్తున ఉన్నవాడు, తగని తన ప్రేమను స్వీకరించాడని తెలిస్తే ఎంత ఆనందాశ్చర్యాల ఆవేశ పరవశాలలో ఊగిపోవాలి నాయిక. తెలుగు పాటలో ‘ఆ ఆ’ అంటూ జలప్రవాహంలా,  దూకే జలపాతంలా సుశీల పాడిన రాగం ఒక్కటి చాలు తెలుగు పాటను, అలాంటి సన్నివేశాలలోని ఇతర పాటలను మించి అంత్యంత ఎత్తులో నిలపటానికి.

నిజానికి, ఇలాంటి సందర్బం ‘అన్‌పఢ్’ సినిమా లోనూ ఉంది. విద్యావంతురాలు కాని నాయకను విద్యావంతుడయిన వాడు స్వీకరిస్తాడు. ప్రేమను ఆమోదిస్తాడు. అప్పుడామె సంతోషంతో పాట పాడుతుంది.

ఆప్ కీ నజరోం నె సమ్‌ఝూ ప్యార్ కే కాబిల్ ముఝే
దిల్ కీ  ఏయ్ ధడకన్, ఠహర్ జా, మిల్ గయీ మంజిల్ ముఝే..

పాట అద్భుతంగా ఉంటుంది. పాటలో భావం పరమోత్తమం. లతా గానం అయితే పాటను స్వర్గలోకానికి ప్రతిరూపంగా మలుస్తుంది. ఆమె తీసిన రాగాలు, వేసిన గమకాలు, ప్రదర్శించిన భావాలు ఉత్తమోత్తమం. పాట స్థాయిని పదింతలు పెచుతాయి. కానీ, ఆ పాట సందర్భంలో అతకలేదు.

మామూలుగా సందర్భం  తెలియక విన్నవారు, ఇది విషాదగీతం అనుకుంటారు. అర్థం తెలిసినవారు పాట బాగుంది కాని ఆ సందర్భంలో ఉండవలసిన ఆనందం, ఆవేశాలు లేవు; కృతజ్ఞతా భావం కనిపిస్తుంది కానీ నాయికలో న్యూనతా భావం అధికంగా తోస్తోంది అనుకుంటారు. దాంతో, పాట ‘అద్భుతమయినా’ సందర్భంలో ఒదగదు. సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఇలాంటి సందర్భాలలో ఒదగని పలు అద్భుతమైన గీతాలను సృజించాడు. పాటలు హిట్. కానీ, సినిమాలో అంతగా ప్రభావం చూపవు పాటలు. మెలోడీ అద్భుతం. కానీ సినిమా పరంగా బలహీనం.

(ఈ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=Wv-VlQMD0VY )

‘హమ్ సే ఆయా న గయా’ అన్న అద్భుతమైన పాట ఉంది. మెలోడీ పొంగి పొర్లుతూంటుంది. సినిమాలో అది హాస్య సన్నివేశం. ‘తుమ్హారె జుల్ఫ్ కె సాయే మే షామ్ కర్ లూంగా’ అన్న మహమ్మద్ రఫీ పాట ఉంది. బయట వింటే అద్భుతం. సినిమాలో అది రొమాంటిక్ పాట. రొమాన్స్ పదాల్లో ఉంది. గాయకుడి స్వరంలో ఉంది. బాణీలో మాధుర్యం ఉంటుంది. కానీ రొమాన్స్ ఉండదు. అందుకే వానలో సంతోషంతో నర్తిస్తూ పాడే పాటలెన్ని ఉన్నా, ‘ముత్యాల జల్లు కురిసే’ పాట అన్నిటికీ ప్రత్యేకంగా నిలుస్తుంద. సందర్భాన్ని అర్థం చేసుకుని, ఔచిత్యాన్ని పాటిస్తూ, సందర్భం ప్రదర్శించాల్సిన భావానికి తగ్గ బాణీని ఎంచుకుని, సాహిత్యాన్ని జోడించి, సందర్భోచితమైన చిత్రీకరణ జోడిస్తే – పాట మధురమైన గీతంగానే కాదు, మరుపురాని దృశ్యంగా కూడా నిలుస్తుంది.

కాలక్రమంగా అన్నీ మారుతాయి. నిత్య చంచలమైన ప్రపంచంలో పరిణామం తప్పనిసరి. నాయికా నాయకుల వ్యక్తిగత మనోభావాలను అతి సుందరంగా వ్యక్తపరచే వాన పాటలు రాను రాను సామూహిక నృత్యాల బృందగాన గీతాలుగా పరిణామం చెందాయి. ఈ పరిణామ క్రమం వచ్చే వారం చర్చిద్దాం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version