[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన “‘మధుర మీనాక్షి’ – అద్వైతం” అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
I
ఆర్.ఎస్. సుదర్శనం గారి ‘మధుర మీనాక్షి’ కథను తొలిసారి భారతిలో [May, 1970] ప్రచురించారు. ఆసక్తికరమైన కథాసంవిధానంతో మధుర మీనాక్షి విగ్రహం, ఆమె మానుష్య రూపం కేంద్రబిందువుగా కథ సాగుతుంది. కథా తత్త్వం అద్వైత పునశ్చరణ. ఆలోచింప చేసే ప్రవహ్లిక ‘మధుర మీనాక్షి’. అర్థం చేసుకోడం కష్టమైన అద్వైత తత్త్వాన్ని కథకు అన్వయించడంలోనూ అస్పష్టత చోటు చేసుకుని సాధారణ పాఠకుడ్ని అక్కడక్కడా తికమకపెడుతుంది. కళకు అస్పష్టత, నిగూఢత అలంకారము అనుకుంటే పేచీ లేదు. RS కు బదులు ‘RSS’ అని R.S. సుదర్శనం గారిపై మార్క్సిస్టులు వ్యంగ్యబాణాలు వేసినా జాతీయవాదంపై, భారతీయ తాత్త్వికతపై విశ్వాసాన్ని సడలించని ప్రముఖ సాహితీవేత్త ఆయన.
జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుట్టి వద్దనుకున్నా జగద్గురువుగా ఎదిగాడు తన బోధనలతో, వస్తానన్న అపార సంపదను త్రోసిరాజని. ఏ మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రభావాలులేని మేధతో [unconditioned mind] సత్యాన్వేషణ చెయ్యమన్నారు జిడ్డు వారు. రమణ మహర్హి, రామకృష్ణ పరమహంస లాంటి ‘ఆధ్యాత్మిక గురువుల’ బోధనలను, చివరకు ‘ఓషో’ ను తోసిపుచ్చాడు. ఓషో మాత్రం జిడ్డును జగద్గురువుగా అంగీకరించాడు. సత్యాన్వేషణలో ఎవర మార్గాన్ని వారు ఏర్పరచుకోవాలన్న విప్లవాత్మక బోధన చేశాడు. దేవుడు అంటే అసలు ఏమిటి అని ప్రశ్నించాడు.
సుదర్శనం కూడా మదనపల్లెలో పుట్టారు. తన పెరడులోని జిడ్డు చూపిన [?] మార్గాన్ని ఒదిలి రమణ మహర్షి బోధనలు, అద్వైతం వైపు మొగ్గుచూపారు. ఎవరి అభిరుచి, తాత్త్విక వ్యవసాయం వారిది.
II
కథలోకి వెళ్ళబోయేముందు ఆసక్తికరమైన చారిత్రిక అంశాలు రేఖామాత్రంగా తెలుసుకోడం మంచిది. పాండ్య రాజుల, వాళ్ళ రాజధాని మధుర చరిత్ర కనీసం రెండువేల ఐదొందల సంవత్సరాల కాలంది. కామాక్షి ఆరాధన రెండువేల ఏళ్ళ పైచిలుకుది. మనకు తెలిసి కులశేఖరుడు పెద్ద దేవాలయాన్ని నిర్మిచాడు [1190-1205]. నలభై ఏళ్ళు పాలించడం అపారమైన సంపదను కూడవేయడం అంతటి ఖర్చును భరించడానికి వీలు కలిపించాయి. పట్టమహిషికి పుట్టిన సుందరపాండ్య తండ్రి కులశేఖరుడిని ఆయన ఆఖరి దినాలలో చంపి సింహాసనాన్ని లాక్కున్నాడు. తండ్రికి ఇష్టుడు ఉంపుడుగత్తెకు పుట్టినవాడు ఐన వీరపాండ్య, సుందర పాండ్య గొడవపడ్డారు. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ కుళ్ళు, కుతంత్రాలు తప్పవు. మధురలో అంతర్యుద్ధం జరిగింది. అదే అదునుగా 1311లో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కాఫర్ను దోచుకురావడానికి పంపాడు. ఆ నపుంసకుడు చాలావరకు ఆ పని చేశాడు, కొంతమేరకు మీనాక్షి ఆలయ విధ్వంసంతో పాటు. మీనాక్షి విగ్రహాన్ని దాచి కాపాడుకున్నారు. మరి కొందరు సుల్తానులు అతని తరువాత వచ్చి దోపిడీతో ఊరుకోక మిగిలివున్న దేవాలయంలో మరికొంత దేవాలయాన్ని ధ్వంసం చేశారు. 1323 నుంచీ ఢిల్లీ సుల్తానుల పాలనలోకి మధుర వెళ్ళింది. 1371 లో హంపీ విజయనగర రాజులు ఢిల్లీ సుల్తానులను పారద్రోలి మధురను వాళ్ళ సామంతులు నాయక రాజుల చేతిలో ఉంచారు. విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం క్రమేపీ పతనం చెందుతుండగా 1530 లో నాయక రాజులు స్వతంత్రులయ్యారు. తెలుగు వారయిన నాయక రాజులు ఆలయాని పునరుద్ధరించారు. ప్రస్తుతం వున్న చాలా భాగం వారి చలువే. పద్నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి పన్నెండు ముఖ ద్వారాలు కలిగివుంటుంది. 33,000 శిల్పాలు కొలువై వున్నాయి.
మధుర శివుడికి సుందరేశుడు అనే పేరుండటం పాండ్య రాజులలో చాలామందికి ఆ పేరుండటం కారణం. పాండ్య వంశంలో మీనాక్షి అనే రాజవంశ స్త్రీ కూడా కొంతకాలం రాజ ప్రతినిధిగా వ్యవహరించింది. స్థలపురాణంలో ఆమె రాకుమార్తే. రాజులు తమను తాము ఏదోరూపంలో దైవంలా కొలిపించుకోడం చరిత్రలో లేని విషయం కాదు. రాజులుగా, దైవాలుగా రాముడిని, కృష్ణుడిని వదిలేస్తే, శాతవాహనులకు పూర్వం వున్నాడు అని భావించే శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు గురించీ చెప్పక్కరలేదు. రెండో లేక మూడో శతాబ్దంలో తన భర్తకు మరణదండనను విధిస్తు రాజు నెడుంచెలియన్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఒక వక్షాన్ని కోసేసుకుని, ఒక కాలి పట్టీని రాజు ముందుకు విసిరేసి. రాజు-రాణుల చావుకు, మధుర నగర ధ్వంసానికి కారణమయిన కణ్ణగి/కన్నగి తమిళులకు ఒక దేవతగా మారింది.
తొలినాళ్ళ పాండ్యరాజులు జైన మతస్థులు. నిజానికి తమిళులు గర్వంగా చెప్పుకునే సిలప్పాతికారం, మణిమేఖల, తొల్కాప్పియం [తమిళ వ్యాకరణం], తిరుక్కురళ్ జైనులవె. ఏడో శతాబ్దంలో అరికేసరి మారవర్మ [సుందర పాండ్యన్] భార్య శైవ చోళదేశం నుంచివచ్చిన రాణి మంగమ్మ [మంగయ్యఅర్కరసి] జైనుల రాజకీయ, మత ప్రాబల్యాలను నిరసిస్తూ చోళదేశ శైవ బ్రాహ్మణుడు సంబంధర్ ను మధుర రప్పించగా ఆయనకు జైనులకు జరిగిన వాదోపవాదాలతో ఓడి జైనులు తమను తామే మాటప్రకారం శిక్షించుకున్నారు. రాజు మతం మార్చుకున్నాడు. తరువాత కూడా జైనుల ప్రాధాన్యత కొంత మిగిలివుంది. ఈ విషయాలు చెప్పడంలో మీనాక్షి జైన యక్షిణి విగ్రహం అయుండవచ్చు అన్న సందేహం కలగడం కారణం. భుజం మీద వాలిన చిలుకతో మూడు వక్షోజాలతో [శివుడి దర్శనంతో ఒకటి మాయమయినా] మీనాక్షి దర్శనమిస్తుంది.
III
కథకుడి స్వేచ్ఛ గురించీన ఆరాటంతో కథ ఆరంభమవుతుంది. అది అందరు అనుకునే బానిసత్వం నుంచీ కాదు. హృదయంలో ఏర్పడిన – ఏ కారణం వలననో అతనికే తెలియని – శూన్యం ఆ కోర్కెకు దారి తీయగా. భార్య చనిపోయి రెండేళ్లవుతుంది; నలుగురు పిల్లలున్నారు. ఆ రెండేళ్ళనుంచీ శృంగారం మీద మమకారం లేదంటాడు. ఆర్థిక ఇబ్బందులూ లేవు. ఏదో ఒక రోగం లేకపోతే మనిషి జీవించడం కష్టం. ప్రస్తుత పరిసరాలనుంచీ, ఆయనతో నిత్యమూ సంబంధమున్న మనుషుల నుంచీ, పాత జీవితం నుంచీ, నిత్యమూ వింటున్న తన భాషను ఒదిలి కాస్త స్వేచ్ఛగా ‘క్రొత్త ఊపిరి’ పీల్చుకునేందుకు వీలుగా అతనికి ఎవ్వరూ తెలీని ప్రదేశాన్ని వెళదామనుకున్నాడు. దాన్ని ఒక జీవి దైవంతో మమేకమవడానికి పడే ఆరాటంగా భావించవచ్చు – అలా అని అతనికి అనిపించకపోయినా. ఆ ఎరుక అతనికి లేకపోయుండొచ్చు. అంచేత స్వేచ్ఛను అనుభవించడానికి దక్షిణాది మధురను ఎన్నుకుని రైలెక్కాడు. మధుర అనే పేరు, మధుర అమ్మవారు మీనాక్షి పేరు అంటే అతనికి ఎంతో ఇష్టం. అయినా ఇరవై ఏళ్ళ క్రితం మదరాసులో చదువుకున్నపుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. మధురవెళ్లి ఏమి చెయ్యాలి అన్నదాంట్లో మాత్రం అతను స్పష్టంగా లేడు. మధురను చూడటం, అమ్మవారిని దర్శించుకోడం కాక మరొకటేముంటుంది ఎవరికైనా? ఏదో నూతన అనుభవం అవబోతోందని అతని ఆరవ బుద్ధి చెప్పిందేమో! అతని ఒకనాటి పరిచయస్థుడు గురుమూర్తి గుర్తుకొచ్చాడు. అతను మధురవాసి; చిరునామా తెలియదు. అరవ తెలుగు మాట్లాడతాడు. ఇది గురువు అక్కరలేని ఆధ్యాత్మిక అనుభవంగా రచయిత, లేక కథకుడు సూచిస్తున్నాడు. దైవానికి, ముముక్షువుకు గురువు కూడా అడ్డే.
తారసపడే వ్యక్తులలో ‘వింతను’ గుర్తించే ప్రయత్నం చెయ్యము అని కథకుడు ఒక స్త్రీ వైఖరిని రైలుపెట్టెలో గమనించి అంటాడు. ఆమె తన భర్త మరుగుదొడ్డికి వెళ్ళంగానే స్వేచ్చగా కనిపిస్తుంది. అతను తిరిగి రాగానే ఆమె వాలకం యథాస్థితికి వచ్చింది. అలాంటి ధోరణి ఇతర వ్యక్తులలోనూ ఉంటుందంటాడు. ఆ రెండో ధోరణిలోని సౌందర్యాన్ని చూడగలగాలి అని అతని అభిప్రాయం. దానర్థం స్వేచ్ఛలో సౌందర్యం ఉందని; హద్దులు దాన్ని చూడటానికి అడ్డంకి అని.
మధుర చేరి ఒక లాడ్జీలో చేరాడు. ఆ సాయంకాలం మీనాక్షి దేవాలయానికి వెళ్ళాడు. స్వేచ్ఛను హరించే హద్దులను అక్కడ గమనించాడు – దైవాన్ని చేరనీయకుండా. హిందువులకు మాత్రమే ప్రవేశము; అమ్మవారిని దగ్గిరసా చూడాలంటే మొల గుడ్డ తప్ప ఒంటి మీద మరో గుడ్డ ఉండరాదు. చొక్కా, బనీను విప్పడానికి సిద్ధంగా వున్నా అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. కనుక ఆ హద్దుల కారణంగా లక్ష్యాన్ని చేరుకునే వీలులేక అతను అర్చన జరిగినంతసేపూ దూరంగానే ఉండిపోవలసి వచ్చింది.
ఇక్కడి నుంచే అసలు కథో, మార్మికతో, స్వప్నమో [కొంత నిజంతో మిళితమయి] ఆరంభమవుతుంది.
గుడి నుంచీ వెనక్కు వెళుతూ తిరిగి చూడగా ఒక సౌందర్యరాశి రావడం గమనించాడు. తనతో మాట్లాడటానికి ఆమె సుముఖంగా ఉందని అనిపించింది. అలాంటప్పుడు ఏ వయసు మగాడైనా మర్కటం అవక తప్పదు. త్వరగా చెప్పులు వేసుకుని వచ్చేసరికి ఆమె అక్షరాలా అంతర్ధానమైంది. ఆశాభంగం చెందాడు. రెండో రోజు తిరిగి ఆలయానికి వెళ్లి ఆమె కనిపిస్తుందేమోనని చూచాడు. గదికి వెళ్ళిపోయి బజారుకు వచ్చి ఒక ఆళ్ళజోడు కుకాణంలో దూరితే ఆమె కనిపించింది. కళ్లజోడును ఎంపిక చేసుకోడంలో సాయం చేసాడు. తనకు కావలసిన దానినీ ఎంపిక చేసుకున్నాడు. బయిటకు వచ్చినపుడు అతని అభ్యర్ధన మీద అతనితో కాఫీ తాగింది. ఆమె కాలేజీలో ఫిలాసఫీ బోధిస్తుంది. వ్యక్తిగతంగా అద్వైతి. ఆమె పేరు మీనాక్షి. తనకు ఏ వేదాంతం, తత్త్వంలోను నమ్మకం లేదు, మీరు నాకు కలిగించగలరా అని అడిగాడు. నిజానికి ఏ తత్త్వంకన్నా ఆమెతో సాంగత్యం మధురమయినది. మాట్లాడకుండా వెళ్ళిపోయింది. గంటిపోయిన తరువాత వచ్చి కూపీ లాగితే తన కళ్లజోడుకై ఆమె రాలేదని తెలిసింది.
సాయంకాలం పుష్కరిణి వద్ద తారసపడింది. ఆమెతో సంభాషించాడు. ఆమె ప్రశ్నకు సమాధానంగా ఆలయం బాగుందని, పుష్కరిణి కూడా చక్కగా, ఎంతో నిర్మలంగా ఉందని అన్నాడు. “ఆలయానికి పుష్కరినే ప్రధానం, మనిషికి హృదయంలా,” అనింది.
ఇక్కడ శ్రీరమణ తత్త్వాన్ని రచయిత ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది. శ్రీరమణుడు హృదయం చైతన్య స్థానం, హృదయమేగాని శిరస్సు ప్రధానం కాదు. ఆయన ఉద్దేశంలో హృదయం మనిషి ఛాతీకి ఎడమవైపు వుండే శరీర అవయవం కాదు. కుడివైపుండే చైతన్యం. ఈ చైతన్యమే ఆత్మా అని దేహాతీతమైన ఆ చైతన్యం. సాధకుడు అన్వేషించేది ఆ ఆత్మనని బోధించి వున్నాడు. ఈ వాదనవల్ల అద్వైతికి తార్కికంగా సమాధానాలు చెప్పే తలనొప్పి ఉండదు.
హృదయం చేసే పని, మెదడు చేసే పని వేరు వేరయినా, ఆమె కూడా మేధస్సు కంటె హృదయానికి, ఆలోచనకంటే ఆవేశానికి ప్రాధాన్యతనిస్తానని ధ్రువీకరించింది. అనుభూతిని మనసుక్కాక హృదయానికి అంటకట్టారు. మరోలా చెప్పాలంటే దైవాన్నీ ఒక అనుభూతిగానేగాని తర్కం ద్వారా పొందటం అసాధ్యమని. అద్వైతంలో ఆవేశానికంటే ఆలోచనకు ప్రాముఖ్యం కదా అని ఆమె అద్వైతి అన్నవిషయం గుర్తుకొచ్చి అడుగుతాడు. కాదు అంటుంది. మీనాక్షి ఎలా వుంది అని ఆమె ప్రశ్నిస్తుంది. ఏ మీనాక్షి అని కొంటెగా అడిగితే ఆ మీనాక్షివిగ్రహం ఈ మీనాక్షి ఒకటే అంటుంది. దానర్థం వ్యక్తి, దైవం ఒకటేనని, అద్వైతం చెప్పినట్టు. వివరణగా – రూపం లేనిది భావమూ, భావం లేనిది రూపమూ లేవు; నామం, రూపంతోటిదే; నామం, రూపం కలిగించే భావం ప్రధానమైంది అయినపుడు మీనాక్షి ఒకటే రెండు కాదు. ఆమెను వాదనలో వదలకంటే ఇలా ప్రశ్నిస్తాడు: “…అక్కడ విగ్రహం, ఇక్కడ మనిషి. సౌందర్యంలో సాదృశ్యం ఉందనుకున్నా, నాకు విగ్రహం కంటే మనిషి ప్రిఫెరెన్సు” [ప్రిఫెరెన్సు అనే ఆంగ్ల పదాన్ని పదేపదే వాడాడు రచయిత దానికి తెలుగులో సరైన మాట లేనట్లు] అని వాదనకు దిగాడు. అలా భావించడం భ్రమ, మాయ, అజ్ఞానం వల్ల. అనుభూతిలో ఏకత్వాన్ని చూడాలని మాయకు లోనవ్వగూడదని హితవు పలుకుతుంది. సృష్టి మాయ వాటిని దాటి ఏదో అవాజ్మానస గోచరంగా [మనసుకు అతీతంగా] ఆత్మ స్వరూపాన్ని పొందటం అద్వైతం అంటారు; మరి అద్వైతం లోకానిరాసం చెయ్యడంలేదా అని ప్రశ్నిస్తాడు. మీనాక్షి అద్వైత బోధన చేస్తుంది. నామరూపాలు, అవి కల్పించే భావాలూ, ఆశలూ వేరు వేరుగా లేవు. అవి అన్నీ ఒక్కటే, అదే సత్యం. వైవిధ్యమే మాయ. సృష్టిని మాయ అంటే సృష్టి లేదనికాదు. సృష్టి అంటే ప్రకృతి, అనాది, అనంతమే. పుట్టుక, చావు అనేవి ప్రతి జీవికీ వున్నా, సృష్టి మొత్తానికి మాత్రం ఒక్కసారి పుట్టుక, ఒక్కసారి చావు అనేవి లేవు! సృష్టి లక్షణం మార్పు. ఈ మార్పును కాదని అనుభూతి ఏకత్వాన్ని పొందడమే ‘అద్వైతం’ చెబుతుంది. ఈ లోకం ఒట్టిదని, గట్టిదని, వేరే ఎక్కడో వుంది వెదకమనీ చెప్పదు. వైవిధ్యం ఒట్టిది, ఏకత్వం గట్టిది. వైరాగ్యం అంటే ప్రిఫెరన్సు లేకపోవడం. అదే సమదృష్టి. విగ్రహము మనిషి ఒకటే. అలా రెండింటిని సమదృష్టితో చూడాలి. ఉన్నట్టుండి నేను మధుర వచ్చింది మిమ్మల్ని కలుసుకోటానికే అని రొమాంటిక్గా అన్నాడు. కావచ్చు అనింది. ఆమె మామూలు వ్యక్తి కాదని తోచింది అతనికి.
ఇక్కడ కథలోని అతని స్వప్నం, ఆధ్యాత్మికతతో ముడిపడిన మార్మికత, ఎంతో కొంత వాస్తవం విడదీయలేంతగా ఏకమై ఒక మలుపు తిరుగుతాయి. ఒక అరవై ఏళ్ళ ముత్తైదువ వచ్చి మీనాక్షిని కలిసింది. ఇరువురు అతన్ని పట్టించుకోకుండా వెళుతుంటే వాళ్ళను వెంబడించి వాళ్ళ ఇల్లు చేరాడు. ముసలామె కమ్ముల తలుపు తాళం తీసింది. దాటగానే నడవ, దాని కుడి ప్రక్కన మేడపైకి మెట్లు వున్నాయి. ముసలావిడ నడవదాటి మరో తలుపు తాళం తీస్తున్నది. మీనాక్షి మేడపైకి దారితీస్తూ అతన్ని రమ్మన్నది. పై భాగానికి మరో తాళం వుంది. దాన్ని మీనాక్షి తీసింది. ముసలామె ఎవరు అని అడిగితే జ్ఞానాంబ అనింది మీనాక్షి. మీ అమ్మగారా అంటే మౌనంగా ఊరుకుంది. కాస్సేపాగి రెట్టించి అడిగితే ఆమె ఇంట్లో నేను కాపురం ఉంటున్నా, ఆమె పేరు జ్ఞానాంబ నాకు అత్త అనుకోవచ్చు అంది. జ్ఞాన సరస్వతిని పార్వతి అత్తగా భావించింది అనుకోవాలా? మూడు తాళాలను తీయడం గమనించి “పంజరంలో చిలకలాగా అబ్బా! ఎన్ని తాళాలు” అన్నాడు. ఆత్మా చిలుకను పోలినదని చెప్పడం. “శరీరంలో ఆత్మలాగ! మూడు తాళాలు. ఆమె [జ్ఞానం] తీసినవి రెండు, నేను [దైవం] తీసింది ఒకటి. వేదాంతంలో త్రిపుటి అంటే దృశ్యము, దృష్టి, ద్రష్ట.”
అమ్మవారిని ఓంకార పంజరంలో చిలకలా పోల్చిన స్తుతి వుంది [ఓంకార పంజర శుకీమ్..] మూడు తాళాలను కలిపి వేదం త్రిపుటి అని పిలిచింది. అంటే దృశ్యము, దృష్టి, ద్రష్ట – చూసేవాడు, చూసే వస్తువు ఆ రెండింటి సంబంధం. ఆ మూడు లేకుండా ఉండటం లక్ష్యం. మూడు మానసిక వ్యవస్థలు: స్వప్నం, సుషుప్తి , జాగ్రదా.
ఒక బల్లమీద రమణమహర్షి ఫోటో వుంది. అది కథకుడికి ధైర్యం, ఉత్సాహం ఇచ్చాయి. లైంగిక పరమానందం పొందబోయేముందు ఆ రెండూ అవసరమేమో. అతను తాను స్వప్నావస్థలో ఉన్నట్టు భావించాడు. ఈలోగా ఆమె మనోజ్ఞంగా తయారయి జడలో మల్లెపూలతో దర్శనమిచ్చింది ‘దేవత’లా. చివరకు దృశ్యము, దృష్టి నశించి ద్రష్ట [చూసేవాడు] మిగిలాడు. వాడూ పోవాలి. మధుర ఎందుకు వచ్చావు అని అడిగింది. అతనికి హృదయం విప్పి చెప్పాలనిపించింది. “జీవితం అర్థంకాక, స్వేచ్ఛకోసం, శాంతికోసం, ఆనందంకోసం, అనుభూతికోసం, ఏమిటో తెలీని దాని కోసం,” అన్నాడు. ఇప్పటికి అతనిలో స్పష్టత మధుర రాక విషయంలో వచ్చింది. సౌందర్యం అంటే ఏమిటి అని అడిగింది. ఇష్టం; ఇష్టం అంటే ‘నేను’ అన్నాడు. అయితే మధురకు వచ్చింది మీ కోసమేనా? అని అడిగింది. “కాదు. మీనాక్షి కోసం” అన్నాడు. ముందున్న అభిప్రాయం మారినట్టుంది క్షణాలలో. “అయితే రండి,” అని ఆహ్వానించింది. మీనాక్షిలో మమేకమయ్యాడు. మహదానందం పొందాడు. కళ్ళు తెరిచేసరికి తన లాడ్జీలో మంచం మీద పడుకుని వున్నాడు. రాత్రి ఎనిమిది. నిద్రపోయాడు. పొద్దున్న ఏడుకు లేచాడు. ‘సెక్స్’లో యింతటి మైకం, ఇంతటి సుఖానుభూతి వుంటాయని అతనెన్నడూ ఊహించలేదట.
సుఖానుభూతి విషయ-ఇంద్రియ [మనసుతో సహా] సంపర్కంతో కలుగుతుంది. సెక్స్ సుఖం అయితే మరొక శరీరంతో కూడినప్పుడు లేక స్వలింగాన్ని ప్రేరేపించినపుడు కలుగుతుంది. ఆత్మానందంలో ఇంద్రియాలకు, మనసుకు పాత్రలేనపుడు దేనితో అనుభూతి చెందాలి? భగవద్గీత రెండో అధ్యాయంలో రూపరహితమైన ఆత్మ స్వభావాలను తెలియజేస్తూ అది నిర్వికారి అన్నారు. అంటే దానికి సుఖం కూడా అంటదు కష్టమే కాక. జీవాత్మ పరమాత్మతో మమేకం అయినపుడు దివ్య ఆనందం కలిగితే, పరమాత్మ, జీవాత్మ ఒకటే అయినపుడు ఆ దివ్యానందంలో నలుసంతయినా పరబ్రహ్మకు కూడా చెందాలి. ఆత్మ సుఖం దేనివల్ల కలిగేట్లు దేని ద్వారా అనుభవించేట్లు? ఏ ఇంద్రియ అనుభవమయిన వ్యక్తిగతం. మరొకరు చెబితే ఆ వ్యక్తి అనుభవం మరొకరిదవ్వదు. అలాంటివి మరొకరికి కలిగినపుడు మాత్రం అది ‘ఇలాంటిది’ అయ్యుండొచ్చు అని స్వీయ అనుభవం ఆధారంగా భావించడానికి వీలుంటుంది. ఒకడు తింటే మరొకడి ఆకలి తీరదు. ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయనేమో శంకరాచార్యుడు తన వివేకచూడామణి ఆఖరిలో [576] “ప్రళయం లేదు, సృష్టికూడా లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు – ఇది పరమార్థము” అని ముగించాడు. గజం మిథ్య, పలాయనం మిథ్య! కానీ జీవాత్మ పరమాత్మలో మమేకం అవడం మిథ్య కాదు!
పాఠకుడు బ్రహ్మలో ఐక్యమయ్యే ఆధ్యాత్మిక అనుభూతి సెక్స్ అనుభూతితో పోల్చినట్టుగా భావిస్తే, ఆధ్యాత్మిక అనుభూతి బూతు అనుభూతి అవదు. సెక్సు అనుభూతిలోను మనసు కొన్ని క్షణాలపాటు తురీయస్థితిని – అంటే ఆలోచనలేని మానసిక స్థితి – పొందుతుంటుంది. కథకుడు దాన్ని కేవలం లైంగిక అనుభూతిగా తీసుకున్నట్టుంది. అతనికి ఆమె మామూలు మనిషా, మనిషి రూపంలోని మధుర మీనాక్ష అన్న విషయంలో స్పష్టత కొరవడి, పాఠకుడికి అసలే అద్వైతం దానికి కథకుడు పైత్యం తోడయ్యింది అనిపిస్తే పాఠకుడిని నిందించక్కరలేదు. మూడు అవస్థలలోని స్వప్నావస్థలో జరిగిన అనుభవంగా కథకుడు తీసుకుని దాన్ని జాగ్రదావస్థలో మననం చేసుకుంటున్నాడేమో.
సాయంకాలం దేవాలయానికి వెళ్లి అక్కడ మీనాక్షి కనబడక ఆమె ఇంటికెళ్లి జ్ఞానాంబను కలిశాడు. తానెపుడు అతన్ని చూడలేదంది. మీనాక్షి తాను మాత్రం నిన్న ఇంచుమించు ఇదే వేళకు కలిశాము అంది. మీనాక్షి పక్కన ముసలామెకు నిన్న అతను కనబడలేదు. అతన్ని కలవడం, ఇంట్లోకి తీసుకెళ్లడం ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడం ఆమెకు తెలియకుండా మీనాక్షి చేసింది. రాత్రి తొమ్మిదికి – అంటే అతని అద్వైత అనుభవం ముగిసి ఎనిమిది గంటలప్పుడు తన గదిలో కళ్ళు నిద్రనుంచీ తెరిచిన తరువాత గంటకు – ప్రమాదం జరిగింది. స్టౌ వెలిగిస్తూ ప్రమాదవశాతూ మీనాక్షి కాలిపోయింది అని జ్ఞానాంబ చెప్పింది. నాలుగేళ్లుగా మీనాక్షి అమెరికాలో నివసిస్తున్న ఆమె భర్తతో కలిసి ఉండటంలేదు. అతను అక్కడికి రమ్మన్నా వెళ్ళలేదు. ఆమెకు పిల్లలు లేరు. ఆ వివరాలు ముసలామె చెప్పింది. అంతకంటే వివరాలు అడిగితే తన రహస్యం వెల్లడౌతుందేమో అంటాడు కథకుడు. అతని దగ్గిర ఏ రహస్యం ఉందని వెల్లడవడానికి? హంతకుడు కాదు, దొంగ కాదు; మహా అయితే మీనాక్షి అనుమతితో ఆమెను కలిసి సుఖించాడు. వివాహవ్యవస్థను, ధర్మాన్ని అతిక్రమించానని అపరాధభావం ఉందేమో. ఆ చర్యను ఏ న్యాయస్థానం తప్పుపట్టి శిక్షిస్తుందని?
ఆ ఊళ్ళోనే మూడు రోజులు కేవలం మీనాక్షి ఫోటో గురించీ వుండి, మొత్తం మీద ఒకటి సంపాదించాడు. ఆ ఫొటోలోని మీనాక్షికి, అతనికి పరిచయమైన మధుర మీనాక్షికి పోలికలు లేవు. మధుర మీనాక్షి సౌందర్యం, ‘స్ఫూర్తి’ ఆ ఫొటోలోని వ్యక్తిలో లేవు. ఆ మీనాక్షి ఒక ప్రిఫెరెన్స్ లేని విరాగిగా తనతో కలిసి సుఖానుభవాన్ని అతనికి [ఆమె అనుభవించకుండా!] కలుగజేసింది అని అతను భావిస్తాడు. ఆ అనుభూతిలో అతనికి ఏకత్వం కనిపించింది. మనిషి, దైవం కలిసినపుడు రెండూ ఒకే తాను అయినా అనుభూతిమాత్రం జీవి సొంతం అనుకోవాలి. అతను ద్రష్ట [చూసేవాడు], ఆమె దృశ్యం, ఇరువురి సంబంధం త్రివేణీ సంగమమయ్యాయి. చివరకు చూసేవాడు మానసికంగా మిగలలేదు.
మీనాక్షి దగ్ధం అయిన విషయానికి వస్తే అది నశ్వరమైన [అశాశ్వతమైన] వ్యక్తిని అనశ్వరమైన [శాశ్వతమైన] బ్రహ్మతో వేరు చేసి చూపడం అనుకుంటాడు. అనుభవం [బ్రహ్మతో ఏకమవడం] అనశ్వరమైనది; ఆమె [వ్యక్తి] శరీరం నశ్వరమైనది. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఫోటోను చూసినప్పుడు కేవలం కొన్ని పోలికలు మాత్రమే మధుర మీనాక్షివి వున్నపుడు, మీనాక్షి అనే మామూలు వ్యక్తి దగ్ధమయినట్లా, కథకుడు వెంటపడిన మూర్తా? మధుర మీనాక్షి ఒక తాత్త్విక అంశాన్ని తెలియజేయడానికి మీనాక్షి అనే వ్యక్తిని దగ్ధం చెయ్యదుగదా ఆ పేరుగల వ్యక్తి ఉనికికి జ్ఞానాంబతో సహా సాక్ష్యాలున్నాయి.
అతను గమనించిన విషయం శాశ్వతమైనది శాశ్వతం కాని లోకం ద్వారానే మనిషికి అందుతోంది అని. శాశ్వతమైన బ్రహ్మను తెలుసుకోడానికి, ఐక్యం కావడానికి శాశ్వతం కానీ లోక అవసరం వున్నట్లే!
ఆలయంలోకి వెళ్ళాడు. ముంజేతి మీది చిలుక ఏ క్షణాన్నైనా ఎగిరిపోయేలా వుంది. అది వ్యక్తి ప్రాణానికి ప్రతీక.
“మధురకు ఇందుకా పిలిపించావు! అన్నాను, మనసులో ఆ దేవీమూర్తితో. ప్రత్యక్షమై, స్వయంగా అద్వైత బోధచేసి, అద్వైతానుభూతి ప్రసాదించి, నన్ను నీ దాసుణ్ణి చేసుకున్నావు! అంత అవ్యాజమైన ప్రేమ నీది!”
దాసుడే కాదు, ప్రేమికుడు కూడా.
తన దగ్గిరకు తానే అతన్ని కోరకుండా పిలిపించుకుని అద్వైతబోధన చేసింది. అతని ప్రత్యేకత ఏమిటో. సాధకుడు కూడా కాదు. అంత అవ్యాజమైన ప్రేమకు ఏవిధంగా అర్హుడు? ఆధ్యాత్మికం కాకపోయినా, స్వేచ్ఛకై అతని మనసు పడే ఆరాటమే అతని అర్హతేమో! బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతున్నాడు అని ఉపనిషత్తు చెబుతుంది. అతను బ్రహ్మ అవ్వలేదు; మనిషిగా మిగిలివున్నాడు. అద్వైతానుభవాన్ని కథకుడి మనసుకో, ఆత్మకో రాచి కాస్త రుచిచూపింది మధుర మీనాక్షి.
You must be logged in to post a comment.
మనల్ని మనకి చూపే కవితలు ‘ఒక ఆదివారం సాయంత్రం’
అలనాటి అపురూపాలు-50
ప్రవాస చంద్రుడు
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-3
సినిమా క్విజ్-33
రెండు ఆకాశాల మధ్య-47
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-16
కాజాల్లాంటి బాజాలు-36: అన్నీ బెంగలే!
నువ్వు!
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు -1
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®