Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధుర భాషణం యొక్క ప్రాశస్త్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మధుర భాషణం యొక్క ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

లప్రవాహామైనా కొన్నేళ్ళకు కఠిన శిలను కరిగించేస్తుంది. మధుర వచనమైనా పాషాణ హృదయాన్ని కరిగేలా చేస్తుంది. మధుర భాషణం పరహితాన్ని కోరేదై ఉండాలంటుంది మహాభారతం. మాట, మౌనం నాణానికుండే బొమ్మ బొరుసు లాంటివి. మాట విలువ అమూల్యం అనంతం, చెడిపోవడం, బాగుపడడం రెండూ సంభవం. ఇష్టమైనవాటిని, మనసుకు నచ్చే మాటల్ని వినాలన్నదే మన బలహీనత. విలువైన, మేలు కలిగించే మాట లభించడం బహు కష్టం. హితం కలిగించే మాట మనోహరం కాకపోవచ్చు, మనోహరమైన మాట హితకరం కాకపోవచ్చు. మానవుడుకి హితం కలిగించేందుకే వేద వాఙ్మయం ఆవిర్భావం. అన్ని వేళలా హితాన్ని కోరుతూ, మంచి సూచనలిచ్చే మిత్రుల మాటలు జీవితాన్ని కాంతివంతం చేస్తాయి.

మనసులను ఆహ్లాదపరిచే లేక దుఃఖభరితం చేసే శక్తివంతమైన ఆయుధం మాట. ఇతరులకు మనం చేయగలిగే ఒకే ఒక సహాయం ముఖం నిండా చిరునవ్వు అనే ఆభరణాన్ని ధరించి, వారికి స్వాంతన కలిగించేలా ఒక చల్లని మాట మాట్లాడడం. దీని వలన అందరికి భయాందోళనలు తగ్గి మనస్సులో ఆహ్లాదం కలుగుతుందని శాస్త్ర వాక్యం. అందుకే మధుర భాషణం అనేది మానవులకు వుండాల్సిన సుగుణం అని పెద్దలు చెబుతారు. అవతలి వారు ఎంత ధుమ ధుమలాడుతున్నా, అసహనంతో అరుస్తున్నా, మాటకు మాట బదులు చెప్పకుండా, చిరునవ్వుతో ఆఖరున ఒక మంచి మాట మాట్లాడి చూడండి.

మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి అని మన పెద్దలు అంటూ వుంటారు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది అని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది.

శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు – గంపెడు పిల్లలు, భార్య, సంసార సాగరాన్ని ఈదే సంపద లేక అనునిత్యం దారిద్య్రంతో ఉండేవాడు. కాని మనస్సులో ఎప్పుడూ దైవచింతన, జపం, తపం, ధ్యానం, మూడు పూటలా సంధ్యావందనం చేస్తూ, ప్రశాంతవదనం, మధుర భాషణంతో, శ్రీకృష్ణుని స్నేహాన్ని సదా గుర్తు చేసుకుంటూ అమిత భావసంపదతో ఆత్మానందంలో ఉండేవాడు. సంచిత, ప్రారబ్ద కర్మలు పూర్తయిన క్షణంలో శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగి, తన భవదారిద్య్రాన్ని కూడా తొలగించుకుని, ముక్తి పొందిన మహనీయుడు సుధాముడు.

ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు అన్నారు స్వామి వివేకానంద కాబట్టి మాట అనే ఆయుధాన్ని వివేకంతో ఉపయోగించడం మంచిది.

మాట్లాడే ప్రతీ మాటా సౌమ్యంగా, మధురంగా ఉండాలి. తోటి మనుష్యులను మన మాటలతో నొప్పించకుండా ఉండాలి. అందరినీ మాటలతో నొప్పించక మెప్పిస్తూ ప్రోత్సహిస్తూ.. మనసా వాచా కర్మణా మహోన్నత వ్యక్తులుగా రూపొందించుకోవాలి.

Exit mobile version