Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాధవ గీతం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన మళ్ళ కారుణ్య కుమార్ గారి ‘మాధవ గీతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఏమైంది తనకి! నేను ఎంత అడిగినా చెప్పడం లేదు?..” అని కూతురు గురించి ప్రస్తావిస్తూ అన్నాడు శ్రీకాంత్.

“నాకు అదే తెలియడం లేదు.. నేను బుజ్జగించి చూసాను.. సర్ది చెప్పి చూసాను.. నిజం ఏమిటన్నది తెలియడం లేదు. తను మాత్రం ఈ చదువు కొనసాగించలేను అని అంటుంది..” అని కూతురు గురించి బెంగపడుతూ అంది లక్ష్మి.

“పోనీ చదువుకి భయపడుతోందా అంటే, తనకి చదువు అంటే ప్రాణం.. పోనీ ఈ మెడిసిన్ వృత్తి తనకు ఇష్టం లేదంటే.. ఎప్పటి నుండో తాను డాక్టర్ కావాలని దృఢంగా అనుకుంది.. దానికి తగ్గట్టు చదవగల శక్తి కూడా తనకి వుంది.. మరి ఎందుకు ఈ విధంగా అంటుంది?..” అని అర్థం కానీ స్థితిలోకి వెళ్తూ అన్నాడు శ్రీకాంత్.

“పోనిలేండి.. తనికి ఎలా ఇష్టం అయితే అలానే చేద్దాం.. తనకంటే మనకు ఏదీ ఎక్కువ కాదు కదా.” అని అంది లక్ష్మి.

“కాదు లక్ష్మి.. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా.. ఏ నిర్ణయమో ఎలా తీసుకుంటాము? అక్కడ ఎవరైనా తనని ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెట్టరా?..” అని అనుమానంతో అడిగాడు..

“లేదు. లేదు.. నేను వాళ్ళ హెచ్.ఓ.డి.కి ఫోన్ చేసి అడిగాను. ఆవిడ అలాంటిది ఏమి జరగలేదు అని చెప్పింది..”

“మరి అక్కడ ఎవరైనా తనని ప్రేమ అని హింసిస్తున్నాడా?..” అని రెట్టించిన అనుమానంతో అడిగాడు శ్రీకాంత్..

“ఛా.. ఛ అలాంటిది ఏమీ లేదు.. అలాంటిది వుంటే తానే చెప్పేది కదా..”

“అసలు ఏమైందో చెప్పకుండా మనకు ఎలా తెలుస్తుంది?” అని పూర్తిగా తన సహనాన్ని కోల్పోతూ అన్నాడు శ్రీకాంత్..

ఇంతలో డోర్ బెల్ రింగ్ అవుతున్న శబ్ధం వచ్చింది.

“ఈ సమయంలో ఎవరు? వెళ్ళి చూడు లక్ష్మి..” అని సోఫా వెనక్కి చారగిలబడుతూ అన్నాడు శ్రీకాంత్..

సరే అని అంటూ లేచి డోర్ వైపుకు సాగింది లక్ష్మి. తలుపు తీసింది.

ఎదురుగా వున్నాడు మాధవ్..

“ఓహ్ మాధవ్, నువ్వా!.. చాలా రోజులకు వచ్చావు?. రా లోపలికి..” అంటూ పిలిచింది..

“ఏదో పని వుంటే గానీ ఈ టౌన్‍కు రావడం జరగదు ఆంటీ.. పని వుండి వచ్చాను.. మీరు గుర్తుకు వచ్చారు.. మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను..” అని అంటూ లోపలికి వచ్చాడు.

తన వైపు వస్తున్న లక్ష్మి వైపు చూడకుండా ఆమె పట్టీల మువ్వల శబ్ధం విని.. “ఎవరు లక్ష్మీ అది?..” అని అడిగాడు శ్రీకాంత్..

“నేను అంకుల్ మాధవ్‌ను..” అని శ్రీకాంత్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ శ్రీకాంత్ దగ్గరకు చేరుకున్నాడు మాధవ్..

వెంటనే మాధవ్ వైపు చూస్తూ

“ఓహ్ మాధవ్.. నువ్వా.. చాలా రోజులకు వచ్చావు?.. ఏంటి సంగతలు?.. చదువు బాగా సాగుతుంది కదా..” అని కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీకాంత్.

“అంతా బాగుంది అంకుల్.. అది సరే మీరు ఈ రోజు చాలా డల్‌గా వున్నారు?.. ఎప్పుడూ మీలో కనిపించే ఉత్సాహం లేదు!.. మీ ఆరోగ్యం బాగుంది కదా?..” అని అడిగాడు మాధవ్.

“ఏమి లేదు మాధవ్.. ఏవో బిజినెస్ టెన్షన్స్.. అది సరే చేతిలో ఏమిటి ఆ ఫ్లూట్?..” అని దాన్ని చూపిస్తూ అడిగాడు శ్రీకాంత్.

“ఇదా అంకుల్!.. దీన్ని కొనడానికే వచ్చాను..” అని సమాధానం ఇచ్చాడు మాధవ్

“అయితే నీకు ఫ్లూట్ వాయించడం కూడా వచ్చా!..” అని ఆశ్చర్యంతో అడిగాడు శ్రీకాంత్..

“మా మాస్టారు నేర్పారు… ఆయనతో కచేరీలకు వెళ్తుంటాను కదా!”

“ఓహో! ఇంతకీ ఆ మాస్టారు ఎవరు?..”

“నాగేశం గారు.. ఫేమస్ కదా ఆయన ఫ్లూట్ వాయించడంలో.. అలాగే టీచర్ కూడా.. వినయ నాతో ఐదవ తరగతి వరకు చదువు కుంది కదా.. వినయ ఆ స్కూల్ మానేసిన తర్వాత అతను వచ్చారు.” అని చెప్పాడు మాధవ్..

“ఆ.. ఆ.. అతని గురించి విన్నాను.. చూసాను కూడా.. మంచిది మాధవ్, అలాంటి సరస్వతి పుత్రుల మన్ననలు నీకు దొరికాయి అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి..” అని అన్నాడు శ్రీకాంత్..

“అంకుల్.. మీకు స్ట్రెస్‌గా వుంది అన్నారు కదా.. ఒక మంచి రాగం వినిపించనా.. మా గురువు గారు చెప్తుంటారు.. ఈ ఫ్లూట్‌తో కొన్ని జబ్బులు కూడా నయం చేయవచ్చు అని..” అని అన్నాడు మాధవ్..

“ఆలస్యం ఎందుకు మాధవ్.. స్టార్ట్ చేయి..” అని అన్నాడు శ్రీకాంత్..

మాధవ్ తన విద్యతో శ్రీకాంత్ లక్ష్మిని అలరించాడు.. వాళ్లు కొంత సమయం వాళ్ల బాధ మరిచిపోయి రిలాక్స్ అయ్యారు.

“ఎలా వుంది అంకుల్?..” అని ముగించిన తర్వాత అడిగాడు మాధవ్..

“బాగుంది మాధవ్, చాలా బాగుంది!.. హ.. గుర్తుకు వచ్చింది.. మొన్ననే చూసాను. యూట్యూబ్‌లో ఒకతను సామజవరగమన పాట ఫ్లూట్‍పై బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు.. నువ్వు అలా వాయించగలవా?.. లైవ్‌లో వింటే ఆ థ్రిల్ వేరు కదా..” అని ఉత్సుకతతో అన్నాడు శ్రీకాంత్..

“అంకుల్ ఇప్పుడు మీరు మామూలు స్థితికి వచ్చారు.. తప్పకుండా మీ కోసం వాయిస్తాను..” అని అంటూ ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు.

శ్రీకాంత్ ఆ రాగాన్ని ఎంజాయ్ చేస్తూ విన్నాడు..

“చాలా సంతోషం మాధవ్!.. కాసేపు ఈ లోకాన్ని మరిచిపోయేలా చేశావు..” అని సంతోషంతో అన్నాడు శ్రీకాంత్…

“చాలా థాంక్స్ అంకుల్… సరే నేను ఇక బయలుదేరుతాను… వినయను అడిగాను అని చెప్పండి.” అని అంటూ వెళ్ళడానికి సిద్దం అయ్యాడు.

“మాధవ్.. వినయ ఇక్కడే ఉంది!.. నువ్వు తనతో మాట్లాడు.. పైన వుంది.. వుండు పిలుస్తాను..” అని లేచాడు శ్రీకాంత్..

“అరే. అదుగో పై నుండి చూస్తుంది.. వినయ.. ఇలా రామ్మా. నీ మిత్రుడు వచ్చాడు” అని మాధవ్‌ను చూపిస్తూ అన్నాడు శ్రీకాంత్.

తండ్రి పిలవడంతో ఆమె కిందకు దిగింది.

“మాధవ్ చాలా బాగా ప్లే చేశావు.” అని మాధవ్‍తో అంది.

“వినయా, కాసేపు మాధవ్‌తో మాట్లాడు. పాపం ఎప్పుడు వచ్చినా, నీ గురించి అడుగుతుంటాడు.. నీ స్నేహితులు ఎవరూ రాక పోయినా ఇతను మాత్రం అప్పుడప్పుడు వస్తూ వుంటాడు.” అని అన్నాడు శ్రీకాంత్..

“లేదు డాడీ. నాకు పని వుంది.” అని వెళ్ళిపోయింది వినయ.

“అంకుల్ మీకు తెలియంది ఏముంది!.. ఆమెకు ఎందుకో నేను అంటే ఇష్టం వుండదు.. ఎప్పుడు ఎదురైన రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంది.. బహుశా నాలాంటి వారితో ఆమె మాట్లాడదేమో..” అని అన్నాడు మాధవ్.

“మాధవ్. ఇంకెప్పుడు అలా మాట్లాడకు.. తాను ఎప్పటికైనా తెలుసుకుంటుంది తన తప్పు.. నేను ఎప్పుడూ నిన్ను ఆ విధంగా చూడలేదు.. మాకు ఈ పేద ధనిక భేదం లేదు.. నిన్ను మా బిడ్డలా అనుకుంటాం.” అన్నాడు శ్రీకాంత్.

“అయ్యో అంకుల్.. నా ఉద్దేశం అది కాదు.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి..” అని అంటూ ముందుకు వెళ్ళబోయాడు మాధవ్..

“మాధవ్ ఒకసారి ఆగు..”అని శ్రీకాంత్ అనడంతో,

ఒక్కసారిగా ఆగి..

“ఏంటి అంకుల్?..” అని అన్నాడు మాధవ్..

“మాధవ్.. ఎందుకో తెలియదు!.. వినయ తన చదువు మానేస్తాను అంటుంది.. కారణం చెప్పడం లేదు.. తను నీకు స్నేహితురాలు కదా.. ఆ కారణం ఏమిటో తెలుసుకోగలవా?.. అన్ని విధాలుగా అడిగి చూసాము కానీ ప్రయోజనం లేదు.. చివరి ప్రయత్నంగా నువ్వే మాకు కనిపిస్తున్నావు.” అని అన్నాడు శ్రీకాంత్, ఎలాగైనా తన కూతురు బాధేంటో తెలుసుకోవాలని.

“అయ్యో. అంకుల్.. మీకోసం తప్పకుండా వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను..” అని అంటూ వినయ రూం వైపుకు వెళ్ళాడు..

అప్పటికి ఆమె కిటికి దగ్గర నిల్చొని ఏదో ఆలోచిస్తూ వుంది..

“వినయా!..” అని పిలిచాడు మాధవ్.

ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది.

“నీతో కాస్త మాట్లాడాలి..”అని ఆమె వైపు చూస్తూ అన్నాడు.

“సరే. రా.. వచ్చి కూర్చో..” అని అక్కడ వున్న కుర్చీ చూపిస్తూ.. తాను బెడ్ మీద కూర్చుంది.

“మళ్ళీ నీతో ఇలా కలిసే రోజు వస్తుంది అని అనుకోలేదు!.. సంతోషంగా వుంది!.. చిన్నప్పుడు గుర్తుందా నువ్వు ఎప్పుడూ నాతోనే వుండేదానివి..” అని ఏదో చెప్పబోయాడు..

“ఒకసారి నాకోసం ఈ ఫ్లూట్ వాయిస్తావా!” అని అడిగింది.

“తప్పకుండా” అని ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు.

ఆ ఫ్లూట్ రాగాన్ని ఆస్వాదిస్తూ కళ్లుమూసుకుంది!

కొంత సమయానికి మాధవ్ ఫ్లూట్ వాయించడం ఆపాడు..

వినయ మెల్లగా కళ్ళు తెరిచింది..ఇప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది..

“వినయా ఈ రాగం మనకు శాంతిని ఇస్తుంది.. వినయ మీ నాన్నగారు చెప్పారు.. నువ్వు ఎందుకో చాలా డిస్టర్బ్‌డ్‌గా వున్నావని.. అసలు ఏమైంది నీకు? నాతో చెప్పు!.. నేను నీకు స్నేహితుడినే కదా!..” అని అన్నాడు మాధవ్..

ఆమె ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా వుండిపోయింది..

“సరే నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు అనుకుంటా.. నేను వెళ్తున్నాను. ఒకటి గుర్తు పెట్టుకో వినయా. మా గురువు గారు ఎప్పుడూ చెప్తుండే వాళ్ళు.. పరిస్థితులు అయినా.. మనుషులు ఐనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా మనం ఎదిరించాలని.. అయినా నీకు అండగా నీ పేరెంట్స్ వున్నారు కదా, ఎందుకు నీకు భయం?” అని అక్కడ నుండి లేచాడు..

“ఆగు మాధవ్..” అని కాసేపు ఆలోచనలో పడింది..

“నా సమస్యకు కారణం.. అక్కడ ర్యాగింగ్ జరగడం. నా మౌనానికి కారణం మా సీనియర్స్. బాగా డబ్బు, పలుకుబడి వున్నవాళ్ళు.. వాళ్ళని ఎదిరించడం నా వలన కాలేదు. ఈ విషయం మీద కంప్లయింట్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా ఏమి చేయలేక పోయారు.. మరి ఎవరికి నేను నా బాధను చెప్పుకోవాలి.. అందుకే ఈ చదువు మానేస్తే ఏ బాధ వుండదు.. అని ఈ నిర్ణయం తీసుకున్నాను..” అని ఏడుస్తూ చెప్పింది వినయ.

“వినయా, నీ భయానికి అర్థం ఉంది.. అయితే నువ్వు ఈ విధంగా భయపడి ఉండిపోవడం కరెక్ట్ కాదు. సరే ఈ విషయం తర్వాత మాట్లాడుదాం.. నువ్వు మీ పేరెంట్స్‌తో జాలీగా మాట్లాడు.. వాళ్ళు చాలా బాధపడుతున్నారు.. నేను మళ్ళీ రేపు వస్తాను..” అని చెప్పి అక్కడ నుండి కదిలాడు మాధవ్..

అప్పటి వరకు ఎదురుచూస్తున్న శ్రీకాంత్ మాధవ్ కిందకు దిగడంతో.. వెంటనే మాధవ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. “మాధవ్!.. కారణం ఏమిటో తెలిసిందా?..” అని అడిగాడు శ్రీకాంత్.

“తెలిసింది అంకుల్..” అని మొత్తం వివరంగా చెప్పాడు మాధవ్..

“చెత్త వెధవలు నా కూతుర్ని ఏడిపిస్తారా?.. నా కూతుర్ని చదువుకి దూరం చేయాలని చూస్తారా?..చెప్తాను వీళ్ళ పని.” అని అంటూ తన ఫోన్ తీశాడు..

“ఆగండి అంకుల్.. మీరు ఇప్పుడు కంప్లీట్ ఇచ్చినా లాభం లేదు.. వాళ్లకు డబ్బు వుంది అని అహంకారం.. దానితో వాళ్లు ఏది చేయడానికైనా సిద్ద పడతారు. మీరు తొందర పడకండి.. మనం ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.” అని అన్నాడు మాధవ్..

“చిన్నవాడివి అయినా మంచి మాట చెప్పావు. మీరు తొందర పడకండి. మాధవ్ అన్నట్టు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం.” అని భర్తతో అంది లక్ష్మీ..

“మరి ఏమిచెద్దాం అంటావు మాధవ్?..” అని అడిగాడు శ్రీకాంత్.

“అంకుల్ మీరు వినయతో సంతోషంగా వుండండి.. ఈ విషయాన్ని తన దగ్గర ప్రస్తావించ వద్దు.. రేపు నేను మళ్ళీ వస్తాను.. ఏమి చేయాలో ఆలోచిద్దాం.” అని అన్నాడు మాధవ్..

“చిన్నవాడివి అయినా సమస్య ఏమిటో తెలుసుకున్నావు.. నువ్వు చెప్పినట్లే చేస్తాను..” అని అన్నాడు శ్రీకాంత్..

కారణం ఏమిటి అని అడగకుండా ఆ రోజు కూతురితో కలిసి సరదాగా గడిపారు శ్రీకాంత్, లక్ష్మీ.

***

మరుసటి రోజు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు మాధవ్.

అప్పటికి శ్రీకాంత్, లక్ష్మీ, వినయ నవ్వుతూ కనిపించారు..

మాధవ్ రాకను చూసిన శ్రీకాంత్.. “రా మాధవ్.. రా.. ఈ రోజు చాలా హ్యాపీగా వుంది!..” అని అన్నాడు.

“అవును మాధవ్.. నన్ను, ఏడిపించి హింస పెట్టి ర్యాగింగ్ చేసిన వాళ్లను మేనేజ్‌మెంట్ సస్పెండ్ చేసింది.” అని చెప్పింది వినయ.

“అలాగా!.. చూసారా అంకుల్, మీరు అనవసరంగా నిన్న ఆవేశపడ్డారు.. మంచివాళ్లకు ఎప్పుడూ ఆ దేవుడు మంచే చేస్తాడు.” అని అన్నాడు మాధవ్.

“మాధవ్!.. నిన్న నేను పోలీసులకు కంప్లయింట్ ఇవ్వబోతుంటే నన్ను ఆపావు.. ఉదయం సరికి ఈ వార్త విన్నాను.. నాకెందుకో ఈ నిజం నమ్మాలి అనిపించడం లేదు.. అసలు ఏమి జరిగిందో చెప్పు. నాకు తెలిసి నువ్వే ఏదో చేశావు..” అని అనుమానంతో అడిగాడు శ్రీకాంత్.

“అంకుల్ భూపతి రాజు గారు మీకు తెలుసా?” అని అడిగాడు మాధవ్..

“అతను తెలియని వాళ్ళు ఎవరు వున్నారు.. అలాంటి కాలేజీలకు, మరెన్నో కంపెనీలకు అధిపతి అతను కదా!.. అతను ఎవరికి కలవనంత బిజీ. అతన్ని కలవడం అంత సులభం కూడా కాదు..” అని అన్నాడు శ్రీకాంత్.

“అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి అంకుల్.. అతను ఎప్పుడూ చెప్తుండే వారు.. నీకు ఏ సహాయం కావాలన్నా అడుగు అని. ఇప్పుడు నేను అతనికి ఈ సహాయాన్ని అడిగాను..” అని చెప్పాడు మాధవ్..

అందరూ ఆశ్చర్యపోయారు!…

“మాధవ్, ఇదెలా సాధ్యం?.. అంత పెద్ద వ్యక్తి నీకు తెలుసా!..” అని ఆశ్చర్యంతో అడిగాడు శ్రీకాంత్..

సమాధానంగా టేబుల్ మీద వున్న భగవద్గీతను అందుకున్నాడు మాధవ్..

“మా గురువు గారు చెప్తూ వుంటారు.. దీన్ని నమ్ముకుంటే ఆ కృష్ణ పరమాత్మ తోడుగా వుంటాడు అని.. నేను గురువు గారు దగ్గర గీత నేర్చుకున్నాను.. ఒకసారి గురువు గారు కచేరి అయిపోయిన తర్వాత నన్ను కొన్ని శ్లోకాలు చెప్పమన్నారు.. నేను వాటిని చెప్పాను.. అప్పుడు నాకు పరిచయం అయ్యారు భూపతి రాజు గారు.. అతను గురువు గారికి ముందే తెలుసు.. గురువు గారి శిష్యుడిని అని, పైగా నేను కూడా బాగా ఫ్లూట్ వాయిస్తాను అని తెలిసి ఆశ్చర్యపోయారు, ఆనందించారు.. భూపతి రాజు గారికి కూడా భగవద్గీత అంటే ఇష్టం.. అలా ఆ దేవుడు అతన్ని నాకు సన్నిహితుడ్ని చేశాడు.. అప్పటి నుండి అతను ఖాళీ సమయాల్లో నన్ను పిలిచి ఫ్లూట్ వాయించుకుంటూ. చాలా విషయాలు చెప్తుండేవారు.. ఆ చనువుతో  వినయ సమస్య అతనితో మాట్లాడాను.. ఇది ఆ అమ్మాయి సమస్య మాత్రమే కాదు.. మంచిగా చదువు కోవాలని ఎన్నో ఆశలతో వస్తారు.. ఈ ర్యాగింగ్ భూతం వలన ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.. తప్పకుండా దీనిపైన చర్య తీసుకుంటాను అని నాకు హామీ ఇచ్చారు..” అని చెప్పాడు మాధవ్.

“మాధవ్ నన్ను క్షమించు.. నేను నిన్ను ఎప్పుడూ ఒక మనిషిలా చూడలేదు..నీకు డబ్బు లేదు, నాకు వుంది ఏమైనా చేయగలను అని అహంకారంతో చూసాను.. ఆపదలో వున్న నన్ను ఆదుకోవడానికి ఏ డబ్బున్న స్నేహితుడు రాలేదు.. నేను నిన్ను తక్కువుగా చూసినా స్నేహానికి విలువ ఇచ్చి నా దగ్గరకు వచ్చావు. నా సమస్య తీర్చావు.” అని బాధపడుతూ, పశ్చాతాపంతో అంది వినయ.

“వినయా!.. చిన్నప్పుడు నువ్వు నాతో ఎంతో స్నేహంగా వుండే దానివి.. కల్మషం లేని స్నేహాన్ని చూపించే దానివి. ఇప్పటికీ కూడా నాకు గుర్తు వుంది. నీ స్నేహాన్ని నేను మరిచిపోలేను.. నువ్వు నన్ను తర్వాత దూరం పెట్టడం ప్రారంభించావు.. కానీ అంకుల్, ఆంటీ ఎప్పుడూ నా మీద ఆప్యాయత చూపిస్తూనే ఉన్నారు.. వినయా!.. మా గురువు గారు చెప్పారు.. ఒక మంచి స్నేహాన్ని ఎప్పుడూ కూడా శత్రువులా మార్చుకోకు అని. అందుకే ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావు అని, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడక పోయినా నీ దగ్గరకు వస్తూ వుండే వాడిని..” అని అన్నాడు మాధవ్.

“చూసావా వినయా!.. నువ్వు ఎప్పుడూ అతన్ని పేదవాడిగానే చూసావు. కానీ ఈ రోజు నీ డబ్బు, పలుకుబడి నిన్ను కాపాడలేదు.. కేవలం అతని మంచితనం, అతని ఒక్క మాట నిన్ను చిక్కుల్లో నుండి బయటపడేశాయి.. చూసావా అతను అతని గురువు మాటను వేదంగా భావిస్తాడు. గురువుకి వున్న శక్తి అటువంటిది. రాయిని రత్నంగా మార్చగలదు. అందుకే మాధవ్‌కు అలాంటి మంచి, గొప్ప వ్యక్తుల్ని దేవుడు సన్నిహితులుగా ఇచ్చాడు.. ఇప్పుటికైనా అర్థం అయ్యిందా వినయా – ‘డోంట్ అండరెస్టిమేట్ ది కామన్ మ్యాన్’ అన్న పదానికి అర్థం?..” అని కూతురు వైపు చూస్తూ అన్నాడు శ్రీకాంత్.

Exit mobile version