[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘మంచి బ్యాక్టీరియా’ అనే రచనని అందిస్తున్నాము.]
“అమ్మా” అని పిలుస్తూ క్రాంతి బ్యాగ్ మూసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.
“వచ్చేసావా క్రాంతీ” అంటూ అమ్మ వంటింట్లో నుంచి గిన్నెలు కడుగుతున్న చేతులతో అలాగే వచ్చింది.
“అమ్మా ఇలా డర్టీగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. లేకపోతే జబ్బులు వస్తాయి” అని క్రాంతి పెద్ద లెక్చరిచ్చాడు.
“ఆహా! అలాగా! మా క్రాంతికి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో! ఉండు చేతులు కడుక్కుని వస్తాను” అంటూ వంటింట్లోకి సంతోషంగా వెళ్లిపోయింది జ్యోతి.
జ్యోతి చేతులు కడుక్కొని వస్తూ వస్తూ బాత్‌రూమ్ లోపలికి వెళ్లి వచ్చింది. క్రాంతి దగ్గర కూర్చుంటూ “స్కూల్లో ఈరోజు విశేషాలేమిటి?” నవ్వుతూ అడిగింది.
అప్పటికే క్రాంతి అసహనంగా మొహం పెట్టి “అమ్మా నువ్వు బాత్‌రూమ్ నుంచి వచ్చి డెట్టాల్‌తో చేతులు కడుక్కోలేదు. అంతటా బ్యాక్టీరియా ఉంటుందమ్మా. ముందు చేతులు శుభ్రం చేసుకుని రా” అన్నాడు కొడుకు మాటలకు జ్యోతి “ఈరోజు ఏమైందిరా! ఇన్నిసార్లు శుభ్రం, శుభ్రం అంటున్నావు, సరే చేతులు కడుక్కొని వస్తానులే” అని మురిపెంగా విసుక్కుంటూ సింక్ దగ్గరకు వెళ్లిపోయింది.
డెట్టాల్‌తో చేతులు కడుక్కుని వచ్చిన జ్యోతితో “మా మంచి అమ్మ” అంటూ మెడ చుట్టూ చేతులేసి ముద్దు పెట్టుకున్నాడు. క్రాంతి ఐదవ తరగతి పూర్తయి ఈ మధ్యనే ఆరవ తరగతిలోకి వచ్చాడు. మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూలని కొంచెం ఫీజులు ఎక్కువైనా చేర్పించారు. స్కూలులో పాఠాలు బాగా చెపుతున్నారు. బాగా చదువుకున్న టీచర్లు ఉన్నారు. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ వంటి వస్తువులన్నీ ఉన్నాయి. కొత్త స్కూలుకు వచ్చాక క్రాంతిలో చాలా తేడా కనిపిస్తున్నది. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు.
“అమ్మా! ఈరోజు మా సైన్స్ మాస్టారు బ్యాక్టీరియా, వైరస్‌ల గురించి పాఠం చెప్పారు. బ్యాక్టీరియాల వల్ల ఎన్నో జబ్బులు వస్తాయట. ముఖ్యంగా బాత్‌రూమ్ లోకి వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలట. లేకపోతే ట్యూబర్‌క్యులోసిస్, న్యూమోనియా, కలరా, టెటనస్, ఆంత్రాక్స్, వంటి ఎన్నో బ్యాక్టీరియల్ జబ్బులు వస్తాయట. ఇంకా ఆహారం తినబోయే ముందు చేతులు కడుక్కోకపోతే వాంతులు, విరోచనాలు కడుపునొప్పి వంటివి వస్తాయట. గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలట. లేకపోతే గోళ్లలో మట్టి చేరి దాని ద్వారా బ్యాక్టీరియా కడుపులోకి పోతుందట. చాలా ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయట. టైఫాయిడ్ జబ్బు కూడా బ్యాక్టీరియా వలననే వస్తుందట తెలుసా. ఈరోజు మాస్టర్ చెప్పారు”. కళ్ళు ఇంతంత పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చెప్తున్నాడు క్రాంతి.
జ్యోతి సంభ్రమంగా వింటున్నది పిల్లవాడికి చాలా విషయాలు తెలుస్తున్నాయని లోపల్లోపల మురిసిపోతోంది. ఈ విషయాలు తనకీ తెలీదు. తను చదివిందేమో బికామ్, ఎకౌంట్స్ తప్ప సైన్స్ గురించి తెలీదు. అంతలోనే జ్యోతి భర్త ఆనంద్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. జ్యోతి గబగబా ఎదురెళ్లి క్రాంతి తెలివితేటల గురించి సంతోషంగా చెప్పింది. జ్యోతి చెప్పినవి వింటూ ఆనంద్ లోపలికి వచ్చాడు.
“ఏరా క్రాంతీ! ఈరోజు బ్యాక్టీరియాల మీద రీసెర్చ్ చేస్తున్నావా? బ్యాక్టీరియా గురించి బాగా తెలుసుకున్నావా. మైక్రోస్కోపు కనుక్కోక ముందే ఈ బ్యాక్టీరియా చేసే అరాచకాలు ఎవరికి తెలియవు ఎందుకు రోగాలు తగ్గటం లేదు అనుకునేవారు. ఇవి కంటికి కనిపించని జీవులు కదా! మా చిన్నతనంలో టిబి చాలా మందికి ఉండేది. ఎప్పుడూ దగ్గుతూనే ఉండేవారు. వాళ్లను దూరంగా ఉంచేవారు. అలాగే ప్లేగ్ వ్యాధి కూడా. ఈ వ్యాధికి ఎంతో మంది బలయ్యారు. మైక్రోస్కోప్ వచ్చాకనే ఈ వ్యాధులకు బ్యాక్టీరియా కారణమని తెలిసింది. అప్పుడు బ్యాక్టీరియాను అంతం చేసే యాంటీబయాటిక్ మందుల్ని కనుగొన్నారు. కాబట్టే మనం ఈనాడు ప్రశాంతంగా బతకగలుగుతున్నాము”. అని ఆనంద్ వస్తునే క్రాంతికి ఎన్నో విషయాలు చెప్పాడు.
క్రాంతి ఆశ్చర్యపోయి వింటున్నాడు. “నాన్న నీకివన్నీ తెలుసా? చెప్పలేదే” అన్నాడు క్రాంతి. “నేను చదివింది బిఎస్సీ కదా క్రాంతీ! నాకివన్నీ తెలుసు. నీకు చెప్పాలన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నా ఆఫీసు పనిలో నేను బిజీగా ఉంటాను కదా! మీ హోమ్ వర్కులన్నీ అమ్మే చేయిస్తుంది కదా! అందుకే నాకు ఇవన్నీ చెప్పాలని తెలియలేదు”. క్రాంతి క్రాప్ సరిచేస్తూ అన్నాడు ఆనంద్.
జ్యోతి కూడా సంతోషంగా అన్నది “ఈ విషయాలన్నీ నాకు కూడా తెలియదండీ. మీరు అప్పుడప్పుడు పిల్లలకి పాఠాలు చెబితే బాగుంటుందండీ. స్కూల్లో చెప్పేవే కాక ఇంట్లో కూడా కొన్ని విషయాలు తెలిస్తే పిల్లలకు నాలెడ్జ్ బాగా వస్తుంది”.
“సరే జ్యోతీ అలాగే చెబుతాను. రోజూ కాకపోయినా ఆదివారాల్లో నైనా పిల్లలకు పాఠాలే కాదు, సమాజం గురించి కూడా తెలియజేస్తాను”. అంటూ క్రాంతి వైపు తిరిగి “నీకిప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా! మనకు రోగాలను తెప్పించే బ్యాక్టీరియా ఉన్నట్లే మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది తెలుసా నీకీ విషయం” కాళ్లకున్న షూస్ విప్పుకుంటూ అన్నాడు ఆనంద్.
“అలా ఎలా అవుతుంది నాన్నా. మా టీచర్ చెప్పలేదే. బ్యాక్టీరియా అంటే చెడ్డదే కదా! అది ఎందుకు మేలు చేస్తుంది చెప్పు చెప్పు” అని ఆదుర్దాగా అడిగాడు క్రాంతి.
“ఉండు కొద్దిగా మొహం, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. ఇప్పుడే బయటనుంచి వచ్చాను కదా! నా వంటి మీద బాక్టీరియాతో పాటు వైరస్ కూడా ఉండవచ్చు. అందుకే శుభ్రం చేసుకుని వస్తాను” అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆనంద్.
జ్యోతి కూడా లేచి “కన్నా నేను మీ ఇద్దరికీ ఏదైనా వేడి వేడిగా టిఫిన్ చేసుకుని వస్తాను. తింటూ మాట్లాడుకుందురు అంతలో ఈ పాలు తాగేసెయ్ గబగబా” అంటూ పాల గ్లాసు క్రాంతి ముందు పెట్టింది. క్రాంతి కొత్త విషయం తెలుసుకోవాలన్న ఆనందంతో ఏమీ పేచీ పెట్టకుండా గబగబా గ్లాసెత్తి పాలు తాగేశాడు.
ఆనంద్ మొహం కడుక్కుని వచ్చేసరికి జ్యోతి కూడా టిఫిన్లు రెడీ చేసింది. వేడివేడి టీ పెట్టి రెండు కప్పుల్లో పోసుకుని ఆనంద్ కొకటి ఇచ్చి తనోకటి తీసుకున్చది. క్రాంతి టిఫిన్ అంటూ “ఊ! ఇంకా చెప్పు నాన్నా. బాక్టీరియా మనకెలా సహాయం చేస్తుంది నాకు. వింతగా ఉన్నది” అన్నాడు.
“తెలియని ప్రతి విషయం వింతగానే ఉంటుంది క్రాంతీ! రోజా అమ్మ రాత్రి పూట పాలను తోడు పెడుతుంది కదా! ఉదయానికి ఏమవుతుంది. పెరుగుగా మారుతుంది కదా! రాత్రి పాలుగా ఉన్న పదార్థం ఉదయానికి పెరుగుగా ఎలా మారుతుందో తెలుసా నీకు, తెలియదు కదా! ‘లాక్టోబాసిల్లస్’ అనే బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. దాని వలననే మనం పెరుగును తినగలుగుతున్నాం” అన్నాడు ఆనంద్ కొడుకు వంక చూస్తూ.
“ఛీ ఛీ అయితే నేను రోజూ పెరుగన్నం తినను” క్రాంతి అసహ్యంగా మొహం పెడుతూ చెప్పాడు. “అదేంటి నాన్న ఇన్ని రోజులు చెప్పలేదు. పెరుగన్నం మానేసేవాడికి కదా!” అన్నాడు.
“ఆగాగు క్రాంతీ. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా అందులో బాక్టీరియా ఉండడం వల్లనే మన శరీరానికి మంచి జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా పెరుగన్నం తినమని చెబుతారు: ఇంకా పొట్టలో బోలెడు బాక్టీరియాలు ఉంటాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటంలో సహాయపడతాయి. ఈ మంచి బాక్టీరియా వలనే మనం ఆరోగ్యంగా ఉంటాము”. అని ఆనంద్ చెప్తూ ఉండగానే క్రాంతి ఆపాడు.
“నాన్నా జబ్బులు వచ్చినపుడు బాక్టీరియాను చంపడానికి యాంటీ బయాటిక్ మందులు వేసుకుంటామని చెప్పావు కదా! అప్పుడు మంచి బాక్టీరియా ఎక్కడ ఉంటాయి” అడిగాడు క్రాంతి.
“నువ్వు తెలివైన వాడివిరా. మంచి సందేహం. మనం మందులు వాడినప్పుడు చెడు బాక్టీరియాతో పాటుగా మంచి బాక్టీరియా కూడా చనిపోతుంది. ఫలితంగా కడుపులో అజీర్ణ సమస్యలు వస్తాయి. మనం డాక్టరు దగ్గరకు వెళ్ళగానే మంచి బాక్టీరియాను మందుల రూపంలో ఇస్తాడు. దానివల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. చూశావా బాక్టీరియా వల్ల లాభాలు కూడా ఉన్నాయని తెలుసుకున్నావా” అన్నాడు ఆనంద్.
“అవునా నాన్నా నాకీరోజు మంచి బాక్టీరియా గురించి చాలా విషయాలు తెలిసాయి రేపు స్కూల్లో మా ఫ్రెండ్స్ కు చెపుతాను” అని సంతోషంగా చెప్పాడు క్రాంతి.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.