Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మబ్బే మసకేసిందిలే!

[వడలి రాధాకృష్ణ గారు రాసిన ‘మబ్బే మసకేసిందిలే!’ అనే హాస్యకథని పాఠకులకు అందిస్తున్నాము.]

వాడి చావు ఈడి నవ్వులాట కొచ్చింది! అందుకే నవ్వు నిలవడం లేదు. ఆనందం ఆగడం లేదు. రెండు కలగలిసిపోయి బయటకు తన్నుకొచ్చేస్తున్నాయి. అంతే చపలచిత్తం అదే పనిగా ఉబ్బిపోతున్నాడు. అంతేనా, తబ్బిబ్బయిపోతున్నాడు. మొగుడిని చూసిన చలువపందిరి మురిసిపోతోంది. ప్రక్కన అద్దెకిచ్చిన కిచిడీమూర్తి గారి పోర్షన్ లోని పాతకాలపు రేడియో లోంచి పాతకాలపు సినిమా పాట వారిని మురిపించేసి మెరిపించి పారేస్తోంది.

‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా!

అందరూ సుఖపడాలి నంద నందనా!’

పాట లోని భావం చలువపందిరి సూపర్ మనసును పిండిపారేసే సరికి ఆమె పరుగున పారే గుండ్లకమ్మ కుడి కాలువ అయిపోతోంది.

కాలువ ఏటివాలు లాగ ఆనందంతో ఆమె ప్రవహించేస్తోంది. అవును తమకు మంచి రోజులొచ్చేశాయి. మరి! ఇకనుండి అన్నీ శుభ శకునాలే!

“చూశారా!! విషయం తెల్సిందో లేదో నా కుడి కన్ను అదేపనిగా కొట్టుకుపోతోంది!”

“మొన్న తమ్మారావు సిద్ధాంతిని కలిశాను. ఆయనా అదే చెప్పేసినాడు. రేడియోలోని పాత పాట, ఆయన గారి పుల్ల ప్రశ్నలను సరిగ్గా సరిపోలి ఉంది..”

“ఏమన్నాడు?”

“చేతిలోని జెర్రిపోతు రేఖని చూసి ‘త్వరలోనే రోడ్డెక్కుతాన’ని చెప్పేసినాడు. మరోసారి మధ్యలో ఎలక్షన్లు వచ్చేస్తాయని, ఈ మారు ఆ సిద్దరాజు గాడిని ఓడించేసి ఈ చపలచిత్తం బాబు ఎం.ఎల్.ఏ అయిపోగలడని సెలవిచ్చేసినాడు.”

చలువపందిరిలోని ఉత్సాహం ఉప్పొంగి యావత్ ఉప్పరపాలెం నియోజక వర్గాన్నీ ముంచెత్తి పారిస్తోంది.

***

అక్కడ సిద్దరాజు అలాగయిపోతే, ఎప్పుడూ ఎలక్షన్లలో గెలుపుగుర్రం కానేరని చపలచిత్తం ఇలాగ.. చెక్కారెడ్డికి ఇసయం అర్థం కాకుండా ఉంది.

“కనీసం సచ్చిపోయిన సిద్దరాజు శవాన్ని తీసేసే దాకయినా ఆగలేవా! ఇలాగయితే పబ్లిక్కులో సీపయి పోగలవు చిత్తమా!!” అన్నాడు.

“ఎం.ఎల్.ఏ. సిద్దరాజు గాడు సిద్ధి పొందేసినాడు.. కెవ్వు కేక” చపలచిత్తం అరిచేసినంత పనిచేశాడు. చెక్కారెడ్డి వారిస్తూన్నా వినడం లేదు.

పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో సిద్దరాజు మీద చపలచిత్తం పోటీపడ్డాడు. పోటీ పడటమే కాదు, నువ్వెంత అంటే నేనింత అనుకుంటూ ఓటరు మహాశయులను బుట్టలో పారెయ్యడాన్ని బుట్ట ప్యాకేజీలు పంచేశాడు. అదే బుట్టలో బిర్యాని ఉండాది! బ్రాందీ బాటిలూ ఉన్నాది! బ్రాందీకి దన్నుగా బాబాయి కాపు సోడానూ ఉన్నాది!! మూడు అంచెల నోట్లు పంపిణీ పథకమూ ఉన్నాది. చివరకు గెలవలేక పోయాడు, అంతేను.

ఆ ఎమ్.ఎల్.ఎ ఎలక్షన్‌లో సిద్దరాజు ఆశ అందలమెక్కిపోతే, చపలచిత్తం ఒక్కసారిగా చతికలబడి పోయాడు. చతికిలబడ్డా, చక్కబడిపోయాడు. తనదైన రోజున ఉప్పరపాలేనికి రాజు అయి తీరుతానని తీరువగా నడుం కట్టేసుకున్నాడు. తీతువుపిట్ట అయిపోయినాడు.

ఇంకేముంది ప్రజాసేవ అంటూ, ప్రజలకు సేవ చేయాల్సిందే అనుకుంటూ నిత్యం ప్రజల మధ్యనే నివసించేస్తున్నాడు. నాన్న, నాడు సారా వ్యాపారంలో సంపాదించిన సొమ్ముల్ని మొన్న ఎలక్షన్లలో సగం ఖర్చు పెట్టేశాడు. రేపటి ఆశతో, తన మీద తనకున్న నమ్మకంతో ఖర్చులకు వెనకాడకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు.

ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పటినుండి ఇలాగ.. – తను నమ్మిన మనుషులు చెక్కారెడ్డి, బిక్కి చౌదరి, కుమార రాజు, దొడ్డినాయుడు, వరదయ్య కాపు – వలదని వారిస్తూనే ఉన్నారు. కానీ చపలానిది వినే చిత్తం కాదు.

చపలచిత్తానికి పూనకం ప్రశ్నలు చెప్పే పల్లపు చెట్టి మాటల మీద అత్యంత గురి ఉంది. “క్రితంసారి పంపకాలలో ప్రమాణాలు పాటించకపోవడంతో బొమ్మ తిరగబడింది. లేకపోతే ఆ సిద్దరాజు గెలవడమేమిటీ? నువ్వ కళ్ళూ కాళ్ళు కట్టుకు కూర్చోవడమేమిటి? ఆడి జాతకంలో పదవి పుల్లుగా లేదు. మధ్యలో దిగిపోవడం గ్యారంటీ. అప్పుడు గుర్రమెక్కేది నువ్వే! ప్రజల్ని పాలించేదే నువ్వేనో” పల్లపు చెట్టి మాటలు పొంగలి టిఫిన్‌కి కొబ్బరి చెట్నీ కాంబినేషన్ అంత రంజుగా ఉంది. అంతే ఆ మాటలు చపలచిత్తం మనసును చుట్టేసినాయి. ఇక మబ్బులు, మసకలు వీడిపోయినట్లున్నాయి. తన విషయంలో చెట్టి గారి మాటలు చాల సార్లు నిజమయిపోయినాయి. తన మొదటి భార్యకు ఈ భూమి మీద నూకాలు నిండుకున్నాయని సెలవిచ్చింది ఆయనగారే! ఆయన అన్నట్టే అప్పట్లో కళావతీ ఎగిరిపోయింది. చలువపందిరి వచ్చేసింది. ఆమెకు సంతానం కలుగదని కుండలు బద్దలు కొట్టేసినాడు. “నీ భార్యలే నీకు వారసులు” అని ఆర్డరేసి పారేసినాడు.

సిద్దరాజు సీటు మారిపోతుందని మూడు నెలలముందే చక్రమేసి చెప్పేసినాడు. అప్పుటినుండీ చపలచిత్తానికి కేన్వాసింగ్ పిచ్చి ముదిరిపోయింది. అతగాడిలోని ఎన్నికల కోయిల కూసేసింది.

చలువపందిరికి కూడా ఎం.ఎల్.ఏ గారి భార్యననిపించుకోవాలని తెగ ఉబలాటపడిపోతోంది. అనివార్యంగా అవసరం వస్తే సింపతీ వేవ్‌లో తాను గెలుపు గుర్రమయిపోవాలని ఆరాటపడుతూ ఉంది. మొత్తానికి రాజకీయ కదనరంగంలో ఎవరికి వారు కాలు దువ్వుతూనే ఉన్నారు.

***

ఉప్పరపాలెం ఎం.ఎల్.ఏ సిద్దరాజు హఠాత్తుగా రాత్రికి రాత్రే సిద్ది పొందేసాడు. అదీ గట్టిగా కొట్టుకొనే ఆయనగారి గుండె కాస్తా గుట్టుగా కొట్టుకోక ఆగిపోయింది. అంతే చావు కబురు చల్లగా ఊరంతా పాకేసిస్తాది. ఊరిలోని సిద్ధరాజుకి ఏకైక ప్రత్యర్థి చపలచిత్తానికి ముందుగానే తెల్సిపోయింది. ఆ కబురు ఈయనికి చల్లగానే తోస్తోంది. ఇక తన గెలుపును ఏ శక్తి ఆపేది లేదన్న ఆలోచనకు వచ్చేస్తున్నాడు. చపలచిత్తం. ఆయన గారి ఊపును ఆపడం భార్యతో సహా ఎవరి వల్లా కావడం లేదు.

సంతోషం ఎగిసిపడుతూంటే కేరింతలు కొట్టేస్తున్నాడు. ఆ చూపే తప్ప ఏ చూపూ లేని తింగరోడివని చలువపందిరి దెప్పిపొడవడంతో ప్లేట్ తిప్పి రూటు మార్చేసి అదే స్థాయిలో ఏడవడం మొదలుపెట్టాడు.

అందరి ముందూ సిద్దరాజును తల్చుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. చలువపందిరికి మొగడి ఏడుపు సీను గొప్పగా అన్పిస్తోంది. లేకపోతే మాయదారి మీడియా ఉన్నదాన్ని మరింత ఉన్నతంగా చూపించేస్తోంది. అందరితో కల్సి వెళ్ళి సిద్దరాజు భౌతిక కాయం మీద దండలు వేసి వీరగా శ్రద్ధాంజలి ఘటించేశాడు.

“నా స్వంత అన్నలాంటోండు. మనలందర్నీ వదిలేసి వెళ్ళిపోయినాడు. తల్చుకుంటే నా గుండె గుడిమెట్ల వాగు అయిపోతోంది” అంటూ పలకరించిన మీడియా మైకు ముందు రెచ్చిపోయి అదే పనిగా సంతాపాన్ని ప్రకటించేస్తున్నాడు.

“అసలు గుడిమెట్ల వాగు ఎక్కడున్నాది సామీ!” వెనక నుండి ఎవడో కూసింత గాట్టిగానే కౌంటరేశాడు.

“ఎక్కడున్నాదో నీకు చెప్పాలేట్రా సన్నాసీ!” ఆ ప్రక్కనుండి మరొకడు మారు కౌంటర్‌ని కొట్టేశాడు.

“సిద్దన్న ఎగిరిపోయినాడని బాధపడమాకండి. ఆడు లేనిది లోటే అయినా మనం ముందుండి పూరించాలి. మీకు దైర్యం చెప్పి ముందుండడానికి నేనున్నాను.” మీడియా ముందు చపలచిత్తం గొప్ప కలరింగ్ ఇచ్చేస్తున్నాడు.

“చపలచిత్తానికి జై.. చపలచిత్తం గారి నాయకత్వానికీ జై.. మన ఎనకాల గట్టిగా నిలబడగల్గిన మహారాజు గారికీ జైజైజై” అక్కడ మనుషులు మహా రెచ్చిపోతున్నారు.

ఆ సీను చపలచిత్తం గాడికి బాగుంది. తన భవిష్యత్తు మీద గొప్ప ‘గురి’ ఏర్పడిపోతోంది.

చనిపోయిన మొగుడి ప్రక్కన ఏడుపుగొట్టు మొకంతో కూర్చున్న సిరిపురికి ఎక్కడో కాలిపోతోంది. సిద్దరాజు పోయిన దుఃఖంలో ఉంది తాను. అటువంటి చోట చపలచిత్తం గాడి చపల వేషాలు నషాలానికి ఎక్కేలా చేస్తున్నాయి.

సిరిపురి చిర్రుబుర్రులాడి పోతోంది. చపలం గాడిని కసితో చూసేసింది! మాటలతో కాక కళ్ళతో హెచ్చరించేసింది!!

***

ఏది ఏమయినా అందివచ్చిన అవకాశాన్ని చపలచిత్తం వదులుకో దలచుకోలేదు. తన చేతిలోని గీతల గమనాన్ని చూసి తన భవిష్యత్తు తీర్పును చెప్పేసిన సిద్ధాంతి గారి మాటల మీద గురి ఉంది. ఆయన చెప్పినట్లే అన్ని జరిగి పోతున్నందుకు సంతోషంగా ఉంది

“సిద్దరాజు ఎగిరిపోయినాడు. ఇక ఎగిరే తెల్ల పావురానివి నువ్వే” అని ఆయన సెలవిచ్చేశాడు. అంతే చపలచిత్తంలో గెలుపు పట్ల కసి రగిలిపోతోంది. ఆగక ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు.

‘నీ వెంట మేమున్నా’మంటూ దుందుడుకు మూకలు, దూకుడు చోటా నాయకులు – అందరూ సంఘీభావం ప్రకటించేస్తున్నారు. అందినకాడికి అన్నింటినీ అందిపుచ్చేసుకుంటూ ఉన్నారు.

మీడియా కూడా రాబోయే మధ్యంతర ఎన్నికలలో చపలచిత్తందే గెలుపు గుర్రమంటూ కుండ బద్దలు కొట్టేసింది. కానీ సిరిపురి రాజకీయాన్ని, భర్త మరణాన్ని వేరువేరుగా చూస్తూనే ఉంది. ప్రత్యర్థి తానంటూ ప్రగల్బాలు పలికేస్తున్న చపలచిత్రానికి అతీతమైన చిత్తంలో భవిష్యత్తును రచిస్తూనే ఉంది! కంటి చూపు జీరతో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది!! చూపుల చురకలతో కత్తులు దూస్తూనే ఉంది!!!

సిద్దరాజు చావు కాదు గాని ఉన్నట్టుండి ఎన్నికల వేడి రగులుకొచ్చేసింది. పుచ్చుకొని మాట తప్పకుండా మద్దతు ప్రకటించే జనావళి అంతా చపలచిత్తానికి జేజేలు పలికేస్తోంది.

ఎన్నాళ్ళుగానో ఎదురు చూసి క్షణాలు తన కోసమని తన్నుకొని వచ్చేస్తుంటే చపలచిత్తం అందులేని ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకుంటూనే ఉన్నాడు.

***

చపలచిత్తానికి నమ్మశక్యంగా లేదు. ఎగిసిపడిపోయిన రాజకీయ కొదమ సింహం తానయి పోతున్నాడు. చలువపందిరి చేసేది లేక చేతులెత్తేసింది. ఇద్దరూ చేతులు కాలేసరికి తల్లడిల్లిపోతున్నారు. పైన అధిష్టానవర్గం యొక్క నిర్ణయం మరీ ఇంత ఏకపక్షంగా ఉంటుందనుకోలేదు. ఎం.ఎల్.ఎ. సిద్దరాజు అకారణంగా కాలం చేసేసినాడు. పదవిలో ఉన్న వ్యక్తి పరలోకానికి ఎగిరిపోతే వారి వారసులు, ముఖ్యంగా అతని భార్యను పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రివాజు అయిపోయింది. ఉన్నట్టుండి ఆ వాదన తెరమీదకు వచ్చేసింది. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో సిద్ధరాజు భార్య సిరిపురి శాసన సభ్యత్వానికి ఏకగ్రీవంగా ఎన్నికయిపోయింది.

బిక్కమొహం వేయడం, బిక్క చచ్చిపోవడం చపలచిత్తం వంతయిపోయింది. చేతిలోని సెల్‌ఫోన్ కడు దీనంగా మోగుతోంది.

తనకు ఎప్పుడూ చేయి చూసి శకునాలు చెప్పే పల్లపు చెట్టి గారి ఫోన్ కాల్ అది.

“అబ్బాయి! ఈసారి నీ స్టార్స్ గొప్ప రైజింగ్‌లో ఉన్నాయి. పదవిని అందిపుచ్చుకోవల్సిన వాడివి. పొరబాటున ఈసారి స్టార్లు ప్రక్కకు పడ్డాయంటే లేచే అవకాశం ఇక ఎంత మాత్రము లేదు. ఇదే నీకు గెలుపు సమయం. లేకపోతే నీ గ్రహస్థితి నిన్ను గెలవనివ్వదు. అప్పుడు ఎం.ఎల్.ఏ కాదు కదా వార్డ్ మెంబరుగా కూడా గెలవలేవు.”

పల్లపు చెట్టి గారి ఫోన్ కబుర్లు చపలచిత్తానికి ఎక్కడికో తీసుకుపోతుంటే ఆకాశంలో కమ్మేసి ఉన్న కారుమబ్బుల్ని వెర్రి మొర్రి చూపులతో పరికించి చూస్తూ ఉన్నాడు.

Exit mobile version