[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన రచించిన ‘మాయమైన జగతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఏ యింట పెళ్ళైన
ఊరంత పెద్దలే, అందరికీ ఆనందమే
వీడు మా వాడె, వాడు మా వాడె!
ఆడపిల్లైతే, వాడ వాడంతకు మహలక్ష్మియే!!
***
ఎవరింట పెళ్ళిపేరింటమైన
దంపుళ్ళ పాటల సిందళ్ళె సందళ్ళు,
బృందగానాలు, బంధు రాగాలు
అందరి కలకలలే ఆ పూట వాద్యవృందాలు!
***
గుడియె, ప్రతివారి బడి
అయవారి పాఠాలు, వెలలేని బోధలు
తాతలైన దాక మది నిలిచేటి
బతుకు సాగించే సూటి బాటల పైడి సూత్రాలు!
***
ప్రహరీలు లేని ఇళ్ళు
ఎరుగని బాటసారులకు ముందర అరుగులు
వాకిట రారమ్మను నీటి తొట్లు
పాదాభిషేకమైననే, ఇంటి లోనికి అడుగులు!
***
కలసిన మనసుల కలివిడి జీవితమలు
కలతలు పండుగ లన్ని సామూహికములు
ఒకడి కష్ట మందరికి కలవరము
ఒక్కొ డొంటరై మిగలని కుటుంబ కవచము!
***
కలసి ఉంటే కలదు సుఖమను
జీవన విధాన నమ్మకపు గట్టి కోటలు
కాల గతిని బీటలు వారి
దూరమాయె, ఐక్యతల బల్మి కలుమలు!
***
ఎవరికి వారె నేడక, ఏకాంత ద్వీపము
ఎవరి కెవ రేమి కాని వింత చందము
నలువైపుల పరచిన దిగులు సంద్రము
కొలిమి కడ చల్లదనముల యత్నము!
***
బతుకు పరుగు పందేన గుర్రములు
ఆర్జన కుబేరులు, ధనమున్న పేదలు!
నీరస రసులు, శుష్కముల యెదలు
సరసి దరినునిను, దప్పికల బాధలు!!
***
లోకపు ప్రమణశీలతా లక్షణమన
ఈ కొత్తలో అలనాటి మామంచి,
మనిషి నాదరించు జగతి తిరిగొస్తే
జనుల గుణమె దీటౌ పసిడి కొలతైతే!
***
పాత కొత్తల మేల్కలయిక చేతి కందితే
నేటి వేగం, నాటి సౌమ్యం కలిసి ఉింటే
కూలు కాపురాలకు, కాపుదల వచ్చినట్లే
ప్రగతి జ్యోతితో కొత్త దారులు చూపినట్లే!!