[‘మాతృమూర్తి స్మృతులు’ అనే అనువాద కవితని అందిస్తున్నారు శాంతిశ్రీ బెనర్జీ. మూలం రవీంద్రనాథ్ ఠాగోర్.]
నాకు అమ్మ గుర్తులేదు
కానీ ఒక్కోసారి హఠాత్తుగా
నాకు వినబడుతుంది
మధురమైన లాలి పాట
నా ఆటల్లో ఆ పాట
కలసి పోయినట్లు అనిపిస్తుంది
నా ఉయ్యాల ఊపుతూ
అమ్మా ఆ పాట పాడిందా?
నా కోసం ఆ పాట వదిలి వెళ్లిందా?
నాకు అమ్మ గుర్తులేదు
కానీ శరదృతువులో
మంచు కమ్ముకున్న గాలి లో
పారిజాత పుష్పాల
పరిమళం దాగి ఉటుంది
అమ్మ తన బుట్టలో
ఆ పువ్వులు నింపుకుందా?
అందుకే పూజ గదిలోని సుగంధం
ఆమె నుండి వచ్చే సువాసన అయ్యిందా?
నాకు అమ్మ గుర్తులేదు
కానీ నేను నా గది గవాక్షం నుండి
సుదూర నీలాకాశం చూస్తున్నప్పుడు
అమ్మ నా వైపు చూస్తున్నట్లు అనిపిస్తుంది
నన్ను తన ఒడిలోకి తీసుకుని
నా వైపు చూసిన అదే చూపు
అపారమైన ఆకాశంలో గోచరిస్తుంది
మూలం: రవీంద్రనాథ్ ఠాగూర్
తెలుగుసేత: శాంతిశ్రీ బెనర్జీ
(రవీంద్రుడు బెంగాలీలో ‘మొనె పోడా’ (గుర్తు చేసుకుంటూ..) అనే శీర్షికతో రాసిన ఈ కవితను నా స్నేహితురాలు కుమ్ కుమ్ రాయ్ ఆంగ్లంలోకి ‘రిమెంబరింగ్’ అనే శీర్షికతో అనువాదం చేసింది. దానికి నా తెలుగు అనుసృజన ఇది. రవీంద్రుని తల్లి శారదాదేవి (1830-1875) రవీంద్రుడికి పద్నాలుగేళ్ల ప్రాయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చనిపోయిన ఎన్నో దశాబ్దాల తర్వాత 1921లో రవీంద్రుడు ఈ కవిత రాశారు.)
శాంతిశ్రీ బెనర్జీ గుంటూరులో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ. వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఎమ్.ఫిల్. చేశారు. తీన్‌మూర్తి భవన్, డిల్లీలో నెహ్రూకు సంబంధించిన ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ’ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 2022 జూలైలో వారి కథా సంపుటి ‘మానుషి’, కవితా సంపుటి ‘ఆలంబన’ వచ్చాయి. 2024 డిసెంబర్ లో వారి ట్రావెలాగ్ ‘గమనకాంక్ష’, వ్యాస సంపుటి ‘వ్యాస వల్లరి’, హిందీలో వచ్చిన వారి కథల అనువాదం ‘మానుషి’ వచ్చాయి.