Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాటే మౌనం

[శ్రీమతి రాధకృష్ణ కర్రి రచించిన ‘మాటే మౌనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కీచురాళ్ళ శబ్దానికి నిశిరాత్రి శ్రుతి కలిపింది
ఎండిన ఆకులు లయబద్ధంగా నేలమీదకు
నలుచెరగులా గాలి హోరున చొరబాటు
లోపల ఊపిరి అందని ఉక్కపోత

ఆలోచనలు చేసే అలజడికి రేగిన మంట
దహిస్తూ దహిస్తూ
గుండెలో నిప్పుల కొలిమిగా

నీకు తెలియొచ్చు
తెలియకనూ పోవచ్చు
ఆ శిక్ష అనుభవిస్తున్నది
నువ్వు.. నేను

నువ్వు కాదనొచ్చు..
కానరాని దూరాలకు వెళ్లానని భ్రమించొచ్చు
తెలియని ఆవేశపు అనర్థంలో నుసిగా మారేది
నీ – నా అనుబంధాలే

ఆ మంటలో పూర్తిగా కాలకముందే
కన్నీటి జల్లులతో కొంత మేర చల్లబరుచుకుందాం
ఒక్కసారి
వెనుకకు తిరిగి చూడు
నీకోసమే ఎదురుచూసే నిజాల వెలుగు
తెలిమంచు పరదాల సాయంతో.

Exit mobile version