[శ్రీ కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి రచించిన ‘మాధుర్యము లొదలొద్దు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
అమ్మ జగతిన నిల్ప, భాష బ్రతుకును నేర్పు
అమ్మ లేకున్న బ్రతుకు సాగునేమో గాని
అమ్మ భాష లేని బ్రతుకెటుల సాగురా
మాతృ భాష ఎడ మమకారమే చూపరా
ఏబదా రక్షరాల ఇంపైన భాషరా
ఏ భాషకు తగ్గని ధీటైన భాషరా
అచ్చుతో అంతమగు అజంత భాషరా
అరసున్న కైన అర్ధమిచ్చేటి భాషరా
పలుకుల కులుకు లొలికేటి భాషరా
పదముల సొగసు లొలికించు భాషరా
పశు, పక్ష్యాదు లేవీ తమ భాష నొదలవు
పర భాషల మోజు మన కెంతఉన్ననూ
తల్లి భాషను వదలుట, తప్పేను గదరా
అందమైన లిపిగల అద్భుతపు భాషకు
ఆ లిపిని మార్చు బుద్ధి నీకేల కలిగెరా
ఆంగ్లమున తెలుగు వ్రాతలేల మిత్రమా
ఆ తెగులు వదిలించ కదలరా సోదరా
అమ్మను మరువొద్దు అమ్మ భాషను వదలద్దు
ఆ మాధుర్యముల నెన్నడూ కోల్పోవద్దు