[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’. ]
ఈ మధ్య మా వదిన చెప్పే కబుర్లు లేక జీవితం నిస్సారంగా అనిపిస్తోంది.
నాకే కాదు, నాకు తెలిసినవాళ్లందరూ కూడా నేను కనపడగానే “మీ వదినగారు రాలేదా!” అని అడుగుతున్నారు.
నాకు ఏవని చెప్పాలో తెలీక, “మా వదిన పుట్టింటికి వెళ్ళిందండీ.” అనేసి అప్పటికి తప్పించుకునేదాన్ని.
అసలు ఇంతకీ మా వదిన ఎక్కడికి వెళ్ళిందంటారా..
“ఇదిగో రెండ్రోజుల్లో వచ్చేస్తానూ!” అంటూ కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్ళింది. అలా అన్నామె ఆ కుంభమేళా పూర్తయేదాకా అక్కడే వుండి మొన్ననే తిరిగి వచ్చింది.
వదిన కుంభమేళా మొదలైన మొదటి వారంలోనే వెళ్ళింది ప్రయాగ్‌రాజ్. అక్కడినించి రోజూ ఫోన్ చేసి ఎన్ని లక్షలమంది జనం వచ్చేరో, అంతా ఎంత బాగుందో చెప్పేది. ఓ రెండురోజులయ్యేక పొద్దున్నే ఫోన్ చేసింది.
“ఎప్పుడొస్తున్నావు వదినా.. వచ్చేటప్పుడు ఆ గంగాజలం కాస్త మాక్కూడా తెచ్చిపెట్టూ!” అన్న నా మాటలకి వదిన సమాధానం విన్న నాకు మతిపోయింది.
“గంగాజలం అక్కడికి తేవడమెందుకూ! ఏకంగా మిమ్మల్నే ఇక్కడి గంగాజలంలో ముంచేస్తాను.”
“మేం ఆ రష్లో రాలేము వదినా. అంతంత దూరాలు నడవలేము కూడా..”
“మీరు రానూ వద్దు, నడవనూ వద్దు. అయినా సరే మీకు కుంభమేళాలో స్నానం చేయించే బాధ్యత నాదీ.”
“ఎలా వదినా!”
“నువ్వు మీ ఫేమిలీ ఫొటో వాట్సప్‌లో పంపించు. అవి ఇక్కడ ప్రింటు తీసి, ఆ ఫొటోని గంగలో ముంచుతాను. అల్లా చేస్తే మీకు కూడా పుష్కర స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది.”
వదిన మాటలకి నాకు మతి పోయింది.
“అలా ఎలా వదినా! ఫొటోలు గంగలో ముంచితే మనుషులు మునిగినట్టెలా అవుతుందీ!”
“అవును స్వర్ణా, నేను ఇక్కడ అలా కొంతమంది చెయ్యడం చూసేను. అందుకే చెపుతున్నాను. పేరు, గోత్రంతో సంకల్పం చెపుతూ ఫొటోలు సంగమంలో ముంచుతున్నారిక్కడ. మీ అన్నయ్య ఫొటో నా మొబైల్లో ఉందనుకో, మీది పంపించు.”
వదిన మాటలకి నాకు నోటమ్మట మాట రాలేదు.
“ఏంటి మాట్లాడవ్. సర్లే, ఇప్పుడే చూసేను. మీ ఫేమిలీ ఫొటో కూడా నా మొబైల్లో కనపడింది. మీది భారద్వాజస గోత్రవే కదా! నేను సంకల్పం చెప్పి, ఫొటో గంగలో ముంచేస్తాలే.” వదిన ఫోన్ పెట్టేసింది.
నేను అయోమయంలో పడిపోయేను. ఫొటో సంగమంలో ముంచితే ఆ మనుషులు మునిగినట్టెలా అవుతుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు.
సరిలే, ఎలాగూ ముంచుతానందికదా.. నీట ముంచినా పాల ముంచినా వదినదే భారం. అయినా వదిన అలా చేస్తే లాభం ఉన్నా లేకపోయినా నష్టం లేదు కదా అని ఊరుకున్నాను.
రెండ్రోజులైంది. ఈపాటికి వదిన వెనక్కి వచ్చేసి ఉంటుందీ, కుంభమేళా విశేషాలు తెలుసుకుందామని మళ్ళీ ఫోన్ చేసేను.
“ఇంటికి జాగ్రత్తగా చేరేవా వదినా! బాగా రష్ ఉందా! నడవగలిగేవా!” అంటూ కురిపించిన నా ప్రశ్నల వర్షానికి వదిన జవాబు విన్న నేను స్థాణువయ్యేను.
“నేనింకా ప్రయాగ్‌రాజ్ లోనే ఉన్నాను. ఇప్పుడప్పుడే రాను. ఎలాగైనా ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని, ఓ రెండుమూడు లక్షలు వెనకేసుకుంటే కానీ ఇంటికి రాదల్చుకోలేదు.”
“అదేంటీ! అక్కడికి పుష్కర స్నానానికి కదా వెళ్ళేవూ!”
“నిజవే, వచ్చింది పుష్కర స్నానానికే. కానీ ఇక్కడికి రోజూ లక్షలకొద్దీ జనం వస్తున్నారు. వాళ్లకి అవసరవైనవి కొనుక్కుందుకు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడుతున్నారు. పసిపిల్లలకి పాలూ, వృధ్ధులకి దగ్గరుండి స్నానం చేయించడం, సమయానికి కాఫీలూ, టిఫిన్లూ.. ఇలా రూపాయి పెడితే వచ్చేవాటిని పది రూపాయల కమ్ముకుని బోల్డు సంపాదిస్తున్నారు ఇక్కడి వాళ్ళు. ఫ్రీగా అన్నీ పెట్టేవి ఉన్నా కూడా వీళ్ళ వ్యాపారం కూడా చాలా బాగుంటోంది. అంతదాకా ఎందుకూ! పదిరూపాయిలు పెడితే వచ్చే పందుంపుల్లలు అమ్మేవాడు రోజుకి పదివేలు సంపాదిస్తున్నాడు. ఇంక మోటార్ సైకిళ్ళు ఉన్నవాళ్ళకి పండగే పండగ. ఎంతమందినో ఎక్కించుకుని, ఘాట్‌లో దింపి, రోజుకి కనీసం పాతిక వేలు సంపాదిస్తున్నాడు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ప్రపంచం మొత్తం మీద ఇంకెక్కడా ఇన్నికోట్లమంది కూడడం మనం చూడం. అందుకే ఈ నెల్లాళ్ళు ఇక్కడే ఉండి కనీసం రెండుమూడు లక్షలైనా సంపాదిద్దా మనుకుంటున్నాను.”
వదిన చెప్పే మాటలు వింటున్న నాకు కళ్ళు తిరిగి కింద పడిపోతానేమోనని భయం వేసింది. కూర్చున్న కుర్చీని గట్టిగా పట్టుకుని,
“వదినా, నువ్విప్పుడు అక్కడ పందుం పుల్లలు అమ్ముతావా!”
“అమ్మితే తప్పేం లేదు కానీ, నేను ఆ పని చెయ్యటం లేదు. ఇవాళ వాట్సప్ గ్రూప్‌లో నా దగ్గర్నించి ఒక మెసేజ్ వస్తుందీ, చూడు. మనకి తెల్సిన వాళ్లందరికీ పంపించేను. నువ్వు కూడా నీ ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యి. నాకిక్కడ క్లయింట్లు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ చేస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన.
అరగంటయినా వదిన దగ్గర్నించి ఏ మెసేజీ లేదు. ఈ వదిన అక్కడ ఏం చేస్తోందిరా దేవుడా అనుకుంటున్న నాలో ఆతృత పెరిగిపోతోంది.
ఓ గంట పోయేక వదిన దగ్గర్నించి మెసేజ్ వచ్చింది. అదొక ఇన్విటేషన్ కార్డ్‌లా తయారు చేసింది వదిన. ఒక్కొక్క లైను ఒక్కొక్క ఫాంట్‌తో, ఒక్కొక్క రంగుతో, పైన ఓ మూలగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫొటోతో చూడగానే చదివెయ్యాలన్నంత అందంగా వుంది ఆ కార్డ్. ఆ కార్డ్‌లో ఇలా ఉంది.
“మీరు కుంభమేళా లో పవిత్రస్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారా! కానీ మీరు ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారా! చింత వద్దు. నేనున్నాను మీ చెంత.
మీ ఫొటో కానీ, లేదా మీ ఫేమిలీ ఫొటో కానీ , మీ గోత్ర నామాలతోపాటు వాట్సప్‌లో ఈ కింద నంబర్‌కి పంపించండి.
ఆ ఫొటోను ప్రింట్ తీయించి, ఆ ప్రింట్‌ను మీ గోత్ర నామాలతో సహా సంకల్పం చెపుతూ, పవిత్ర సంగమంలో మూడుసార్లు ముంచి, దానిని వీడియో తీసి మీకు పంపుతాం.
144 సంవత్సరాల కొక్కసారి దొరికే అరుదైన అవకాశం ఈ మహా కుంభమేళా. దీనిని వదులుకోకండి.
పాస్‌పోర్ట్ సైజు ఫొటో ప్రింట్ కయితే మూడు మునకలకు అయిదువందల రూపాయిలు.
కేబినెట్ సైజ్ ప్రింట్ కయితే వెయ్యి రూపాయిలు. పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే అందుబాటులో ఉన్నాయి. లేదా స్కాన్ కూడా చెయ్యొచ్చు.”
అది చదివిన నేను నిర్ఘాంతపోయేను.
ఇదెక్కడి బిజినెస్! ఫొటోలు గంగలో ముంచడమేవిటీ! అలా ముంచినందుకు డబ్బులు తీసుకోవడ వేవిటీ! అసలు దీని కెవరైనా స్పందిస్తారా! ఏవిటీ పిచ్చి అనుకోరూ!
అదే మెసేజ్ పెట్టేను వదినకి.
“నీ బిజినెస్ మాట విని అందరూ నవ్వుకుంటారు వదినా. వద్దు, మానెయ్యి.” అంటూ.
మరు నిమిషంలో వదిన దగ్గర్నించి జవాబు వచ్చింది.
“అందుకే నీకు బతకడం తెలీదన్నది. అవకాశం వచ్చినప్పుడు అంది పుచ్చుకోవాలి. ఇలా మెసేజ్ పెట్టేనో లేదో అప్పుడే పదిమంది ఫొటోలూ, డబ్బూ పంపించేసేరు. అన్నీకేబినెట్ సైజులే. అకౌంట్లో పదివేలు పడ్డాయప్పుడే. ఇంక నన్ను డిస్టర్బ్ చెయ్యకు. ఇక్కడ ప్రతి నిమిషం విలువైనదే.”
వదిన మాటలు విన్న నాకు ఈ మనుషుల మనస్తత్వాలేవిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వీళ్ళంతా డబ్బులు పెట్టేసి పుణ్యం కొనుక్కోవాలనుకుంటున్నారా! అసలది సాధ్యమేనా! వదిన ఇలా డబ్బు సంపాదించడం న్యాయమేనా! ఆ దేవుడి పేరు చెప్పి జనాలని మోసం చెయ్యడం కాదా! నాకేంటో తల తిరిగిపోయినట్టైంది. మొదటిసారిగా వదిన మీద కోపం లాంటిది వచ్చింది. అంతే. ఇంక నెల్లాళ్లపాటు వదిన మాటే తల్చుకోకూడదనుకున్నాను. అలాగే ఉన్నాను.
కానీ, కుంభమేళా పూర్తయినప్పట్నించీ వదిన గురించే ఆలోచనలు. ఈపాటికి ఇంటికి వచ్చేసుంటుంది. నాలుగురోజులు రెస్టు కూడా అయిపోయుంటుంది. వదిన ఫోన్ కోసం వెయిట్ చేద్దామా, లేక అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుదామా అనుకుంటున్నాను. ఇంతలో వదినే ఫోన్ చేసింది. వెంటనే ఎత్తేను.
“ఏంటి స్వర్ణా ఫోన్ చెయ్యలేదూ! ఈ వదిన మీద కోపం వచ్చిందా!” అంది.
“కోపమెందుకూ! మా వదిన లక్షలు లక్షలు సంపాదించుకుని వచ్చింది కదా, అవి లెక్కెట్టుకుంటూ బిజీగా ఉండుంటుందని చెయ్యలేదు.”
ఫక్కున నవ్వేసింది వదిన.
“అది సరే కానీ, నీ లెక్కలు తేలేయా.. ఎన్ని లక్షలు తెచ్చేవేవిటీ!” ఎంత దాచుకుందామనుకున్నా గొంతులో ఆతృతని ఆపలేకపోయేను.
“లెక్కపెట్టలేనంత.” అంది వదిన నెమ్మదిగా.
“అదేంటీ!” అన్నాను ఆశ్చర్యంగా.
వదిన నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది.
“స్వర్ణా, అక్కడ మనుషులని చూసి నీకు చెప్పినట్టే ముందు నేనూ అనుకున్నాను. నేను మెసేజ్ పెట్టిన మొదటిరోజే పాతికమంది వరకూ ఫొటోలూ, డబ్బూ పంపించడం చూసి మురిసిపోయేను. ఎంత తెలివైనదాన్నో అనుకుంటూ నన్ను నేనే మెచ్చేసుకున్నాను. కానీ, అక్కడ మరొకరకం మనుషులు కూడా ఉన్నారు స్వర్ణా.”
నేను ఫోన్‌ని చెవికి మరింత దగ్గరగా తెచ్చుకున్నాను. వదిన మాటలు మరింత స్పష్టంగా వినపడుతున్నాయి.
“ఓ రోజు ఇంకా తెల్లవారకుండానే గంగ వైపు వెడుతున్న ఓరోడ్డు మీద సైకిల్‌కి అటూ ఇటూ పాల కేన్లు కట్టుకుని ఒకతను ఆ దారమ్మట వచ్చే పిల్లలకీ, పెద్దలకీ పాలు పోస్తున్నాడు. నేను కూడా వెళ్ళి ఓ పది రూపాయలిచ్చి కప్పు పాలు ఇమ్మన్నాను. అతను పాలు ఇచ్చేడు కానీ డబ్బులు తీసుకోలేదు. ఎందుకనీ అని అడిగితే,
‘అమ్మా, ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి చంటిపిల్లలని కూడా తీసుకుని చాలామంది పవిత్ర స్నానాని కొస్తున్నారు. ఆ పిల్లలకి తాగడానికి కాసిని పాలిస్తే, వాళ్ళు చేసుకున్న పుణ్యంలో నాకూ కొంత వస్తుంది కదమ్మా! డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోగలం. కానీ పుణ్యం మటుకు ఇలాంటప్పుడే కదమ్మా వచ్చేదీ’ అన్నాడు.
ఆ మాటలు నన్ను ఛెళ్ళున చెందెబ్బ కొట్టినట్టనిపించింది. అప్పుడు అక్కడంతా గమనించడం మొదలెట్టేను.
చాలా పెద్ద పెద్ద సంస్థలు అక్కడ ఉచితంగా భోజనాలూ, ఫలహారాలూ ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాలంటీర్లుగా చేస్తున్నారు. గవర్నమెంటు ఏర్పాటు చేసిన ఉద్యోగులు కాకుండా ఇలా స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారక్కడ. ఇన్ని కోట్లమంది వచ్చేసరికి వ్యాపారం చేసుకునేవారితో సమానంగా స్వచ్ఛందంగా ఇంకా ఇంకా చేసేవారు ముందు కొస్తూనే ఉన్నారు. అసలు ఆలోచిస్తే వ్యాపారం చేసే వాళ్లకన్నా ఎక్కువగానే ఈ స్వచ్ఛందంగా సాయం చేసేవాళ్ళే కనిపించేరు. టీలు అమ్ముకునేవాడి దగ్గర్నించీ, పళ్ళు అమ్ముకునేవాడి దగ్గర్నించీ వృధ్ధులకీ, పిల్లలకీ వారి దగ్గరున్నవి ఉచితంగా అందించడమే.
అది చూసిన నాకు నేను చేసే పని సరైనది కాదనిపించింది. అలాగని పుణ్యం కోసం ఫొటోలు పంపుతున్నవారి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోబుధ్ధెయ్యలేదు. అందుకనే ఈ నెల్లాళ్ళూ అక్కడే ఉండి, నాకు మొబైల్లో వచ్చిన ఫొటోలన్నీ ప్రింట్లు తీయించి, వాళ్ళు పంపిన గోత్రనామాలతో ఆ ఫొటోలను సంగమంలో ముంచి, వీడియో తీసి వాళ్లకి పంపించేను. కానీ వాళ్ళు పంపిన డబ్బులు మటుకు తీసుకోలేదు. మళ్ళీ వాళ్లకే పంపించేసేను.
నేను చేసిన పని తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ, సంగమంలో వాళ్ళ గోత్రనామాలతో పవిత్రస్నానం చేసేమన్న భావన మాత్రం వాళ్లలో కలిగించేను. అది చాలు నాకు. ఇప్పుడు చెప్పు, మీ వదిన ఎన్ని లక్షలు సంపాదించిందో!”
నా దృష్టిలో మళ్ళీ వదిన అంతెత్తు ఎదిగిపోయింది.
“లెక్కపెట్టలేనంత పుణ్యం సంపాదించేవు వదినా.” అన్నాను తృప్తిగా.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.