Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాజాల్లాంటి బాజాలు-145: మా వదిన కొత్త బిజినెస్

[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]

మామూలుగానే పొద్దున్నే వదిన ఫోన్. అంత అర్జంటు పనేమిటా అనుకుంటూ ఫోన్ తీసిన నన్ను వదిన అడిగిన ప్రశ్న మతి పోగొట్టింది.

“స్వర్ణా, మీ పిన్ని కూతురు సులేఖ పెళ్ళి ముచ్చట్లు ఏవైనా చెప్తావా!”

పొద్దున్న పొద్దున్నే అష్టావధానం చేస్తున్న నాకు తిక్క రేగింది.

“ఏం.. పేపర్‌లో ఏవైనా వేయిస్తావా!” అనడిగేను కోపంగా.

“ఓహ్.. మంచి వేడి మీద ఉన్నట్లున్నావ్.. ముందు పొయిమీద ఏం పెట్టేవో చూసుకో.. తర్వాత నా మెసేజ్ చూసుకో.” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన.

హమ్మయ్య, తొందరగానే వదిలింది అనుకుంటూ నా దినచర్యలో పడిపోయిన నేను మధ్యాహ్నం పదకొండు దాటేక కానీ వదిన పంపిన మెసేజ్ చూడలేకపోయేను. అది ఇదిగో ఇలా ఉంది.

“స్వర్ణా, మీ పిన్ని కూతురు పెళ్ళిరోజుకి వీడియో చెయ్యమని అడుగుతూ, పెళ్ళినాటి ఫొటోలు కొన్ని పంపింది. నీకు తెలుసో.. తెలీదో.. ఈమధ్య నేను పుట్టినరోజులకీ, పెళ్ళిరోజులకీ కస్టమర్స్ ఇష్టాలు తెల్సుకుని, కస్టమైజ్డ్ వీడియోలు చేద్దామనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే మొదలుపెట్టేను. మొదటిదే సులేఖది చేస్తున్నాను. ఇది బాగా వస్తే ఈ కొత్తరకం బిజినెస్‌లో బోల్డు డబ్బులు. దానికోసం ముందు కస్టమర్స్ గుడ్‌విల్ కావాలి కదా! మీ పిన్ని కూతురు సులేఖ పెళ్ళి విషయాలు నీకు బాగా తెలుస్తాయి కదా, ఆ సంఘటనలు ఆడియోలో చెపుతూ, వీడియో చేద్దామని అనుకుని నీకు ఫోన్ చేసేను.

“ఈ కొత్త బిజినెస్ ఏంటి వదినా! నేనెప్పుడూ వినలేదు.”

“అందుకే అస్తమానం నీకు చెపుతుంటాను అప్డేట్ అవమని. కొత్తగా ఎన్ని రకాల బిజినెస్ లో తెల్సా! ‘ఈ రోజు మీరు ఏమి వండుకోవాలో మేం చెప్తాం!’ అంటూ ఓ రోజు పొద్దున్నే వాట్సప్‌లో ఓ యాడ్ కనపడుతుంది. అది చూడగానే ఆ రోజు ఇంట్లో టొమాటోలు మాత్రమే ఉన్న ఓ ఇల్లాలు వాళ్లకి మెసేజ్ పెడుతుందన్న మాట. ‘ఇలాగ, ఇంట్లో టొమేటోలు మాత్రమే ఉన్నాయీ.. ఏం చెయ్యనూ!’ అంటూ. దానికి వాళ్ళు టొమేటో పప్పు చేసి, ఆ ఉడికిన పై నీళ్ళతో ఘాటుగా చారుపొడి వేసి చారు పెట్టవచ్చనీ, కాస్త మగ్గిన టొమాటో ముక్కలతో, ఉల్లిపాయలు కలిపి వేయించి, మెంతికారంతో రోటి పచ్చడి చెయ్యవచ్చనీ, అవే ఉల్లిపాయలు పోపులో వేసి కాస్త మగ్గేక. టొమేటోలు వేసి కూరపొడి జల్లి, ముద్దకూరలా చెయ్యవచ్చనీ, అలా మగ్గబెట్టిన టొమేటోలు పెరుగులో కలిపి పోపేసి పెరుగు పచ్చడినీ, అదే టొమేటోలు ఉల్లిపాయలూ, గరం మసాలా వేసి టొమాటో బాత్ చెయ్యవచ్చనీ టొమాటోతో చేసే రెసిపీలన్నీ చెప్పేసి, అలా చెప్పినందుకు గూగుల్ పే ఎంత చెయ్యాలో కూడా చెప్పేస్తారు.

వాళ్ళు కూరలు పంపరు.., వండరు.. కానీ కేవలం అవిడియా ఇచ్చినందుకు డబ్బులు తీసుకుంటారన్నమాట. దీన్నిబట్టి నీకేం తెలుస్తోందీ! ఈ ప్రపంచమంతా అవిడియాలతోటే నడుస్తోందని కదా!” అంది వదిన.

“ఏం వండాలో చెప్పినందుకే డబ్బులు కట్టాలా!” ఆశ్చర్యంగా అడిగేను.

“ఇది కేవలం ఉన్న కూర ఎలా ఉపయోగించుకోవాలన్న దానికే. అదే కనక ఏ ఫంక్షన్ అయినా అయితే ఆ ఫంక్షన్‌కి ఏ థీమ్ పెట్టాలో, దానికి ఎటువంటి డ్రెస్సులు కొనాలో, పార్టీకి ఎలాంటి విందు తయారు చెయ్యాలో చెప్పడానికి స్పెషల్ ఫీజ్ కూడా ఉంటుంది.” అంటూ వివరించింది వదిన.

“మరి ఇవన్నీ ఎవరు చేస్తారు!” అని అడిగిన నా ప్రశ్నకి,

“చెయ్యడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. స్వర్ణా, ఈ రోజుల్లో నీ చేతిలో డబ్బులుండాలంతే. నువ్వు ఆలోచించి అలసిపోయే పని లేకుండా, వాళ్ళే ఆలోచించేసి, వాళ్ళే ఆ పనులన్నీ చేసేసి, నిన్ను సంతోషపెట్టేసి, నీ దగ్గర డబ్బులు పట్టుకుపోతారు.”

కాస్త ఆగి మళ్ళీ మొదలెట్టింది వదిన.

“కానీ, ఇక్కడ నా బిజినెస్ వేరు. ఆలోచనా నేనే చేస్తాను, పనీ నేనే చేస్తాను. ఎవరింట్లో పుట్టినరోజైనా, పెళ్ళిరోజైనా, మరే ఇతర శుభకార్యమైనా, దానికి సంబంధించిన సంఘటనలు చెపితే చాలు. వాళ్లకి పెర్సనల్‌గా సరిపోయేలా కస్టమైజెడ్ వీడియో చేసి పంపుతాను. అది పెళ్ళిరోజైతే జీవిత భాగస్వామికి పంపుకోవచ్చు, పుట్టినరోజైతే వాళ్లకి పంపుకోవచ్చు. నువ్వే ఆలోచించు. ఎవరో పెద్దవాళ్ళు రాసిన కొటేషన్ కన్నా, మనకి సంబంధించిన విషయాలు మన గ్రీటింగ్స్‌లో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందీ!”

ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటూ,

“ఇది నువ్వు ఎక్కడ విన్నావు వదినా!” అనడిగేను.

“నేనే ఆలోచించేను. ఇప్పుడంతా పెర్సనలైజెడ్ ట్రెండ్ నడుస్తోంది కదా! కాఫీ మగ్గులమీదా, టిఫిన్ ప్లేట్ల మీదా భార్యాభర్తల బొమ్మలు ప్రింట్ చేయించుకుంటున్నారు. అలాగే పెళ్ళిరోజుకి అప్పటి మధురస్మృతి ఏదైనా తీసుకుని, దానికి సరిపోయే సినిమాపాట పెట్టి, వీడియో చేసి భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ పంపితే మనసెంత నిండిపోతుందీ! ఆ వీడియో పదిమందికీ పంపించుకుని, అందరూ బాగుందంటుంటే ఎంత గొప్పగా ఉంటుందీ! అందుకే సులేఖ అడగగానే సరే నన్నాను.”

“కానీ, సులేఖ పెళ్ళై అప్పుడే ముఫ్ఫైయేళ్ళు దాటాయి. ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడీ రోగ మెందుకొచ్చిందీ దానికీ!”

నా మాటలకి వదిన కోపంగా,

“స్వర్ణా, నా క్లయింట్‌ని ఏవీ అనకు. నేనూరుకోను. ఇదివరకు లేనివి ఇప్పుడు ఎన్ని చేసుకోవటంలేదూ! పిల్లలందరూ అలా చేసుకుంటుంటే సులేఖకి కూడా అలా గ్రీటింగ్ చేసి వీడియో భర్తకి పంపుకోవాలనిపించిందేమో! నీలా కాకుండా తనైనా అప్డేట్ అవుతోంది. అందుకు మెచ్చుకో. ఇంతకీ తన పెళ్ళిలో జరిగిన సరదా విషయాలేమైనా తెల్సా.. తెలీదా.. అది చెప్పు ముందు.” అంది.

నాకూ విసుగులాంటిది వచ్చేసింది.

“సులేఖ పెళ్ళిలో సరదా విషయాలా! వదినా, మర్చిపోకు. తన పెళ్లై ముఫ్ఫైయేళ్ళు దాటింది. అప్పుడు పెళ్ళిళ్ళలో వియ్యాలవాళ్ళిద్దరూ ఆనవాయితీలూ, సాంప్రదాయాలూ అంటూ గొడవ పడడాలే కానీ సరదాగా వేడుకలంటూ జరిగేవా!”

“పోనీ, అవే చెప్పు. నేను వాటిని సరదా విషయాలుగా మార్చేస్తాను.”

వదిన మాటలకి విస్తుపోయేను.

హేవిటీ..వియ్యాలవారి కయ్యాలు సరదాగా మార్చేస్తుందా! సరే, చూద్దాం, ఈ దెబ్బతో వదిన సంగతి తేల్చేద్దాం.. అనుకుంటూ సులేఖ పెళ్ళిలో జరిగిన రెండు మూడు విషయాలు గుర్తు చేసుకున్నాను.

అందులో ఒకటి.. ఎదురుసన్నాహం సమయంలో మగపెళ్ళివారు పానకం బిందెలు స్టీలువి కావాలన్నారుట. సరే నన్నారు ఆడపెళ్ళివారు. కానీ ఆ ఆడపెళ్ళివారికి సలహాలిచ్చే పెద్ద మనిషి, స్టీలు బిందెలంటే ఇనుమూ, అవి ఇవ్వకూడదూ, పుచ్చుకోకూడదూ. అందుకని అవి ఇవ్వొద్దూ అని సలహా ఇచ్చేరుట. అది నిజవేకదా అని, మా పిన్నీ బాబయ్యా ఇత్తడి పానకం బిందెలు కొని వాటిలోనే మగపెళ్ళివారికి ఎదురుసన్నాహంలో పానకం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్ళిమండపానికి రాగానే ఆ ఇత్తడిబిందెలు చూసి మగపెళ్ళివారు మొహం ముడుచుకుని, మేం వెనక్కెళ్ళిపోతాం అన్నారు.

అలాగ ఆ పానకంబిందెల దగ్గరే ఆ తగువులాట. ఓ రెండుగంటలపాటు సాగేక మధ్యవర్తులెవరో చెప్పడం వల్ల, స్టీలుబిందెలు కొనుక్కుందుకు మళ్ళీ డబ్బు లిస్తామని మా బాబయ్య ఒప్పుకున్నాక మగపెళ్ళివారు దిగొచ్చేరు.

రెండోది మరీ విడ్డూరం..

పెళ్ళయిపోయేక కొత్త దంపతులిద్దరూ లాజహోమం చేసేరు. అది పూర్తయింది. ఇంక మంగళహారతి ఇచ్చి, ఆ కార్యక్రమం ముగించాలి. పాపం అప్పటికే సుమారు నాలుగ్గంటలనించీ పెళ్ళిమంత్రాలూ, హోమాలతో అలసిపోయి ఉన్న నవ దంపతు లిద్దరూ ఎప్పుడు ఇదంతా ముగుస్తుందా అని చూస్తున్నారు. సరేనంటూ మంగళహారతి ఇవ్వడానికి నేనూ, మా పద్మక్కా పళ్ళెం పట్టుకుని వచ్చేం. కానీ మగపెళ్ళివారిలో ఓ పెద్దాయన దంపతు లిద్దరికీ పెళ్ళికూతురి తండ్రి బట్టలు పెడితే కానీ, మంగళహారతి ఇవ్వకూడదని అడ్డుపడ్డారు. సరేనని మా బాబయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెపితే, ఈ వైపు పెద్దమనిషి ఒకాయన, ఇప్పుడు మనం బట్టలు పెట్టకూడదూ అన్నారు. వాళ్ళేమో బట్టలు పెట్టందే హారతి ఇవ్వొద్దంటారు.. వీళ్ళేమో ఇప్పుడు మాలో బట్టలు పెట్టే ఆచారం లేదంటారు. అలా చెప్పిన పెద్దమనుషు లిద్దరూ ఆ మాటలు చెప్పేసి పక్క గదిలోకీ వెళ్ళిపోయి కాఫీలు తాగేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

ఆ పెద్ద మనుషుల మాట కాదనలేని మా బాబయ్య, ఆయన వియ్యంకుడూ ఏమీ చెప్పలేక, చెయ్యలేక అక్కడినుంచి నెమ్మదిగా జారుకున్నారు. పెళ్ళికొడుకు తల్లి మాత్రం పెద్దమనిషి చెప్పినట్టు చేసి తీరాలని భీష్మించుకుని కూర్చుంది. మా పిన్ని ఏం చెయ్యాలో తెలీక బిక్కచూపులు చూడ్డం మొదలెట్టింది. మంగళహారతి పళ్ళెం పట్టుకున్న నేనూ, మా పద్మక్క ఆ పళ్ళాన్నికింద పెట్టాలో, లేక అలా చేతిలోనే పట్టుకు నిలబడాలో తెలీక బొమ్మల్లా ఉండిపోయేం.

మా సంగతి సరే, పాపం ఆ పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ.. అప్పటికే అయిదారు గంటలనించీ అలా పూజలూ, హోమాలూ చేస్తూ ఉన్నారేమో.. అలా పీటలమీదే వేళ్ళాడ పడిపోతున్నారు. ఎటువైపునించీ ఎవరూ మాట్లాడరూ. ఏం చెయ్యాలో తెలీదు.

అలా అరగంట పైన గడిచేక ఇంక ఆ సన్నని పీటలమీద కూర్చోలేక అవస్థ పడుతున్న సులేఖ నన్ను దగ్గరికి పిల్చి, “అమ్మమ్మని రమ్మని చెప్పవే” అంది.

అప్పుడు నాకు తోచింది. అవును కదా! అమ్మమ్మ ఈ పెద్దమనుషు లనబడే వాళ్లందరి కన్నా పెద్దది. పైగా మంచి అజమాయిషీ చేసే మనిషి. వెంటనే వెళ్ళి అమ్మమ్మకి విషయం చెప్పి వెంటబెట్టుకొచ్చేను.

అమ్మమ్మ క్షణంలో పరిష్కారం చెప్పేసింది. పెళ్ళిళ్ళలో మగపెళ్ళివారి ఆనవాయితీయే పాటించాలి అంటూ నూతన దంపతు లిద్దరికీ కన్యాదాత చేత కొత్తబట్టలు పెట్టించి, దగ్గరుండి మాచేత మంగళహారతి ఇప్పించి, వాళ్లని పీటలమీంచి లేపింది.

సులేఖ పెళ్ళిలో జరిగిన ఈ రెండు సంఘటనలూ వదినకి చెప్పేను. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో ఫొటోలే తప్పితే వీడియోలు లేవు. వీటిని వదిన వీడియోలో సరదాగా ఎలా జొప్పిస్తుందా అనుకున్న నాకు మర్నాడు వదిన పంపిన వీడియో చూసి మతిపోయింది.

సులేఖ పెళ్ళిలో ఎదురుసన్నాహం నించీ అప్పగింతలవరకూ తీసిన ఫొటోలన్నీ వరసగా పెడుతూ, బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెళ్ళిరోజు సినిమాలోని ‘పెళ్ళివారమండీ, ఆడపెళ్ళివారమండీ. మా బాధ వినేదెవరండీ.. పెళ్ళివారమండీ, మగ పెళ్ళివారమండీ.. మా పాట్లు వినేదెవరండీ..’ అనే పల్లవి పెట్టి తర్వాత చరణాలన్నీ మార్చేసి, ఎవరిచేతో పాడించేసి, ఆ పాట పెట్టేసింది. ఆ పాట వెనకాల వినిపిస్తూ మొత్తం వీడియో చేసేసింది వదిన.

ఆ పాట ఇదిగో ఇలా ఉంది..

చరణం.

స్టీలు బిందెలు ఇమ్మంటే ఇత్తడి బిందెలు తెచ్చారూ।పెళ్ళివారమండీ మగ పెళ్ళివారమండీ।

ఇత్తడి బిందెలె శ్రేష్టమూ.. ఇనుము మేమూ ఇవ్వమూ। పెళ్ళివారమండీ ఆడ పెళ్ళివారమండీ।

అన్న చరణానికి ఇత్తడి బిందెలముందు వరసగా కూర్చున్న వియ్యాలవారి ఫొటో పెట్టింది.

చరణం.

పీటలమీద బట్టలు పెట్టని పిసినార్లు మా కొద్దండీ। పెళ్ళివారమండీ మగ పెళ్ళివారమండీ।

కావాలంటే పట్టుబట్టలే పెట్టే సత్తా ఉందండీ। పెళ్ళివారమండీ ఆడ పెళ్ళివారమండీ।

అనే చరణానికి వేళ్ళాడిపోతూ పీటలమీద నీరసంగా కూర్చున్న పెళ్ళికొడుకూ, పెళ్ళికూతుళ్ల ఫొటోలు పెట్టింది.

ఈ వీడియో కనక సులేఖ పెళ్ళిరోజు గ్రీటింగ్స్ అంటూ వాళ్ళాయనకి పంపితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకుందుకే భయమేసింది.

ఈ లోపల వదిన దగ్గర్నించి మెసేజ్.. ‘ఎలా ఉంది వీడియో! నా బిజినెస్ బాగుంటుందంటావా!’ అని.

వదిన అడిగిన ప్రశ్నకి ఏవని జవాబివ్వాలో తెలీలేదు. మీరేమైనా చెప్పగలరా!..

Exit mobile version