Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్తవ్యనిష్ఠకు మారుపేరు మా రామా మాస్టారు

[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు గారి గురించి వివరిస్తున్నారు శ్రీ మల్లాప్రగడ రామారావు.]

యన ‘రామా మాస్టారు’ అనే అందరికీ తెలుసు. ఆయన గురించి చెప్పాల్సి వస్తే అలాగే చెప్పేవాళ్ళు. కొద్దిమందికే తెలిసిన వారి అసలు పేరు శ్రీ వడ్డి సత్యనారాయణ. వారికి మాత్రం తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థుల శ్రేయస్సు ఒక్కటే తెలుసు.

బాధ్యతలు తెలియని తమ్ముడు కారణంగా వారి కుటుంబ భారమూ తానే భరిస్తున్నా, ఒకరి తర్వాత ఒకరు పుట్టిన బిడ్డలు పురిటిలోనే మరణిస్తున్నా, దక్కిన ఒక్కడూ అంత చురుకువాడు కాకపోయినా, బోదకాలు కారణంగా అవస్థ పడుతున్నా, వారి దృష్టి యావత్తూ తన వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులను తీర్చిదిద్దడం పైనే.

వారి వద్ద శిక్షణ పొందిన వారిలో మెరికల్లాంటి వారికి కొందరికి ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు రావడానికి కూడా మాస్టారు కారణభూతులయ్యారు. రామా ఇన్‌స్టిట్యూట్‌లో టైపు రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారంటే అంత మదింపు ఉండేది.

రామా టైప్ ఇన్‌స్టిట్యూట్‌ బీజం వారు అప్పట్లో విశాఖపట్నం చెంగల్రావు పేటలో ఉండే ఇంటి వీధి వైపు అరుగు మీద కొందరికి టైపు నేర్పడంతో ప్రారంభమైంది.

“పొద్దస్తమానo, పొద్దు పోయిన తర్వాత కూడా శ్రమ పడుతుంటే నాకు క్షయ రోగం వచ్చి ఛస్తాననుకునేవారండి” అని ఒకసారి మాస్టారే నాతో అన్నారు.

అయితే వారి దృష్టిలో నేను పడడం మాత్రం ఒక అపార్థం కారణంగా జరిగింది.

నేను ఆ ఇన్‌స్టిట్యూట్‌లో 1966 చివర్లో చేరేసరికి అది హిందూ రీడింగ్ రూమ్ ప్రక్కన ఉన్న ఒక మేడ పై భాగంలో ఉండేది. ముందు ఉన్న పెద్ద హాల్లో టైప్ రైటింగ్ శిక్షణ, వెనుక ఉన్న చిన్న గదిలో షార్ట్ హ్యాండ్ శిక్షణ జరిగేవి.

అప్పటికి నేను టైప్ రైటింగ్ మాత్రమే నేర్చుకుంటున్నాను. ఒక ఉదయం టైప్ చేస్తున్న నా భుజం మీద చిన్న దెబ్బ పడింది. వెనక్కి చూస్తే మాస్టారు. వారి చేతిలో కర్రలా చుట్టిన వార్తాపత్రిక (కాబోలు) ఉంది. నాకేమీ అర్థం కాలేదు.

కొంచెం కోపంగా “‘ఫిబ్రవరి’ స్పెల్లింగ్ కూడా రాదా? తప్పులు లేకుండా టైప్ చేయడం నేర్చుకోండి” అని మందలించారు. టైప్ చేస్తున్న కాగితం చూస్తే నా తప్పు బోధపడింది. “ఇంత మాత్రానికే దెబ్బ వేస్తారా” అని మండుకొచ్చింది. ఎప్పుడూ ఏ ఉపాధ్యాయుడి చేతా దెబ్బ కాదు కదా, చివాట్లు కూడా తిని ఉండలేదు నేను. ఐతే, చేరిన కొత్త. పైగా మాస్టారు గురించి అందరూ మంచిగా చెప్పుకోవడం అప్పటికే విని ఉన్నాను. అందుకని సరి పెట్టుకున్నాను.

మరుసటి రోజు మాస్టారే నేనున్న చోటుకు వచ్చి, “సారీ అండి. నిన్న పొరపాటయింది” అన్నారు. ఎందుకలా అన్నారో తర్వాత మాస్టారి సహాయకుడు శ్రీరామ్మూర్తి గారు చెప్పగా తెలిసింది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో అప్పుడు నాలాగే నాకు వరుసకు సోదరుడు మల్లాప్రగడ విజయ భాస్కర రామారావు టైప్ నేర్చుకుంటున్నారు. వారూ విశాఖ రేవులోనే పనిచేసేవారు. అతనేదో తుంటరి పని చేస్తే, శ్రీరామ్మూర్తి గారు ఫిర్యాదు చేసారు. మాస్టారు ‘ఆ రామారావే, ఈ రామారావు’ అనుకున్నారు.

“ఆయన ఎంతో బుద్ధిమంతుడండి.” అని నా గురించి మాస్టారికి శ్రీరామమూర్తి గారు చెప్పారు. అది మొదలు, నన్ను ఆప్యాయంగా చూసేవారు మాస్టారు. నాపట్ల క్రమేపీ వారికి పుత్ర వాత్సల్యం ఏర్పడింది.

ఎందరో యువతీ యువకులం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నా, ఎవరూ హద్దు మీరని క్రమశిక్షణ సాధ్యం చేసారు మాస్టారు.

మళ్ళీ నా విషయానికొస్తే, నేను జీవితంలో రెండు పరీక్షలలోనే విఫలమయ్యాను. ఒకటి ఎన్.సి.సి. ‘బి’ సర్టిఫికెట్ పరీక్ష. రెండవది టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష. కష్టపడి లోయర్ గ్రేడ్ పరీక్షలో నెగ్గుకొచ్చాను కానీ, హయ్యర్ గ్రేడ్ పరీక్ష నావల్ల కాలేదు. కారణం నాకు టైప్ రైటింగ్ లో ‘బ్లైండ్ టచ్’ ( కీబోర్డ్ మీద అక్షరాలు చూడకుండా టైప్ చేయడం) లేకపోవడమే. అందుకని రెండోసారి పరీక్షకు సిద్ధమవదలచుకోలేదు. షార్ట్ హ్యాండ్ మాత్రం కొనసాగించాను.

ఏదో ముఖ్యమైన పండుగ రోజు. ఏ పండుగో గుర్తులేదు. అలా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, పెద్ద పండుగలు వస్తే తప్ప మాస్టారు ఇన్‌స్టిట్యూట్‌కి సెలవు ప్రకటించేవారు కారు‌. వారాంతపు సెలవుల ప్రసక్తే లేదు. ఉదయాన్నే మాస్టారు చంగలరావుపేట లోని ఒక ఇరుకు సందులోని ఉన్న మా ఒకటిన్నర గదుల అద్దె వాటాలో ప్రత్యక్షమయ్యారు. నేను విస్తుపోయాను. మాస్టారికి  ఇన్‌స్టిట్యూటే లోకం. వారిని గురించి తెలిసిన వారందరికీ ఇది తెలిసిన విషయమే. తప్పనిసరైతే తప్ప దగ్గరి బంధువుల ఇళ్లకు కూడా వెళ్లేవారు కాదు.

ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలో కూర్చున్న మాస్టారు సూటిగా విషయానికి వచ్చారు. “మీ హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజ్ నేను కట్టేసాను. మీకిష్టమైతే మళ్లీ ఇన్‌స్టిట్యూట్‌ కి వచ్చి టైప్ రైటింగ్ నేర్చుకోండి”.

నేర్చుకున్నాను.

కానీ మళ్ళీ పరీక్ష తప్పాను. బహుశా అదే మొదటిసారేమో మాస్టారి శిక్షణలో ఒక విద్యార్థి టైప్ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోవడం. కానీ, మాస్టారు బాగా సంతోషపడడానికి కూడా నేనే కారణమయ్యాను. ఎలాగంటే..

ముందే చెప్పినట్టు టైప్ రైటింగ్ లోయర్ ఉత్తీర్ణుడనయ్యాను. షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఫలితం మాత్రం నిలిపివేసి, నాకొక తాఖీదు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ‌ సాంకేతిక విద్యా విభాగం వారు. “ఇంతవరకు ఎవరూ నూటికి నూరు శాతం, యధాతథంగా పరీక్షకుడు చెప్పినదంతా (dictation), పేరా విభజన సహా, టైప్ చేసినవారు లేరు. అదీ కాక మీరు షార్ట్‌హ్యాండ్‌లో రాసుకున్న స్ట్రోక్స్ పిట్ మ్యాన్స్ షార్ట్‌హ్యాండ్ స్ట్రోక్స్‌కి భిన్నంగా ఉన్నాయి. మీరు తప్పక అక్రమాలకు పాల్పడి ఉంటారు. మీ పరీక్ష ఫలితం ఎందుకు రద్దు చేయవద్దో తెలియపరచండి.”

ఆ తాఖీదు చదివిన మాస్టారు తద్వారా తమ ఇన్‌స్టిట్యూట్‌కి దక్కిన ఘనతకు సంతోషించేవుంటారు.

దగ్గరుండి నాతో సమాధానం తయారు చేయించారు. నేను పట్టభద్రుడునని, ఆంగ్ల భాష పై కొంత పట్టు ఉందని, ‘హిందూ’ దినపత్రిక క్రమం తప్పకుండా చదువుతానని, దానికి తోడు కొన్ని ఆంగ్ల పదాలు, వాటికి షార్ట్‌హాండ్ స్ట్రోక్స్ జత చేయమన్నారు. అలాగే చేసాను. శ్రమపడి పిట్మాన్స్ పాఠాలనే అనుసరించాను. “కొంప ముంచారు. రామారావ్స్ షార్ట్‌హ్యాండ్ స్ట్రోక్స్ వాడండి” అని ఆదేశించారు. కథ సుఖాంతం అయింది. ఫలితం ప్రకటించారు.

1978 లోనే నేను విశాఖకు దూరమయ్యాను. మధ్య మధ్యలో విశాఖపట్నం వచ్చి రెండు మూడు రోజులున్నా మాస్టారిని కలిసే ప్రయత్నం చెయ్యలేదు.‌ ఇప్పుడు విచారిస్తున్నాను. గత జల సేతు బంధనం.

ఒకసారి మాత్రం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అన్నవరం నుంచి విశాఖపట్నం వరకు కలిసి ప్రయాణం చేశాము. అప్పటికి నేను విశాఖ రేవులో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం వదిలి కేంద్ర కార్మిక విద్యాసంస్థలో విద్యాధికారిగా పనిచేస్తున్నాను. మాస్టారు ఎంతో సంతోషించారు.

మాస్టారు 15-5-1989 న విశాఖపట్నంలో మరణించారు. అప్పటికి కార్మిక రాజ్య బీమా సంస్థలో చేరడం వల్ల నా మకాం చెన్నైకి మారింది. ఆ వార్త ఎప్పటికో‌ తెలిసింది.

కీ.శే. శ్రీ వడ్డి సత్యనారాయణ, శ్రీమతి వీరలక్ష్మి

కానీ, నాలాంటి ఎందరో వారి విద్యార్థుల హృదయాలలో మా రామా మాస్టా‌రు చిరంజీవిగానే ఉన్నారు.

గుండె పట్టేసే విషయం చెప్పి ముగిస్తాను.

ఒక ఉదయం మాకు షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ ఇస్తున్న మాస్టారు మధ్యలో ఆపేసి, కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ముందు హాల్లోకి వెళ్లిపోయారు. శ్రీరామ్మూర్తి గారు వచ్చి “ఇవాళ డిక్టేషన్ లేదు. నిన్న రాత్రి మాస్టారు గారి భార్య ప్రసవించారు. బిడ్డ దక్కలేదు. ఉదయాన్నే కన్నకొడుకుని పాతిపెట్టి, మీకు పరీక్షలు దగ్గరవుతున్నాయని సరాసరి విజయనగరం నుండి ఇక్కడికి వచ్చేసారు.”

అందరం నిర్ఘాంత పోయాం. అలాంటి మాస్టారుని మళ్ళీ చూడలేదు.

వారి నుంచి నేను నేర్చుకున్నదేమైనా ఉంటే, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కాక, అది అంకితభావంతో వృత్తి ధర్మం నిర్వహించడం.

గురుభ్యోనమః

Exit mobile version