[తమ మిత్రులు జరిపిన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనుభవాలను అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
మిత్రుడు మల్చూరు విజయభాస్కరెడ్డి గారికి ఇప్పుడు 74 ఏళ్ళ వయసు. వయసుదేముంది? ఆయన అవిశ్రాంత, నిరంతర యాత్రికులు. పాతికేళ్ళ వయసువారి ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది. గత పదేళ్లలో మన దేశంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగి చూచారు. చూసిన ప్రదేశాలనే మళ్ళీ మళ్ళీ చూశారు. ఈశాన్య భారతం అంటే చాలా ఇష్టం.
విజయభాస్కరరెడ్డి మిత్రులు, వృత్తి ఫోటోగ్రాఫర్ (Professional Photographer) అయిన శ్రీ కమలాకర్ ఇటీవల ఒక assignment పని మీద ఒక మిత్రుడితో కలిసి అస్సాం వెళ్ళారు. రెండు రోజుల తర్వాత అతని సహచరుడు అత్యవసరంగా వెళ్ళిపోవలసి వచ్చింది. కమలాకర్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి “మీరు గౌహాటికి (Guwahati) రాగలరా?” అని అడిగారు. ఇంకేముంది? వెంటనే గౌహటి (Guwahati) వెళ్ళే రైలెక్కి రెండు రోజుల తర్వాత గౌహటి (Guwahati) స్టేషన్‌లో దిగారు. స్టేషన్‌కి వద్ద కమలాకర్ తన కారుతో విజయభాస్కరరెడ్డిని రిసీవ్ చేసుకొని హోటల్‍కు తీసుకొని వెళ్ళారు. ఫిబ్రవరి 4, 5 తారీకుల్లో విజయభాస్కరరెడ్డి ప్రయాణపు బడలికతో విశ్రాంతిగా వుంటే, కమలాకర్ తన ఫోటోగ్రఫి పనుల మీద వెళ్ళిపోయి, 5వ తేదీ రాత్రికి హోటల్‍కు వచ్చారు.
6వ తేదీ ఉదయం కమలాకర్ కారులో శివసాగర్‍కు బయలుదేరారు. రెండు గంటల కారు ప్రయాణం తర్వాత, ఆ దారిలో ఖజిరంగా జాతీయ వన్యమృగ అభయారణ్యం వచ్చింది. పార్కులో ఏనుగు మీద సవారీ అయి తిరిగి చూడచ్చు లేదా ఇతర పర్యాటకులతో కలిసి జీపులో ఆ అభయారణ్యం అంతా తిరిగి చూడొచ్చు. విజయభాస్కరరెడ్డి, ఆయన మిత్రులు జీపులో పార్క్ అంతా తిరిగి చూశారు. ఖడ్గమృగాలు పచ్చిక బయళ్ళలో మేస్తూంటే కంచె వద్దకు వెళ్ళి ‘వ్యూ పాయింట్’ నుంచి చూడొచ్చు. ఇదొక అపూర్వ అనుభవం. ఈ అభయారణ్యంలో ముందుకు వంగి గూనిలాగా అనిపించే దుప్పులు (Hog dears) కూడా ఉన్నాయి. ఈ పార్కులో చాలా జీవ వైవిధ్యం ఉంది. పెలికాన్లు, బట్టమేకలు వంటి అరుదైన పక్షులను కూడా ఈ పార్కులో సంరక్షిస్తున్నారు.
ఆ రాత్రి జోర్హాట్ టౌన్ హోటల్లో వుండి తెల్లవారి కారులో శివసాగర్‍కు బయలుదేరారు. కమలాకర్‍తో వుంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన కాస్తంత జ్ఞానం సంపాదించుకోవచ్చనే ఆలోచన కూడా విజయభాస్కరరెడ్డికి ఉంది. అస్సాంలో రోడ్లు ఒక మోస్తరుగా ఉన్నాయి, రోడ్డు రిపేరు జరుగుతున్న ప్రతిచోటా, ఆ మార్గంలో ఎన్ని గంటల నుంచి వాహనాలను అనుమతిస్తారు, అనుమతించని సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు రాసి పెట్టిన బోర్డులు రిపేర్లు జరుగుతున్న చోట పెట్టి ఉన్నందుకు టూరిస్టులు సంతోషిస్తారు.
8, 9 తేదీల్లో ఉదయం పదికల్లా శివసాగర్ టౌనుకు చేరి, నేరుగా రంగ్ ఘర్ చూడడానికి బయలుదేరారు. పది నిమిషాల ప్రయాణం.
రంగ్ ఘర్:
అస్సాం పాలకులు అహోమ్ రాజుల క్రీడావినోదాల కోసం విశాలమైన మైదానం, ఆ మైదానంలో ఒక పక్కన రాజభవనమని భ్రమ కలిగేంత రెండంతస్థులు పెద్ద భవనం – భవనం మొత్తం ఎర్రటి ఇటుకరాయితో నిర్మించబడింది. ప్రభువులు ఆ భవనంలో కూర్చుని మల్ల యుద్ధాలు, కత్తియుద్ధాలు వంటి ప్రదర్శనలు తిలకించేవారట!
ఈ భవనానికి ఒక వైపు మెట్ల దారి- ప్రవేశద్వారం నుంచి లోపల కూడా చూడవచ్చు. కమలాకర్‌కు ఎంత సంతోషమో! క్షణం వృథా చేయకుండా ఫొటోగ్రఫిలో నిమగ్నమయ్యారు.
రంగ్ ఘర్ నుంచి బయటపడే సరికి పొద్దువాలిపోయింది. అస్సాంలో మనకన్నా ముందే సూర్యాస్తమయం అవుతుంది. ఒక హోటల్లో నాలుగు మెతుకులు తిన్నామనిపించి, తమ హోమ్ స్టే అతిథి గృహం ‘తలాతల్’ కు వచ్చి పడకల మీద వాలిపోయారు. ‘తలాతల్’ అతిథిగృహం చాలా సౌకర్యంగా ఉంది, మనిషికి 1200 రూపాయలు తీసుకున్నారు.
తలాతల్ ఘర్:
8వ తేది ఉదయమే తలాతల్ ఘర్‍కు బయలుదేరారు. కారులో పోతే పది నిమిషాలు పడుతుంది. ఇక్కడ 18వ శతాబ్ది నాటి రాజులకు, సైనికులకు నివాసానికి అవసరమైన రాజ భవనాలు, సైనికుల నివాసాలకు పనికొచ్చే గృహాలు నిర్మించారు.
రాజభవనం, ఇతర భవనాలు చాలా పెద్దవి కాని, శిథిలావస్థకు చేరాయి. ఆ సమీపంలో జలసాగర్ వద్ద విష్ణు డోల్, శివ డోల్, దేవ డోల్ ఆలయాలున్నాయి.
ఉదయమే అహోమ్ రాజభవన సందర్శనకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆ రాజుల రుద్రభూమి.. సమాధులున్న Charai అనే చోటికి వెళ్ళారు. ఇది చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రదేశమట! యునెస్కో ఈ సమాధులను world heritage site గా గుర్తించింది. మట్టి గుట్టల కింద పార్థివదేహాలను (శవాలను) పూడ్చిపెట్టి, ఆపైన గుట్టలపైన సమాధులు నిర్మించారు. విశాలమైన పచ్చని పచ్చిక మైదానంలో ఈ సమాధులున్నాయి. దాన్ని ఏదో పెద్ద పచ్చిక బయలు లాగా, ఉద్యానవనం లాగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సమాధులు ‘అస్సాం పిరమిడ్లు’ అని ప్రసిద్ధి చెందాయి.
తర్వాత Namphake బౌద్ధ సన్యాసుల మఠం (monastery) చూడాలని బయల్దేరారు. ఆ దారిలో NAR KHOTIA రైలుస్టేషన్‌కు పోయి, రైలు దిగి తమ కోసం వేచివున్న మిత్రులు ప్రవీణ్, జాఫర్ జాక్ లను తోడ్కొని (Receive చేసుకొని) మొనాస్టరీని చూడడానికి వెళ్ళారు. అప్పటికే భోజనం టైం దాటిపోయింది. మఠం లోని సన్యాసులు వీళ్ళు భోజనం చేయలేదని గ్రహించి సాదరంగా భోజనం పెట్టి పంపించారు.
శివ డోల్ ఆలయ సముదాయం:
శివసాగర్ పేరుతో పిలవబడుతున్న చిన్న టౌన్ పర్యాటకులంతా తప్పకుండా చూచి ఆనందించే ప్రదేశం. ఒకప్పుడు అస్సాంను పరిపాలించిన ‘అహోమ్’ రాజవంశం వారికి ఇది ముఖ్య పట్టణం. అహోమ్ రాజుల మూలాలు చైనా దక్షిణ భాగంలో ఉన్నాయని అంటారు. శివసాగర్ నుంచి 15 మైళ్ళ దూరంలో CHARAIDEO అనే ప్రదేశంలో అహోమ్ రాజులు రాజధాని నిర్మించుకొన్నారట! ఈ పాలకులు మహాయాన బౌద్ధ మతాన్ని అనుసరించేవారు. ఇంగ్లీషువాళ్ళు మనదేశంలో ప్రవేశించిన కాలంలో అహోమ్ రాజులు రాజధానిని ఇప్పటి శివసాగర్‍కు తరలించి, క్రమంగా హిందూ మతాన్ని అనుసరించారు. 19వ శతాబ్దంలో శివసాగర్‌లో ఒక సరస్సు, శివాలయం, దుర్గ గుడి, విష్ణువుకు గుడి నిర్మించారు.
డోల్ అంటే శివాలయం, ఎర్రని ఇటుకలతో ఈ గుళ్ళను నిర్మించారు. శివ డోల్ గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది. శివాలయం వెలుపలి ప్రాకారం మీద శిల్పాలు చెక్కించారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం నాడు పెద్ద ఎత్తున జాతర (తిరునాళ్ళు) జరుగుతుంది, అస్సాం అన్ని ప్రాతాల నుంచి ఈ జాతర చూడను గుడికూడుతారు. ఆయా పండుగల్లో విష్ణు ఆలయంలో కూడా పూజలు, ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడి విష్ణు ఆలయాన్ని ‘జయ డోల్’ అంటారు. దుర్గ గుడి తకదేవి డోల్ పూరిపాక ఆకారంలో కట్టబడింది. ఇది రెండు అంతస్తులుగా కట్టబడింది. ఈ గుడి ప్రాకారం మీద కూడా అనేక దేవతా విగ్రహాలు – ఉబ్బెత్తు శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ 350 సంవత్సరాల క్రితం కట్టినవని తెలిసింది. విజయభాస్కరరెడ్డి, కమలాకర్ జట్టులోని ఆరోజు చేరిన ఇద్దరిలో Mr. Jasper Jack వృత్తి పర్యాటకుల వెంట వుండి చూపించడం. అతను విజయభాస్కరరెడ్డి ఈశాన్యరాష్ట్ర పర్యటనల్లో ఏర్పాట్లు చేసేవాడు. మరో వ్యక్తి ప్రవీణ్ ప్రధాన్ పూర్వం విజయభాస్కరరెడ్డితో కలిసి తిరిగాడు. అతను నేపాలీ. అప్పుడు అతను కూడా అస్సాంలో ఉన్నాడు, వచ్చి విజయభాస్కరరెడ్డి బృందంతో కలిశాడు.
10వ తేదీ నలుగురూ కలిసి కారు అద్దెకు తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తిరాప్ జిల్లాలోని KHONSA కు బయల్దేరారు.
కోన్సాలో హోమ్ స్టే లో దిగారు కాని, అక్కడ భోజనం ఏర్పాట్లు లేవు. ఈ బృందంలోని జాక్ బజారుకు వెళ్ళి వంటకు అవసరమైన వంటసామాన్లన్నీ తెచ్చి అద్భుతంగా వండి భోజనం వడ్డించారు.
11వ తేది దాదం (Dadam), లాహో అనే రెండు పల్లెలకు వెళ్ళి అక్కడి జీవనవిధానం పరిశీలించారు. ఈ పల్లెల్లో NOCTE అనే ఆదివాసి ప్రజల జీవితం చూచే అవకాశం లభించింది.
12వ తేది లాహో గ్రామం నుంది allo కు వెళ్ళి ఆదివాసులు జరుపుకుంటున్న జాతర – tribal festivel చూచి అందులో పాల్గొన్నారు. ఆదివాసీల వంటకాలు రుచి చూసే అవకాశం కలిగింది.
13వ తేది Thinsa అనే ఆదివాసి పల్లెలో కటాంగ్ పుట్సా అనే ఆదివాసీలను కలిశారు. ఆ రోజే keti అనే మరొక పల్లెకు వెళ్ళి కొంతసేపు గడిపారు. కేతి లోనే రాత్రి విశ్రమించారు.
14వ తేదీ వాకా పల్లెకు బయల్దేరి వెళ్ళారు. దారిలో Tisu కూడలి వద్ద ఎడమ వైపున్న రోడ్డులో Ngine గ్రామం మీదుగా వెళ్ళారు. Wakka పల్లె నుంచి, Kamhua Noknu గ్రామానికి వెళ్ళారు. అక్కడ స్థానిక పాఠశాల అధ్యాపకులను, విద్యార్థులును కలుసుకొన్నారు. స్థానిక ఆదివాసి భాష రాయడానికి వాళ్ళు తయారు చేసుకొన్న లిపిని పాఠశాల మాస్టర్లు చూపించారు. ఆ రాత్రి ఒక హోమ్ స్టే లో తలదాచుకున్నారు. లాంగ్‍డింగ్ దాటిన తర్వాత రోడ్లు అంత బాగా లేవు, కారు ప్రయాణం బాధాకరంగా అనిపించింది.
15వ తేది కామ్‍హువా నోక్ను రాజభవనం చూచారు. అస్సాం లోని ఇతర రాజభవనాలతో పోల్చితే ఈ భవనం చాలా పొడవుగా ఉన్నట్లనిపించింది. ఇక్కడ హోమ్ స్టే నడుపుతున్న మహిళతో ఫొటోలు తీసుకొన్నారు.
అక్కడి నుంచి మయన్మార్ సరిహద్దులో ఉన్న చివరి పల్లె Jagan (జగన్) అనే కుగ్రామం చూచి వచ్చారు. ఇక్కడి పల్లెలన్నీ చాలా చిన్నవి, అతి తక్కువ జనాభా. హోమ్ స్టే యజమానురాలు సమీపంలో ఉన్న తన పల్లెకు ఈబృందాన్ని వెంట పెట్టుకొని పోయి చూపించింది.
16 న ఈ బృందం Longding లో జరుగుతున్న గ్రామీణుల జాతర చూడడానికి వెళ్ళారు. Wancho ఆదివాసీలు ఏటా ఘనంగా జరుపుకొనే జాతర అని తెలిసింది. pat-kai Hill ప్రాంతాల ఆదివాసీలు ఈ జాతర జరుపుతారు, వసంతాగమనానికి స్వాగతం పలుకుతూ. ఈ జాతర ముఖ్యంగా రకరకాల ఆదివాసీ తెగల మధ్య సమైక్యత, సౌభ్రాతృత్వం, శాంతి కోరుకొంటూ, వాంఛూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోడానికి జరుపుతారు. గ్రామీణులంతా అక్కడ చేరి నృత్యాలు, పాలులు, ఆటలు, ఆయుధాలతో ప్రదర్శనలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. మన దేశం నుంచే కాక కొందరు విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్ (సంబరాలను) చూడడానికి అక్కడ చేరారు. 1975 నుండి ఏటా ఫిబ్రవరి 16 న లాంగ్‌డింగ్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది ఆ రోజు రద్దీ వల్ల లాంగ్‍డింగ్‌లో హోటల్ దొరకక ఈ బృందం కామ్‍హువా నోక్నోలో హాం స్టే లో ఉండవలసివచ్చింది. హోమ్ స్టే యజమానురాలు వీళ్ళను తన అత్తగారి పల్లెకు తీసుకొని వెళ్ళింది. కారులో 2 గంటల ప్రయాణం, ఆదివాసీల పల్లె, అంతా కలిపి వంద ఇళ్ళకు మించి వుండవు.
ఫిబ్రవరి 18 రాత్రి, అరుణాచల ప్రదేశ్ లోని శిలాపత్థర్ అనే ఊళ్లో ఉన్నారు. ఉదయం అక్కడ నుంచి మేచుక టౌన్‍కు వెళ్ళారు. మేచుకను మెన్‍చ్చుక అని కూడా అంటారు. మేచుక హిమాలయాల ఒడిలో సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. ఇటీవల కాలంలో మేచుకకు టూరిస్టుల తాకిడి బాగా అధికమైంది. ట్రెకింగ్ చేసేవాళ్ళు, ఇండియా టిబెట్ బోర్డరు వద్దకు వెళ్ళేవాళ్లు రకరకాల పర్యాటకులుంటారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 3,4 గిరిజన భాషలతో పాటు, హిందీ ఇంగ్లీషు వాడుకలో ఉన్నాయి. విమాన మార్గంతో పాటు, గౌహటి (Guwahati) నుంచి అరుణాచల్ ప్రదేశ్‍కు భూమార్గం కూడా ఉంది, సుమారు 12 గంటల ప్రయాణం.
18వ తేది దిబ్రూగర్ నుంచి మేచుక వెళ్ళే మార్గంలో శిలాపత్థర్ టౌన్‍లో రాత్రికి హోటల్లో ఉన్నారు. అసలు విషయం – అరుణాచల్ దర్శించడానికి ప్రత్యేక అనుమతులుండాలి. ఈ బృందం ఆ ఏర్పాట్లు ముందుగానే చేసుకుంది.
అస్సాం నుంచి మేచుకకు వచ్చేసరికి అప్పటి వరకు ఎటు చూసినా నలువైపులా కంటికి పచ్చని తివాసి పరచినట్లున్న ప్రకృతి ఒక్కసారిగా మారిపోయి, అంతా ఎండిపోయినట్లుగా మారిపోయిందట! ఆ రోజు సాయంత్రానికి ఈ బృందం మేచుక చేరింది. అక్కడ హాటల్ దొరకక మూడు రోజులు హోమ్ స్టే లోనే ఉండి అన్నీ దర్శించారు. విజయభాస్కరరెడ్డి, ఫొటోగ్రఫి చేసే మిత్రులు కమలాకర్ – మేచుక లోనే ఉండి అక్కడ తను చేయవలసిన ఫోటోగ్రఫీ పని మీద వెళ్ళిపోయారు.
విజయభాస్కరరెడ్డి, మిత్రులు ప్రవీణ్ ప్రధాన్ వెనక్కి వచ్చి ఆలో (Alo) లో ఒక రాత్రి ఉండి, మరుసటి రోజు గౌహాటి (Guwahati) వెళ్లే రైలెక్కారు. 24 గంటలు ప్రయాణం చేసి, గౌహటిలో (Guwahati) దిగి ఒక హాస్టల్లో ఉన్నారు. మరుసటిరోజు తులసి అనే వ్యక్తి జీవులో ఖాజీరంగా వెళ్ళి అక్కడి ఖజిరంగా వన్యప్రాణుల పార్కంతా నాలుగు గంటలు తిరిగారు. తులసి గారు, విజయ భాస్కరరెడ్డి, ఆయన మిత్రుణ్ణి జోర్‍హాట్ వెళ్ళే బస్ ఎక్కించారు.
జోర్‍హాట్ బస్ స్టాండ్‌లో దిగి మజూలి (Majuli) ద్వీపం అలా తిరిగి చూచారు. బ్రహ్మపుత్ర, సుబన్ సిరి నదుల మధ్య ఏర్పడిన ద్వీపం. అస్సాంలో ఇదొక దర్శనీయ స్థలం.
జోర్‍హాట్ నుంచి మజులి ద్వీపానికి ఫెర్రీ మీద వెళ్ళాలి. ఆ రాత్రి మజులి ద్వీపంలో ఒక హోమ్ స్టే లో ఉన్నారు. మజులీలో రెండు వైష్ణవ మఠాలు, ముఖానికి వేసుకునే మాస్కుల కుటీర పరిశ్రమ, గిరిజనులున్న పల్లె చూశారు.
సాయంత్రానికి జోర్‍హాట్ వాపసు వచ్చారు. మరుసటి రోజు గౌహటికి వెళ్ళి అక్కడ నుంచి విమానంలో తిరుగుప్రయాణమయ్యారు.
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.