[శ్రీ అంబల్ల జనార్దన్ రచించిన ‘మా చిట్టి తల్లి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది భారతదేశంలోని ఒక విదేశీ బ్యాంక్ యొక్క వార్షికోత్సవ సమారంభం. ముంబయిలోని ఒక ఏ.సి. హాల్లో దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులతో నిండుగా ఉంది. వారంతా దేశం నలుమూలలనుండి వచ్చిన బ్యాంక్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు. ముంబయి శాఖలో పనిచేస్తున్న మా చిన్నమ్మాయి అపర్ణ (అప్పూ) తల్లిదండ్రులుగా మేము కూడా ఆ సమారంభానికి హాజరయ్యాం. సింగపూర్‌లో ఉన్న బ్యాంక్ ఏషియన్ విభాగం ముఖ్యాధిపతి గారు ప్రముఖ అతిథిగా రానున్నందున ఆ కలయికకు ప్రాముఖ్యత ఏర్పడింది. వారు బ్యాంక్ యొక్క భవిష్యత్ ప్రణాళికలపై కీలకోపన్యాసం చేసి గత సంవత్సరపు ‘ఉత్తమ ఉద్యోగి’ని కూడా ప్రకటించనున్నారు.
బ్యాంక్ ఉద్యోగుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొందరు పాటలు పాడితే కొందరు నాట్యాలు చేసారు. మరికొందరు జోకులు చెబితే, ఇంకొందరు హిందీ శాయిరీలతో అలరించారు. మా అమ్మాయి అపర్ణ ‘రాధాకృష్ణుల’ సమూహ నృత్యంలో కృష్ణునిగా పాల్గొంది. ఆ బ్యాలే ప్రేక్షకుల విశేష మన్నలను అందుకుంది. వారితో పాటు మేమూ ఘనంగా స్పందించాము.
బ్యాంక్ ఏషియన్ విభాగం ముఖ్యాధిపతి గారు తన కీలకోపన్యాసంలో గత సంవత్సరం బ్యాంక్ యొక్క అభివృద్ధికై తోడ్పడ్డ ఉద్యోగులను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంక్ యొక్క భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా వివరించారు. మనదేశంలో, ఇతర బ్యాంక్‌ల నుండి ఎంత పోటీ ఉన్నా బ్యాంక్ కలాపాల విస్తరణకు ఇంకా ఎంతో అవకాశం ఉందని వక్కాణించారు. బాగా పరపతి, ఆస్తులు ఉన్నవారిని, ఇతర ప్రముఖ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారికి బ్యాంక్ ప్రత్యేకతలను విశదపర్చి వ్యాపారం వృద్ధిచేయాలని సూచించారు. తద్వారా బ్యాంక్ లాభాల వృద్ధికి తోడ్పడాలన్నారు.
ఆ తర్వాత వ్యాఖ్యాత్రి, ఉత్తమ ఉద్యోగుల ఎంపికకై చివరి వరకు పోటీలో నిలిచిన ఐదు పేర్లను చదివింది. వారినుండి ఒక ఉత్తమ ఉద్యోగిని ప్రకటించమని బ్యాంక్ ఏషియన్ విభాగం ముఖ్యాధిపతి గారిని కోరింది.
ముఖ్యాధిపతి గారు “ఉత్తమ ఉద్యోగి ఎవరో చెప్పుకొండి చూద్దాం?” అని ప్రేక్షకులను అడిగారు. చాలామంది తమకు తోచిన పేర్లను చెప్పారు. ఇంకొంత ఉత్సుకత రేకెత్తించి చిట్టచివరకు “గత సంవత్సరపు ఉత్తమ ఉద్యోగి ఎవరంటే..” కాస్త ఆగారు. ఆ ఐదు పేర్లలో మా అమ్మాయి పేరు కూడా ఉన్నందున, మాతో పాటు ఇతరులు కూడా చాలా ఉత్కంఠతో సీట్ల అంచున కూర్చుని ఆ ప్రకటనకై ఎదురు చూశారు. ముఖ్యాధిపతి ‘అపర్ణ అనుమళ్ల’ అని ప్రకటించారు.
మేము మా చెవులను నమ్మలేకపోయాము. అది మా ‘అప్పూ’! మా చిట్టి తల్లికి ఆ అనూహ్య, అపూర్వ, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది! మా ఆనందానికి హద్దులు లేవు. మా అమ్మాయి హుందాగా ఆ పురస్కారం అందుకోవడానికి వేదికపైకి వెళ్లింది. ముఖ్యాధిపతి, ఆ పురస్కారానికి అపర్ణను ఎందుకు ఎంపిక చేసారో వివరించి, మా అమ్మాయిని అభినందించారు. అంతే కాదు పదోన్నతి కూడా ప్రకటించారు. మా చిట్టి తల్లికి దక్కిన గౌరవానికి మేము ఇంకా ఆనందించాము.
తనకు దక్కిన గౌరవానికి తన స్పందిస్తూ.. “నన్ను ‘ఉత్తమ ఉద్యోగి’గా ఎంపిక చేసినందుకు నిర్వాహక వర్గానికి ధన్యవాదాలు. ఇక ముందు కూడా రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తానని నిర్వాహకులకు భరోసా ఇస్తున్నాను. ఈ పురస్కారం మా బృంద సభ్యులందరికి చెందుతుంది. నేను ఈ రోజు మీ ముందు ఇలా నిల్చున్నందుకు ముఖ్య కారకులు మా తల్లిదండ్రులు. వారు నేర్పిన విలువలు, సంస్కారం వల్లనే నేను నా కర్తవ్యాన్ని శాయశక్తులా నిర్వహించాను. అందుకే ఈ అవార్డు వారికి అంకితం చేస్తున్నాను.” ఆలా అనగానే చప్పట్లు మిన్ను ముట్టాయి. “మా అమ్మ-నాన్నల సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. బ్యాంక్ వ్యాపార అభివృద్ధికై నా దగ్గర కొన్ని సూచనలున్నాయి. అవి తర్వాత నిర్వాహకులకు తెలుపుతాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు.” మళ్లీ చప్పట్లు. ముఖ్యాధికారి కల్పించుకొని మమ్మల్ని వేదికపైకి ఆహ్వానించారు. మాకు పూలగుచ్చము ఇచ్చి శాలువాతో సత్కరించారు. మా చిట్టి తల్లి వల్లనే కదా మాకు ఆ సన్మానం దక్కిందని ఆనందంతో మేము ఉబ్బి తబ్బిబయ్యాము.
వేదిక కిందకు దిగగానే ఎంతో మంది మాకు అభినందనలు తెలుపడానికి చుట్టుముట్టారు. మా సీట్ల వద్దకు వెళ్లడానికి దాదాపు ఇరవై నిముషాలు పట్టింది. వెంటనే మా కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకుంది అపర్ణ. ఆనంద భాష్పాలతో మా కళ్ళు చెమర్చాయి.
ఆ సందర్భంగా నాకు సుమతి శతకారుడు బద్దెన కవి పద్యం, జ్ఞప్తికి వచ్చింది.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ..!
ఈ పద్యం, పుత్రుని జన్మకై తండ్రి యొక్క సంతోషం గురించి చెప్పినా, అది కూతురుకి, తల్లికి కూడా వర్తిస్తుంది. బద్దెన కవి హయాంలో ఆడవారు ఇంటికే పరిమితమయ్యేవారు కాబట్టి మగవారి గురించి రాశారు కానీ నేడు ప్రతి రంగంలో ఆడవారు మగవాళ్లతో సమానంగా పని చేస్తున్నారు అందుకని, ఈ పద్యం కూతుళ్ళకు, తల్లికి కూడా వర్తిస్తుంది. అదీగాక తమ సంతాన పెంపకానికి తల్లికి ఎక్కువ బరువు బాధ్యతలుంటాయి.
సహజంగానే నాకూ నా భార్యకు, మా అమ్మాయిని పలువురు ప్రశంసించి శుభాకాంక్షలు తెలిపినందుకు చాల సంతోషంగా ఉండింది. కార్లో ఇంటికి తిరిగి వస్తుండగా నా ఆలోచనలు, మా శ్రీమతి, అపర్ణను గర్భం దాల్చినప్పటి రోజులు జ్ఞప్తికి వచ్చాయి. అప్పటికే మాకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అవి ‘మేమిద్దరం, మాకు ఇద్దరం’ అనుకునే రోజులు. అందుకని మూడో సంతానం కనాలా వద్దా? అని నేనూ, శ్రీమతి చాలా తర్జన భర్జన పడ్డాం. ఆలా నెల రోజులు గడిచాయి కానీ ఎటూ తేల్చుకోలేక పోయాము. చివరకు మా అమ్మనాన్నల, అత్తమామల అభిప్రాయం తీసుకోవాలని నిశ్చయించాము. వారుండేది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. అలాంటి సున్నిత విషయాలు ఫోనులో చర్చించలేము. స్వయంగా వెల్దామంటే ఇద్దరికీ సెలవు సమస్య. ఓ మూడు నెలలు గడిచాక మా ఇద్దరికీ వారం రోజులు సెలవు మంజూరయింది. మన రాష్ట్రమ్ చెరో మూల ఉన్న వారి దగ్గరకు వెళ్లాల్సి ఉంది.
మొదట మా ఇంటికి వెళ్లాం. సంగతి వినగానే మా నాన్నగారు ఇంతెత్తున ఎగిరి పడ్డారు.
“నా ఒక్కడి సంపాదనతో మీ ఏడుగురు పిల్లలను పెంచలేదా? మీరిద్దరు సంపాదిస్తూ, మూడో పిల్లను కనడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారా?” అన్నారు.
మా అమ్మగారు “మీరూ, మీలాంటి తల్లిదంద్రులు, బాహ్యాడంబరాలకు అలవాటుపడి, ఎక్కువ పిల్లలు కనడానికి వెనకాడుతున్నారు. నారు పోసిన వాడు నీరు పోయడా? ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. పిల్లలు మీకు బరువైతే మా దగ్గర విడిచిపెట్టండి. మేము పెంచుతాము.” అని దులిపేసారు. మాకు స్పష్టత వచ్చింది. మూడో సంతానాన్ని కనాలని నిశ్చయించాము.
ఎలాగూ వచ్చాము కదా అని, దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అత్తవారింటికి బయలుదేరాము. వారూ మా తల్లిదండ్రుల వాదననే బలపరిచారు. వారు పెంచి పోషించింది ఎనిమిది మందిని మరి! అప్పుడు మాకు మూడో సంతానాన్ని కనే విషయంలో ఇంకా స్పష్టత వచ్చింది. పుట్టేది అబ్బాయైనా అమ్మాయైనా మేము కని పెంచాలని నిర్ణయించాం. వారెవరో తెలుసుకోవాలని ప్రయత్నించను కూడా లేదు. ఆలా మా చిట్టి తల్లి ఈ పుడమిపై కాలూనింది. ఆ తర్వాత ‘అపర్ణ’ అని నామకరణం చేసి పెద్ద పిల్లలిద్దరిని పెంచినట్లే పెంచాము. మా ఇంటి దగ్గరి మంచి బడిలో చేర్పించి, చదువేతర కలాపాల్లో కూడా పాల్గొనడాన్ని ప్రోత్సహించాము. పై చదువులకు కూడా ఆమె ఇష్టానికే వదిలిపెట్టాము. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్స్ శాఖలో డిస్టింక్షన్ మార్కులతో పాసయింది. చివరి సంవత్సరం ఫలితాల కంటే ముందే ‘క్యాంపస్ ఎంపిక’లో ప్రస్తుత విదేశీ బ్యాంక్‌లో, మంచి వేతనంతో ఉద్యోగ పత్రం లభించింది. తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి, ఇప్పుడు ఈ అవార్డుతో మా పేరు నిలబెట్టింది.
అపర్ణ, బ్యాంక్ యొక్క ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కింద స్వీకరించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఆమెను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేయడానికి బహుశా ఆ అంశం కూడా ఒక కారణమేమో?
అడ పిల్లలు తండ్రికి సన్నిహితంగా, మగ పిల్లలు తల్లికి దగ్గరగా ఉంటారని నానుడి. అది మా విషయంలో కూడా నిజం. ఏ చెడు స్నేహాలతో పాడైపోతారని, తన సహజ భయంతో మా ఆవిడ, ఆడపిల్లలను అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అది వారికి నచ్చదు. వారు నాతో ఫిర్యాదు చేస్తారు. నేనేదో చెప్పి వారిని శాంత పరుస్తాను. వారడిగిన చాలా వాటికి ఒప్పుకుంటాను. అమ్మ ఇంకా పాత కాలంలోనే ఉందని మా అమ్మాయిల అభిప్రాయం. అమ్మాయిలను సహజంగా ఎదగ నియ్యాలని నా భావన.
తన ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత మా అప్పూ “అమ్మా! పరీక్షలకు చదివి చాల అలసిపోయాను. ఈ వాతావరణం నుంచి బయటపడాలని ఉంది. మనం అమ్మమ్మా, నానమ్మా, తాతయ్యల దగ్గరకు వారి ఊళ్లకు వెళదాం. పల్లెటూరి స్వచ్ఛగాలితో సేద తీరుదాం.” అంది. నా భార్య నన్ను సంప్రదించి, తనకు ఆఫీస్‌లో సెలవు దొరకడం కష్టం అని చెప్పింది. నాది కూడా అదే సమస్య, అదే మా చిన్నమ్మాయికి చెప్పాము. “అమ్మా! మాకు సెలవు దొరకడం కష్టం. అన్నయ్య, అక్కయ్యలకు వారి వార్షిక పరీక్షలున్నాయి. అందుకని మేమెవరం నీతో ఊళ్లకు రాలేము. మనం ఇంకెప్పుడన్నా వెళదాం తల్లీ” అన్నాను.
“పర్వాలేదు నాన్నగారూ! మీరెవరు నాతో రాకపోయినా నేనొక్కదాన్నే వెళతాను.”
“ఈడుకొచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపుతాం? అసలే రోజులు బాగా లేవు. అమ్మాయిలపై ఎప్పుడు, ఎవరు, ఏ అఘాయిత్యం చేస్తారో చెప్పలేము.” మా ఆవిడ వీటో వేసింది.
“నన్ను నేను ఆ మాత్రం కాపాడుకోగలనమ్మా. ఆ మాత్రం నన్ను నేను రక్షించుకోలేకపోతే నా బ్లాక్ బెల్ట్ ఇంకెప్పుడు ఉపయోగపడుతుంది? ఓ సారి నా ఇంటర్ ఫలితాలు వచ్చాయంటే మళ్లీ కొత్త కోర్సులో ప్రవేశాలూ, ఆ పై పరీక్షలకై చదువులూ ఇక నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు. అందుకే నన్ను వెళ్లనీయండి అమ్మా.” ఆలా అంటూ నా వైపు చూసింది మా అప్పూ.
“సరేనమ్మా! నువ్వన్నట్టే కానీ. ప్రయాణంలో జాగ్రత్త.” నేను పచ్చ జెండా ఊపేసరికి చిట్టి తల్లి ఎంతో ఆనంద పడింది. ఆ తర్వాత మా ఆవిడ రోజూ రెండు సార్లు ఫోన్ చేసి అప్పూ బాగోగులు కనుక్కునేది.
ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత కాలేజీ వాళ్ళు తలపెట్టిన వారం రోజుల శిక్షణ యాత్రకు పోతానని చెప్పింది మా అప్పూ. మళ్లీ మా ఆవిడ నోరు నొక్కుకుంది. “హవ్వ హవ్వ! వయసులో ఉన్న పిల్లను అబ్బాయిలతో పాటు అన్ని రోజులు ఎలా పంపుతాం? అది తెలిసి లోకులు ఏమంటారు? ఆ చదువేదో పుస్తకాల నుండి నేర్చుకో రాదా? రేపేమైనా జరగరానిది జరుగుతే ఎవరు బాధ్యులు? ఇదంతా మీరిచ్చిన అలుసు కాకపోతే ఏమిటి?” నా మీద విరుచుకు పడింది శ్రీమతి.
“అది కాదమ్మా. మాతో పాటు ఈ విషయంలో బాగా అనుభవమున్న లెక్చరర్లూ, ప్రొఫెసర్లూ ఉంటారు. వారు విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండేలా చూసుకుంటారు. నువ్వు ఊహిస్తున్న సంఘటనలు ఏవీ జరుగనివ్వరు. మీరైనా అమ్మకు చెప్పండి నాన్నా” బంతి మళ్లీ నా కోర్టులో పడేసింది చిట్టి తల్లి.
“ప్రియా! ఉద్యోగానికి గాని చదువుకై గాని ఆడవారు బయటికి వెళ్ళినప్పుడు అందరితో కలిసి పని చేయ వలసి ఉంటుంది. మగవారు ఉన్నచోటికి వెళ్లకూడదనుకుంటే కుదరదు. మన అప్పూపై నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. మనం ఆమె చదువుకి భంగం కలిగించ వద్దు.” అప్పూ కళ్ళతోనే నాకు ధన్యవాదాలు తెలిపింది. అలా నాతో మా అమ్మాయి బంధం మరింత బలపడింది.
అపర్ణ తన ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో తోటి విద్యార్థులందరిలా జీన్స్, టీ షర్ట్ కావాలని కోరింది. మా ఆవిడ లోని అభద్రతా భావం మళ్లీ తలెత్తింది.
“ఆడవాళ్లకు చీర, లేక చుడిదార్ పర్వాలేదు కానీ మగ రాయుడిలా జీన్స్, ఎదపై కొంగు లేకుండా టీ షర్ట్ ఏమిటి ఛండాలంగా?”
నేను మళ్లీ కల్పించుకొని మనం కాలంతో మారాలని సముదాయించి సర్ది చెప్పాను.
ఇంజినీరింగ్ చివరి సంవత్సరం వార్షిక పరీక్షల సన్నాహక సెలవులప్పుడు మేము ఆఫీస్ వెళుతుంటే మా అమ్మాయి . “నాన్నగారూ! నేను నా స్నేహితురాలు గీతతో కలిసి చదువుకోడానికి వాళ్ళింటికి వెళతాను.” అంది. “ఏం? మనింట్లో చదువుకోరాదా? దానికి వాళ్ళింటికి ఎందుకు పోవడం?” మా ఆవిడ అంది.
“అది కాదమ్మా! మేము కలిసి చదువుకుంటే ఒకరికొకరం మా సందేహాలు తీర్చుకోవచ్చు. అలా చదువుకోవడం వల్ల అలసట అనిపించాడు. ప్లీస్ అమ్మా! సాయంత్రం ఆరు గంటలలోగా తిరిగి వస్తాను.”
“ఇవాళ ఇంట్లోనే చదువుకో. నేను రాత్రి నాన్నగారితో మాట్లాడి చెబుతాను.”
ఆ రాత్రి మా ఆవిడ, తన భయం వెలిబుచ్చింది.
“ఏమండీ! అప్పూ చదువుకోడానికి వేరే వాళ్ళింటికి ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోండి. ఆలా చదువుకునే నెపంతో ఇంట్లోంచి వెళ్లి తమ మగ స్నేహితులతో షికార్లు చేసే వారి గురించి ఎన్ని వినలేదు? అలాగే ఆ ఆడ స్నేహితుల అన్నలతో ప్రేమలో పడి తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిన వారెందరిని చూడలేదు?”
“అదంతా నీ అపోహ ప్రియా. మనమ్మాయి అలాంటిది కాదు. అప్పూకి చదువుపై తప్ప ఇంకో ధ్యాస లేదు. అందుకే ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ వస్తుంది. నువ్వు అనవసర భయాలు పెట్టుకొని అప్పూ చదువులకు ఆటంకం కలిగించకు. తాను అన్నట్టు గీత ఇంటికి వెళ్లనియ్యు. అన్నట్టు గీత కెవరూ అన్నలు లేరు.”
“అలాగే కానియ్యండి. మీరెప్పుడు నన్ను సమర్థించారు గనుక!” అని మూతి మూడు వంకర్లు తిప్పింది ప్రియ. నా లాగే మా అప్పూ ఒకేసారి ఎన్నో పనులు చేయగల సమర్థురాలు. తను తన సెలవుల్లో ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది. తన బ్యాంక్ నుండి, బడి అధికారులనుండి అనుమతి తీసుకొని అప్పుడప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలకు చదువు చెబుతుంది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి సముద్ర తీరాల ప్రక్షాళనకై నడుం కడుతుంది. తన పుట్టిన రోజులను అనాథాశ్రమాల్లో గాని వృద్ధాశ్రమాల్లో గాని వారికి సేవ చేస్తూ, భోజనం పెట్టి గడుపుతుంది. టోస్ట్ మాస్టర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహిస్తోంది. తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు కొన్ని నర్సరీ పాఠశాలలకు వెళ్లి పిల్లలను ఆటలాడిస్తుంది.
సృజనాత్మకతో పనికిరాని వస్తువులతో, పనికివచ్చే ఉపయోగ వస్తువులను చేయడం మా చిట్టి తల్లికి చాలా ఇష్టం. అలాగే చిత్రలేఖనంపై కూడా అప్పూకి మంచి పట్టు ఉంది. డ్రాయింగ్ పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తానెప్పుడూ ఊరికే ఉండదు. తీరిక సమయాల్లో తన అమ్మకు పనిలో సాయపడుతుంది. ఇంట్లోని అందరి బాగోగులపై శ్రద్ధ తీసుకుంటుంది. ముఖ్యంగా నేను సమయానికి మందులు వేసుకుంటున్నానో లేదో గమనిస్తుంటుంది. మందులు సరిగా వేసుకోకపోతే అప్పుడప్పుడు నాకు క్లాస్ తీసుకుంటుంది.
అప్పుడనిపిస్తుంది మేము గాని మా చిట్టితల్లిని మొగ్గలోనే చిదిమేస్తే ఎంత కోల్పోయేవాళ్లమో? టూకీగా చెప్పాలంటే మా అప్పూ మాకు తరగని బంగారు గని.