Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లుగానో

[డా. సి. భవానీదేవి రచించిన ‘లుగానో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

క్కడి భాష ఏదయితేనేం
ప్రకృతి సంభాషణ మాత్రం అర్థమౌతున్నది
ఈ నేలను దక్షిణ స్విట్జర్లాండని
పేరు పెట్టుకుని మురిసిపోతున్న మనిషిని చూసి
లుగానో సరస్సు రహస్యంగా నవ్వుకుంటోంది
ఎందరో పాలకులు.. రాజ్యాలు
స్వంతం చేసుకుని విర్రవీగారుగానీ
ఈ జలపుటల చరిత్రను చదివిందెవరని?

లుగానో అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు
నా మూలభూమి మీది సరస్సులెన్నో
దృశ్యమానమౌతున్నాయి
దూరంగా ఆల్ప్స్ పర్వతాల యవనికపైనించి
వికసిస్తున్న సూర్యబింబం
నులివెచ్చని జలదర్పణ ప్రతిబింబానికి మురిసిపోతూ
నీటిరాగాలు ఆలపిస్తున్నది
విహారనౌకల ప్రేమావేశాలకు
రెండు దేశాల సరిహద్దుల గురించి ఏం తెలుసని!
ఇది ఇరుభూముల వారి వారధి కదా
ఎన్నిపేర్లతో పిలిచినా
ఎన్నో శతాబ్దుల చరిత్రను
అలల కెరటాలపై లిఖించుకుంటూ
ఎన్నెన్నో యుద్ధాలకు ఎదురీదుతూ
ఇన్నిన్ని అందాల ప్రశాంతతను
నిలబెట్టుకోవటం లుగానోకే సాధ్యమయిందేమో!

రాతియుగంలో పుట్టినా
ఆ రాళ్ళభాషను గుండెల్లో దాచుకుని
లోహయుగానికి ప్రయాణించి
రోమన్ యుగం దాకా వినిపిస్తున్న
మానవ నాగరికతా రహస్యాలకు
తరంగ మౌనచలనాలు తలలూపుతున్నాయి
కుడి ఎడమల పర్వత పంక్తుల బాహువుల్లో
పరవశిస్తున్న ఓ లుగానో సరోవరమా!
మనిషి మింగేస్తున్న సరస్సులన్నింటికీ
నీ అనుభవ పాఠాలు ఆలంబనగా
నవ జీవనశృతిని వినిపించు
జల పావన సంగతులను ఆలపించు

Exit mobile version