Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లైవ్ ఇండికేటర్స్

[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘లైవ్ ఇండికేటర్స్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


1
జీవన సూచికలు గణాంకాలే..
విజేత, పరాజితగా ఆయా స్థానాల్లో
ప్రథమం, ద్వితీయం,..
ప్రోత్సాహకం..
పోరాట పటిమయే సత్సంకల్పం
పోటీలో నిలవడమే ప్రాధాన్యం

2
ఎదిగే ప్రాయంలో అవధులు లేని ఆనందాలు
ఎదర బతుకు ఏమిటనే చింత లేకుండా
బాల్యం, కౌమారం భరోసా ఇచ్చినా
చేతికొచ్చిన యవ్వనానికి రెక్కలు తొడగనీకు
రోజటికి రోజూ పాఠం చదవాలిసిందే
నిరంతరం నిన్ను నీవు పరిశీలించుకోవాలిసిందే

3
బహుమతులు, ప్రోత్సాహకాలు మానవ చలనాలు
స్థిర చిత్తానికి దోహదకారులు
మానసిక ఆరోగ్యానికి హేతువులు
ఓ గుర్తింపు కోసం పడే ఆరాటంలో
ముందూ వెనకా, వెనకా ముందూ
సదా బరి లోనే ఉండాలి

4
ఎప్పుడో గానీ తెలియదు
ఉడిగి పోయిన వయసులో గతం
అప్పుడు నేనలా ఉంటే నేనింకా ఎలా ఉందునో
వర్తమానంలో ఓ నిట్టూర్పు
ప్రయోజనమేమీ లేదు,
జీవన సాఫల్యానికే చివరి అంకం

5
సవ్య దిశలో బాధ్యతాయుతమైన పరివర్తనే
బరువును దించుతుంది
వసుధైక కుటుంబంలా ఈ లోకంలో
గెలుపైనా, ఓటమైనా నిలకడగా
గణాంకాలే జీవన సూచికలు..

Exit mobile version