[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘లక్ష్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రొఫెసర్ రాజశేఖర్ గారు బాగా అసహనంగా వున్నారు. ప్రోస్తోడాంటిక్స్ డిపార్టుమెంట్లో ఆయన ఎదురుగా కృష్ణమోహన్ కూర్చుని వున్నాడు.
“చూడండి కృష్ణమోహన్, బి.డి.యస్. థర్డియర్ చదివే స్టూడెంట్ను అలా ఊళ్ళు తిప్పుకొచ్చామని చెప్తున్నారు. మీకది అర్జెంటే కావచ్చు, దాని మూలంగా ప్రాక్టికల్స్‌కు అటెండ్ కాలేదు. మ్యారేజ్ చేసుకున్నారు. టూరో, హనీమూనో అంటూ ట్రిప్పులు వేసోచ్చారు. అది మీ పర్సనల్. కాని కాలేజ్‌కు సరిగా రాకపోవటం, ప్రాక్టికల్స్ టైమ్‌లో లేకపోవటం ఇదంతా ఏమిటి? లేని అటెండెన్సను మేం ఎక్కడ నుంచి తెచ్చివ్వగలం?”
“సర్ మీరు వైస్ ప్రిన్సిపల్, మీరే ఏదో సహాయం చెయ్యాలి”.
“నేను వైస్ ప్రిన్సిపాలే. ఆంధ్రావాడినే. అయితే ఏం చెయ్యమంటావు? మీ ఆవిడను నేను చెప్తే కాలేజ్ మాన్పించావా, నేను ఇవ్వాళ అటెండెన్సు ఇవ్వటానికి? అయినా ఆవిడేది? అంతా మీరే మాట్లాడుతున్నారు? పైగా చాలా ధైర్యంగా అడుగుతున్నారు. తను వచ్చి కనిపించి అపాలజీ చెప్పుకునే కనీస ధర్మం కూడా లేదా?” అన్నారు కోపంగా.
“సర్ ఇప్పుడే వస్తాను” అంటూ బయటకి వెళ్ళి భార్యను తీసుకుని లోపలికొచ్చాడు. లాలిత్య లోపలికి వస్తూనే సర్‌కు విష్ చేసింది.
“ఏం చేయాలమ్మా నేను మీ విషయంలో? మీ ఆయన యమ్.టెక్. పూర్తి చేశానంటున్నాడు. ఆయన బాగానే తన స్టడీస్ పూర్తి చేసుకున్నాడుగా. నీకు తెలియదా ఆ మాత్రం. పైగా మీ ఆయన్ను రికమెండేషన్ కోసం పంపించావు. లేని అటెండెన్స్ ఇవ్వటం, చెయ్యని ప్రాక్టికల్స్‌కు మార్కులు వుండటం ఇది సాధ్యమేనా? అసలు ఆలోచించే మాట్లాడుతున్నారా మీరిద్దరూ? వైస్ ప్రిన్సిపాల్‌ని అయితే ఇదంతా నా చేతిలో వుంటుందా? మనం మనం ఆంధ్రావాళ్ళం అయినంత మాత్రాన, రికార్డుల్నే మార్చి వేస్తామా మీకోసం? ప్రిన్సిపల్‌ను కలవండి మీరెళ్ళి. ఆయన ఎలా చెప్తే అలా చేయండి. నేను చేయగలిగిందీ, చెప్పవలసిందీ ఇంకేంలేదు” అనేసి ‘ఇక మీరు వెళ్ళవచ్చు’ అన్నట్లుగా ఆయనేదో పుస్తకంలో తలదూర్చారు.
“సారీ సర్! మిమ్మల్ని డిస్ట్రబ్ చేశాం” అంటూ లాలిత్య, కృష్ణమోహన్ ఇద్దరూ డిపార్టుమెంట్ నుండి బయటికొచ్చేశారు.
“నేను ముందే చెప్పాను. డాక్టర్ రాజశేఖర్ సర్ చాలా స్ట్రిక్ట్. అయినా ఇలాంటి అడ్డగోలు విషయాలు మనం మాట్లాడటమే చాలా తప్పు. నేను ముందే చెప్పాను. వినలేదు నువ్వు. పొరపాటు మాటలు మాట్లాడానని సర్ నన్ను ఇంకా చాలా కోప్పడివుండవలసింది. చాలా కన్సర్న్ చూపించారు. థాంక్ గాడ్.”
“వైస్ ప్రిన్సిపల్, పైగా మన ఆంధ్రా వ్యక్తి. కొంచమైనా సాయం చేయకపోతారా? అనుకున్నాను. అటెండెన్స్, ప్రాక్టికల్ మార్కులు వీళ్ళ చేతుల్లోనే వుంటాయి. ఆయన డిపార్ట్మెంటే కదా. ప్రోస్తో ప్రాక్టికల్స్‌కే కదా నువ్వు వెళ్ళనిది. ఈయన చేత కన్జర్వేటివ్ ఆయన క్కూడ ఒక మాట చెప్పించుకుందామనుకున్నాను. తనే అంత చాదస్తంగా, మూర్ఖంగా వుంటే వేరే వాళ్ళకేం చెప్తాడు? మన వాళ్ళని కొంచెం కూడా అభిమానం చూపించలేదు” అంటూ రుసరుసలాడాడు కృష్ణమోహన్.
“వద్దు కృష్ణా. ఇక్కడ ఈ విషయంగా ఇంకెవర్నీ కలవద్దు. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరపడ్డాయి. ఈ పెళ్ళి హడావిడిలో ఏం ప్రిపేర్ కాలేదు. మరో ఆరు నెలల్లో మరలా ఎగ్జామ్స్ వుంటాయి. అపుడు ఇస్తాను ఎగ్జామ్. పదపోదాం” అంటూ కృష్ణమోహన్‌ను బలవంతంగా లాలిత్య యస్.డి.యమ్. డెంటల్ కాలేజ్ నుంచి బయటకు తీసుకుని వచ్చింది.
హుబ్లీలో ట్రెయిన్ దిగి ధార్వాడ్ వెళ్ళే బస్సులో ఇద్దరికీ పరిచయమయ్యింది. ఒకే ఊర్లోని డెంటల్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యేటప్పటికి అప్పుడప్పుడూ కలుసుకునే వాళ్ళు. పరిచయం బాగా పెరిగింది. ఆంధ్రాలో ఇద్దరికీ ఒకే జిల్లాలోని వూళ్ళు. లాలిత్య తండ్రి ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఇటీవల బాగా జబ్బు పడ్డాడు. లాలిత్య తమ్ముడు రామకృష్ణ చిన్నవాడు. ఇంటర్ చదువుతున్నాడు. లాలిత్య తల్లి కమల. భర్త జబ్బు పడేటప్పటికి ఎలాగైనా సరే కూతురు పెళ్ళి చేయాలని పట్టుబట్టింది. లాలిత్య తన బి.డి.యస్. డిగ్రీ వచ్చేదాకా పెళ్ళి ప్రస్తావన తేవద్దని బ్రతిమాలింది.
కృష్ణమోహన్‌తో లాలిత్యకున్న పరిచయం కమల మనసులో బాగా మెదులుతున్నది. అతనితోనే పెళ్ళి అంటే లాలిత్య అంతగా విముఖత చూపించకపోవచ్చు అనే ఉద్దేశంతో వున్నది. అదే విషయాన్ని భర్తతోనూ సంప్రదించింది. ఇద్దరూ కలసి పెళ్ళిళ్ళ బ్రోకరును కృష్ణమోహన్ ఇంటికి పంపించారు. నాల్గు నెలల సంప్రదింపుల తర్వాత కృష్ణమోహన్ ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే లాలిత్యను ఒప్పించి పెళ్ళి జరిపించారు. పెళ్ళయ్యాక ఒక వారం వుండి కాలేజ్ కెళ్ళి జాయిన్ అవ్వాలని వున్నది లాలిత్యకు. కాని కృష్ణమోహన్ పడనివ్వలేదు. తన స్టడీస్ పూర్తయ్యాయి. తను ఫ్రీనే. ఇంక జాబ్ చూసుకోవాలి. ఇక్కడే ఆంధ్రాలో వుండి జాబ్ ట్రయిల్స్ చూసుకోమన్నది లాలిత్య. కాదని తను కూడా ధార్వాడ వచ్చాడు. లాలిత్యను హాస్టలు నుండి తీసుకొచ్చి స్వంత కాపురం పెట్టించాడు. తను ఇక్కడే చదివిన కాలేజ్‌లోనే జాబ్ చూసుకుంటానన్నాడు. పెళ్ళి ఆ తర్వాత ఊళ్ళు తిరగటం వలన కాలేజ్‌కు సరిగా వెళ్ళలేదు. ఇంట్లో వండి పెట్టి కాలేజ్ కొచ్చి చదువుకోవటం తనవల్ల కాదేమోనని లాలిత్యకు భయం పట్టుకున్నది. తను వద్దన్నా వినకుండా ఇదుగో ఇలా రాజశేఖర్ సర్ దగ్గరకు తీసుకెళ్ళి చివాట్లు తిని వచ్చారు. సర్ మీద అకారణ కోపం కృష్ణమోహన్‌కు. “ఎంతో కొంత సాయం చేస్తారనుకున్నాను. లాలిత్య భయపడుతుంటే ఆమెను బయట నిలబెట్టి నేనే లోపలికెళ్ళి మాట్లాడాను. ఆయన యమ్.డి.ఎస్. అయితే నేను యమ్.టెక్. పూర్తి చేశాను. నాకంటే పెద్దవాడు కాబట్టి సీనియారిటీతో వైస్ ప్రిన్సిపల్ కాగలిగాడు. నా డిగ్రీకి అయినా విలువ ఇవ్వకుండా, వాకిట్లో నుంచే తోలేశాడు. ఆయనే ఏమీ పట్టించుకోకపోతే, కర్ణాటకకు చెందిన ప్రిన్సిపాల్ ఏం హెల్ప్ చేస్తాడు? ఛ. ఛ. అనవసరంగా ఆ రాజశేఖర్ దగ్గరకెళ్ళి భంగపడివచ్చాం” అంటాడు.
తన కాలేజీ ఖర్చులే కాకుండా ఫామిలీ మెయింటెయిన్ చెసుకోవటానికి కూడా ఇంటి నుండి డబ్బు తెప్పించు కోవటం లాలిత్యకు బాధగా వున్నది. ఒక వైపు తండ్రికి, ఆరోగ్యం ఏమి మెరుగు పడటంలేదు. ధార్వాడ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏమీ వేకెన్సీలు లేవని కృష్ణమోహన్‌కు జాబ్ రాలేదు. ఆంధ్రా నుంచి తెలిసిన వాళ్లు ఫోన్ చేసి చెప్పారు – ‘ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజ్‌లో పోస్టులు తీసుకుంటున్నారు. వచ్చి కృష్ణమోహన్ ట్రై చేసుకోవచ్చ’ని. లాలిత్య భర్తను వెళ్ళమని గొడవపెట్టింది. కృష్ణమోహన్ అయిష్టంగానే బయలుదేరివెళ్ళాడు. అప్లై చేశాడు. కొంత ప్రయత్నం చేయాల్సివచ్చింది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాబ్ రావటానికి.
ఇంటర్యూలో సెలక్టయ్యాడు. వారం రోజుల్లో ‘ట్రిపుల్ ఇ డిపార్ట్మెంట్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయినవ్వమన్న ఆర్డరు అందుకున్నాడు. అయినా ఇక్కడ ఉద్యోగమని కృష్ణమోహన్‌కు అసంతృప్తిగానే వున్నది. లాలిత్య మరలా హాస్టల్లో జాయినయ్యింది. యస్.డి.యమ్. డెంటల్ కాలేజ్ లేడీస్ హాస్టల్ మెయిన్ కాంపస్‌లో అన్ని రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ వున్నారు. కొద్దిమంది ఫారిన్ స్టూడెంట్స్ కూడా వున్నారు. బి.డి.యస్. వాళ్ళూ పీజీ కోర్సు, యమ్.డి.ఎస్. చేసేవాళ్ళు వుండటం వలన హాస్టలంతా సందడిసందడిగా కోలాహలంగా వుంటుంది. వార్డెన్ మేడమ్ కర్ణాటక అయినా ఆమెకు కన్నడంతో పాటు ఇంగ్లీషు, హిందీ బాగా వచ్చు. తెలుగు కూడా కొద్ది కొద్దిగా మాట్లాడుతుంది. అందర్నీ పలకరిస్తూ, అవసరమయితే సున్నితంగా హెచ్చరిస్తూ వుంటుంది హాస్టల్మేట్స్ను.
ఇదివరకు తనున్న రూమ్ లోనే మరలా చేరింది లాలిత్య. రూమ్మేట్స్లో ఒకరు నార్తిండియన్, మరొకరు ఆంధ్రానే. నార్తిండియన్ రోష్నీ పేరుకు తగ్గట్టే మెరిసే చర్మకాంతితో సన్నగా, నాజూగ్గా వుంటుంది. ఆ అందానికి తోడు పొడవాటి నిగనిగలాడే జుట్టు.
“నాలాగే మీరు గూడా అచ్చం రోటీలే తినండి. పచ్చికూరగాయల ముక్కల సలాడ్ తీసుకొండి. ఎందుకా పచ్చళ్ళు, రైస్ అంతలా తింటారు? నాలా చేస్తే మీరు అందంగా, నాజూగ్గా తయారవుతారు” అంటుంది.
లాలిత్య మరో రూమ్మేట్ లావణ్య ఇద్దరూ రోష్నీ మాటలకు నవ్వేస్తూ వుంటారు. లాలిత్యకు మనసులో భారం కొంత తగ్గింది. హాస్టల్ వాతావరణంలో కొంత ఉల్లాసంగా వుండసాగింది. హాస్టల్ మెస్ లోనూ బాగా సందడిగా వుంటుంది. గ్లాసులు, ప్లేట్ల చప్పుళ్ళు, కిచెన్‌లో నుండి వచ్చే వంటకాల వాసనలు, కుక్కర్స్ విజిల్స్ అంతా శబ్దమయమే. దానికి మించి స్టూడెంట్స్ చేసే అల్లరి, కబుర్లూ కలిసి ఎక్కువ మోతాదులో ధ్వనితరంగాల్నే పుట్టిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, లంచ్, డిన్నర్‌కు దేనికైనా తిన్నంత తిని పారవేసినంత పారేస్తూ వుంటారు. రోష్నీ ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మెస్ కొస్తుంది. అక్కడి డిషెస్‌లో వున్న వంటకాన్ని చూస్తూ ‘గుఱ్ఱాలకు పెట్టే తిండి లాగుందే తల్లీ’ అంటూ లావణ్య తన తెచ్చుకున్న పచ్చళ్ళనూ, కాకరకాయ కారంలాంటి వాటిని పెట్టుకుని తింటూ వుంటుంది. నిజానికి మెస్ లోని హెడ్ కుక్ పరశురామ్ స్టూడెంట్స్ నందరినీ మెప్పించటానికి చాలా ప్రయోగాలు చేస్తూ వుంటాడు. చాలావరకు సఫలీకృతుడవుతాడు. కాని లావణ్యకు ఏమీ నచ్చవు. పచ్చళ్ళనే ఆశ్రయిస్తూ వుంటుంది. రోష్నీ మన పక్కన వుంటే ఈ పచ్చడి సీసాను చూసి గొడవ పెడుతుంది అనుకుని నవ్వుకుంటూ వుంటారు. చదువు పూర్తి కాకుండానే జరిగిన తన పెళ్ళి, పెళ్ళి తర్వాత కూడా కొన్నాళ్ళు కాలేజ్ మానివేయటం అప్పుడప్పుడూ లాలిత్యకు బాగా గుర్తుకువస్తుంటాయి. కాలేజ్ స్టాఫ్ దగ్గర తను సిగ్గుపడుతూ వుండాల్సివస్తుంది. దానికి తోడు కృష్ణమోన్ తొందరపాటు నిర్ణయాలు కొంత బాధిస్తూ వుంటాయి. నాన్న ఆరోగ్యం బాగా వుంటే తను పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా పడివుండేదేమో అనిపిస్తుంది.
ఆర్నెల్లు గడిచాయి. లాలిత్య థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వ్రాసి ఊరికి వస్తున్నానని ఫోన్ చేసింది. “వచ్చే ముందు తన ఫస్టియర్, సెకండ్ ఇయర్ మార్స్ లిస్టులు తెచ్చుకో” అని చెప్పాడు కృష్ణ. “ఇంకా ఫీజులు కట్టిన రశీదులు కూడా తీసుకునిరా” అన్నాడు. ఎందుకని అడిగితే తీసుకునిరా, వచ్చింతర్వాత చెప్తానన్నాడు.
ఇంటి నుంచి వచ్చేటప్పుడు బాగా నెయ్యి వేసి కలిపిన సున్నుండలు తీసుకుని రమ్మని చెప్పింది రోష్నీ.
“నీకెందుకు తల్లీ స్వీట్స్, లావయిపోతావు. వద్దు. రెండుపూట్లా రోటీలు, కీర, టమోటా, ఉల్లిముక్కల సలాడ్, కాస్త పప్పు కూరా చాలుగా నీకు”.
“నై.నై. ఉడద్ దాల్ కీ మిఠాయీ బహుత్ స్వాదిష్ట్ హై” అంటూ నవ్వేసింది.
కృష్ణమోహన్ చెప్పినట్లుగానే ముఖ్యమైన పేపర్స్ అన్నీ తీసుకుని వచ్చింది లాలిత్య. వాళ్ళ నాన్న ఆరోగ్యం ఇంకా క్షీణించింది. కమల ధైర్యం కూడా సన్నగిల్లుతున్నది. కృష్ణమోహన్ అప్పుడప్పుడూ వచ్చి చూసిపోతున్నాడని తల్లి చెప్పింది.
“ఆంటీ, వీలైతే లాలిత్యను ఇక్కడి ఆంధ్రాలోని డెంటల్ కాలేజ్‌కు మార్పిద్దాం. మీరు కూడా తనను ఇక్కడికి వచ్చెయ్యమని చెప్పండి. మీకూ తోడుగా వుంటుంది. తను ఇక్కడికి వస్తే మేం కూడా ఇక్కడే మీ దగ్గరే వుంటాం. లేదా వేరే ఫ్యామిలీ పెట్టుకుంటాం.” అంటూ ఆమెను లాలిత్య రాకముందే మెంటల్‌గా ప్రిపేర్ చేశాడు.
“నేనీ రోజు కాలేజ్‌కు సెలవు పెడతాను. ఇక్కడ తక్కెళ్ళపాడులో వున్న సిబార్ డెంటల్ కాలేజ్‌కి వెళదాం.”
“సిబార్ కాలేజ్‌లో మనకేం పని?”
“నిన్ను ఫోర్త్ ఇయర్‌కు ఇక్కడ జాయిన్ చేసుకుంటారేమో కనుక్కుందాం”
“అదెలా సాధ్యం? ఇదేమైనా పి.జి. కోర్సులో జాయినవటమా? ఎంట్రన్స్ వ్రాసి సీటడగటానికి, సాధ్యం కాని వాటి గురించి ఆలోచించటమెందుకు? నిన్ననే కదా వచ్చాను. నన్ను నాన్న దగ్గర వుండనీ, నాకెక్కడికీ రావలని లేదు.”
“వెళ్ళి ప్రయత్నం చెయ్యటంలో తప్పులేదుగా లాలిత్య, ఒకసారి వెళ్ళివద్దాం.”
“మీ బి.టెక్. ఫైనలియర్లో వేరే రాష్ట్రం నుంచి వస్తే ఇక్కడ కాలేజ్‌లో జాయిన్ చేసుకుంటారా? అని అడిగితే ఒప్పుకుంటారా? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? కర్ణాటకలో కట్టే ఫీజులు ఈ కాలేజీకి కడతామని నువ్వంటావు. ఇంపాసిబుల్, అది జరిగే పనికాదు. కోర్సు మొదట్లో అయితే మనిష్టం. ఇప్పుడు మధ్యలో మేం రాష్ట్రాలు మారుతాం, కాలేజీలు మారుతాం అంటే ఏ గవర్నమెంటు ఒప్పుకుంటుంది? అసలు ఆ పద్ధతే లేదు చదువుకున్నవాళ్ళు. మీకు అంతమాత్రం తెలియదా అని మనల్నే కేకలేస్తారు. పోయినసారి రాజశేఖర్ సార్ దగ్గరకు వద్దంటే వెళ్ళారు. ఆయన వీలు పడదంటే కోపగించుకున్నావు. ఇది ఇంకా పెద్ద ప్రాసెస్.”
“నువ్వే పెద్ద ప్రొఫెసర్‌గా హెచ్చరిస్తున్నావు. వాదన అనవసరం. నేను కన్విన్స్ చేసుకుంటాను. ఆల్రెడీ కొంత విషయం సేకరించాను. రేపొకసారి వెళ్ళివద్దాం. కాదనకు.”
కమల కూడా అల్లుడికి వత్తాసుపలికింది.
మర్నాడు లాలిత్య, కృష్ణమోహన్ ఇద్దరూ తక్కెళ్ళపాడులోని ‘సిబార్’ డెంటల్ కాలేజ్‌కి వెళ్ళారు. కాలేజ్‌లో పనిచేసే ‘కమ్యూనిటీ’ హెచ్.వో.డి. పద్మలతా మేడమ్ దగ్గర తెలిసినవాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వున్నాడు. అందుకని నేరుగా ఆమె డిపార్టుమెంట్ తెలిసుకొని అక్కడికెళ్ళారు.
“చెప్పండి మీకేదో సలహా కావాలి అని ఫోన్ చేయించారు.”
“మీరు ఆలిండియా డెంటల్ కౌన్సిల్ మెంబరయినట్లుగా పేపర్లో చూశాను మేడమ్. కంగ్రాచ్యులేషన్స్ మేడమ్.”
“థాంక్యూ”
“నేనిక్కడే గుంటూరులోని ఇంజనీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను. తను నా మిసెస్, లాలిత్య, బి.డి.యస్. థర్డియర్ ఎగ్జామ్స్ వ్రాసి వచ్చింది. వాళ్ళ ఫాదర్‌కు బాగా సీరియస్‌గా వున్నది. మేమిద్దరం దగ్గరుండి ఆయన్ను చూసుకోవాలి.”
ఇందులో నా సలహా ఏముంటుంది అన్నట్లుగా చూశారు మేడమ్,
“మీరేం మాట్లాడటం లేదు లాలిత్య, విషయమేమిటో చెప్పండి”.
“నేను ధార్వాడ యస్.డి.యమ్. డెంటల్ కాలేజ్ చదువుతున్నాను మేడమ్.”
“యస్.డి.యమ్.లోనా? చాలా మంచి కాలేజ్, మంచి ఎక్విప్మెంట్, మంచి స్టాఫ్ ఉన్న కాలేజ్. మన ఆంధ్రాస్ చాలామంది అక్కడ పనిచేస్తున్నారు. మన స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అవుతారక్కడ.”
“అదే మేడమ్, ఫైనలియర్‌కు ఇక్కడ ‘సిబార్’లో జాయినవటానికి వీలుంటుందేమోనని మిమ్మల్ని రిక్వెస్టు చేస్తున్నాను. ఇంట్లో అమ్మకు తోడుగా వుండాల్సిన అవసరం వున్నది. తమ్మడు చిన్నవాడు. అందుకని మిమ్మల్ని రిక్వెస్టు చేయటానికొచ్చాం”.
“రిక్వెస్టు, రిక్వెస్టు అనటం అలా వుంచండి. సాధ్యంకాని పని మీరు అడుగుతున్నారు. అది ఎలా వీలవుతుంది? కర్ణాటక స్టేట్ నుండి ఎ.పి.కి ఒక స్టూడెంటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కావాలి. ఫీజుల మార్పులు వుంటాయి. అసలు వీలవుతుందని నేననుకోను. చాలా పెద్ద ప్రాసెస్, ఇదంతా నడిచే లోపల నీ సంవత్సరపు చదువు అయిపోతుంది. ఒక్క సంవత్సరం ఎంతలో తిరిగివస్తుంది? ఆ తర్వాత ఏమన్నా అవకాశం వుంటే ఇంటెరిమ్షిప్ అప్పుడు ఆలోచిద్దాం.”
“మీరు ఆలిండియా డెంటల్ కౌన్సిల్ మెంబరుగా మేడమ్! మీరు రికమెండ్ చేస్తే ట్రాన్స్ఫర్ అవదా?” అన్నాడు కృష్ణమోహన్.
“డెంటల్ కౌన్సిలు మెంబరుకైనా, సామాన్యులకైనా ఒకటే ప్రాసెస్. మేం మా కౌన్సిల్లో దంత వైద్యవిద్యను ఇంకా ఎంతముందుకు తీసుకు వెళ్ళవచ్చో చర్చిస్తాము, ఎక్కడెక్కడ కాన్ఫరెన్సులు జరపాలో ఏయే మార్పులు దంత వైద్య విద్యకు ఉపయోగపడతాయో సమీక్షిస్తాం. అంతేకాని ఒక స్టూడెంట్ను ఆ రాష్ట్రాన్నుంచి ఈ రాష్ట్రానికి అందునా నేను పని చేసే కాలేజికి రప్పించుకోవాలన్న నిర్ణయం ఎలా తీసుకుంటాం? లాలిత్య! నా మాట విని నువ్వు అక్కడే నీ కోర్సు పూర్తి చేసుకో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటావా? ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య వుంటూనే వుంటుంది. మిగతా ఫ్యామిలీ మెంబర్లు దానికి పరిష్కారం ఆలోచిస్తారు. ఈ రోజుల్లో మంచి వైద్యం అందుబాటులో వున్నది. మీరుండేది గుంటూరంటున్నారు. కాబట్టి డాక్టర్సుకు కొరత ఏం లేదు. కృష్ణమోహన్ గారూ! మీ మిసెస్ కన్నా మీరే ఎక్కువ ఆమెను ఆంధ్రాకు తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారులా వున్నది. బాగా థింక్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది సరియైన ఆలోచన కాదని, ఇలాంటి ఆలోచన్లతో టైం వేస్టు చేసుకోకండి.”
“వెళ్ళివస్తాం మేడం. మా కోసం మీరు చాలా టైం తీసుకున్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ మేడమ్” అంటూ లాలిత్య లేచి నిలబడింది.
“కొంచెం రిస్క్ తీసుకుంటే పనవుతుంది. పరిస్థితి అర్థం చేసుకుంటారేమో అనుకుంటే మనల్నే కన్విన్స్ చేసి పంపించారు” అన్నాడు కృష్ణమోహన్.
‘నాకు ముందే తెలుసు, ఇది జరిగేపని కాదు’ అని లాలిత్య మనసులో అనుకున్నది. వీలుపడదు అన్నారని తెలిసికొని కమల కూడా నిరాశపడింది.
చదువు పూర్తయ్యేవరకు ఓపికపట్టాలి. కృష్ణమోహన్ తను అనుకున్న పనులన్నీ తనకు అనుకూలంగానే జరిగి పోవాలనుకుంటాడు. తను బి.డి.యస్. పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత యమ్.డి.యస్. పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టుకోవాలని కలలు కన్నది. అమ్మావాళ్ళు మొదటినుంచీ పి.జి. చెప్పించటానికి సుముఖంగా లేరు. ‘ముందు పెళ్ళిచేస్తాం. ఆ తర్వాత వచ్చేవాడికి ఇష్టమయితే పి.జి. చేస్తావో, ప్రాక్టీస్ పెట్టుకుంటావో నీ యిష్టం’ అనేవాళ్ళు. కృష్ణమోహన్‌తో పరిచయం, అతనక్కడ కొన్ని విషయాలలో తనకు సాయపడటం గురించి ఇంట్లో వాళ్ళకు చెప్పిది. తనూ, అతనూ బాగానే స్నేహంగా వుండేవాళ్ళు. తన ధ్యాసేమో చదువు పూర్తిచేయటం మీదే వున్నది. అతనేమో తన యమ్.టెక్ పూర్తయింది కాబట్టి వెంటనే పెళ్ళి చేసుకునే ఆలోచనలో వున్నాడు. తన దగ్గర పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. ‘నేను కూడా నా చదువు పూర్తిచేస్తాను. అప్పటి దాకా ఆగకూడదా’ అన్నది. ‘మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం ఇంట్లో చెప్పాను. మా వాళ్ళను నేను ఒప్పించుకుంటాను. మీ పేరెంట్స్ కూడా కబురు పంపించారట మా ఇంటికి’, అంటూ పెళ్ళికి తొందరపడ్డాడు.
‘నాన్నగారి అనారోగ్యం, అమ్మ నా పెళ్ళి చెయ్యాలని ఆరాటపడటం, అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ప్రస్తుతానికి నా చదువు ఒక ఆర్నెల్లు వెనుకబడింది. ఇప్పుడేమో ఈ ట్రాన్స్ఫర్ అంటూ ప్రయత్నం మొదలుపెట్టాడు. కృష్ణమోహన్ క్కు అన్నింటికీ తొందరపాటే, దేనికీ నిదానించడు’ అనుకుంది లాలిత్య.
“నీ ట్రాన్సఫర్ కురిరేటట్లుగా లేదు. నేనూ కర్ణాటక వచ్చెయ్యనా? అక్కడే ఏదైనా జాబ్ గట్టిగా ట్రై చేస్తాను” అంటున్నాడు.
“ఎందుకు కృష్ణా? ఫైనలియర్, ఆ తర్వాత హౌస్ సర్జన్ చెయ్యడం అంతేగా! రెండేళ్ళు ఎంతలో గడిచిపోతాయి? మన పేరెంట్స్‌కి నువ్వైనా ఇక్కడ తోడుగా వుండు. అదేగా మనమూ అనుకుంటున్నది. నీకిక్కడ జాబ్ బాగానే వున్నది. మంచి శాలరీ వుంది. ఇంకేం ఆలోచించకు. నువ్వు కర్ణాటక వచ్చి మరలా ఫ్యామిలీ పెట్టాలంటావు. నా ధ్యాసేమో చదువు మీదుంటుంది” అంది.
“మీ కాలేజ్‌లో ఎవరూ లేరా? ఫ్యామిలీ పెట్టి చదువుకునేవాళ్ళు. నువ్వే కష్టపడిపోతున్నట్లు మాట్లాడకు, ఇద్దరం కలిసి వుండటాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను. నీకా ధ్యాసే లేదు. పెళ్ళి అయిందన్న ఊసే నీకు గుర్తుండటం లేదు. అన్ని ప్రయత్నాలు నేనే చేస్తున్నాను. మనం పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఏం ఒరిగింది? నువ్వక్కడే వుండి జాబ్ చేసుకో. నేనిక్కడే వుండి చదువుకుంటాను. ఇదేగా నువ్వు చెప్పేది” అన్నాడు కోపంగా.
అల్లుడికి కోపం వచ్చిందని కమల సర్ది చెప్పటానికి ప్రయత్నించింది.
లాలిత్యకు మూడవ సంవత్సరపు బి.డి.యస్. ఫలితాలు తెలిశాయి. ‘అమ్మయ్య, ఫైనలియర్ కొచ్చేశాను’ అనుకున్నది. తాను మరలా వెంటనే కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నది. కృష్ణమోహన్ మాత్రం ఏం మాట్లాడం లేదు. లాలిత్య ప్రయాణం సంగతి పట్టనట్లే వున్నాడు.
“ఎల్లుండి బయలుదేరతానమ్మా.”
“కృష్ణతో మాట్లాడమ్మా. చెప్పకుండా వెళ్ళకు” అన్నది కమల,
ఆ రోజు తండ్రి మంచం దగ్గర కూర్చున్నది లాలిత్య. పాలలో నానబెట్టిన బ్రెడ్‌ను స్పూన్‌తో తినిపిస్తున్నది. “నాన్నా! నేను థర్డ్ యియర్ పాసయ్యాను. ఫైనిలియర్కు వెళ్ళి జాయినవుతాను” అంది నెమ్మదిగా.
ఆయనకు కిడ్నీలు సరిగా పనిచెయ్యటం లేదు, ట్రీటిమెంట్ తీసుకుంటున్నారు గాని ఆశాజనకంగా ఏమీ లేదు పరిస్థితి, మాటి మాటికీ అస్పత్రి చుట్టూ తిరగాల్సివస్తుంది.
“చాలా సంతోషమమ్మా. జాగ్రత్తగా చదువుకో” అన్నాడు నెమ్మదిగా,
వెళ్ళే రోజున గూడ కృష్ణ ఏం మాట్లాడలేదు. ఆ ప్రస్తావన తనే తీసుకువస్తే చదువూ, గిదువూ ఏం వద్దు ఇక్కడే వుండిపో అంటాడని భయవడింది. కాని ఆ భయం కాసేపే. తన మార్కుల లిస్టులూ, ఇంకా ఇంపార్టెంట్ పేపర్లూ అన్నీ సర్దుకుని ఫైనలియర్ చేరటానికి రెడీ అయ్యింది. తన లక్ష్యం జీవితంలో మంచి డాక్టర్ కావటం.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి. వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.
కథలో ఏమీ లేదు. Disappointed.
Enduku ledu Sham GARU ! Vundi .BHARYA NENU CHEPPINATTU VINAALI …..ANUKUNE BHARTALAKU , ALLATI AALOCHANA SARIKADU …AAMEKI VOKA LAKSHYAM PASSON VUNTUNDI ..ARTHAM CHESUKOVAALI ….LEDU ANE AHAM PRADARSISTE PHALITHAM ILAGE VUNTUNDI….MEKU TELIYAKA KAADU…!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రేమ పరిమళం-9
జ్ఞాపకాల తరంగిణి-31
రాత్రి పలికిన నిజం
రాజకీయ వివాహం-2
ఎవరిళ్ళకు వారు..
తిరస్కృతి
దిశ-3: ఏం చూస్తున్నాం?
నూతన పదసంచిక-26
అక్షరాల్లో ఒదిగిన ఓ విశిష్ట వ్యక్తి జీవితం
ఆసక్తికరమైన 102 నాటవుట్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®