[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘లక్ష్య సాధనలో..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అడుగులైతే ముందుకేస్తున్నాను కానీ..
మార్గం స్పష్టంగా అగుపించడంలేదు!
సాధించాల్సిన లక్ష్యం మాత్రం
కళ్ళముందు కదులుతూనే ఉంది!
నా లక్ష్యం మాత్రమే
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారగా
బ్రతుకుపై ఆశతో సాగుతున్నాను!
లక్ష్య సాధనలో
ముళ్లున్నా, పూలున్నా,
విమర్శలున్నా, ప్రశంస లున్నా..
అన్నింటినీ సమంగా స్వీకరిస్తూ..
పట్టుదలగా జీవన పోరాటం చేస్తున్నాను!
మనస్సులో జనించిన లక్ష్యసాధనే..
నన్ను నడిపించే సన్మార్గదర్శి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.