[శ్రీ భమిడిపాటి గౌరీశంకర్ గారు రచించిన ‘లడ్డూ ప్రేమ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ‘అభినందన’ సంస్థ (విజయనగరం) ఫిబ్రవరి-మార్చ్ 2025లో నిర్వహించిన హాస్య కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ.]
“అలివర్ వెన్‌డెల్ హోల్మస్ అనే యు.ఎస్. రచయిత ప్రేమను గురించి ఏమన్నాడో తెలుసా..” అన్నాడు హనుమంతు
“తెలియదు.. నేనెప్పుడూ యు.ఎస్. వెళ్లలేదు కదా..” అన్నాను సీరియస్ గానే.
హనుమంతు ఫక్కున నవ్వి “అతనిప్పుడు లేడులే.. నువ్వు వెళ్లినా..” అన్నాడు..
“అసలు విషయం చెబుదూ… ప్రకటనలు లేని టీ.వీ సీరియల్‌లా..” అన్నాను మళ్ళీ సీరియస్‍గా.
“ఏమన్నాడంటే.. ఏ ప్రేమ శాశ్వతం కాదు.. ఏ ప్రేమ ఎప్పుడైనా నీకు తెలియకుండా మరణించవచ్చు.. అని.. బాగుంది కదా..” అన్నాడు హనుమంతు.
“ఇంతకీ ఈ ప్రేమ గొడవ ఇప్పుడెందుకు..” అన్నాను
“అంటే ప్రేమ.. దురద.. దగ్గు… ఈ మూడింటిని దాచటం అసాధ్యం కదా..” అన్నాడు హనుమంతు, మధురవాణి ముందు చిద్విలాసంగా నవ్వే గిరీశంలా.
“ఇప్పుడు ఆ మూడింటిలో నీకు తగులుకున్నదేమిటి?” అన్నాను. లుబ్ధావధాన్లు స్టయిల్‍లో నవ్వి.
“మన రామకృష్ణ కలిసాడులే.. గురుద్వార్ బస్ స్టాప్‍లో.. అందుకు వాడి లడ్డూ ప్రేమ గుర్తుకు వచ్చింది.. వాడి కూతురు హర్యానా జిలేబీలు వేసేవాడిని ప్రేమించిందంట..” అన్నాడు మళ్ళీ గిరిశం స్టయిల్‍లో.
ఇద్దరం.. అలా.. రిషికొండ నుంచి తెన్నేటి విశ్వనాథం పార్క్ వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చాం. సంచిలో వాటర్ బాటిల్ తీసి నీళ్లు త్రాగాం.. రిలాక్సయినాం.. ఓ గంట ఆ కబురూ.. ఈ కబురు చెప్పుకొని.. మళ్లీ.. ఎం.కే. గోల్డ్ కోస్ట్ వరకు వాకింగ్ చేస్తాం.. వేసవి సెలవుల్లో ఇదే మా నిత్య కృత్యం.. ఇద్దరం.. లెక్చరర్స్‌గా పనిచేస్తూ విశాఖ చేరిపోయాం. పాత సంగతులను ఇలా ఎవరో తెలిసిన వారు కలిస్తే తవ్విపోసుకుంటాం.. ఆ మట్టి మాకంటనిదయితే.. సరదాగా..
ఇది పాతికేళ్ల ప్రేమకథ.. మా మిత్రుడు రామకృష్ణ కథ..
ప్రస్తుతం వాడి కూతురు కథ కూడా..
***
శ్రీకాకుళం దగ్గర్లో.. మబగామని.. ఓ చిన్న కుగ్రామం.. అప్పటికి అక్కడ ఇప్పుడున్నంతగా మేడలు.. సంపద.. లైట్లు లేవు. గ్రామం అంటే గ్రామమే.. రామకృష్ణ అక్క పెళ్లికి.. స్నేహితులుగా వెళ్ళాం.. అప్పటికి పీ.జీ. చేసి ఉన్నాము.
రాత్రి ఎనిమిదన్నరయింది. మే నెలలో పెళ్లి. కరెంట్ ఆరిపోయింది. మా ఇద్దరికీ ఊపిరాడటం లేదు.
రామకృష్ణ అక్క మా దగ్గరికి వచ్చి “ఓరే హనుమంతు, కృష్ణ ఏడిరా” అంది పెళ్లికూతురు గెటప్‍లో..
మా ‘ట్రయిల్స్’ లో మేమున్నాము. అవును.. వీడేడి.. ఆఁ.. బహుశా.. వాడి ‘ట్రయిల్స్’లో వాడున్నాడేమో అనే అనుమానం వచ్చింది. ట్రయిల్స్ అంటే ఆడపిల్లల వెంట పడటం.
మధ్యాహ్నం భోజనాల సమయంలో వాడో అమ్మాయితో తిరగడం గమనించాం.. ఇంట్లో చెంచా కూడా తీయని వాడు.. ఆమె వెనకాల.. బరువయిన పాత్రతో అన్నం వడ్డించడం కూడా చూసాం. అప్పుడే అనుకున్నాము.. అమ్మో.. మాకన్నా జోరుగా.. అప్పడాలు విరిచేస్తున్నాడని (ఇది మా కోడ్ లెండి.. ఇప్పుడు పులిహోర కలుపుతున్నాడంటున్నారు).. అది గుర్తుకు వచ్చింది..
రాత్రి సమయం.. గాలి లేదు.. కరెంటు లేదు.. ఇంతకన్నా ‘గొప్ప సమయం’, ‘మంచి సమయం’ ఏముంటాయి కనుక.. దగ్గ(రవ)టానికి, గోక్కోవటానికి.. మెల్లగా శబ్దం చేయకుండా.. నల్లపిల్లులు మాదిరిగా మేడ ఎక్కాం.. నీళ్ల ట్యాంకు దగ్గర.. దగ్గరగా.. దాదాపుగా కలిసి.. ఏదో.. తినిపించుకుంటున్నారు. మాకర్థమైంది.. చిన్న దగ్గు దగ్గి.. వారి ఏకాంతానికి.. మా సంకేతం పంపి.. క్రిందకు వచ్చేసాం. మరీ.. వారికి దగ్గరగా వెళ్ళటం బాగోదు కదా.. ‘దగ్గుతున్నవారికి’ దగ్గరగా వెళ్ళకూడదని కదా నీతి. కరోనా నేర్పిన పాఠం పావుగంట తరువాత.. పెళ్లి పందిట్లో ఉన్నా మా దగ్గరకు వచ్చి “అక్క పిల్చిందట కదా.. చెప్పింది.. ఆమెకు మధ్యాహ్నం అన్నంలో లడ్డూ వేయలేదట.. కావాలంటేనూ..” అని చెప్పుకొచ్చాడు. ఇంతలో నాకు నా ‘అరిసె’, మా హనుమంతుకు ‘సున్నుండ’ గుర్తుకు వచ్చాయి.. గబగబా వంటగదిలోకి వెళ్ళాము.. మాకు కావలసినవి తీసుకున్నాము.. మా ‘దగ్గుల’ కోసం వెతికాము.. అబ్బే.. చీకట్లో వారు కనిపించలేదు.
***
“నువ్వు నా పెళ్ళికి రావాలి.. సుమా.. మీ అరిసెలు.. సున్నుండలు కూడా వస్తున్నాయి మరి..” అన్నాడు రామకృష్ణ పోస్ట్ కార్డు సైజు శుభలేఖ మా చేతిలో పెట్టి. మేము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం. లెక్చరర్ పోస్టు కోసం ఏ.పీ.పీ.యస్సీ రాస్తూ.. ‘సరే’ అన్నాం నవ్వుతూ.
వాడి పెళ్లి ‘లడ్డూ’తోనే జరిగింది.. కాంట్రాక్టులు చేసి బాగా ‘బలిసాడు’ అంటే బాగా సంపాదించాడని సుమండి.. నచ్చే బొమ్మల దొరకవు, దొరికే బొమ్మలు నచ్చవనే ముళ్ళపూడి వారి వాస్తవం మా ఇద్దరి వివాహాలు నిజం చేసాయి, తరువాత కాలంలో మరి..
ప్రస్తుతం వాడి కూతురు.. వాళ్ళింటి ముందు హర్యాణా జిలేబీలు వేసే కుర్రాడిని ప్రేమించిందట..
ఓ రోజు మా దగ్గరకు వచ్చి.. “ఇదేం ఖర్మరా బాబు.. జిలేబీలు వాడిని ప్రేమించానంటుంది” అని వలవల బోయి.. విలవిలలాడాడు. మేము ఓదార్చేము. “ఇప్పటి ప్రేమలు కేవలం తాత్కాలికం, నీవేమీ భయపడకు,. బాగా ఆటో నడిపేవాడినో, లేకుంటే దోశలు వేసేవాడినో చూపించు. జిలేబిలు వేసేవాడిని మరిచిపోతుంది.. వర్రీ కాకు.. సరదాగా అన్నాములే.. నీ లడ్డు ప్రేమ గుర్తుకు వచ్చి.. నీకు బాగా తెలిసిన బలిసిన.. కాంట్రాక్టర్ సంబంధం చూడు.. ఓ నాలుగు రోజులు కారులో తిప్పు.. దశపల్లా.. నోవాటెల్లో భోజనాలు అలవాటు చేయించు.. ఆ తరువాత.. కథ చూడు..” అన్నాము ఇద్దరం ముక్తకంఠంతో.
అతడు శాంతించిన (?) మనసుతో వెళ్ళాడని మేమనుకున్నాము..
తరువాత ఆరు నెలలకు ఓ పెళ్లి కార్డుతో వచ్చాడు.. ఆనందంగా.. తన కూతురితో.. ఆ పిల్లే.. “మీరు తప్పకుండా రావాలంకుల్.. కరోడ్‍పతి మా మామయ్య. నా ఉడ్ బీ అమెరికాలో ఎం.ఎన్.సి. లో సి.ఈ.వో. పెళ్లి తరువాత అమెరికా వెళ్ళిపోతా.. మీ బ్లెస్సింగ్స్ కావాలి..” అని నా కాళ్లకు నమస్కరించింది.
మెల్లగా.. ఆమె.. “చెవిలో మరి జిలేబీలు ఏమయ్యాయి” అన్నాను.
“పోండంకుల్.. ఇప్పుడు జిలేబీలేమి తింటాం.. పిజ్జాలు, బర్గర్లు తప్ప” అంది గడుసుగా. వాళ్ళాయన అమెరికాలో పిజ్జా కంపెనీ సి.ఇ.ఓ మరి.
ప్రేమ ఒక ఉద్వేగం.. దీనిని అనుభవించేవారు ఎక్కువ.. ఆనందించేవారు తక్కువ.. లడ్డూ ప్రేమలకు, జిలేబి ప్రేమలకు అదే తేడా.
మీరేమంటారు..!?