[‘బుంగమూతి’, ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే పిల్లల పుస్తకాలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఆంధ్ర ప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలోని ఎస్. కోటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు కవి, కథకులు, బాలసాహితీవేత్త. కరెన్సీ నోట్ల సేకరణ, పిల్లలతో పలు కార్యక్రమాలు చేయించడం వారి అభిరుచులు.
పిల్లలకు కథల రూపంలో మంచి చెప్పడమే కాకుండా తెలుగు భాషపై మక్కువ కలిగించేలా చేసేందుకు తన వంతు ప్రయత్నంగా కాశీ విశ్వనాథం గారు తెలుగు పలకుబడులను, సామెతలను కథలలో ఉపయోగిస్తూ, వాటి వెనుక ఉన్న కథలని వివరిస్తూ – పలుకుబడులతో ‘బుంగమూతి’ అనే కథల పుస్తకం, సామెతలతో ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే పుస్తకం వెలువరించారు. తెలుగులో ఈ పలుకుబడులు, సామెతలు ఎలా పుట్టుకొచ్చాయో, వాటిని ఏ సందర్బంలో ఎలా ఉపయోగిస్తారో కథలలో సన్నివేశాల ద్వారా, పాత్రల మధ్య సంభాషణల ద్వారా చక్కగా, సులువుగా అర్థమయ్యే రీతిలో వివరించారు.
‘బుంగమూతి’ – పలుకుబడుల కథలు:
ఇందులో 50 కథలున్నాయి. అన్ని కథలకు కార్టూనిస్ట్ హరి వెంకట రమణ చక్కని చిత్రాలు గీసారు. పిల్లలకివి మరొక అదనపు ఆకర్షణగా ఉంటాయి. ఈ పుస్తకంలోని కొన్ని కథలను పరిశీలిద్దాం.
లచ్చవ్వకి 70 ఏళ్ళు దాటాయి. పుట్టి పెరిగినది, పెళ్ళయి కాపురం చేసినవన్నీ పల్లెలే! పట్నం ఎప్పుడూ చూడలేదామె. రైలెక్కి పట్నం వెళ్ళి అక్కడి వింతలు విశేషాలు చూడాలని కోరుకుంటుంది. ఆమె వయసు రీత్యా, శారీరక ఇబ్బందుల దృష్ట్యా, పెద్ద కొడుకు వద్దంటాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కొడుకుని బ్రతిమాలి, ఒప్పించి, పట్నం బయల్దేరుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంది. తీరా పట్నం వెళ్ళాకా, మనవడికి ఆమెతో మాట్లాడేంత తీరుబాటు ఉండదు. ఎండల వల్ల, ఇంట్లోంచి బయటకు రాలేక, వింతలూ విశేషాలు చూసే ఓపిక లేక ఇంట్లోనే ఉండిపోతుందామె. మనవడి కొడుకుతో ఆడుకుంటుంది, కానీ అక్కడి పద్ధతులేవీ నచ్చని ఆమెకి పట్నం అంటే వెగటు కలుగుతుంది. చివరికి కొడుకు కోడలితో కలిసి పల్లెకి వచ్చేస్తే గాని తృప్తి కలగదు. ‘బాధపడితే కానీ బోధపడదు’ అనే పలుకుబడికి అల్లిన కథ ఇది.
ఆటల్లో వాడే పదాలతో కూడిన – ఆటలో అరటిపండు’, ‘పులుసులో ముక్క’ అనే రెండు పలుపబడులతో చక్కని కథగా మలిచారు రచయిత. ఆటలో అరటిపండు గురించి అందరికీ ఎంతో కొంత తెలిసినా, ‘పులుసులో ముక్క’ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ప్రాధాన్యత ఇవ్వనవసరం లేని వ్యక్తులని లేదా పిల్లలని ‘పులుసులో ముక్క’ అని అనడం ఎలా మొదలయిందో చక్కగా చెప్పారు రచయిత.
‘కుండలో గుర్రాలను తోలద్దు’ అనే పలుకుబడిని, ఆకలి మీదున్న కుర్రాడికి అన్వయించి, దాని అర్థం సులువుగా వివరిస్తారు. దాన్ని అర్థం చేసుకున్న పిల్లాడు, ఆ పలుకుబడిని ఉపయోగించడమే కాకుండా మరో పలుకుబడి జోడించి అమ్మకి చెప్తాడు. అర్థమయ్యేలా చెప్తే పిల్లలు ఎంత సులువుగా నేర్చుకుంటారో అని చెప్పేందుకు ఈ కథ చక్కని ఉదాహరణ.
‘ఏరు ముందా ఏకాశి ముందా’ అనే పలుకుబడి వెనుక ఉన్న కథని ఆలయ పూజారి ద్వారా చెప్పించడం గ్రామంలో అందరినీ కలుపుకునిపోయే మంచి జీవనశైలికి సూచన.
‘రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తీయండి’ అనే పలుకుబడి వెనుక ఉన్న కథని మునిమనవడి బుడిబుడి అడుగులు చూసి మురుస్తున్న మునిమామ్మ మనవడితో చెప్తుంది. ఇళ్ళల్లో బామ్మలు ఉండి మనవళ్ళకి, వారి భార్యలకి మార్గదర్శనం చేసే రోజు మళ్ళీ వస్తే బాగుండనిపిస్తుంది ఇటువంటి కథలు చదివాకా.
‘పుల్లారుబుడ్డి’ కథ తెలుగువారి ఇళ్ళల్లో వివాహాల సందర్బంగా జరిగే వేడుకల్లో ఉపయోగించే పలుకుబడిని చక్కగా వివరిస్తుంది
‘పులి బక్రడం బావ బతకడం’ కథలో ఊరికి, ప్రధాన పాత్రకి పెట్టిన పేర్లు – ఆ ఊరి, ఆ మనిషి స్వభావాన్ని ఒకే పదంలో వెల్లడి చేస్తాయి. అంత చక్కగా పెట్టారా పేర్లు – ఊరి పేరు లొసుగూరు, ఆ మనిషి పేరు అబద్ధం.
‘కాలి కింద కన్నం’ కథలో ఆ పలుకుబడి ఎలా వచ్చిందో వృద్ధురాలైన తల్లి కొడుక్కి చెప్పినప్పుడు – పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, అనుభవం మీద పెద్దలకు కలిగే జ్ఞానంపై గౌరవం పెరుగుతుంది.
తుంతగువు అంటే ఏమిటో, దాన్ని ఎవరు ఎలా తీర్చారో తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది.
ఈ కథల్లో పాత్రలు పిల్లలు, పెద్దలు – మాస్టార్లూ, విద్యార్థులు, తాతయ్యలు మనవళ్ళూ మనవరాళ్ళూ, అమ్మానాన్నలు పిల్లలు! అంటే ఈ కథల ద్వారా కుటుంబ బంధాల విలువని, సామాజిక బంధాల విలువని చాటినట్లయింది.
“ఆయన కథలు సరళమై, సుబోధకమై, సంక్షిప్తమై, పాఠాలై బోధిస్తాయి. ఇబ్బందుల్ని గుణపాఠాలై వారిస్తాయి” అంటారు ఈ కథల గురించి శ్రీ చొక్కాపు వెంకటరమణ తమ ముందుమాటలో. ఈ కథలు చదవడం పూర్తి చేసాకా, పాఠకులు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తారు.
***
‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ సామెత కథలు:
ఈ పుస్తకంలో కూడా 50 కథలున్నాయి. అన్ని కథలకు కార్టూనిస్ట్ ప్రేమ్ చక్కని చిత్రాలు గీసారు.
“భాషా సౌందర్యానికి మూలమైన సామెతలతో కథలు అల్లడం ఆషామాషీ విషయం కాదు. ఈ పుస్తకంలో ఉన్న కథలన్నీ దేనికదే ప్రత్యేకమైనది. ఈ పుస్తకంలోని కథలు పాఠకుల మదిలో పదికాలాల పాటు చిరస్థాయిగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు” అన్నారు శ్రీ చొక్కాపు వెంకటరమణ తమ ముందుమాటలో. ఈ ముందుమాటలో సందర్భోచితంగా చక్కని సామెతలను ఉపయోగించారు.
ఈ పుస్తకం తీసుకురావడంలో తన ఉద్దేశాన్ని ‘నా అంతరంగం’లో వివరించారు రచయిత.
ఈ కథలకు చందమామ రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారి చక్కని కితాబునిచ్చారు.
‘రోలు మొర.. మద్దెల చుర చుర’ కథలో రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకోవడం అనే సామెత ఎలా వచ్చిందో చెప్పారు.
చుట్టుపు చూపుగా వచ్చి, ఇంట్లో తిష్టవేసి బంధువులు కాస్తా రాబందులైతే, వాళ్ళని ఇంట్లోంచి పంపేయడానికి ఆ పేదింటి ఇల్లాలు వేసిన చిట్కా నుండి పట్టింది – ‘పొమ్మన లేక పొగపెట్టడం’ అనే సామెత.
‘కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది’ అనే సామెతని ఉపయోగిస్తూ చెప్పిన కథ బాగుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట లొంగక తప్పదని, అది కాలమే నిర్ణయిస్తుందని ఈ కథ చెప్తుంది.
‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు’ అనే సామెత కథ సంచికలో ప్రచురితమైంది. పనికి రాని వాటిమీద, బలహీనుల మీద ప్రతాపం చూపినప్పుడు ఈ సామెత వాడతారని చెప్పారు రచయిత.
ఒక్కొక్కరికి ఒకొక్క భయం ఉంటుంది. ఎదుటి వారి భయం తమకు అర్థరహితంగా అనిపించినట్టే, మన భయం వాళ్ళకు అర్థరహితంగా తోస్తుంది. ఇదే విషయాన్ని చెబుతుంది ‘ఉన్న ఊరు వాడికి కాటి భయం పొన్నూరు వాడికి ఏటి భయం’ అనే సామెత కథ చెబుతుంది.
‘కోతి పుండు బ్రహ్మరాక్షసి’ అనే సామెత ఎలా వచ్చిందో చెప్పే కథ ఆసక్తిగా ఉంటుంది.
‘ఎగిరి దంచినా ఎగరకుండ దంచినా అంతే కూలి’ అనే సామెత యజమాని మెప్పుకోసమో, ఎక్కువ డబ్బులిస్తారనో ఆశపడి భంగపడిన సందర్బాలలో ఉపయోగిస్తారని ఒక కథలో చెప్తారు రచయిత.
భగవంతునిపై భారం వేసి కార్యసాధన కోసం ధైర్యం తెచ్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి సంబంధిన కథని ‘తెగించిన వాడికి తెడ్డే లింగం’ అనే సామెతకి వర్తింపజేసి చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.
‘మప్పుకుంటే తిప్పుకోలేము’ అనే సామెతకి చక్కని కథని అల్లారు. ‘గర్వం తీయని విషం’, ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే సామెతలకు అల్లిన కథలు బాగా నప్పాయి.
***
ఈ రెండు పుస్తకాలలోని కథలకున్న విశేషం బొమ్మతో సహా, రెండు పేజీలలో ముగియడం! పిల్లల కోసం ఎంత చెప్పాలో అంతే – సరిగ్గా కొలిచి చెప్పినట్టుగా చెప్తూ, ఓ పలుకుబడినో/సామెతనో వివరిస్తూ దానికి సంబంధించిన మరో పలుకుబడినో/సామెతనో ఆ కథలో చొప్పించి Two in One లా, ఒక్కోసారి Three in One లా ఉపయోగించుకుంటూ చక్కని కథలను అందించారు కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు.
పిల్లలే కాదు, పెద్దలు కూడా చదవదగ్గ పుస్తకాలు ఇవి.
***
(పలుకుబడి కథలు)
రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు
ప్రచురణ: పి.ఆర్. పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 110
వెల: ₹ 400/-
ప్రతులకు:
కాశీ విశ్వనాథం పట్రాయుడు
ఆంగ్ల ఉపాధ్యాయులు,
భవానీ ఐటిఐ దగ్గర, ఎస్. కోట,
విజయనగరం జిల్లా. 535145
ఫోన్: 9494524445
~
(సామెత కథలు)
రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు
ప్రచురణ: పి.ఆర్. పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 110
వెల: ₹ 250/-
ప్రతులకు:
కాశీ విశ్వనాథం పట్రాయుడు
ఆంగ్ల ఉపాధ్యాయులు,
భవానీ ఐటిఐ దగ్గర, ఎస్. కోట,
విజయనగరం జిల్లా. 535145
ఫోన్: 9494524445
~
శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kasi-viswanatham-patrayudu/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
