[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
షష్టాశ్వాసము – మూడవ భాగము
ఉ.॥
తెల్లగ తెల్లవార కనుతేలగ సంద్రము మీద నంతటిన్
చల్లగ నుండు పూరములు ఛాతిని తాకగ వేగిరంబునన్
తృల్లిటు గెంతుచున్ విడక తృప్తిని బొందక సంద్రమందునన్
ఎల్లలు గానకుండగను ఏగుచు వార్ధిని చుట్టివత్తుమే. (491)
మ.॥
నిసిరాత్రంబున లేచి మేము యిక యా నీరంబునే మున్గుచున్
మసి బారంగను రాత్రి వేళలను యేమారంగ మేముండగన్
కసిచే మీనము బట్టుచుంటిమిక మేకంబైన లోకంబులోన్
విసుగున్ లేకను సంచరించెదముగా వేసార మేమీ యిలన్. (492)
సీ॥
రాత్రి వేళల యందు నాత్రంబుగా మేము
కడలి వద్దకు జేర కదులు వేళ
చీకటి రాత్రులన్ చిక్కక దృష్టికిన్
పాము కాటును వేయ ప్రాణ హాని
పాదరక్షలు లేక పరుగిడుచుంటిమి
చీకటందున గుచ్చె చేటు ముళ్ళు
అన్ని గ్రామంబులన్ అలరెగా విద్యుత్తు
మా గ్రామమందున మరియు లేదె
తే.గీ.॥
వెలుగు రాజిల్లు కాలంబు వేగరాదె
మాదు బిడ్డల ప్రశ్నల మనసు నిలిపి
ఏడ్చుచుంటిమి సిగ్గుతో ఏది త్రోవ
తలలు దించుక బ్రతుకును దాల్చినాము. (493)
ఉ.॥
మా పసిపిల్లలున్ చదువ మా పురియందున స్కూలు లేదె; యే
మీ పని యంచు యుంటిమిక మీదట ఎన్నిక వేళలందునన్
ఆ పని చేయువారలకె ఆపక వోటును వేసెదంచు; మా
యీ పని తేల్చి ముందరకు యిట్టుల సాగుమటంచు బల్కమే. (494)
ఉ.॥
రోగము రొచ్చు రాగ మరి రొప్పుచు పోదు మనంత దూరమున్
వేగమె వైద్య సౌకరము ఎక్కడ నున్నది మాదు గ్రామమున్
సాగుచునుండె వత్సరపు సంధుల నుండి యనంత కాలమున్
కాగల కార్యమున్ గడచి కమ్మని వార్తల నంద జేగదే. (495)
ఉ.॥
ఎండకు వానకున్ తడిచి వేడికి సైతము మ్రగ్గిపోయి; యా
దండ్రి సముద్ర తీరమున దారెటు గానక యుండి పోతిమే
బండనమందు భీములుగ బాగుగ చేపలు పట్టుచుండ్రు; యీ
ఎండెడి మోములన్ దరికి ఎంతకు దారిని జూపరెవ్వరున్. (496)
ఉ.॥
లోకము నిద్రజాలమున లొంగి గిలంగిల కొట్టుచుండగన్
వేకువ ఝామునే నిదుర వీడెదరింకను జాలముల్ గొనన్
ఆకలి దీర్చగన్ దుదకు ఆర్తిగ సద్దిని నింపి గైకొనన్
మాకున పాత్ర లెత్తుకొని మానక చేరె సముద్ర తీరమున్. (497)
ఉ.॥
రేయి సముద్రమంతటను లెక్కకు మించిన రీతి వాసనల్
రోయుచు నుందుమో లవణ రోతను బొందు విధంబు నుండగన్
చేయిని బట్టి కెల్కినను చెంపల కెంపు తళుక్కు వర్ణముల్
రాయిని మించు రత్నముల రాశిని సంద్రజలంబు గాంచెడిన్. (498)
చం.॥
తళుకును గాంచి మైమరిచి తాకిన చేతికి శీత పూరముల్
కళుకున స్పర్శనొందు మరి కంపును తాకిన నాసికాగ్రముల్
మిళుకున మెర్వగన్ మనము మీలు వసించెడి నీలు కాదనన్
తళుకు బెళుంకు రత్నమని తప్పక సాంతము మోసమీ ధరన్. (499)
సీ॥
కనులు బొడుచుకున్న కానదు యా వేళ
కడలి యందున తెప్ప కదులుచుండె
ఎటు బోవుచుందుమో ఏమి చేయవలయు
ఎవరొచ్చి సాయంబు ఇటుల జేయు
యంత్రసాయము లేదు యవనిలో తోయాలి
తండ్లు తెడ్ల వలన తనర కదలు
తెల్లవారకు ముందె తీరంబు నొదిలేసి
ఆరీగి చేరును అదను లోపు
తే.గీ.॥
ఇన్ని కష్టంబు లోర్చితి మేధి నందు
అయ్యొ ఇది యేమటంచును యాశ తోటి
దలచ రక్కట ఏమిటో దారుణంబు
భూమి లోపల ఎంతెంత భేదమందు. (500)
ఉ.॥
పట్టిన చేపలన్నిటిని పావల కోపది కమ్ముచుండె; యి
ప్పట్టున గూడు లేక భువి పాలను సైతము లేక పిల్లలున్
గట్టిగ నేడ్చు చుందురిక గాసిని దీర్చుక లేరు గన్క; యా
పట్టిన చేపలన్ యధిక పాటుకి నమ్మను దారి జూపుడీ. (501)
ఉ.॥
ఏ యధికారి రారు గద నెన్నగ బాధల బాపనీ ధరన్
ఏ యధికారి రారు గద ఇట్టి సమస్యల గోడు నాలకిం
చే యధికారి రారు గద చెప్పెడు బాధల బాపనీ మహిన్
యీ విధ కార్యముల్ వసుధ నెవ్వరు గూడ పరిష్కరించరే. (502)
సీ॥
పురిటి నొప్పుల తోటి పుణ్యంపు స్త్రీలంత
ముక్కోటి దైవాల మ్రొక్కు లిడుచు
ప్రసవ వేదన నుండి పైకి లాగమనుచు
మనసున వేడగా మానకుండ
పది మైళ్ళ దూరంబు ప్రసవ వేదన తోటి
చావు బ్రతుకులతో సంధి కొట్ట
బ్రతుకంత ఘోరమై భారంబు గను జేరి
బతుకు చుందురు వీరు భయము తోడ
తే.గీ.॥
ఎట్టులైనను మాదైన ఇట్టి వేద
పటు తరంబుగ పోకార్చి పంతమలర
మాదు బతుకున వెలుగును పాదు కొలుప
హృదయమందున నిను గొల్తు సదమలముగ. (503)
ఉ.॥
ఈ విధ బాధలన్ బడుచు ఈ దినమందున యుంటి మీ ధరన్
ఏ విధమైన గాని మము యీ భువి యందున మాదు పిల్లలన్
కోవిదులైన రీతి దయ గొమ్మిక పట్టెద మీదు పాదముల్
కావను భూమి లోపలను కౌతుక మిచ్చెడి వారు లేరికన్. (504)
తే.గీ.॥
నీకు తెలియక లేదింక నిజము సుమ్ము
నీదు ముత్తాత నుండియు నిటుల బాధ
లందు చుంటిమి మేమంత; రాజితముగ
చదువు కొంటివి ఉద్యోగ చతురుడవుగ. (505)
ఉ.॥
మా దయనీయ జీవనము మాన్పను వచ్చిన కాంతిరేఖవే
ఏ దయ లేక యుంటిమిల ఎన్నడు వెల్గునొ కానమింతకున్
ఓ దయరూప మమ్ములను ఒడ్డున వేయుము సంతసించగన్
నీ దయ చేతనే పుడమి నిక్కము మేమును శాంతి నొందమే. (506)
ఉ.॥
ఎన్నికల వేళలను నరుదు దెంచెడి నాయకులంత జేరి; మీ
చిన్నది యైన బాధలను చేతుము చేతుమటంచు యోటులన్
మన్నన తోడ మాకు మరి మానక వేయుడి వందనంబిదే
అన్నటు వంటి వారలును ఐనచొ పిమ్మట గానుపించరే. (507)
కం.॥
ఇప్పుడు వస్తివి నీవును
తప్పక తొలగును యిడుమలు తప్పులు లేకన్
ఒప్పుగ తీర్చిన వెతలను
అప్పటి నుండియు నీ యెడ ఆర్తిగ గొలువన్. (508)
వచనం॥
అని బల్కి కూర్చుండిన పిమ్మట నా సోమరాజు యా బాధల చిట్టాను విని విచలిత హృదయాంతరంగుడై ద్రవీకృత మనస్కుడై (509)
కం.॥
వింటినిలే మీ యిడుమలు
కంటిని ప్రత్యక్ష గతిని కన్నుల తోడన్
మింటికి నందెడి కష్టము
యింటిని పెరకును సతతము ఈ విధి నిజమౌ. (510)
శా.॥
మీ కష్టంబుల నాకలించితిని నా మీదన్ మహా భారము
న్నేకన్ రీతిగ నొంద జేసితిరి నేనేలాగు నన్జేయగన్
లోకంబుల్ బహు సంతసం మురియ కాల్మొక్కైనను జేసెద
న్నేకాకిన్ గదయంచు దల్చకుడి మున్నేనున్ బలుండైతినే. (511)
ఉ.॥
నాకును శక్తి మించదని నమ్మకమైనది మీదు కోర్కెలన్
మీకును హామి నిచ్చెదను మిక్కిలి బాధలు లేక చేసెదన్
ప్రాకటమైన రీతి యిటు ప్రాజ్ఞులు విజ్ఞులు మెచ్చు రీతిగన్
ఏకము జేతు బాధలను ఎన్నడు దాపును జేరకుండగన్. (512)
ఉ.॥
మీకిదె మాట యిచ్చెదను మిక్కుట రీతిగ బాధలన్నటిన్
ఏకము జేసి వెళ్లెదను ఏవురు నమ్ముము నాదు వాక్కులన్
శోకము నున్న మీరలును సుంతయు శేషము లేక జేసెదన్
మీకిదె మాట ఇచ్చెదను మిక్కిలి వెల్గును చిందునట్లుగన్. (513)
తే.గీ.॥
ప్రతిన జేసిన యాతని పల్కులినగ
నంత శాంతులునయ్యిరి అవని జనులు
మనదు కులమున, పురమున, మసలినట్టి
మానధనుడిట్లు పలుకగ మరువ గలమె. (514)
తే.గీ.॥
అంత మరియొక సారటు సంతసమున
చెలగి మార్మోగె కరతాళ కలకలంబు
మనసు నిండుగ దోచెను మౌనమేల
మనదు కొమరుని దీవించ మగత యేల. (515)
(సశేషం)
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.