Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కుసుమ వేదన-22

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

షష్టాశ్వాసము – మొదటి భాగము

కం.॥
పాలన జేయవె శ్రీహరి
పాలించగ వేగరావె పాప విదూరా
లాలనతో నా మనసును
మేలుగ రంజిల్ల జేసి ఏలవె స్వామీ.

సోమరాజు స్వగ్రామానికి వచ్చుట

ఆ.వె.॥
సోమరాజు నొక్క నాడు తలంచెను సొంత జనుల
చూసి రావలంచు చోద్యమలర
క్రింది వారి బిల్చి కోర్కె దెల్పినపుడు కీడు లేక
పోయివత్తు మనుచు పుడమి వెడల. (441)

చం.॥
అనగనె వారలంతయును యాత్ర తనొందుచు పర్వులెత్తుచున్
పనిబడి యట్టి మత్స్యముల బట్టెడి గ్రామము నెంచి రంతటన్
గొనగొని యాదరంబునను గొప్పధికారియు మీదు గ్రామమున్
పనిబడి వచ్చుచుండెనని పాలెపువారికి తెల్పిరంతటన్. (442)

ఉ.॥
అప్పుడు గ్రామవాసులును యబ్బుర మందుచు బాలరాజుకున్
యప్పుడు బుట్టినట్టి సుతుడాగమమాయెను సోమరాజహో
గొప్పగ విద్యలన్ బడసి కూరిమి తోడుత జిల్ల కంతకున్
కప్పము కట్టుకొంచు మరి గౌరవ రీతి కలెక్టరయ్యెడిన్. (443)

ఉ.॥
అంతటి విద్య నేర్చిన మహామనిషిప్పుడు మమ్ము జూడగన్
ఎంతయొ యాశ గల్గిమన మీపురవాసుల కల్వ గోరగన్
ఎంతటి భాగ్యమీ పురికి యీ దినమందున చూడరాగ; ఎం
తెంతను కున్నగాని మన మీ దీనమందున స్వాగతించమే. (444)

సీ॥
మన కష్టమెల్లను మానకన్ దోలును
యా సోమరాజును యతిగ గొలువ
వేగరారె జనుల వెయ్యేళ్ల కష్టంబు
పారదోలగ వచ్చె ప్రభుడనంగ
మేర మీరెను గదా మెల్లగా ఈ వార్త
వినగ మనసు నందు విదితమయ్యె
జాగు చేయగనేల జాతి వాడొచ్చెను
కదలి వేగను రండు కనికరమున

తే.గీ.॥
అటుల గ్రామస్థులందరు యాశ జెంది
మనదు గ్రామాన బుట్టిన మాన్య చరితు
ఎటుల యుండెనొ జూతము వేగరారె
వాని కన్నుల గాంచను వైనమౌరి. (445)

చం.॥
వరుసగ రెండు మూడు దినవారము నుండియు యట్టి వారలున్
దరిశిన మిచ్చెగా పురికి దారి నెదుక్కొని ఉన్నతాధికా
రరయగ వీధులున్ మురికి యంతయు జిమ్ముచు బారవైచుచున్
సరగున వత్సరంబునకు సాలుగ రాని సమస్త వారలున్. (446)

సీ॥
అప్పుడా వీధుల యందాలు జూడగ
మనపురం బాయిది యనక బోదు
గందరగోళమై గతిలేక దిరిగెడి
చిత్తు కాగితములు చిందులేయు
వీధులందున సాగు విధి లేని పశువులు
వేయు బేడల తోడ విసుగు కలుగు
దుర్వాసనల బాధ సర్వంబు బోయెను
ధరణి సోమరాజు ధర్మమాని

తే.గీ.॥
ఆ విధంబుగ వీధుల నటుల నూడ్చి
వేయ జూసిన ప్రజలకు వేయి రెట్ల
సంతసంబును గూర్చెను స్వామి భక్తి
తోడ జేసెను వారలు తొలుత నచట. (447)

ఉ.॥
ఈ దినమే గదా మనదు యీప్సిత మేర్చను సోమరాజు; య
య్యధిక బాధలన్ పుడమి యందున దీర్చను యాగమించెడిన్
లేదిక మాకునుం గలుగు లెక్కకు మించిన వేదనంబులన్
రాదిక మాదు సంఘమున రచ్చను జేసెడి యీతి బాధలన్. (448)

చం.॥
అనుదినమందునన్ మనము ఆకలిదప్పుల చేత సంద్రమున్
గణనకు మించు వేదనల గాటను జిక్కి నశించి పోవగన్
వినుటకు మాదు వేదనల విజ్ఞులు లేరని చొంత నొందగన్
పనిగొని వచ్చెడిన్ మదిని పాలన జేయగ సోమరాజుయున్. (449)

తే.గీ.॥
అటుల యా దినమందున పటుతరంబు
గాను యేతెంచె పురికిని గారవమున
సోమరాజను యధికారి సూనుడిగను
యిచట బుట్టిన చేపల వీర సుతుడు. (450)

తే.గీ.॥
అతని రాకకు మేమును యనవతరము
వేచి యుందుము నిప్పుడు వేడ్క మీర
మాదుపురమంత నిప్పుడు మారుమ్రోగ
తారజువ్వల వెలిగింతు తనివి దీర. (451)

తే.గీ.॥
మేళతాళాల వారిని మిగుల బిలిచి
బ్రాహ్మణోత్తము లందరిన్ బాగు బిల్వ
చేరె నా వూరి యాలయ చెంతకపుడు
వచ్చి చేరెను చేపల వారలంత. (452)

తే.గీ.॥
యూరి వారందరును గూడ నుత్సహమున
తలల నంటియు శుచిగాను తరలివచ్చె
పురము మధ్యన యుండియు పూజలొసగు
ఆలయపు దాపు నెలకొల్పెనపటి కపుడు. (453)

తే.గీ.॥
అచట నెలకొల్పె ఎత్తైన యాకృతపుడు
దాని పైనను బరిచిరి దండిగాను
పచ్చరంగున యుండెడి పట్టలపుడు
మీదు మిక్కిలి దండిగ మెండు గాను. (454)

తే.గీ.॥
మైకులను గట్టి పాటలు మారుమ్రోగ
అతిగ జెప్పిరి బిల్చిరి యాదరమున
వేగ కదిలిరి జనులంత వేగిరమున
మన కుమారుడు మేటిగ మసలెననుచు. (455)

కం.॥
దండిగ కుర్చిల నేసిరి
మెండుగ నా పురి జనులును మేధిని లోనన్
అండగ నుండెడి వానికి
ఎండిన బతుకులు నచ్చట ఎంతయు జేరన్. (456)

కం.॥
వచ్చిరి పురజను లంతట
వచ్చిరి యందరును గూడ వనరుగ నపుడున్
మెచ్చిరి వేడుక గనుగొని
నచ్చిరి వారలు సరగున నావుడు యెల్లన్. (457)

సోమరాజు గ్రామంలోనికి ప్రవేశించుట

ఉ.॥
అంతట నేగుదెంచె మది యాశల మేరకు సొంత గ్రామమున్
సుంతరు దెంచ వచ్చెనుగ సూనుడ వైనిట బెర్గి నందునన్
చెంతనె క్రింది వారు భట చేరిక గల్గిన నూరు చేరగన్
వింతగ జూడవచ్చిరిగ వీధుల నిండుగ మత్స్యకారులున్. (458)

తే.గీ.॥
అంతనా వూరి బెద్దలు నాదరమున
యూరి పొలిమేర దాపుకు చేరిరంత
సోమరాజుకు మాలలు సొంపు మీర
వేయ బూనిరి యా వేళ వెల్గిపోగ. (459)

తే.గీ.॥
కారు దిగి నంత లోననె గౌరవమున
పూలమాలలు వేసిరి పూనియపుడు
యంతయాతని పైనను యమిత భక్తి
కలిగి యున్న దటంచును కాంచెనపుడు. (460)

తే.గీ.॥
పూర్ణకుంభము చేనిడి పొలుపు మీర
స్వాగతంబును పలికెను స్వచ్ఛమనసు
తోడ నా యూరి బెద్దలు తొడరినపుడు
పారవశ్యంబు నొందెను సారగుణులు. (461)

తే.గీ.॥
సదరు మన యూరి వారలు సంతసించ
నడచి కదలుడు వారలు నాట్యమాడె
దరు గ్రామంపు కోరిక దక్కునపుడు
వేగ తరలుద మందరం వెలితి లేక. (462)

తే.గీ.॥
అనగ యా సోమరాజును యటులె ననుచు
వాహనంబును వదిలియు వరుస క్రమము
సాగె యధికార వర్గంబు సంతసించె
వెలిగె నా వేళ ప్రజ మోము వేడుక లర. (463)

సీ॥
పరివార జనమంత పరికించు చుండగా
ప్రబల భక్తి కతండు పరవశించె
భూసుర వర్గంబు భూరి రీతిని బల్కె
ఘన వేద మంత్రాలు గతిని నిల్పి
పొలిమేర యందున పొలుపు మీర గపుడు
ఘనముగా నా వేళ గడచెనంత
ఈ ఘట్టమా వేళ నెంత యానందంబు
కన్నుల పండువై కదలెనంత

తే.గీ.॥
సాగె నా వేళ నుత్సాహ సంబరంబు
వీధులన్నింట మార్మొగె వేడుకలర
స్త్రీలు పురుషులు బాలలు చిక్కు లేక
అన్ని వర్గంపు వారలున్ ఆగమించె. (464)

సీ॥
మేళతాళంబులు మేలుగా మ్రోగంగ
సాగె నూరేగింపు చక్కగాను
బాపనయ్యలు మంత్ర భావమ్ము పఠియింప
సాగె నూరేగింపు చక్కగాను
తండోపతండమై తరలెనా బ్రజలంత
సాగె నూరేగింపు చక్కగాను
చుట్టుప్రక్కల నుండు చుట్టాలు రాగను
సాగె నూరేగింపు చక్కగాను

తే.గీ.॥
పురము నందలి కాపులు పూని నడువ
సాగె నా వేళ కన్నుల సంబరమున
సొంత బిడ్డను కాంచగ సొచ్చె జనులు
తరలి వచ్చిరి జనులంత తప్పకుండ. (465)

(సశేషం)

Exit mobile version