Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీమతి కుప్పం రెడ్డమ్మ సాహితీ ట్రస్ట్ జాతీయస్థాయి నవలల బహమతి ప్రదానోత్సవ సభ – నివేదిక

చిత్తూరు జిల్లాకి చెందిన శ్రీమతి కుప్పం రెడ్డమ్మ సాహితీ అవార్డు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్థానిక తోటపాళం జంక్షన్ లోని రాజామహల్ హోటల్ లోని సమావేశ మందిరంలో శ్రీమతి కుప్పం రెడ్డమ్మ జాతీయస్థాయి ఉత్తమ నవలా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. కె. రామలక్ష్మి మాట్లాడుతూ కవులు, రచయితల నవలా సాహిత్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. కవులు, రచయితలు సమాజంలోని సమకాలీన పరిస్థితుల పట్ల అవగాహనతో చైతన్యవంతమయిన సమాజ నిర్మాణానికి దోహదం చేసే రచనలు చేయాలని సూచించారు.

ఈ ట్రస్టు జాతీయ స్థాయి నవలల పోటీ ప్రకటనకు స్పందించి 15 మంది తమ నవలలను పోటీకి పంపించారు. ఈ నవలలను ముగ్గురి దగ్గరకు పంపించి, వారి అభిప్రాయములను సేకరించి, నిర్వాహకుల అభిప్రాయములను కూడా కలిపి క్రోడీకరించి నాలుగు ఉత్తమ నవలలను ఎంపిక చేశారు.

ఈ నవలా రచయితలకు లేఖ ద్వారా, చరవాణి ద్వారా తెలియపరిచి అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆహ్వానించారు. ముఖ్యంగా టైపు చేయకుండా వారి లెటర్ హెడ్ మీద చేతి వ్రాతతో వ్రాసి రచయితల పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించారు.

సామాన్యంగా అవార్డు ప్రదాన సమయంలో రచయితల బయోడేటాని చదువుతారు. కాని ఈ కార్యక్రమములో నవలా పరిచయం చేస్తూ రచయితలను సత్కరించడం విశేషం.

ఉత్తమ నవలలుగా ఎంపికయిన పద్మ దాశరథి రచన ‘సాహచర్యబంధం’ నవలను యం. ఆర్. అరుణకుమారి; డి. యన్. సుబ్రహ్మణ్యం రచన ‘అగ్రిమెంట్’ నవలను డా. కె. రోజా ప్రియ; అల్లూరి గౌరీ లక్ష్మీ రచన ‘మలిసంజ కెంజాయి’ను శ్యామలాదేవి; శొంఠి జయప్రకాష్ రచన ‘అదృశ్య సంకెళ్ళు’ నవలను జి.శాంతాదేవి సాహితీ ప్రియులకు పరిచయం చేశారు.

రచయితలకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేసి జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘చిత్తూరు జిల్లా రచయితల సంఘం’ గౌరవాధ్యక్షులు శ్రీ కట్టమంచి బాలకృష్ణారెడ్డిగారు మారుతున్న సమాజ పరిస్థితులను అవగాహన చేసుకుని సందేశాత్మక రచనలు చేయవలసిన సామాజిక బాధ్యతను రచయితలు స్వీకరించాలని సూచించారు.

సుమారు ఏడెనిమిది దశాబ్దాల క్రితం మహిళలు ఆమెకు తమ తమ సమస్యలను గురించి ప్రశ్నలు అడగడం, జవాబులివ్వడం జరిగేది. ఆ జవాబులు వారిలో ఆత్మస్థయిరాన్ని నింపి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉండేవి. ఆమె ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ‘ప్రమదావనం’ శీర్షిక ద్వారా మహీళలను చైతన్యపరచిన స్వర్గీయ మాలతీ చందూర్.

ఈ శీర్షిక ద్వారా ప్రభావితురాలయిన స్వర్గీయ కుప్పం రెడ్డమ్మగారు తన కుమార్తెను ఉత్సహంగా చదివించి డాక్టర్‌ని చేశారు. డా. రామలక్ష్మిగారు తన తల్లిపై గౌరవంతో సాహితీ ట్రస్ట్‌ను స్థాపించి గత 33 సంవత్సరముల నుంచి చిత్తూరు జిల్లా స్థాయిలో రచయితలకు వివిధ సాహితీ ప్రక్రియలలో పోటీలను నిర్వహించి పురస్కారాలను అందించారు.

ఈ 2025లో జాతీయ స్థాయిలో నవలల పోటీలను నిర్వహించడం ద్వారా వివిధ రాష్ట్రాల తెలుగు రచయితలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తమ తల్లి ఫోటోతో పాటు మాలతీ చందూర్ ఫోటోని కూడా సమావేశ మందిరంలో పెట్టి నివాళినందిచడం ఆమె సంస్కారానికి నిదర్శనం.

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ సమాజసేవ చేస్తూ సమాంతరంగా సాహితీ సేవ కూడా చేయడం రామలక్మిగారి ఔన్యత్యానికి తార్కాణం. అందుకు వారి కుమార్తె డాక్టర్ రాజాప్రియ, అల్లుడు డాక్టర్ నిరంజన్ రెడ్డిగారు కూడా సహకరించడం ముదావహం.

ఈ రెండు సేవలతో పాటు పేద విద్యార్ధులకు తల్లి పేరిట స్కాలర్‌షిప్ లను అందిస్తూ విద్యారంగసేవ కూడా చేస్తున్నారు.

స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థినులు

ఈ కార్యక్రమంలో వీరి కుటంబ సభ్యులందరితో పాటు హరినాయుడు, భాస్కరరెడ్డి, మునుస్వామి, గంటామోహన్, సహదేవనాయుడు, అరుణకుమారి, కృష్ణం రాజులతో పాటు చిత్తూరు జిల్లాకి చెందిన సాహితీవేత్తలు, సాహితీప్రియులు పొల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మామూలుగా అవార్డు ప్రదాన కార్యక్రమాలలో రచయితలు నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పడం సహజం, కానీ ఈ కార్యక్రమంలో పోటీకి నవలలు పంపించి తమని ప్రోత్సహంచిన రచయితలకు డా. కె. రామలక్ష్మి గారు ధన్యావాదాలు తెలియజేయడం కొసమెరుపు.

Exit mobile version