[డా. రావి రంగారావు గారు రచించిన ‘కుంకుడు కాయ’ అనే కవితాసంపుటిని విశ్లేషిస్తున్నారు శ్రీమతి సత్యగౌరి మోగంటి.]
ప్రముఖ కవి డా. రావి రంగారావు గారు ఆగస్టు 2007లో వెలువరించిన వచన కవితల సంపుటి ‘కుంకుడు కాయ’. ఇన్నేళ్ళు గడిచినా, రెలవెన్స్ కోల్పోని కవితలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. పుస్తకం పేరులోనే ఎంతో నిగూఢ అర్థం దాగివుంది.
అనారోగ్యాన్ని చీల్చి చెండాడేదే ఈ ‘కుంకుడు కాయ’. ఎన్ని దివ్వౌషధాలున్నా తలను వెలిగించేది కుంకుడు కాయ.
అస్తవ్యస్తంగా ఉన్న సమాజంలోని రుగ్మతలను రంగారావుగారు ఈ సంపుటిలో చీల్చి చెండాడారు.
సమాజాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ సమాజంలోని అందరి బాధలు, సమస్యలతో కలిసిపోతూండటం కనబడుతుంది. సమాజాభిలాషి రాసే కవిత్వం ఇలాగే ఉంటుంది.
హితైక వచనాలు ఎన్నో చెబుతారు. చాలా సరళమైన భాష. వాడిగా ఉంటుంది శైలి. లోతైన భావాలు.
ఇవి చదువరులను చైతన్యపరుస్తాయి. మెదడుకు, ఆలోచనా శక్తికి పదునుపెడతాయి.
పుస్తకం చదువుతుంటే రంగారావుగారి నైజం అర్థం అవుతుంది.
దేశానికి వెన్నెముక అయిన రైతన్న పట్ల రంగారావు గారి ప్రేమను చూద్దాం.
“శాలువాలు, పట్టు బట్టలూ
లాల్చీలూ, పైజమాలూ
చేతికి బంగారు తొడుగులూ
కాలికి గండపెండేరాలూ కాదు..
ఇరవై నాలుగు గంటలూ
పొలం పండించే శ్వాసతో బతికిన
ముతక బట్టలు ధరించిన
రైతు నాన్న స్వేదం
నా కవిత్వం” అంటారు.
చాలా ‘సింపుల్’ గా అందరికీ అవగతమయ్యేలా చెప్పారు.
~
‘ముఖం చూపని కవిత’లో, కవిత ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పడం చాలా బాగుంది.
“అలంకారాల్ని చూపించి
ఆడంబరాల్తో మెరిపించి
స్పష్టంగా ముఖం చూపించని
పెండ్లికొడుకు కాకూడదు కవిత” అన్నారు.
~
‘అంకితం’ కవితలో కవిత్వమంటే ఏమిటో, అది ఎంత శక్తివంతమైనదో చెప్పారు.
“అంకితం ఇవ్వడమంటే
అదొక బాధ్యత మోపడం –
పండ్లను ప్రచారం చేస్తూ
పదిమందికీ చేర్చాలని,
చైతన్య రుచులతో జనాన్ని
శక్తిమంతులుగా మార్చాలని..” అని అంటూ,
“ఇప్పుడు కవిత్వ మంటే కన్య కాదు,
రోగాలను తొలగించే మహా మూల ఔషధం!
మనసులను వెలిగించే మధుర రస తేజం!” అన్నారు.
~
‘నల్ల సూర్యుడు’ కవితలో దేశం ప్రక్షాళన విషయం వక్కాణించి చెప్పారు.
“నెత్తి మీద
సుత్తితో కొట్టినా సరే,
పిడికిలితో బిగించి
నలిపినా సరే,
దుమ్ము పైకి
ధనువు సంధించి
విజయం సాధిస్తుంది,
మురికిని హెచ్చరించే
ఉగ్ర నేత్రాలను ప్రసాదిస్తుంది..” అంటూ కుంకుడు కాయ తలంటు గుర్తు చేస్తారు.
~
‘దీపమూ దేశమూ’ కవితలో దేశం మీద భక్తి, ప్రేమ, ఆవేదన.. తొణికిసలాడే ఈ వాక్యాలు చూద్దాం.
“నిప్పు గరువే గానీ,
తుప్పు పట్టదు..
ఈ దీపం
నా దేశం
పర్యాయపదాలైతే
ఎంత బాగుణ్ణు!” అంటారు.
గొప్ప దేశభక్తి, సంస్కారం ఈ పాదాలలో గమనిస్తాం.
~
‘కులం దొంగ’ కవితలో ఇలా అన్నారు.
“సముద్ర మంటే
ఎంత పెద్దదో అనుకున్నా,
దేశంలో అవినీతి కన్న
చాలా చిన్నది” .
≈
“మెడలో వేసుకున్నా సరే
జేబులో దాచుకన్నా సరే
మన దగ్గరున్నప్పుడు కులం
ఎముక ముక్కే పాపం!
శకుని చేతికి చిక్కితే మాత్రం
రాజ్యాల్ని మార్చేసే మంత్ర దండం” అన్నారు.
“వాడి గుట్టు మనకు తెలిసినా
మన రోగం మనకు తెలియక
మనం వాణ్ణి నమ్ముతున్నాము!
వాడు మనల్ని అమ్ముతున్నాడు” అంటూ దేశంలోని అవినీతిని ఎండగట్టారు.
~
‘మనిషీ – ప్రకృతీ’ కవితలో మానవుని విధ్వంసక చర్యల ఫలితాన్ని చూపించారు.
“మనిషి కోరికల ముదిరిన వేడికి
అడుగంటుతున్నాయి భూగర్భ జలాలు,
విలాసాల దాడులకు గాయపడే కదా
మూలుగుతోంది ఆరోగ్య కామధేనువు,” అంటూ,
“అమ్మా, ఉగాదీ! ఏమనుకోకు!
మనుషుల మీద కోపంతో రాననబోకు!
ప్రకృతిని మార్చడం మానేస్తాం!
మాలో వికృతిని పాతేస్తాం!”
అంటూ ఎంత ఆశావాదాన్ని వెలిబుచ్చుతూ, గొప్ప సందేశం అందించారు.
***
సంప్రదాయంగా వచ్చే మన కుంకుళ్లు మురికిని బాగా పోగొడతాయి. రసాయనాలు లేని కుంకుడు కాయ మనిషికి తలంటి మురికిని ఎలా పోగొట్టి సంస్కరిస్తున్నాయో అలా ఈ సమాజంలో సంస్కరణలు, ప్రక్షాళన అవసరం అన్న విషయాన్ని కాస్తంత కటువుగానే చెప్పారు. చాలా సరళంగా, ఎంతో భావయుక్తంగా చెప్పారు. ఆపాత మధురం, ఆలోచనామృతం, చైతన్య ప్రవాహం రావి రంగారావు గారి ‘కుంకుడు కాయ’ సంపుటి. ఈ సంపుటి వచ్చి 18 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఈ కవితలు ఎంతో తాజాగా అనిపిస్తాయి.
కవి మనుషులలో చైతన్యాన్ని తీసుకురావాలి.
మెదడుకు పని చెప్పాలన్నది ఈ కవి ఆకాంక్ష. కవిత్వం అంటే ఆవేదన, కోపం, దేశ భక్తి, సామాజిక స్పృహ. ఇవన్నీ.
మానవత్వానికి.. మనిషితనానికి అత్యంత ప్రాధాన్య మిచ్చిన కవీశ్వరులు డా. రావి రంగారావు.
***
రచన: డా. రావి రంగారావు
ప్రచురణ: సాహితీమిత్రులు, మచిలీపట్నం
పేజీలు: xvi+132
వెల: 66/-
ప్రతులకు:
నర్రా ప్రభావతి
4-290, గోగుపేట,
మచిలీపట్నం 521001
ఫోన్: 08672-221345
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
