Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కుండీలో కవి సమయం

[శ్రీ ఎస్. హనుమంతరావు రచించిన ‘కుండీలో కవి సమయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

బాల్కనీ కుండీలో
బ్రహ్మజెముడు మొక్క!
గన్‌మెన్ల మధ్య నాయకుడిలా
ఒళ్లంతా ముళ్లతో..
ఇప్పుడిక్కడున్నా
దాని ప్రవాస పరంపర
ఏ సహారాలోనో
థార్‌ ఎడారిలోనో మొదలైంది..
ఇలా పెరగడం వల్ల
అక్కర లేనంత నీళ్లతో
వృక్షం నీడన వున్న మొక్కలా
గిడసబారి.. గారం ఎక్కువైన పాప మాదిరి..
పెంచడం ఫ్యాషన్‌ వారికి
దానిది బ్రతుకుపోరు..
అయినా అపుడపుడు
అలసట నవ్వులా.. ఓ పువ్వు!
‘బ్రహ్మజెముడు పుష్ప వికసనంలా చంద్రోదయం’
అన్నాడుగా సర్రియలిస్టు కవి నారాయణ బాబు..
చిరుగాలికి కదిలే
ఆ కోమల కుసుమం
కుండీలో కవి సమయం..
జీవితేచ్ఛా పద చిత్రం!

Exit mobile version