[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘క్షణమొకటి కావాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఏదో నలత
ఇష్టాల ముట్టడికి
లోలోపల తొక్కిడి.
గుమిగూడిన పాత రోజులు
వయసు ఒడ్డుపై నిలబడి
మనసు లోతట్టును జల్లెడ పడుతున్నాయి.
మునిగిన క్షణం
ఏ మూలకు కొట్టుకొస్తుందనని
నమ్మకాన్ని ఈదే అల ఈత కోతకు
కంటికి గండి పడి
పారే ఆవేదనంతా ఆగిపోయాక
బయటపడ్డ మనిషిని
తనకు తానుగా
గుర్తుపట్టే క్షణమోకటి
ఇప్పుడు కావాలి