Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కృతులకు నతులు

[శ్రీ ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన ‘కృతులకు నతులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నేటి కవిత్వం నిండా
ప్రజా సమస్యల ప్రకటన
సంఘం చుట్టూ సాహిత్య పరివేష్టన! పరిరక్షణ!

ప్రజా పరివేదనల పట్ల శ్రద్ధ వహించే
కవి కలానికీ గళానికీ జోతలు!
సమస్యలకు సామాధానాలను
సాధించేలా
సమాజాన్ని సమాయత్త పరచే
అక్షర యోధులకు జేజేలు!
ఇదే కదా యుక్త సాహిత్య విధానం!
ఉచిత సాహితీ పరిణామం!

సామాజిక స్థితి గతులకు దర్పణమౌతూ
సర్వుల హితా నికి సమర్పణమౌతూ
సహచరిలా ఆలంబనలా లాలనలా
సహృదయంతో సాగే సాహిత్యానికి
సవినయ సన్నతులు!

ఎటు జూచినా
దుర్భర దుఃఖ భరిత జీవన చిత్రాలే
దృశ్యమానమౌతున్న వేళ
కలవరపడుతూ
కలతలచే గాయపడుతూ
త్రికరణ శుధ్ధిగా
కర్తవ్యపాలన చేసే
కలం వీరులకు
సంస్తుతులు!

జన జాగృతి కై
జనగణ జీవనోద్ధరణకై
జన్మ నెత్తే కృతులు
కాలానికి కవులందించే
ఉత్తమ ఉపకృతులు!
కవి పుట్టుకకు ధన్యతను కూర్చే
బహూకృతులు!

Exit mobile version