[శ్రీమతి ఆర్. లక్ష్మి గారి ‘కృత్రిమ మేధ – రెండు వైపులా పదునున్న కత్తి’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ – “మానవ నాగరికతలో ఇది ఒక కీలకమైన ఘట్టం. జాగ్రత్తగా, సక్రమంగా వినియోగించగలిగితే కృత్రిమ మేధతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దానివలన సంభవించగల ప్రమాదాలను ముందే గమనించుకొని జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ మేధ మనిషి నియంత్రణను అధిగమించి స్వతంత్రంగా వ్యవహరించగల అవకాశం ఉంది. మనిషితో విభేదించి సర్వ స్వతంత్ర స్వభావాన్ని రూపొందించుకోగల అవకాశమూ ఉంది.” అని అన్నారు.
అయితే ఈ క్రొత్త సాంకేతిక విప్లవంతో – మానవ జాతి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పేదరికం, అనారోగ్యాలను సమర్థవంతంగా ఎదుర్కోగల అవకాశాలూ ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం పేరిట ప్రకృతికి చేసిన హానిని, నష్టాన్ని కొంతైనా పూడ్చగల అవకాశమూ ఉంది. ఆ రకంగా కృత్రిమ మేధ వలన మేలు ఉందన్న సత్యమూ కాదనలేనిది.
2016 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘CFI’ ప్రారంభోత్సవ సభలో ‘కృత్రిమ మేధ’ ను గురించి స్టీఫెన్ హాకింగ్ వెలిబుచ్చిన అభిప్రాయం. ‘CFI’ అన్నది కృత్రిమ మేధ స్వరూప/స్వభావాలు, దాని వలన ఎదురుకాగల పరిణామాలను అధ్యయనం చేయడానికై ఏర్పాటు చేయబడిన సంస్థ (సెంటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్). ఆక్స్‌ఫర్డ్, కాలిఫోర్నియా, బర్కెలీ, కేంబ్రిడ్జ్ యూనివర్శీటీలు, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌ల నుంచి పలువురు సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రారంభోత్సవ సభలో ఎంతో దార్శనికతతో హాకింగ్ వెలిబుచ్చిన అభిప్రాయం అది. ఆయన లాగే పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మార్గరెట్ బోడెన్ – ‘కృత్రిమ మేధ’ అధిక సమస్యలకు పరిష్కారాన్ని చూపగలదు. దైనందిన జీవితాన్ని సులభతరం చేయగలను. మానవ జీవితాన్ని, మెదడుకు సంబంధించిన సైన్స్‌ను గణనీయమైన అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. అయినా దుర్వినియోగం జరిగితే మాత్రం A.I. వలన సంభవించే పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. CFI లక్ష్యం ఈ ప్రమాదాలను నివారించడానికి AIని సమాజహితమైన దారిలో అభివృద్ధి చేయడం. బ్రిటిష్ తత్వవేత్త, కాగ్నిషన్ సైంటిస్ట్. ఇంకా పలు రంగాలలో నిష్ణాతురాలైన ఈమె ‘CFI’ కన్సల్టెంట్ కూడా. యూనివర్శిటీ ఆఫ్ ససెక్స్‌లో ప్రొఫెసర్ అయిన బోడెన్ 1970లోనే యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌లో – మానసిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, న్యూరాలజిస్టులు, భాషావేత్తలు ఇలా వివిధ రంగాలలోని నిపుణులు కలసి పని చేసేలా ‘కాగ్నిటివ్ సైన్సెన్స్ రిసెర్చ్ సెంటర్’ని తీర్చిదిద్దారు. 1987లో ‘CRiCS’ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ సెంటర్ వివిధ ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ తన పరిశోధనలలో అన్వయించుకుంటూ ముందుకు సాగిపోతోంది, ‘క్రియేటివ్ మైండ్’, ‘మైండ్ యాజ్ మెషిన్’, ‘ది హిస్టరీ ఆఫ్ కాగ్నిటివ్ సైన్స్’ వంటి అద్భుతమైన పుస్తకాలను కూడా రచించిన మార్గరెట్ బోడెన్ కంప్యూటర్ భాషకు ఆలోచన, సృజనాత్మకతను అద్దడం (AI), మళ్లీ అందులోనూ ఉండగల లిమిటేషన్స్. ఇటువంటి ఆలోచనలకు/ప్రతిపాదనలకు ఆద్యురాలు. అయితే దురదృష్టవశాత్తు, ఆ స్వాప్నికురాలు ఇటీవలె మరణించారు.
కృత్రిమ మేధో వ్యవస్థలు తమంతట తాము నేర్చుకోగలవు. నైపుణ్యాలను పెంపొందించుకోగలవు. అదుపు చేసుకోగలవు. మనిషి అదుపు తప్పి స్వతంత్రంగా వ్యవహరించనూ గలవు.
కొన్ని నెలల క్రిందట చైనాలోని ఒక పబ్లిక్ డిమాన్‍స్ట్రేషన్‌లో రోబో అకస్మాత్తుగా అదుపు తప్పి ప్రవర్తించింది. అప్పట్లో నిపుణులు దానిని ఎర్రర్ కారణంగా కావచ్చని అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ తరువాత కూడా అడపా దడపా అటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సొసైటీకి ఉపయోగపడాలన్న సదుద్దేశంతో తయారుచేయబడుతున్న రోబోలు చాలావరకు ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయి. అయితే ఈ కృత్రిమ మేధో వ్యవస్థలతో ప్రమాదమూ లేకపోలేదు. అని విద్రోహశక్తుల చేతులలో దుర్వినియోగానికి గురైతే పరిణామాలను ఊహించడం కష్టం కాదు.
సాంకతిక రంగం విపరీతమైన వేగంతో దూసుకుపోతుంది. ఒక ఆవిష్కారం తాలుకు లాభనష్టాలు/మంచి చెడులను అంచనా వేసే లోపునే మరో కొత్త పరిజ్ఞానం ఆవిష్కృతమవుతోంది.
A.I, A.G.I. – ఇలా ఎటు చూసినా వేగం!
‘Deep Mind’ వెలువరించిన ‘జెమిని’ మానవుల వలె వైవిధ్యంతో ఆలోచించగలదు. ‘సాఫ్ట్‌బ్యాంక్’ రూపొందించిన ‘పెప్పర్’ హ్యుమనాయిడ్ భావోద్వేగాలతో కూడిన మనస్సును అర్థం చేసుకోగలదు.
ఎమోషనల్ కంప్యుటేషన్ దిశగా అడుగులు ఇప్పటికే వేగాన్ని పుంజుకున్నాయి. 2047 నాటికి AI వ్యవస్థలు మానవులను మించిన సూపర్ ఇంటెలిజెన్స్‌ను షెంపొందించుకొంటాయని అంచనా!
డీప్ మైండ్ సిఇఓ డెమిస్ హస్సబిస్ ప్రకారం కృత్రిమ మేధో వ్యవస్థలకు మన విలువల గురించి తెలియదు. అవి నేర్చుకోగలవు కాబట్టి వాల్యూ సిస్టమ్‌ను కూడా మనమే వాటికి నేర్పించాలి. ఆ రకంగా ప్రోటోకాల్స్, నియమావళి, విలువలతో కూడిన ప్రవర్తనతో వాటిని తీర్చిదిద్దాలి. ఎందుకంటే మనుషుల వలె అవి కార్బన్‍తో రూపొందినవి కావు. కృత్రిమంగా సిలికాన్‌తో రూపొందించబడినవి. అదనపు హంగులను వాటికి సమకూర్చవలసిన బాధ్యతా మనిషిదే!
ప్రొటీన్ల నిర్మాణంపై డెమిస్ హస్సబిస్ – జాన్ జంపర్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలకు నోబుల్ బహుమతి లభించింది. తమ పరిశోధనలలో వారు ‘అల్ఫా పోల్డ్’ అనే ఒక AI వ్యవస్థను రూపొందించారు. దానితో ప్రోటీన్ల నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించడానికి మార్గం సుగమం అయింది. ప్రోటీన్ల సంక్లిష్టమైన నిర్మాణం గురించిన అంచనా వేయగలిగిన ‘అల్ఫా పోల్డ్’ సాంకేతిక పరిజ్ఞానం – ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ల శాస్త్రజ్ఞులు/పరిశోధకులకు ప్రొటీన్ల నిర్మాణం – data base ను అందించింది. అనేక నూతన ఆవిష్కరణలకు కారణం అయ్యింది.
అంతవరకు ప్రొటీన్ల నిర్మాణాన్ని గురించిన అనేక సందేహాలు ఉండేవి. కారణం ప్రొటీన్లు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాయి. అయితే, వాటి స్ట్రక్చర్ అవి నిర్వర్తించే పనిని నిర్ణయిస్తుంది. ప్రొటీన్ల ‘3D’ స్ట్రక్చర్ ప్రతిపాదనతో పరిశోధనలలోని సందేహాలు, అవరోధాలు చాలా వరకు తొలగిపోయాయి.
ప్రొటీన్ల నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. శతాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నా 1% గురించి కూడా పూర్తి అవగాహన సాధ్యం కాలేదు. ఒకొక్క ప్రొటీన్ మేపింగ్‌కు సంవత్సరాలు పట్టేవి. అంత కష్టసాధ్యమైన పనిని కృత్రిమ మేధ అలవోకగా సాధించింది. ఒక్క సంవత్సరంలో 200 మిలియన్ ప్రొటీన్‌ల మేపింగ్‍ను కృత్రిమ మేధతో పూర్తి చేయగలిగారు. ఇది ఒక్క రోజులో సాధ్యమైనదేమీ కాదు. శాస్త్రజ్ఞులు అహోరాత్రులూ శ్రమించి ప్రోటీన్ మేపింగ్‌ను సంవత్సరాలకి, నెలలకి, క్రమేపి వారాల లోనికి తగ్గించుకుంటూ చివరకు రోజులలోనికి తీసుకొని రాగలిగారు.
ప్రొటీన్ స్ట్రక్చర్, వాటి సంక్లిష్టత, మేపింగ్‍లో జరిగే కాలహరణం రీత్యా ప్రజలు ఏ మాత్రం ఊహించని అద్భుతం ఇది. కృత్రిమ మేధతో సాధించగలిగిన అద్భుత ఫలితం. శాస్త్రజ్ఞుల లోనూ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగాయి.
ముఖ్యంగా ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన పరిణామాలకు ఈ కృత్రిమ మేధ పట్టుగొమ్మ కాగలదు. పార్మా రంగంలో – ఒక ఔషదం తయారై మార్కెలోనికి రావడానికి దశాబ్దాల పరిశోధన, బిలియన్ల డాలర్ల వ్యయం అతి సాధారణమైన విషయం.
కారణం – ఇక్కడ ఆవిష్కారాలన్ని రసాయనాలు, కాంబినేషన్ అండ్ పర్ముటేషన్‌తో సొల్యూషన్స్ వాటిపై పరిశోధనలు, ప్రయోగాలు, ఫలితాలు ఇటువంటి వాటిపై దశాబ్దాల శ్రమదమాదులు – ఇలా నిరంతర కృషిపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రక్రియను కృత్రిమ మేధతో చాలా తక్కువ సమయానికి కుదించవచ్చు. ఇది చిన్న విషయం కాదు.