[ఈమధ్య రవీంద్ర భారతిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెట్టిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న తర్వాత కలిగిన ఆలోచనలతో ఈ కవితని వ్రాశారు శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ.]
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
నాశ్రయించి రాసావా నీ
ప్రియురాలికి ఒక ప్రేమలేఖ!?
ఉవ్వెత్తున కెరటాల్లా ఎగిసిపడే
ప్రేమావేశాలను ఆర్ద్రంగా
అక్షరీకరించడం మరిచావా?
ప్రేయసి సౌందర్యాన్ని
మనసు మాధుర్యాన్ని
నీ ఊహల్లో పదిలమైనట్లుగా
వర్ణించడం విస్మరించావా?
పంచుకున్న భావావేశాలు
చేసుకున్న బాసలు
తియ్య తియ్యని స్మృతులు
గుర్తుచేసుకుంటూ నడిపించాల్సిన
కలానికి విశ్రాంతినిచ్చావా?
హృదయరహిత మేధ
లేఖలో అనురాగపు లోతులను
అక్షరాల వెనుక గుండె తడిని
అద్దడం అనవసరమనుకున్నావా?
మానవ అనుభూతులకు
ఆవేశాలకు ఆత్మీయతలకు
అద్దం పట్టలేక విఫలమయ్యావా?
మనిషి స్పర్శ లేని
సృజనాత్మకత కానరాని
పెద్ద పెద్ద పదాలతో
పాండిత్యాన్ని ప్రదర్శించే
కృత్రిమ లేఖ కంటే
గజిబిజిగా అలతి అలతి అర్థాలతో
పచ్చిగా పచ్చగా మెరిసే
నీ చేతి లేఖే ప్రియాతి ప్రియం!
శాంతిశ్రీ బెనర్జీ గుంటూరులో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ. వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఎమ్.ఫిల్. చేశారు. తీన్‌మూర్తి భవన్, డిల్లీలో నెహ్రూకు సంబంధించిన ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ’ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 2022 జూలైలో వారి కథా సంపుటి ‘మానుషి’, కవితా సంపుటి ‘ఆలంబన’ వచ్చాయి.