Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కృతజ్ఞత

[‘కృతజ్ఞత’ అనే బాలల కథని అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

కసారి ఒక వేటగాడు వేటాడటానికి అడవికి వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా దట్టమైన అడవిలో కొన్ని మృగాలు కనబడ్డాయి. వెంటనే బాణం వేశాడు. బాణం గురి తప్పి ఒక చెట్టుకు నాటుకుంది. మృగాలు అన్నీ పరుగుతీశాయి. ఆ బాణం విషదిగ్దమైనది అవటం చేత విషం చెట్టులోకి ప్రవేశించి క్రమక్రమంగా ఎండిపోసాగింది. ఆకులు, కాయలు రాలిపోయాయి. కొన్నాళ్ళకు అది మోడుగా మారిపోయింది.

ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివసిస్తూ ఉంది. దానికి ఆ చెట్టు అంటే అంతులేని ప్రేమ. అందువల్ల అది ఎండి మోడు అయినా దాన్ని విడిచి వెళ్ళలేక పోయింది. ఆహారం కోసం కూడా బయటకు వెళ్ళకుండా దాన్నే అంటి పెట్టుకుని ఉంది. రోజులు గడిచేకొద్దీ చిలుక చిక్కి శల్యం కాసాగింది. మరణం సంభవించినా సరే, వృక్షాన్ని విడిచి వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంది.

దాని ఔదార్యం, మనోధైర్యం చూసిన ఇంద్రుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. బ్రాహ్మణ వేషంలో చిలుక దగ్గరకు వచ్చాడు. “చిలుకా! నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను” అన్నాడు. చిలుక వినయంగా తలవంచి “దేవరాజా! మీకు నమస్కారం. నా తపోబలం చేత మిమ్మల్ని గుర్తించాను” అన్నది. ‘ఎంత అద్భుత జ్ఞానం?’ అని ఇంద్రుడు మనసులోనే ఆశ్చర్యపడి, “ఈ వృక్షానికి ఆకులూ లేవు, పళ్ళూ లేవు. దీని మీద ఏ పక్షులూ నివసించటం లేదు. ఇంత పెద్ద అడవి ఉండగా ఈ ఎండిపోయిన చెట్టునే ఎందుకు ఆశ్రయించుకున్నావు? ఈ అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. అవన్నీ పచ్చగా చూడటానికి అందంగా ఉన్నాయి. నువ్వు ఫలపుష్పసహితమైన మరో పచ్చని వృక్షాన్ని చేరి సుఖంగా ఉండవచ్చు కదా! నువ్వు దీన్ని విడిచిపెట్టక పోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

ఆ మాటలు విన్న చిలుక దీనంగా నిట్టూర్చి “నేను ఈ చెట్టు మీదే పుట్టాను. ఇక్కడ పండ్లు తింటూ పెరిగాను. స్నేహితులతో ఆనందంగా ఆటలాడాను. ఈ చెట్టు తన ఆకులతో తొర్రను కప్పి శత్రువుల బారి నుంచీ నన్నురక్షించింది. తల్లిలా నన్ను కాపాడింది. ఈ చెట్టు అంటే నాకు ఎంతో ప్రేమ, భక్తి. ఇప్పుడు ఇది ఎండిపోయింది. దీనిలో పుష్పించి, ఫలించే శక్తి లేదు. నిస్సారం, శోభావిహీనం అయింది. అయితేనేం, ఒకప్పుడు నన్ను ఎంతో ఆదరించి, ఆనంద పరచింది. ఇది సమర్థంగా ఉన్నప్పుడు నేను ప్రాణాలు నిలుపుకున్నాను. ఇప్పుడు దీని శక్తి క్షీణించిందని కృతఘ్నుడనై విడిచి వెళ్ళనా? ఇతరుల మీద దయ చూపటమే సాధువులకు అన్నిటికన్నా గొప్ప లక్షణమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దయచేసి ఇలాంటి వ్యర్థమైన సలహా ఇవ్వకండి. ఇక్కడే నా ప్రాణం పోయినా నేను సంతోషిస్తాను తప్ప, దీనిని విడిచి వెళ్ళను” అన్నది.

చిలుక యొక్క మృదువైన మాటలకు, ధర్మజ్ఞానానికి ఇంద్రుడు ఎంతో సంతోషించి, “నీ దయాళుత్వానికి సంతోషిస్తున్నాను. ఏదైనా వరం కోరుకో!” అన్నాడు. “ఈ చెట్టు పూర్వం లాగానే పచ్చగా నవనవ లాడుతూ ఉండేటట్లు చేయండి” అన్నది చిలుక. “చెట్టుకు పూర్వపు ఆకారంతో పాటు నువ్వు కోల్పోయిన జవసత్వాలను కూడా తిరిగి ప్రసాదిస్తున్నాను” అంటూ చెట్టు మీద, చిలుక మీద అమృతాన్ని కురిపించాడు ఇంద్రుడు. వెంటనే చెట్టుకు కొత్త కొత్త ఆకులు, కొమ్మలు, మనోహరమైన పండ్లు మళ్ళీ వచ్చాయి. పూర్వం లాగా శోభాయమానంగా తయారైంది. వెళ్లి పోయిన పక్షులన్నీ తిరిగి వచ్చి కోలాహలంగా కిలకిలా రావాలు చేస్తూ ఎగరసాగాయి. చిలుకను దీవించి అదృశ్యుడయ్యాడు ఇంద్రుడు.

“కనుక ధర్మనందనా! నీవు కూడా కష్టసుఖాలలో సమానమైన ప్రవర్తన గలిగి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళని సేవకులను నియమించుకుని, సుఖంగా రాజ్యపాలన చేసుకో!” అంటూ అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు సమస్త ధర్మాలు బోధిస్తూ ఈ కథ చెప్పాడు.

(మూలం: మహాభారతం – అనుశాసన పర్వం. కథనం నా స్వంతం. చిత్రాలు: శ్రీమతి గోనుగుంట సరళ)

Exit mobile version