[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీమతి జె. శ్యామల రచించిన ‘క్రోధిని వేడుకున్నా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వేకువనే వీవనలు విసురుతూ తల్లి వేపచెట్టు
ఏ ఏసీ ఇస్తుంది ఇంత చల్లని హాయి!
ఆ పక్కనే ఆకర్షిస్తూ
మామిడి చెట్టు నవ వసంతానికి సంకేతంగా
గుబురుగా ఆకులు, కొత్త కొత్త పూతలు
గుత్తులుగా వేలాడే మామాంచి మామిళ్లు
మధు మాసోదయాన
విరిసిన దరహాసాలతో
ముచ్చట గొలిపే మరుమల్లెలు
జయ మంగళ సూచకంగా
చెట్టు కొమ్మ వేదికపై
కోకిలమ్మ గాత్రకచేరి
మనసంతా వసంతం కాగా
నిరాశల శిశిరాన్ని నిన్నటికి నెట్టేసి
కొత్త ఆశల చైత్రాన్ని చిత్తంలో నింపుకుని
ముంగిట ముగ్గులు దిద్ది
గుమ్మానికి మామిడాకుల ముస్తాబు చేసి
ఆరు రుచుల ఉగాది పచ్చడిని
అర్థం గ్రహిస్తూ, ఆనందంగా స్వీకరించి
ఆశావాదంతో.. ఆత్మవిశ్వాసంతో
అనుకున్నవి సాధించాలని
శుభ సంకల్పం చెప్పుకున్నా
క్రోధాన్ని పెంచేది క్రోధి.. పండిత వాక్యం
ఆగ్రహావేశాలతో అవని అల్లకల్లోలం కావద్దని
ధర్మాగ్రహాన్ని మాత్రమే దయచేయమని
మానవాళికి మంచి చేయమని
కొంగ్రొత్త సంవత్సరం ‘క్రోధి’ ని వేడుకున్నా!
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.