నల్ల బంగారాన్ని వెలికితీసి –
లోకానికి వెలుగులు పంచుతున్న వాడు!
పట్టాలు పట్టు తప్పకుండా పరిరక్షిస్తూ –
ప్రయాణీకుల ప్రాణాలకు రక్షకుడైన వాడు!
పొద్దున్నే చద్దిముద్దై చౌరస్తాలో-
రేపటి నిర్మాణం కోసం నిరీక్షిస్తున్న వాడు!
నడ్డిని కాటాగా చేసుకొని –
మార్కెట్ యార్డులో బరువైన బస్తా అయినవాడు!
కంటిమీద కునుకును మర్చిపోయి-
రహదారిని శోధిస్తూ, రథాన్ని గమ్యానికి క్షేమంగా చేర్చేవాడు!
విశ్వాన్నే తన శ్రమ శక్తితో
ముందుకు నడిపిస్తున్నవాడు!
ప్రగతి పథగామి వాడు!
కార్యదీక్షా దక్షుడు వాడు!
అతనే జగానికి క్రాంతి నేత!
అతనే జనానికి శాంతి దూత!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.