Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొయ్య పడవలో కాగితం పడవ

[శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు రచించిన ‘కొయ్య పడవలో కాగితం పడవ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]

నాడు వానొస్తే
పసి వయసులో;
బళ్ళకి సెలవులు
కాగితం పడవులు.

కసి వయసులో;
చెట్టు చాటుకు చెలిలో
చేరి చిటపటలు.

నడి వయసులో;
ఆలితో బాల్కనిలో
మొక్కజొన్న పొత్తుల
వేడి టీ కప్పుల సేవనలు.
***
నేడు ముసలి వయసులో;
అదే బాల్కని నుంచే చూస్తున్నా.
రెండు రోజులుగా వానలు
బళ్ళకు సెలవులే కానీ
కాగితం పడవు లేవి???
యూట్యూబ్‍లో నేర్పలేదేమో!?
టి.వీల ముందు పెద్దలు
సెళ్ళ సెల్స్‌లో చిన్నలు.. అంతే!
***
అదిగో అదిగో పడపోస్తోంది..
చాలా పెద్దది..
ఎన్ని రీముల కాగితం వాడారో..
దగ్గరయ్యింది పడవ..
కాగితం పడవ కాదు.. కొయ్యపడవే..
కంటి చూపు మందగిస్తోందా!!!
కళ్ళు చిట్లించి చూసాను..
క్రింద రోడు మీద వస్తోంది పడవ..
కాగితం పడవ కాదు.. కొయ్య పడవే..
అసలు రోడ్డేది?
మా ఊరు ‘వెనీస్’ ఎప్పుడయ్యింది?
లోతట్టు ప్రాంతాల అభాగ్యులను
తరలిస్తోంది ఆ కాగితం పడవ
కాదు.. కాదు.. కొయ్య పడవే
బిక్కుబిక్కుమంటున్న ఆ తల్లి
కన్నీళ్ళను తుడిచేస్తోంది వాన నీరు
అలా తుడిచెయ్యకు వర్షమ్మా..
ఆ తల్లికి ఎక్స్‌గ్రేషియా రాదమ్మా..
ఆ చెంపల కారే నీరే సాక్షమమ్మా..
ఆ కొయ్య పడవలో.. ఆమె ఒళ్ళో ఉన్న
బుడతడు మాత్రం
ఆ ప్రయాణాన్ని అస్వాదిస్తున్నాడు..
ఆ కొయ్య పడవలోంచి రోడ్డు
కాల్వ లోకి వదులుతున్నాడు కాగితం పడవని
***
ఆ మూల.. ఏమిటా కలకలం..
మేన్ హో‍ల్‍లో పడిన ఉమెన్
దేనికి ఒమెన్?
***
వాన వెలిసింది..
ప్రకృతి కాంత తలారబెట్టుకొనే
దృశ్యం ఎక్కడ?
నెలకు మూడు వానలు కురిసినప్పుడు
మట్టి వాసనే..
మూడు నెలల వాన మూడు రోజులు కురిస్తే
రోజు కూలీల రెక్కలాడక
మాడుతున్న డొక్కల వాసన
తెగిన గట్లు.. మునిగిన చేలు
కూలిన గోడలు.. రాలిన చెట్లు
తెల్లారిన జీవితాలు
ఆకాశం నిర్మలంగానే ఉంది
నేల స్వచ్ఛంగానే ఉంది
అదే హరివిల్లు.. అనే రంగులు..
రంగులు మార్చేది మనమే
ప్రకృతినే ఏమార్చాలని చూస్తే
ఆకాశం దులిపేసింది
నేల కడిగేసింది
మన తప్పిదాలని; అంతే!
పిడుగులతో హెచ్చరిస్తూ.
(సమాప్తం)

Exit mobile version