Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కోవెల మంటపం

[శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘కోవెల మంటపం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నాన్న కాలినడకల నుండి
వాలు కుర్చీ వరకు
వీధి గడపకు వాలిన
వార్తా పత్రికను
చేతులారగ ఎత్తి ఎదకు
హత్తుకున్నాడు కనుక
దిన పత్రికల బరాబరు
ముద్రణలకు
తృణ మాత్రం దోహదం చేసిన వాడయ్యాడు.

నాన్న విద్యాభ్యాసం నుంచి
విశ్రాంతి కాలం వరకు
వివిధ గ్రంథ పఠనానికి తప్పని సరి
సమయం కేటాయించాడు కనుక
వీధి చివరి గ్రంథాలయంలో
ఇనుప బీరువా వరుస పుస్తకాల
కొండంత జ్ఞానికి
గోరంత అద్దం పట్టిన వాడయ్యాడు

నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి
సందు మలుపు శెట్టి గారి దుకాణం నుంచి
అమ్మ అవసరంగా కావాలని చెప్పిన
ఉప్పు, పంచదార పొట్లాల నుండి
సంసారస్థుడైన హోదా వరకు
బజారు వరుస అంగడిలో
కొనుగోలు కొనసాగించిన వాడు కనుక
కిరాణా సరకుల వ్యాపారానికి
ఒకింత చేయూత నిచ్చిన వాడయ్యాడు.

బాలునిగా చేతిరాతల
బహుమానములందుకున్న నాన్న
బహు దూర ఉద్యోగ ఉపాధిలో
పల్లె లోన తల్లికి
కబురులంపిన కుశల రాయబారాలకు
తపాలా కార్యాలయం
తరగని ఉనికికి తన వంతు కారణమయ్యాడు.

అతి సామాన్యుడు నాన్న
బాల్యాంక స్థితిని మరువక
ప్రాచీ దిశల అరుణోదయాలను
నిత్య నూతనంగా చూచిన వాడు.
కాలగతిలో తెలుపు నలుపు నీడలను
వెన్నంటి నడచిన వాడు.
మెట్లెక్కి వచ్చినప్పుడు
గర్భగుడిని చుట్టిన
కోవెల మంటపంలా మనసు వెచ్చని
విశ్వాస ప్రదక్షిణలను అందుకున్నాడు.

Exit mobile version