Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త ఊపిరి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వేలూరి శారద గారి ‘కొత్త ఊపిరి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రామనాధం బద్దకంగా లేచాడు. రోజూ ఒకటే రొటీన్. ఇక లేచి పార్కుకి బయలుదేరాలి అనుకుంటూ కాలకృత్యాలు తీర్చుకుని, వాకింగ్ షూ వేసుకుని, చేతిలో చిన్న స్టిక్ తీసుకుని బయలుదేరాడు.

అప్పటికే రామనాధం స్నేహితులు అందరూ వచ్చేసారు. “మీ కోసమే మేం ఎదురు చూస్తున్నాం.. ఏమిటి ఆలస్యం?” అన్నారు సుబ్బారావు, అప్పారావు, బాపూజీ.

“ఈ రోజు బద్ధకంగా ఉండి లేవలేకపోయాను” అన్నాడు.

“బద్ధకమేనా! ఒంట్లో నలతగా ఉందా?” అంటు ఆదుర్దాగా అడిగాడు సుబ్బారావు.

“అబ్బే! అదేం లేదు, ఇక్కడికి వచ్చి ఈ రోజుకి ఆరు సంవత్సరాలయింది. అదే ఆలోచిస్తూ పడుకునే టప్పటికి మధ్యరాత్రి అయింది. అంతే” అన్నాడు రామనాధం.

చల్ల గాలుల మధ్య నడుచుకుంటూ వెళుతుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. అప్పుడే వస్తున్న బాల భానుడి లేలేత కిరణాలు ఒంటికి తగులుతుంటే ఎంతో హాయిగా ఉంది.

రామనాధానికి 70 ఏళ్ళు. హ్యాపీ హోమ్‌కి వచ్చి ఆరు సంవత్సరా అయింది. ‘వృద్ధాశ్రమం’ అనే కంటే హ్యాపీ హోమ్ అంటేనే బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ వృద్ధులందరూ ఇంటి కంటే ఇక్కడే సంతోషంగా గడుపుతారు. కొంతమందికి ఆదివారం వస్తోందంటే ఎంతో సంతోషం. ‘మా పిల్లలు, మనవలు వస్తారు’ అనుకుంటూ ఉదయం నుంచే ఎదురు చూస్తూ ఉంటారు.

పిల్లలు లేనివాళ్ళు, పిల్లల వల్ల అనాదరణకు గురైన వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. తల్లి తండ్రులు లేని యువతీ యువకులు ఈ పెద్దల్లో వాళ్ళ తల్లి తండ్రులను చూసుకుని తృప్తి పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మామ్మ, అమ్మమ్మ, తాతయ్య అంటూ వరసలు కలిసి ఎంతో సంతోషంగా గడిపి వెళతారు.

రామనాధానికి ఇక్కడ బానే వుంది. రోజూ ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, టీ. రాత్రి 7 గంటలకి డిన్నర్. ఎంతో పద్ధతిగా ఉంటుంది.

వారం వారం మెడికల్ చెకవ్. ఏ మాత్రం నలతగా ఉన్నా, వెంటనే డాక్టరు వచ్చి చూసి వెళతారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‍కు కూడా తీసుకు వెళతారు.

ప్రతీ వాళ్ళకి ఒక రూమ్. ఉదయాన్నే వేకప్ కాల్ వస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే కేర్ టేకర్ వస్తాడు ఎలా ఉన్నారో చూడ్డానికి.

***

అరగంట నడిచి అలసిపోయి ఒక సిమెంటు బెంచీ మీద నలుగురు కూర్చున్నారు. “రామనాధం గారూ ఎందుకు ఇవ్వాళ డల్‍గా ఉన్నారు? ఎప్పుడూ మీరే ఉత్సాహంగా ఉంటారు కదా?” అన్నాడు బాపుజీ.

నిర్లిప్తంగా చూసాడు రామనాధం. అందరూ 65, 75 సంవత్సరాల మధ్యలో ఉంటారు.

పిల్లలు ఉండి నిరాదరణకు గురైన వారు రామనాధం, బాపూజీ. అప్పారావు, సుబ్బారావుకి పిల్లలు లేరు. వాళ్ళ వాళ్ళ భార్యలు పోయి 5, 6 సంవత్సరాలు అవడంతో ఒంటరితనం భరించలేక ఇక్కడికి వచ్చారు.

పేరుకి తగ్గట్టే ‘హ్యాపీ హోమ్’ అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఎందుకో రెండు రోజుల నుంచి రామనాధానికి తన ఏకైక కూతురు రాధ పదే పదే గుర్తుకు వస్తోంది. తనను ఎంత నిర్దయగా వదిలేసి వెళ్ళిపోయిందీ! తను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న పిల్ల ఇలా తనని అనాథాశ్రమానికి చేర్చింది అనుకున్నాడు బాధగా.

***

రామనాధం పల్లెటూల్లో గవర్నమెంటు స్కూల్లో సైన్సు టీచర్‌గా పనిచేసేవాడు. ఎంతో ఆదర్శ భావాలు కలవాడు. అందరూ టీచర్స్ సాయంత్రాలు ట్యూషన్స్ చెబుతున్నా, తను మాత్రం పేద పిల్లలకి ఫీజులు కట్టడం, సందేహాలు ఉంటే తీర్చడం చేసేవాడు. రామనాధానికి తగ్గ భార్య వకుళ. పనిమనిషి కొడుకు రాము అల్లరి చిల్లరగా తిరుగుతుంటే. వాణ్ణి స్కూల్లో జాయిన్ చేసే వరకు ఊరుకోలేదు. వాడికి బట్టలు, చదువుకి సంబంధించిన వస్తువులు, నోట్సులు అన్నీ కొనిచ్చింది.

రామనాధానికి ఏకైక కూతురు రాధ. తండ్రికి గారాల పట్టి. తనకి ఏది తోస్తే అదే చేసేది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. పల్లెటూరిలో చదువు అయిపోవడంతో పట్నంలో ఇంటర్‌లో చేరింది. రోజూ బస్‍లో వెళ్ళి వస్తూ ఉండేది. గిర్రున 2 సంవత్సరాలు గడిచాయి. ఇంటర్ పాసై ఇంజనీరింగ్‌లో చేరింది. అక్కడే పరిచయం అయ్యాడు మధు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, చురుగ్గా ఉంటాడు. క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. ఇద్దరి పరిచయం ఇష్టంగా మారి పెళ్ళి వరకు వెళ్ళింది. పెద్దలు అంగీకరించడంతో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్ళి చేసాడు రామనాధం. సిటిలో కూతురు కొత్త కాపురానికి ఫర్నిచర్ అంతా కొన్నాడు.

స్తోమతకి మించి కూతురు అడిగినా, ఎక్కడా రాజీ పడకుండా కొన్నాడు. కూతురు సంతోషమే తన సంతోషం అనుకున్నాడు.

***

కాలం గిర్రున తిరుగుతోంది. రామనాధం రిటైర్ అయ్యాడు. అంతేనా, తాత కూడా అయ్యాడు. కూతురి ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా మనవడిని రామనాధం దంపతులు ఇక్కడే పెంచుతున్నారు. మనవడు సుధీర్‌కి 4వ సంవత్సరం వచ్చిన తరువాత స్కూల్లో జాయిన్ చెయ్యడానికి రాధ తీసుకు వెళ్ళింది.

10 రోజులకే పిల్లాడు బెంగ పెట్టుకున్నాడని రమ్మంటే, రామనాధం, వకుళ సిటీకి వెళ్ళారు. అంతటితో ఆ దంపతులకి క్షణం తీరిక లేకుండా పోయింది. రోజూ స్కూల్లో దించడం, తీసుకురావడం, హోమ్ వర్క్ చేయించడం, ఇంట్లోకి కూరలు తీసుకురావడం, ఒకటేమిటి సమస్తం. రామనాధం డ్యూటీ అయితే, వకుళ జీతం లేని పనిమనిషి అయింది. ముందు ఎంతో ఇష్టంగా ఉన్నప్పటికీ, రాను రాను రాధ ప్రవర్తనతో వాళ్ళు ఎంతో విసిగిపోయారు. శారీరకంగా మానసికంగా ఎంతో దెబ్బతిన్నారు. కూతురి ప్రవర్తన అంతకంతకూ మితిమీరిపోతుంది. ఒక్క పని చెయ్యదు.

ఒకరోజు వకుళకి ఒంట్లో బావులేక పొద్దున్నే లేవలేకపోతే తల్లి ఆరోగ్యం గురించి ఆదుర్దా పడకుండా “ఏమ్మా! అంత బావు లేకుండా ఉన్నానా? నువ్వు ఇప్పటికిప్పుడు మంచం ఎక్కి కూర్చుంటే ఎవరు చేస్తారు? నేను ఆఫీసుకు వెళ్ళాలి. బాబుని రెడీ చెయ్యాలి. నాన్నా! అమ్మకి టాబ్లెట్ ఇచ్చి, కావాలంటే మీరు సహాయం చెయ్యండి. అంతే తప్ప జ్వరం వచ్చిందని సాకు చెబుతూ మంచం ఎక్కితే కుదరదు” అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయింది.

రాధ ప్రవర్తన అంతకంతకూ విచిత్రంగా తయారవుతోంది. కన్న తల్లిదండ్రులనే ప్రేమ లేకుండా పోయింది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడింది లేదు. పైగా ఏదో ఒక విసుర్లు. “మా ఆఫీసులో అందరు – నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావు. ఈ వయస్సులో తల్లి తండ్రులని పల్లెటూర్లో వదిలేయకుండా దగ్గరే వుంచుకుని చూసుకుంటున్నావు అంటారు” అంటూ తనకి తనే గొప్పలు చెప్పుకుంటుంది. వచ్చిన కొత్తల్లో ఏదో విషయంలో రామనాధం కలగ చేసుకోకపోతే కర్కశంగా మాట్లాడింది. “వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండండి. మీ పరిధి దాటి మాట్లాడొద్దు” అంటూ వార్నింగ్ ఇచ్చింది.

రామనాధం దెబ్బ తిన్నట్టు చూసాడు. ‘ఒక్కత్తే పిల్లని గారంగా చూడ్డం తప్పు అయిందా! వకుళ చెబుతూనే వుంది. అంత గారం వద్దు, కష్టసుఖాలు తెలియాలి అని, నేనే పొరపాటు చేసాను. ఇప్పుడు అనుకుని ఏం లాభం’ అనుకుంటూ అప్పటి నుంచి రాధ నుంచి మానసికంగా దూరం అయ్యాడు.

***

రాధ మాటలకి బాధపడ్డ వకుళ నెమ్మదిగా లేచి టాబ్లెట్ వేసుకుని పని మొదలు పెట్టింది. అసలే జ్వరం అనడంతో నీర్సంగా వుండి కళ్ళు తిరుగుతున్నాయి. పనులన్నీ పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. రామనాధం మజ్జిగ అన్నం కలిసి గదిలోకి తీసుకొచ్చాడు.

“ఏవండీ! మనం ఇక్కడ ఉండవద్దు, నన్ను ఎక్కడికైనా తీసుకుపొండి. ఇక్కడ ఉండలేను, మానసికంగా శారీరకంగా నేను చాలా అలసిపోయాను. అల్లుడు మంచివాడే, కానీ, అతని మాట చెల్లుబాటు అవదు. కూతురని చెప్పుకోడానికి కూడా అసహ్యం వేస్తోంది.

ఇల్లు అమ్మిన డబ్బు కూడా దానికే ఇచ్చాం. మనకి ఉన్నది ఈ పెన్షన్ డబ్బులు. ఇందులో కూడా ప్రతీ నెలా ఏదో వంక పెట్టి సగానికి సగం తీసేసుకుంటుంది. నేను దీనితో వేగలేను. నన్ను ఎక్కడికైనా తీసుకుపొండి” అంటూ వకుళ వెక్కి, వెక్కి ఏడ్చింది. రామనాధం ఒక నిర్ణయానికి వచ్చి “రెండు రోజులు ఆగు. నేను నిన్ను మంచి చోటుకి తీసుకు వెళతాను” అన్నాడు.

అనుకున్నట్టే మూడో రోజు మధ్యాహ్నం బట్టలు సద్దుకుని రాధకి ఒక ఉత్తరం రాసి, వకుళని ‘హ్యాపీ హోమ్’కి తీసుకుని వెళ్ళాడు. ఆఫీసు నుంచి వచ్చిన రాధ తాళం వేస్తున్న ఇల్లుని చూసి విస్తుపోయింది. పక్కింటి పిన్ని గారు తాళం ఇచ్చి “మీ అమ్మగారు ఈ తాళం ఇమ్మన్నారు” అని తాళం ఇచ్చి వెళ్ళి పోయింది. హాల్లోకి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న ఉత్తరం చదివి అగ్గిమీద గుగ్గిలం అయింది. ‘రేపటి నుండి ఇంటి పని, పిల్లాడిని చూడ్డం, వాణ్ణి స్కూల్ నుంచి తీసుకురావడం ఇవన్నీ ఎవరు చేస్తారు?’ అనుకుంటూ తీవ్రంగా ఆలోచించింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. అన్ని ఓల్డేజ్ హోమ్‍లు వెతికితే రామనాధం, వకుళల ఆచూకీ తెలిసింది. రాధ వాళ్ళని తిరిగి ఇంటికి రమ్మన్నా రాలేదు.

***

కాలం గిర్రున తిరుగుతోంది. వకుళ అనారోగ్యంతో చనిపోయింది. వకుళ ఆఖరి కోరిక ప్రకారం ఆమె కళ్ళని డొనేట్ చేసాడు రామనాధం. రామనాధం ఒంటరివాడు అయిపోయాడు. సుబ్బారావు, అప్పారావు. బాపూజీ రామనాధాన్ని కనిపెట్టుకుని ఉంటున్నారు. ఏ రోజైనా నలతగా ఉంటే ఆ రోజు అంతా వంతులు వేసుకుని రామనాధం దగ్గరే ఉంటున్నారు.

మొదట్లో కూతురి ఇంటికి వస్తున్నప్పుడు రామనాధం ఎంతో ఊహించుకున్నాడు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. కూతురు, అల్లుడి చేతిలో తను పోవాలనుకుంటే ఇక్కడ ఈ రకంగా ఉండటమేమిటి? కర్మ కాకపోతే అనుకున్నాడు.

***

రామనాధం గదిలో ఫ్యూజ్ పోతే ఎలక్ట్రిషియన్ వచ్చాడు. అతనితో పిచ్చాపాటి మాట్లాడుతుంటే పల్లెటూరిలో తన ఇంటి పనిమనిషి కొడుకు ‘రాము’గా గుర్తించాడు.

రామనాధం పరిస్థితి చూసి రాము చలించిపోయాడు – అంత గొప్ప మనిషికి ఇటువంటి పరిస్థితా అని. రాము తన గురించి చెప్పుకొచ్చాడు. “సార్! మీ వలన నేను ఇంతవాణ్ణి అయ్యాను. మీరే కనుక పాలిటెక్నిక్ ఫీజు కట్టకపోతే నేను ఎక్కడో బస్తాలు మోస్తూ ఉండేవాడిని. నాకు అడుగడుగునా సాయపడ్డారు. నా చదువు పూర్తయిన తరువాత స్వంతంగా నేను వైరింగ్ నేర్చుకుని, నా కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఇంకో నలుగురికి సహాయంగా ఉన్నాను. వాళ్ళకి నెలకి జీతం ఇస్తూ నాకిందే పెట్టుకున్నాను.

ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు వెళతారు కానీ ఈ ‘హ్యాపీ హోమ్’ కి మాత్రం నేనే వస్తాను. కొంచెం సేపైనా ఈ పెద్ద వాళ్ళతో గడుపుదాం” అని అంటూ ముగించాడు.

“సార్ నేను మళ్ళీ వచ్చి, మిమ్ముల్ని తీసుకు వెళతాను” అంటూ వెళ్ళిపోయాడు. అనుకున్నట్టు గానే రెండురోజుల తరువాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రామనాధం దగ్గరకు వచ్చారు రాము, అతని భార్య పిల్లలు.

“మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరు ఎవ్వరూ లేని అనాథ కాదు. నేను ఉన్నాను. నాకూ పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు మొహమాటపడకండి. మా పిల్లలతో ఆడుకుందురుగాని, వాళ్ళకి తాతయ్య లేని లోటు తీరుద్దురు గాని” అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో.

“రండి తాతయ్యా!” అంటూ పిల్లలు చెరో చెయ్యి పుచ్చుకున్నారు. ఇదే తను కోరుకున్నది. రామనాధానికి మనసంతా సంతోషంతో నిండిపోయింది. తనకి చేతికర్ర అవసరం ఇక రాదు అనుకుంటూ సంతోషంగా బయలుదేరాడు, తన కొత్త జీవితాన్ని ఉదయిస్తున్న సూర్యుడిలో చూస్తూ.

రామనాధం స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు, రామనాధం కోరుకున్నది ‘ఈ ఆదరణ, ఈ అప్యాయతే కదా’ అని.

Exit mobile version