[అనుకృతి గారు రచించిన ‘కొత్త చిగురు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆ ఊరి మీదుగా వెళ్ళే బస్సులన్నీ చంద్రమ్మ చిన్న పాక హోటల్ ముందు తప్పకుండా ఆగుతాయి. అక్కడే పై ఊళ్లకు వెళ్ళటానికి వీలుగా బస్ స్టాప్ వున్నది. చంద్రమ్మ హోటల్ లాంటి హోటల్స్ మరో నాలుగైదు వున్నాయి ఆ రోడ్డులో.
చంద్రమ్మ శుచి, శుభ్రం పాటిస్తుందని, కొంచం గిరాకీ మిగతా వాళ్ళకంటే కొంచం ఎక్కువ. అంటే మరీ చెప్పుకోదగ్గ బిజినెస్ కాకపోయినా పర్వాలేదు, ఓ మోస్తరుగా ఆదాయం వుంటున్నది.
చంద్రమ్మ, వెంకన్నకు ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రకాష్, కూతురు సునీత. కొడుకు డిగ్రీ చేసాడు, హైదరాబాద్‌లో ఓ ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్య కస్తూరి, టైలరింగ్ చేసి, బాగానే సంపాదిస్తూ, అతనికి చేదోడువాదోడుగా వుంటున్నది. ఇద్దరు పిల్లలు, ఈ మధ్యనే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, లోన్ పెట్టి కొనుక్కున్నాడు. ప్రకాష్ గురించి తల్లితండ్రులకు బెంగలేదు, కోడలు కూడా సౌమ్యురాలు, అత్తామామలకి, భర్త సహాయం చేస్తే, గొడవలు పెట్టుకొనే రకం కాదు కస్తూరి.
చంద్రమ్మ బెంగంతా కూతురు సునీత గురించే. సునీత ఇంటర్ వరకు, చక్కగా చదువుకొనేది. ప్రకాష్ చెల్లెల్ని ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించాడు. టౌన్లో మంచి కాలేజీలో చేర్చారు. రోజూ ఆటోలో కాలేజీకి వెళ్లి వస్తుండేది. ఆ తర్వాత ఎంసెట్ కోచింగ్‌లో చేరింది, ఇంజనీరింగ్‌లో సీట్ వచ్చింది. టౌన్లో వున్న కాలేజీలో చేరింది. సిటీ బస్సులో వెళతానని, కాలేజీ బస్సుకి ఖర్చు ఎక్కువని చెప్పి, అలాగే వెళుతుండేది.
ఎప్పుడు పరిచయమయ్యాడో ఆటో డ్రైవర్ శంకర్, వాడి వలలో పడింది. చాల రహస్యంగా అతన్ని కలుసుకొనేది. తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని కానీ, తన భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే దశ దాటిపోయిన సునీత, ముందు, వెనక ఆలోచించకుండా, ఓ రోజు, ఆర్య సమాజ్‌లో పెళ్ళి చేసుకొని, ఇంటికి వచ్చింది. చంద్రమ్మ, వెంకన్న నిర్ఘాంతపోయారు. కూతురు మేజర్ కాబట్టి ఏమీ చేయలేకపోయారు. కూతురు తమని ఉద్ధరించాలని వాళ్ళేమీ కోరుకోలేదు, కానీ, కూతురు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందని వాళ్ళు అనుకోలేదు.
హోటల్ మీద ఆదాయంతో, ఉన్నదాంట్లో తృప్తిగానే బ్రతుకుతున్నారు వాళ్ళు.
విషయం తెలిసి, ప్రకాష్ వచ్చాడు. శంకర్‌తో కాసేపు మాట్లాడాక, అతనికి జీవితం పట్ల ఎటువంటి లక్ష్యం లేదనీ, ఆ పెళ్లి ఎక్కువకాలం నిలబడదని అతనికి అర్థమయ్యింది. తల్లీ, తండ్రీ, అన్న ఎంత గొడవ చేస్తారోనని భయపడిన సునీత, అన్నతో సహా అందరూ, నిశ్శబ్దంగా ఉండిపోయేసరికి, ఖిన్నురాలయ్యింది. శంకర్ తల్లి, తండ్రులకి బాగా తెలుసు తమ కొడుకెంతటి ఘనుడో. అన్నకు ఉద్యోగముంది, వెంకన్నకు హోటల్ వుంది, క్రమేణ డబ్బు గుంజవచ్చు అన్న ఆలోచనతోనే, సునీతకు వల విసిరాడు, చేప వలలో పడింది.
చంద్రమ్మది వానాకాలం చదువే కానీ విజ్ఞత కల మనిషి. ఆవేశపడుతున్న భర్తని నిలువరించగలిగింది. పెళ్ళైన మూడో నెలలో, నెల తప్పింది సునీత. టౌన్2లో వుండేవాళ్ళు. సునీత వాళ్ళు. ప్రకాష్ చంద్రమ్మ తమ శక్తిమేర సునీత అవసరాలు తీర్చేవారు. కొడుకు పుట్టాక, వాడికి ఆరోనెల వచ్చాక, తన ఇంటికి వెళ్ళింది సునీత.
శంకర్‌కి ఆమె పట్ల వున్న మోజు పోయింది. ప్రతి చిన్నదానికి, డబ్బు తెమ్మని వేధించసాగాడు. సునీతకి తన వాళ్ళ కష్టార్జితాన్ని అతనికి ధారపోయటం ఇష్టం లేకపోయింది. ఎదురుతిరిగింది. ఫలితం తన్నులు, తిట్లు. తాను చేసిన తప్పుకి ఈ శిక్ష సరైనదే అనుకొని, మౌనంగా భరించేది. బాబుకి రెండేళ్లు వచ్చాయి. సునీత చదువెప్పుడో అటకకెక్కింది.
ఒక రోజు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాని చెప్పాడు శంకర్. మేనమామ లావుగా వున్న కూతురికి మ్యాచెస్ కుదరక నెమ్మదిగా శంకర్‌ని ముగ్గులోకి లాగాడు. మూడెకరాల పొలం, లక్ష కట్నం ఇస్తానని ప్రలోభపెట్టాడు. నయానా, భయానా చెప్పాడు సునీతకి, మరదల్ని చేసుకోవటానికి ఒప్పుకోమని, ఇద్దర్నీ చూసుకుంటానని చెప్పాడు.
సునీతకు అప్పటికి అతని మీద వున్న భ్రమలు తొలగిపోయాయి. కానీ ఆ దెబ్బలు, దుర్భాషలు భరించలేక పోయింది. కొడుకుతో సహా గడప దాటింది, చిక్కి, శల్యమై తన ఇంటికి చేరిన కూతుర్ని చూసి, విలవిలలాడిపోయారు వెంకన్నా, చంద్రమ్మలు. అయినా చంద్రమ్మ కూతుర్ని పరువు కోసమో, లోకం కోసమో దూరం చేసుకోదలచుకోలేదు. లోలోపల కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చి, ధైర్యం చెబుతోంది.
అన్నట్టుగానే, మరదల్ని పెళ్లి చేసుకొని తీసుకవచ్చాడు శంకర్. సునీత తట్టుకోలేకపోయింది. ఆ రోజు ఉదయమే లేచి కొడుకుని స్నానం చేయించి పదే, పదే ముద్దు పెట్టుకొంది. వంట చేసి వచ్చి, తీసుకెళతానని, పిల్లాడిని తీసుకెళ్ళమని తల్లితో చెప్పింది. ఇంటినుండి, హోటల్ అరకిలోమీటర్ దూరం కూడా ఉండదు. చంద్రమ్మకు ఎటువంటి అనుమానం రాలేదు.
సునీత తనలో తాను కుమిలిపోయింది. తన పట్ల తన కుటుంబం చూపిస్తున్న ప్రేమ చూసుంటే రోజు, రోజుకి ఆమె గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోతున్నది. ఇంత జరిగినా శంకర్ అడిగినప్పుడల్లా ఎలాగోలా డబ్బు సర్ది, అతన్ని తనని బాగా చూసుకోమని సర్ది చెప్పి పంపేవాళ్లు అదివరకు. సునీతకు తానెంత తెలివితక్కువగా శంకర్ లాంటి మోసగాడి వలలో చిక్కి, తొందరపడి బంగారం లాంటి భవిష్యత్‌ని నాశనం చేసుకుని, జీవితాన్ని నిరర్ధకం చేసుకున్నాడని లోలోపల కుమిలిపోయేది.
ముందు కొడుకుని కూడా తనతో పాటు తీసుకుపోదామనుకున్నది. కానీ ఆ ఆలోచనకు తల్లి మనసు మెలితిరిగిపోయింది, తన తొందరపాటుకు తనే శిక్ష విధించుకోవాలి అనుకొని, వాడిని తల్లితో పంపింది. నెమ్మదిగా ఊరి చెరువు వైపు నడిచింది. చుట్టూ ఎవరూ లేకుండా చూసి, చెరువులో దూకింది.
పొలం పనులకు వెళుతున్న కొందరు ఆమె నీటిలో పడ్డ శబ్దం విని, చెరువులోకి ఇద్దరు దూకి, ఆమెను బయటకు తీసుకు వచ్చి నీళ్లు కక్కించారు. ఎవరో చంద్రమ్మకి వార్త చేరవేశారు. అప్పటికే ఆటోలో సునీతని తీసుకొచ్చారు, వాళ్లకు సునీత గురించి తెలుసు. సునీతని హాస్పిటల్లో చేర్చారు. కొడుక్కి ఫోన్ చేసింది చంద్రమ్మ. వెంటనే వచ్చాడు. ప్రకాష్ వచ్చి, విషయం చేయిదాటి పోయిందని గ్రహించి, చెల్లెలితో “సునీతా, అతనితో ఇంకా కలిసి బ్రతకాలని అనుకుంటున్నావా” దుఃఖంతో నిండిపోయిన కంఠంతో అన్నాడు.
అన్నను పట్టుకొని ఏడ్చింది. “నేను పాపిష్టిదాన్ని, మీ పరువు తీశాను, నా కొడుకుని చూడు అన్నయ్యా, నాకు బ్రతకాలని లేదు” అన్నది దుఖాతిశయంతో.
“లేదు తల్లీ, భగవంతుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించే హక్కు మనకు లేదు, విడాకులు చట్టరీత్యా తీసుకొందాము” అని ఓదార్చి, విడాకులకు అప్లై చేయించాడు. ఎనిమిది నెలల తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు వచ్చాయి. పిల్లడి బాధ్యత తనకు వద్దని చెప్పాడు శంకర్.
శంకర్ మామ అల్లుడిని తన వూరికి తీసుకెళ్ళి పోయాడు. అందమూ, మంచితనమూ వున్న సునీతనే మోసం చేసిన శంకర్ మత్తగజం లాంటి వాడు, వాడికి ఎప్పుడూ అంకుశపు పోట్లు పడాల్సిందేనని ఆయనకు తెలుసు. కూతురు కోసం సునీత జీవితాన్ని ఛిద్రం చేయటానికి ఆయన జంకలేదు. ఇప్పుడు తన కూతురు విషయంలో మాత్రం ఆ విధంగా జరగకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
బాబుని తల్లి దగ్గిర వదిలి, చెల్లెల్ని తనతోపాటు తీసుకెళ్ళి, డిగ్రీ కాలేజీలో చేర్చాడు ప్రకాష్. కస్తూరి, మరదలిని అక్కున చేర్చుకున్నది. క్రమంగా తన పాత జీవితాన్ని మర్చిపోయి, అటు చదువు, ఇటు ఇంటి పని, కుట్టుపనిలో వదినకు సాయం చేస్తూ, కొత్త జీవితాన్ని ప్రారంభించింది సునీత.
శంకర్ పిల్లాడి గురించి ఎక్కడ పేచీ పెడతాడోనని భయపడింది చంద్రమ్మ. కానీ శంకర్ వాడి బాధ్యత వద్దన్నాక, ఊపిరి పీల్చుకొంది. చంద్రమ్మ, వెంకన్న ఇప్పుడు మనవడి ముద్దు, ముచ్చట్లతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. చంద్రమ్మ వారం, వారం వచ్చిన ఆదాయంలో వెయ్యో, రెండువేలో కోడలికి పంపేది. కస్తూరి వద్దని చెప్పినా, కోడలి మంచితనాన్ని కాపాడుకోవాలనుకుంటే అదే మంచిదని చంద్రమ్మ భావించింది.
ఆ పసివాడి బాధ్యత సంతోషంగా స్వీకరించారు ఆ దంపతులు. లోకం కోసమో, పరువు కోసమో, కులం కోసమో చంద్రమ్మ కూతుర్ని వదులుకోదల్చలేదు. కూతురు బాగా చదువుకోవాలి, తన కాళ్ళమీద తాను నిలబడి, మంచి వుద్యోగం తెచ్చుకొని, మంచి జీవితాన్ని గడపాలని ఆశపడుతోంది చంద్రమ్మ.
(సమాప్తం)

అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.