Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొరియానం – కొరియన్ సినిమాలపై తెలుగులో తొలి ప్రయోగం!

[శ్రీ వేదాల గీతాచార్య రచించిన ‘కొరియానం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు ప్రొ. కె. శ్రీనివాస రాఘవ.]

నాకు చిన్నప్పటి నుంచీ యాక్షన్, థ్రిల్లర్ సినిమాలంటే బాగా ఇష్టం. అలాగే ఎక్కువ ఫైటింగ్లు, యాక్షన్ ఉన్న సినిమాలే చూసేవాడిని. దాదాపు 90’s చివర నుంచీ ఫారిన్ సినిమాలు మన లోకల్ థియేటర్లలోకి రావటం, మనవాళ్ళు బాగా ఆదరించడం జరిగింది. ఎక్కువగా ప్రముఖ హాలీవుడ్ హీరోల యాక్షన్ సినిమాలు వచ్చినా, సంవత్సరానికి ఒకటి, రెండు వచ్చే జాకీ చాన్, జెట్ లీల మార్షల్ ఆర్ట్స్ సినిమాలే బాగా నచ్చేవి మా 90’s కిడ్స్‌కి, ఎందుకంటే వారి ప్రాంతీయ నేపథ్యం, ఆర్గానిక్ యాక్షన్ ఎక్కువగా ఆకట్టుకునేవి. డూప్స్ లేకుండా వాళ్ళు చేసే ఫైట్స్ బాగా నచ్చేవి. ఆ సినిమాల ప్రభావంతో చాలామంది యూత్ మార్షల్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యారు. నేను, నాతో పాటు రచయిత గీతాచార్య కూడా కొంత కాలం కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నాం.

కానీ సినిమాలు చూడాలంటే థియేటర్‌లో లేదా vcr లాంటివే దిక్కు ఆ రోజుల్లో.

తర్వాత మెల్లగా ఇంటర్నెట్ యుగంలో ప్రవేశించగానే థియేటర్లలో రిలీస్ కాని రకరకాల ప్రపంచ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా యాక్షన్ మూవీస్ కోసమే ఎక్కువ వెతికేవాళ్ళం.. ఎందుకంటే యూత్ కదా!

అప్పుడు పరిచయం అయ్యింది ‘కొరియన్’ సినిమా. నేను చూసిన మొదటి కొరియన్ సినిమా ‘My Brother’ (Uri Hyeong) 2004 లో. అప్పటి దాకా చూసిన సినిమాల కంటే భిన్నంగా ఉంది, బాగా నచ్చింది. తర్వాత ‘A Bittersweet Life’, ‘Lady Vengeance’, ‘The Host’, ‘Memories of Murder’, ‘Peppermint Candy’, ‘Joint Security Area’, ‘Oldboy’, ‘The Chaser’, ‘I Saw the Devil’.. అలా అలా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన ‘The Parasite’,’Rangjong’, ‘The Wailing’, ‘Train to Busan’,’Exhuma’ దాకా దాదాపు ప్రతీ యాక్షన్, క్రైమ్, డ్రామా సినిమాలన్నీ చూసేశా, ఇంకా చూస్తూనే ఉన్నా. మిగతా ఫారిన్ సినిమాల కన్నా కొరియన్ సినిమా ప్రత్యేకం.. ఎందుకంటే, అదొక లోకల్ కాని వేరే లోకం. మన దేశంలో కొరియన్ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది!

అంటే నాలాంటి వాళ్ళు ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ మనం సినిమాను చూసి, ఎంజాయ్ చేసి.. కావాలంటే మళ్ళీ చూసి వదిలేస్తాం. బావుంటే ఒక జ్ఞాపకంగా ఉంటుంది అంతే.

కానీ సినిమాను మామూలుగా కాకుండా ఒక ప్రత్యేక ఆసక్తితో చూసే కొంతమంది ఉంటారు. వాళ్ళలో కూడా ఇంకా లోతుగా చూసి విశ్లేషించే వాళ్ళు ఉంటారు, అలాంటివాడే ఈ పుస్తక రచయిత ‘గీతాచార్య’. ఒక విషయాన్ని ముఖ్యంగా సినిమాకు సంబంధించిది అయితే ప్రతీ చిన్న డీటైల్ గుర్తుపెట్టుకుని మరీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే ఆసక్తితో వివరించి చెప్పటం, రాయటం మామూలు విషయం కాదు. సినిమాను ఎంతో ప్రేమించి, రీసెర్చ్ చేసే బుర్ర ఉంటేనే అది సాధ్యపడుతుంది. నాకు చిన్నప్పటి నుండీ గీతాచార్య బాగా తెలుసు కాబట్టే ఈ విషయాన్ని చాలా గట్టిగా, కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతున్నాను.

మేము చాలా సినిమాలు చూసి, బాగా డిస్కస్ చేసే వాళ్ళం. కానీ నాకు అంత లోతుగా విశ్లేషించే ఇంటరెస్ట్, సామర్థ్యం రెండూ లేవు. కానీ గీతాచార్య తనకి నచ్చిన ‘కొరియన్’ సినిమాను ఒక పుస్తక స్థాయికి తీసుకురావటం, అందులోనూ తెలుగులో ఎవ్వరూ చెయ్యని ‘ప్రయోగం’ చేయటం దాదాపుగా అద్బుతం అనే చెప్పచ్చు.

దాదాపు 3 ఏళ్ల క్రితం ‘సంచిక’ లో ఒక మామూలు సినిమా ధారావాహికగా మొదలయ్యింది. మొదట్లో నేను అంతగా చదవలేదు.. కానీ సినిమాలో నేను గమనించని కొన్ని సునిశిత అంశాలు దాంట్లో కనిపించే సరికి కొన్ని ఎపిసోడ్లు చదివేశాను. దానిని ఒక పుస్తకంగా తీసుకురావటం ఒక సాహసం చేసినట్లే!

ఒక చిన్న పిల్లాడు మొదటిసారి Spielberg సినిమా చూసి తన అనుభవాన్ని స్నేహితులకి గొప్పగా చెప్తుంటే ఆ ఉత్సుకతలో భాష, శైలి గురుంచి ఆలోచించడు కదా, ఎందుకంటే సినిమాలో తనకి బాగా నచ్చిన విషయాన్ని ఇతరులతో పంచుకోవటం, వారికి కూడా ఆ సినిమా పట్ల ఆసక్తి కలిగించే లాగా చెప్పటం అంతే. అందుకే ఈ పుస్తకంలో రచయిత ప్రత్యేక శైలి కనపడుతుంది. ఇంక భాష ఒక టిపికల్ కొరియన్ సినిమా లాగే ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఒక రోలర్ కోస్టర్‌లో కూర్చుని మనకిష్టమైన సినిమా చూస్తున్న అనుభూతి వస్తుంది! కొంతసేపటికి రోలర్ కోస్టర్‌ని మరిచిపోయి సినిమాను ఎంజాయ్ చేయటం మొదలుపెడతాం కదా.

ఈ పుస్తకంలో కూడా మనకు మొదటి పేజి ‘పీఠిక’ నుంచే రోలర్ కోస్టర్ ఎక్కేస్తాం.. ఆదాము, అవ్వ, యండమూరి సుబ్బారావు, అల్లూరి సీతారామరాజు, వదల బొమ్మాళీ వదలా, కర్మర్మమ్, మహేష్ బాబు, స్టెఫీ గ్రాఫ్, శ్రావణ శుక్రవారం, కొరియన్ సావిత్రి.. మధ్య మధ్య లో కొన్ని సంస్కృత శ్లోకాలు, కోట్స్, మీమ్స్, టెన్నిస్, క్రికెట్, తెలుగు సినిమా సంగతులు.. రోలర్ కోస్టర్ ప్రయాణం కాకపోతే ఇంకేంటి మరి??

పుస్తకం కొన్ని పేజీలు చదివాక ఓ-డేసు అంటే మన తెలుగు వాడేనా అనే సందేహం వస్తుంది.. అంత లోతుగా ఉంటుంది రచయిత విశ్లేషణ. కొరియన్ సినిమాను, సినిమాలో పాత్రలను పాఠకుడికి బాగా దగ్గరలగా తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. మీరు ఇంతకు ముందు కొరియన్ సినిమా చూసినా సరే ఈ రచన క్రొత్తగానే అనిపిస్తుంది. మనం మళ్ళా ఆ సినిమా చూస్తే గీతాచార్య వ్రాసిన విషయాల కోసం ఆ సినిమాలో ఖచ్చితంగా వెదుకుతాము అంటే అతిశయోక్తి కాదు. అసలు కొరియన్ సినిమా తెలియని వాళ్ళు ఈ పుస్తకంలో 3 చాప్టర్ లు చదివితే వెంటనే oldboy మూవీ చూడటం స్టార్ట్ చేస్తారు.

ఈ పుస్తకం ఏదో ఒక చేయితిరిగిన రచయిత వ్రాసినట్లు ఉండదు కానీ ఒక కొరియన్ సినిమా ప్రేమికుడు తనకి నచ్చిన సినిమాల మీద చేసిన ఒక రీసెర్చ్ థీసిస్‌లా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పలంటే కొరియన్ సినిమాని తన ఓన్ చేసుకున్నాడు గీతాచార్య.

ఎవరైనా కొరియన్ సినిమాల మీద తెలుగులో పోటీ పరీక్ష పెడితే ఈ పుస్తకం ఒక్కటే సిలబస్, రిఫరెన్స్ అవుతుంది.

ఇందులో దాదాపు 60 సినిమాల విశ్లేషణ, విశేషాలతో పాటు హ్యూమన్ సైకాలజీ, వినోదం, స్క్రీన్ ప్లే లాంటి విభిన్న అంశాలు కూడా పొందుపరిచాడు. దీన్ని తెలుగు తెలిసిన కొరియన్ సినిమా వాళ్ళు చదివితే ఈసారి కొరియన్ సినిమాని తెలుగులో తీస్తారేమో అనిపిస్తుంది.

అసలు తెలుగులో కొరియన్ సినిమాల మీద ఒక పుస్తకం రావటమే అరుదు, వచ్చిన దానిని సినిమా, పుస్తక ప్రేమికులు మరింత ఆదరిస్తే సమీప భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చూడచ్చు.

చివరిగా.. ఈ పుస్తకం కేవలం సినిమా ప్రేమికులకు మాత్రమే కాదు, పఠనాభిలాష ఉన్న ప్రతి వ్యక్తికీ ఆసక్తిని కలిగిస్తుందని చెప్పగలను. దీనికి వెన్నుదన్నుగా నిలిచి, ఇలాంటి ప్రయత్నాలని ఆదరిస్తున్న సంచిక బృందానికి నా అభినందనలు.

***

కొరియానం (ఎ జర్నీ థ్రూ కొరియన్ సినిమా)
రచన: వేదాల గీతాచార్య
ప్రచురణ: GALTing Parables
పేజీలు: 432
వెల: ₹ 500/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

Exit mobile version