[శ్రీ వేదాల గీతాచార్య రచించిన ‘కొరియానం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
సినిమాలంటే మనలో చాలామందికి ఇష్టమే! కొందరికి కుటుంబ కథా చిత్రాలు, కొందరి ప్రేమ చిత్రాలు, కొందరి హారర్ చిత్రాలు, కొందరికి సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చుతాయి. కొందరికి పాటలు బావుండే సినిమాలు నచ్చుతాయి, కొందరికి పాటలు లేని సినిమాలు (చాలా అరుదుగా) నచ్చుతాయి.
కొందరికి ప్రాంతీయ భాషా చిత్రాలు ఇష్టమైతే, మరికొందరికి హిందీ సినిమాలు నచ్చుతాయి. కొందరికి హాలీవుడ్ సినిమాలు ఇష్టమయితే మరికొందరికి యూరోపియన్ సినిమాలు నచ్చుతాయి. గత కొన్నేళ్ళుగా కొరియన్ సినిమాలన్నా, కొరియన్ సీరిస్‌లన్నా యువతలో ఆసక్తి పెరిగింది.
దేనిలోనైనా ఇష్టం ఒక స్థాయిని మించితే passion అవుతుంది. అదే సినిమాల విషయమైతే తమకి నచ్చిన సినిమాలను పదే పదే చూస్తారు. సినీ అభిమాని కొంచెం రాయగల్గితే తన బ్లాగులోనో, ఫేస్‍బుక్ పేజీలోనో ఓ సినిమా తనకి ఎందుకు నచ్చిందో రాసుకుంటాడు. ఆ fan – వీరాభిమాని అయితే తమకు నచ్చిన సినిమాల గురించి ఎన్నో విషయాలు సేకరించి పెట్టుకుంటాడు. ఇక తను రచయిత కూడా అయితే తనకు నచ్చిన సినిమాల గురించి కాలమో/పుస్తకమో రాస్తారు. కొందరు మామూలుగా రాస్తే, మరికొందరు విభిన్నంగా, తమకంటూ ఓ శైలి కల్పించుకుంటూ కొత్త ఒరవడిని సృష్టిస్తూ రాస్తారు. వేదాల గీతాచార్య అటువంటివారిలో ఒకరు. తనకు నచ్చిన కొరియన్ సినిమాల గురించి సంచిక వెబ్ పత్రికలో 64 వారాల పాటు వ్యాసాలు రాసి వాటిని పుస్తక రూపంలోకి తెచ్చారు.
గీతాచార్య రచనలను ఫాలో అయ్యేవారికి ఆయనో ప్రయోగశీలి అని అర్థం అవుతుంది. తాను చెప్పదలచుకున్న అంశాన్ని పలచన కాకుండానే, ప్రయోగాత్మకంగా, కొండొకచో హాస్యంగా రాస్తూ.. పాఠకులకు చేరువ చేస్తారు.
ఈ పుస్తకానికి తెలుగు శీర్షిక ‘కొరియానం’ అయితే ఉపశీర్షిక ‘queryయానం’ అని ఉంటుంది. అంటే ప్రశ్నలతో ప్రయాణం! ప్రశ్నలు రేకెత్తిస్తారు, జవాబులిస్తారు.. కొన్నింటికి జవాబులను పాఠకులనే అన్వేషించమంటారు.
ఈ పుస్తకంలో రచయిత కొరియన్ సినిమాలను, కొరియన్ నటీనటులని, దర్శకులని, ఎడిటర్లని, సినిమాటోగ్రఫర్లనీ పరిచయం చేస్తారు. కొరియన్ సినిమాలకీ, హాలీవుడ్ సినిమాలకి ఉన్న పోలిక చెప్తారు. కొరియన్ దర్శకులలో ఉన్న ప్రత్యేకతని స్పష్టం చేస్తారు. రివర్స్ స్క్రీన్‍ప్లే ఉపయోగించి ‘పిప్పర్‍మెంట్ క్యాండీ’ సినిమాని ఉన్నతంగా మలచిన దర్శకుడు ‘ఈ చాంగ్ డాంగ్’ గురించి వివరిస్తారు. ఓల్డ్ బోయ్ సినిమా గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 11 సంగతులను పేర్కొన్నారు. షమనిజం గురించి చెప్పిన మీడియమ్/రాంగ్‌జాంగ్ సినిమా వ్యాసం ఆసక్తిగా చదివింపజేస్తూనే ఒంట్లో గగుర్పాటు కలిగిస్తుంది.
జామ్ (Sleep) అనే కొరియని సినిమా సమీక్షని అందించారు. The Round Up అనే కొరియన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల గురించి రాశారు. దాదాపు 60 సినిమాల సమీక్షలిచ్చారు.
పుస్తకంలో ఉన్నవి ఇవేనా అనుకోవద్దు. ఇంకా చాలా ఉన్నాయి. వాటిని సవివరంగా, బోర్ కొట్టించకుండా చదివించేలా రాశారు గీతాచార్య.
***
కొన్ని సినిమాలలోని పాత్రల స్వరూప స్వభావాలను పరిచయం చేయడానికి తెలుగు పుస్తకాలలోని పాత్రలతో పోల్చి చెప్పడం బావుంది. ఆయా రచయితల అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం కాదు కానీ, ఆ పోలిక ద్వారా ఈ పుస్తకం చదువుతున్న పాఠకులకు సినిమాలోని కారెక్టర్ గురించి బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఓ-డే సు ను మెట్ల సుబ్బారావుతో పోల్చడం!
కొన్నిచోట్ల భారతీయ సినిమాల రిఫరెన్సులు ఉంటాయి. ఉదాహరణకి, ..ing సినిమాలో ఒకే ఒక్క క్షణం పాటు తెరమీద కనబడినా, ప్రేక్షకుల హృదయాలపై తనదైన ముద్ర వేసిన నటుడి గురించి ప్రస్తావిస్తూ, సత్యజిత్ రే సినిమా Patol Babu, Film Star లోని పతోల్ బాబుని ప్రస్తావిస్తారు. ఇక్కడ చదవడం ఆపి, కొద్దిసేపు Patol Babu, Film Star సినిమా చూడాలని పాఠకులకు అనిపిస్తుంది.
పోయెట్రీ సినిమాని సూపర్ స్టార్ కృష్ణను ప్రధాన పాత్రగా పెట్టి తీయవచ్చన్న ఆలోచన/ప్రతిపాదన మరీ కొట్టిపారేయాల్సినదేమీ కాదు. అప్పటికి కృష్ణగారు నటన నుంచి విరమించుకున్నారు. తమిళ నటుడు వివేక్ అయినా నప్పుతాడని అన్నారు రచయిత, కానీ దురదృష్టవశాత్తు, ఈ ఇద్దరు ఇప్పుడు జీవించిలేరు. అలాగే ఓల్డ్ బోయ్ సినిమాని మహేశ్ బాబుతో తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటారు.
సినిమాలలోని ఉత్కంఠని పాఠకులకి పరిచయం చేయడం కోసమో లేదా ఒక పాత్ర సామర్థ్యాన్ని గ్రహింపుకి తేవడం కోసమో రచయిత – క్రికెట్ /టెన్నిస్ ఆటలతో ఇచ్చిన ఉదాహరణలు బాగున్నాయి. ఒక్కోసారి సినిమాలోని సన్నివేశానికి వర్తించే భగవద్గీత శ్లోకాలను కూడా ప్రభావవంతంగా ఉపయోగించారు గీతాచార్య.
ఒక కొరియా వ్యక్తి, కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన చేసిన విశ్లేషణ గొప్పగా ఉంటుంది.
***
ప్రత్యేకించి, రచయిత శైలి గురించి ప్రస్తావించుకోవాలి. కొన్ని ఆంగ్ల పదాలను విభిన్నంగా రాస్తారు.. ఉదాహరణకి సింపుల్ అని అందరూ రాస్తే, గీతాచార్య ఈ పుస్తకంలో సిమ్పుల్ అని రాశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. సత్యం శివం సుందరం అనే హెడింగ్‌ని ఓ నటుడి పేరుతో కలిపి ‘సత్యం శివం Sue0దరం’ అంటారు.
అలాగే The Hamdmaiden అనే సినిమా పేరుని ‘ద hand में den’ అని రాసి, దాన్ని తెలుగులో ‘చేతిలో గుహ’ అని అంటారు. ఇలాంటివి కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, ఎవరో ఒకరు చేయకపోతే, ప్రయోగాలెలా పుడతాయి?
అలాగే, రచయిత ఒక్కోసారి ఒక పదాన్ని విరవడం ద్వారా, అక్కడక్కడా తాను చెప్పదలుచుకున్న అంశాన్ని, తేలికగా చెప్తున్నట్టు అనిపించేలా రాశారు. కానీ దాని వెనుకే వచ్చే మరో వాక్యం ఆ విరుపు లోని లోతుని, సొగసుని పాఠకులకు పట్టిస్తుంది.
ఉదాహరణకి, 71వ పేజీలో, ‘పోయెట్రీ’ అనీ సినిమా గురించి చెబుతూ, ‘పోయె ట్రీ – వెళ్ళిపోయిన వృక్షం’ అని చెప్పి, “ఒకప్పుడు మహా వృక్షంలా వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నదా? అన్న ప్రశ్నను, మానవ సంబంధాలకు జతగలిపి, లోతైన ప్రశ్నలు రేకెత్తిస్తూ సాగుతుందీ సినిమా” అంటారు. దాంతో ఈ సినిమా గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పాఠకులలో రెట్టింపు అవుతుంది.
మరో చోట ‘పోతే’ అని, బ్రాకెట్‍లో ‘ఎక్కడికీ వెళ్ళద్దు, ఏమీ తే నక్కరలేదు’ అని అంటారు. చిన్న నవ్వొకటి మొలుస్తుంది పాఠకుల పెదాలపై.
అధ్యాయం ముగించేటప్పుడు వాడిన వాక్యాలు ఆసక్తిగా ఉంటాయి, తదుపరి అధ్యాయానికి లీడ్ చేస్తాయి. అలాగే పార్క్ చాన్ వుక్ తీసిన ద లిటిల్ డ్రమ్మర్ గర్ల్ సీరిస్‍ని పరిచయం చేస్తూ, కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసే విధంగా
Start {
అమెజాన్‍లో పిడకల వేట
..
..
అంటూ రాసుకొచ్చి,
పిడకల వేట సమాప్తం
} Close
అని ముగిస్తారు.
అలాగే కొన్నిసార్లు రెండు పదాలను జోడించి ప్రయోగించడం కూడా ప్రయోగాత్మకమే. ఒక అధ్యాయానికి ‘కర్మర్మమ్’ అని పేరు పెట్టారు. కర్మ, మర్మం!
***
కొరియన్ సినిమాలతో పాటు కొరియన్ల జీవన విధానాన్ని, అక్కడి సమాజపు రీతి గురించి తెలుపుతూ, మనకీ వాళ్ళకి ఉన్న పోలికని వివరించారు. సంచికలో 64 ఎపిసోడ్ల పాటు సాగిన ఈ ఫీచర్ గానీ, తరువాత వెలువడిన పుస్తకం గానీ – రచయితే ఓ వ్యాసంలో చెప్పినట్టు ‘అంత తేలిక కాదు బ్రదర్!’ అనిపిస్తాయి.
తన రచనని చదివించేలా చేయడానికి మామూలుగా ఓ రచయిత ఎంత కష్టపడతారో, గీతాచార్య అంతకంటే ఎక్కువే శ్రమించారు.
రచయిత పరిచయం చేసిన సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయో, రచయిత వాటి గురించి చెప్పే వ్యాసాలూ అంతే వైవిధ్యంతో నిండి ఉంటాయి.
చివరగా, ఒక్క వాక్యంలో ఈ పుస్తకం గురించి, రచయిత శైలిలో చెప్పాలంటే కంtent लो కొత్తदnam, preజెంటేशन లో yvధ్యం – ‘కొరియానం’
***
రచన: వేదాల గీతాచార్య
ప్రచురణ: GALTing Parables
పేజీలు: 432
వెల: ₹ 500/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 8008160011
~
వేదాల గీతాచార్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-vedala-gitacharya/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.