[బాలబాలికల కోసం ‘కొండ మీద బూచివాడు!’ అనే చిన్న కథని అందిస్తున్నారు జి.ఎస్.ఎస్. కళ్యాణి.]
మధ్యాహ్న సమయం. ఆరేళ్ళ సిరి తమ అపార్టుమెంటులో మంచంపై కూర్చుని, కిటికీలోంచీ దూరంగా కనపడుతున్న కొండవైపు చూస్తోంది.
ఆ కొండంటే సిరికి చాలా ఇష్టం. సిరి ఉండే అయిదో అంతస్తునుంచీ ఆ కొండ, ఎవరో వేసిన వర్ణచిత్రంలా ఎంతో అందంగా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఆ కొండ శిఖరంపై వెళ్ళే మబ్బులు కనువిందు చేస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొండకు కాస్త ఇవతలకు సిరి ఉంటున్న మహానగరం మొదలవుతుంది. నిరంతరం రణగొణ ధ్వనులతో తిరిగే వాహనాలూ, పనులు చేసుకుంటూ హడవుడిగా తిరిగే మనుషులూ, ఖాళీ ప్రదేశం అన్నది లేకుండా నిర్మించిన అధునాతన భవనాలతో క్రిక్కిరిసి ఉన్న ఆ నగరంలో, పచ్చదనమూ పరిశుభ్రత వంటివి మచ్చుకైనా కనపడవు. ఉన్నదంతా భయంకరమైన కాలుష్యం! కొండవంక తదేకంగా చూస్తున్న సిరికి ఉన్నట్లుండి విపరీతమైన దగ్గు మొదలైంది.
“అయ్యో నా తల్లీ! ఆ మాయదారి కాలుష్యం నీలాంటి పసివాళ్ళనెంత బాధపెడుతోందో! ఇంద.. ఈ మందు తాగు!”, అంటూ ఒక చిన్న గిన్నెలో ఉన్న నారింజ రంగు ద్రావకాన్ని తాగమంటూ సిరికి ఇచ్చింది సిరి తల్లి లక్ష్మి.
“అబ్బ! నాకీ మందు వద్దమ్మా! చేదు!”, అంది సిరి ముఖం చిట్లిస్తూ.
“అలా అంటే ఎలా? నువ్వు మందు తాగకపోతే ఏమవుతుందో తెలుసుకదా?”, సిరిని బెదిరిస్తున్నట్లుగా అంది లక్ష్మి.
‘అమ్మో! ఆ కొండ మీద ఉన్న బూచివాడు వచ్చి నన్నెత్తుకుపోతాడు!’, ఇందాక ఇష్టంగా చూసిన కొండవైపు ఇప్పుడు భయంగా చూస్తూ, లక్ష్మి చేతిలో ఉన్న మందును తీసుకుని గటగటా తాగేసింది సిరి.
“నా బంగారు తల్లి! మందు తాగకపోతే నీ అనారోగ్యం తగ్గదు. దగ్గు తగ్గకపోతే బడికెలా వెడతావూ? అందుకే కోప్పడ్డాను. ఇప్పుడిక హాయిగా కాసేపు నిద్రపో. సాయంత్రం నిన్ను చూడటానికి తాతయ్య వస్తారట”, సిరి నుదుటిపై ముద్దు పెట్టి, ఆమెకు దుప్పటి కప్పుతూ అంది లక్ష్మి.
“అమ్మా! ఆ కొండ మీద నిజంగా బూచివాడు ఉన్నాడా?”, లక్ష్మిని అమాయకంగా అడిగింది సిరి.
“ఏమో! నాకూ అంత కచ్చితంగా తెలియదు కానీ ఆ బూచివాడి గురించి నేనూ విన్నాను. అప్పుడప్పుడూ ఒక చిన్న సంచీ భుజాన తగిలించుకుని మన ఊళ్ళోకి కూడా వస్తూ ఉంటాడట. ఆ సంచిలో అల్లరి పిల్లలను వేసుకుంటాడట! అందుకే పిల్లలు అల్లరి చెయ్యకుండా పెద్దవాళ్ళ మాట వినాలి!”, చెప్పింది లక్ష్మి.
కొండ మీది బూచివాడి సంగతి సిరికి తన స్కూల్లో స్నేహితులు కూడా చాలాసార్లు చెప్పారు. లక్ష్మి మాటలు వింటూ కొండవంక చూసి, ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది సిరి.
సిరిని గతవారం రోజులుగా దగ్గు తెగ బాధ పెడుతోంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి మాటిమాటికీ ఆయాసపడుతూ ఉండేసరికి సిరిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళింది లక్ష్మి. సిరిని పరీక్షించిన వైద్యుడు వాయుకాలుష్యంవల్ల సిరి ఊపిరితిత్తులలో సమస్య వచ్చిందని చెప్పి, మందులు రాసిచ్చాడు. ఒక పదిహేను రోజులు సిరి ఇంటి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని కూడా చెప్పడంతో సిరి బడికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటోంది. సిరిని చూడటానికి సిరి ఉంటున్న నగరానికి పక్కనే ఉన్న చిన్న గ్రామం నుండీ సిరి తాత రాధారమణ ఆ రోజు సాయంత్రం వస్తున్నాడు.
సిరి నిద్ర లేచి, కొద్దిగా చిరుతిళ్ళేవో తిని బొమ్మల పుస్తకాలు చదువుతూ కూర్చుంది. వాటిల్లో చంద్రం మామయ్య రాసిన పుస్తకాలంటే సిరికి భలే ఇష్టం!
అంతలో ఒక పెద్ద సంచీ మోసుకుంటూ, “ఏరా బంగారూ! ఎలా ఉన్నావ్? అమ్మనీ, నాన్ననీ కంగారు పెట్టేశావుట! దగ్గు తగ్గిందా?”, అంటూ వచ్చాడు రాధారమణ.
“తాతా!”, అంటూ రాధారమణ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతడి కాళ్ళను ప్రేమతో వాటేసుకుంది సిరి.
“నా బంగారుకొండ!”, అంటూ సంచిని కిందకు దించి సిరిని ఎత్తుకుని రెండు బుగ్గలనూ ముద్దాడాడు రాధారమణ.
“తాతా! నాకోసమేం తెచ్చావ్?”, అడిగింది సిరి.
“మన తోటలో పండిన కూరగాయలూ, నీకెంతో ఇష్టమైన తియ్యటి మామిడిపళ్ళూ తెచ్చాను బంగారూ!”, అంటూ సంచీని తెరిచి చూపించాడు రాధారమణ.
“ఆయ్! మామిడిపళ్ళు!”, సంతోషంగా కేరింతలు కొడుతూ రెండు మామిడిపళ్ళు చేతిలోకి తీసుకుని లక్ష్మికి ఇచ్చింది సిరి.
“ఆహా! మామిడిపళ్ళు. ఇవి ఇంట్లో ఉంటే నువ్వు వీటిని తప్ప ఇంకేమీ తినవు కదా!”, నవ్వుతూ సిరితో అంది లక్ష్మి.
“కానీ మొన్న డాక్టరుగారు నన్ను మామిడిపళ్ళు తినొద్దని అన్నారుగా!”, బిక్కముఖం పెట్టుకుని అంది సిరి.
లక్ష్మి సిరిని దగ్గరకు తీసుకుని, “ఇవి తాత తోటలో పండించినవి. ఈ పళ్ళు సహజంగా పండాయి. వీటిమీద మనకు హాని చేసే మందులేవీ చల్లలేదు కాబట్టి వీటిని హాయిగా తినచ్చు!”, అని చెప్పింది.
“అయితే ఒకటివ్వు!”, హుషారుగా అంది సిరి.
లక్ష్మి బాగా పండిన మామిడి పండొకటి రసం తీసి సిరికి ఇచ్చింది.
“అబ్బ! ఎంత తియ్యగా ఉందో!”, అని లొట్టలేసుకుంటూ మామిడిపండు రసం తాగింది సిరి.
మరో వారం గడిచింది. సిరి దగ్గునుండీ తేరుకుంది.
రాధారమణ ఏదో పనిమీద బయటకు వెడుతూ, “నాతో వస్తావా సిరీ?”, అని అడిగాడు.
బయటకు వెళ్ళి చాలా రోజులు కావడంతో, “ఓ! వస్తా తాతా!”, అని ఠక్కున సమాధానం ఇచ్చి, చిటికెలో తయారైపోయి రాధారమణతో బయలుదేరింది సిరి.
రాధారమణ ఒక చిన్న టీ కొట్టు దగ్గరకు వెళ్ళి, అక్కడున్న బల్ల దగ్గర కూర్చుంటూ, “నా స్నేహితుడు ఇక్కడకు వస్తానన్నాడు. అతడితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోదాం”, అన్నాడు.
“సరే తాతా!”, అని సిరి ఆ దారిన వచ్చేపోయే వారివంక చూస్తూ కూర్చుంది.
కొద్దిసేపు గడిచాక, పొడవాటి నెరిసిన గడ్డం, చెదిరిపోయిన తెల్లటి జుట్టూ, మాసిన బట్టలూ వేసుకున్న ఒక వ్యక్తి భుజాన సంచీ వేసుకుని ఆ టీ కొట్టు వైపుకు రావడం గమనించింది సిరి. అతడి రూపు రేఖలు కొండ మీదుండే బూచివాడి రూపురేఖలతో కచ్చితంగా సరిపోయాయ్!
‘అయ్యబాబోయ్! బూచివాడు ఇక్కడికొచ్చాడేమిటీ?’, బెదిరిపోతూ అనుకుంది సిరి.
బూచివాడు వేగంగా నడుస్తూ సిరివైపే వస్తున్నాడు. సిరికి చాలా భయమేసింది. రాధారమణకు దగ్గరగా జరిగి కూర్చుంది. బూచివాడు నేరుగా సిరి కూర్చున్న బల్లవద్దకు వచ్చాడు. సిరికి వణుకు పుట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది.
బూచివాడు, “ఏం రాధారమణా? బాగున్నావా? ఈ పాపెవరూ? నీ మనవరాలా?”, అని అడిగాడు రాధారమణని.
“అవును! ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ రాముడూ?”, అడిగాడు రాధారమణ.
సిరి మెల్లిగా కళ్ళు తెరిచి బూచివాడివంక చూసింది.
“ఊరికి దూ..రంగా చెట్లకు దగ్గరగా అదిగో ఆ కొండ మీద ఆనందంగా ఉన్నా! ఇంతకీ ఈ ఊరికి ఏ పనిమీద వచ్చావ్?”, అడిగాడు బూచివాడు. రాధారమణ సిరికి వచ్చి తగ్గిన దగ్గు గురించి చెప్పాడు.
బూచివాడు సిరివంక ఒక్క క్షణం పరీక్షగా చూసి, “కొంచెం అల్లరిపిల్లలా కనపడుతోందే! ఇలాంటి అనారోగ్యాలకు నా దగ్గర ఒక చక్కటి మందుంది”, అంటూ తన సంచిలో చెయ్యి పెట్టాడు.
అది చూస్తూనే బూచివాడు తనని ఎక్కడ సంచిలో పెట్టేసి పట్టుకెళ్ళిపోతాడో అని తెగ భయపడి రాధారమణను తన రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుంది సిరి.
బూచివాడు తన సంచీలోంచీ ఒక చిన్న పొట్లం, కొన్ని పుస్తకాలూ తీసి సిరికి ఇస్తూ, “ఇప్పుడే పూసిన పువ్వులా ఉన్నావు. నీకేమీ కాకూడదు. ఈ పొట్లంలో ఉన్నవి మీ ఇంట్లో మట్టిలో పెట్టి కాసిని నీళ్ళు పొయ్! చంద్రం మామయ్య రాసిన పుస్తకాలంటే నీకు చాలా ఇష్టమని మీ తాత నాకు చెప్పాడు. అప్పుడప్పుడూ ఈ పుస్తకాలు చదువుకో!”, అన్నాడు.
సిరి పొట్లంవంకా, పుస్తకాలవంకా ఆశ్చర్యంగా చూసింది.
“తీస్కోరా బంగారూ!”, సిరితో అన్నాడు రాధారమణ నవ్వుతూ. మొహమాటంగా బూచివాడి చేతిలోంచీ పుస్తకాలూ, పొట్లమూ తీసుకుంది సిరి. బూచివాడు వెళ్ళిపోయాడు.
“ఈ పొట్లంలో ఏముంది తాతా?”, రాధారమణను అడిగింది సిరి.
“ఇంటికెళ్ళి చూద్దువుగాని!”, అన్నాడు రాధారమణ. సరేనంది సిరి.
రాధారమణ ఇల్లు చేరుకోగానే బాల్కనీలో ఉన్న ఒక పాత పూలకుండీని శుభ్రం చేసి, అందులో తను ఊరినుండీ మూటలో తీసుకొచ్చిన మట్టిని నింపి, “బంగారూ! నీ చేతిలో ఉన్న పొట్లం తెరిచి చూడు”, అన్నాడు సిరితో.
సిరి ఆత్రంగా పొట్లం విప్పి చూసింది. అందులో కొన్ని విత్తనాలున్నాయ్! వాటిని రాధారమణ చెప్పినట్లుగా మట్టిలో వేసి, కొద్దిగా నీళ్ళు పట్టుకొచ్చి కుండీలో పోసింది సిరి.
“రోజూ బడినుంచీ ఇంటికి రాగానే ఇలాగే నీళ్ళు పోస్తూ ఉండు!”, సిరికి చెప్పాడు రాధారమణ.
సరేనంది సిరి. మళ్ళీ వీలున్నప్పుడు వస్తానని చెప్పి తమ గ్రామానికి వెళ్ళిపోయాడు రాధారమణ.
ఆ మరుసటి రోజునుండీ సిరి క్రమం తప్పకుండా రాధారమణ చెప్పినట్లుగా బడినుంచీ ఇంటికి రాగానే కుండీలో నీళ్ళు పొయ్యడం అలవాటు చేసుకుంది. కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు కుండీలో చిన్న చిన్న మొలకలను గమనించిన సిరి ఆశ్చర్యపోతూ లక్ష్మికి వాటిని చూపించింది.
“ఆబ్బో! మొక్కలు మొలిచాయే! అవేం మొక్కలో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!”, అంది లక్ష్మి.
మరికొద్ది వారాలు గడిచాయ్. మొలకలు మొక్కలుగా ఎదిగాయి. ఒకరోజు తెల్లవారుఝామున ఆ మొక్కలు మొగ్గలు తొడిగాయ్!
అది గమనించిన సిరి, “అమ్మా!”, అంటూ సంతోషంగా ఒక్క కేక పెట్టింది. ఏమైందోనని పరిగెత్తుకుంటూ సిరివద్దకు వచ్చింది లక్ష్మి.
“అమ్మా! ఈ మొక్కలు ఏవో పువ్వులు పూస్తున్నాయ్!”, ఆనందంతో చెప్పింది సిరి.
“ఆహా! అద్భుతం!!”, అంది లక్ష్మి.
మరో రెండు రోజుల తర్వాత ఆ మొక్కలకు అందమైన పువ్వులు పూశాయి. పువ్వులంటే ప్రాణమైన సిరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్! అప్పుడే విచ్చుకున్న పువ్వుల రేకల్ని తన బుజ్జి చేతులతో సున్నితంగా తాకుతూ మురిసిపోయింది సిరి.
అనుకోకుండా ఆ రోజు సాయంత్రం సిరిని చూడటానికి వచ్చిన రాధారమణ మొక్కలను చూసి, “అరె! విత్తనాలు మొక్కలై పువ్వులు కూడా పూశాయే! నా బంగారుతల్లి విత్తనాలను జాగ్రత్తగా చూసుకుందన్నమాట!”, అన్నాడు సిరి తలను గారాబంగా నిమురుతూ.
“తాతా! అందరిలా నేను కూడా ఆ బూచివాడు చెడ్దవాడని అనుకున్నా. బూచివాడు చెడ్డవాడు కాదు తాతా. మంచివాడే! నాకెంతో ఇష్టమైన పువ్వులు పూసే మొక్కలనూ, నాకు చాలా ఇష్టమైన మంచి పుస్తకాలనూ బహుమతులుగా ఇచ్చాడు!”, అంది సిరి నవ్వుతూ.
అందుకు రాధారమణ ఫక్కున నవ్వి, “అవునురా బంగారూ! నా స్నేహితుడు బూచివాడు కాదమ్మా. వాడు గొప్ప మనసున్నవాడు! వాడి పేరు రామచంద్రయ్య. వాడిని నేను రాముడూ అని పిలుస్తా. ఒకప్పుడు నువ్వుంటున్న ఈ ఊళ్ళో బోలెడు చెట్లుండేవి. కొన్నేళ్ళ క్రితం పెద్ద భవంతులూ, రోడ్లూ వెయ్యటానికి ఆ చెట్లన్నీ కొట్టేశారు. అది రాముడికి ఏమాత్రం నచ్చలేదు. చెట్లు నరకడానికి వీల్లేదని రాముడు అన్నాడు. కానీ, ఎవ్వరూ రాముడి మాట పట్టించుకోలేదు. రాముడికి చెట్లంటే ప్రాణం. ఆ చెట్లే లేకపోతే మనుషులే కాదు, జంతువులు కూడా బతకలేవు కదా! ఆ విషయమే అందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు రాముడు. ఈ నగరంలో ఉండే గందరగోళం మధ్య ఉండలేక ఊరికి దూరంగా ఆ కొండమీద చెట్ల మధ్యలో ఉంటూ, అప్పుడప్పుడూ నగరానికి వచ్చిపోతూ ఉంటాడు. కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాలకు చెట్లే మంచి మందని ప్రచారం చేస్తూ, విత్తనాలను పంచిపెడుతూ, ప్రకృతిని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నాడమ్మా నా మిత్రుడు! నీకో సంగతి తెలుసా? నీకిష్టమైన బొమ్మల పుస్తకాలు రాసే చంద్రం మామయ్య వాడే!”, అన్నాడు.
“ఆఁ??! నువ్వంటున్నది నిజమా తాతా? కొండ మీద బూచివాడు నాకిష్టమైన పుస్తకాలు రాసే చంద్రం మామయ్యా??!”, ఆశ్చర్యపోతూ రాధారమణను అడిగింది సిరి.
“నిజమేనమ్మా! ఒక్కొక్కసారి మనం కొందరు మనుషులను చూసి వాళ్ళు మంచివాళ్ళు కాదని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు వాళ్ళల్లో అంత గొప్పతనం దాగి ఉందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ‘Don’t judge a book by its cover’ అని అంటారు పెద్దలు”, అన్నాడు రాధారమణ.
“తాతా! నన్ను ఇంకొక్కసారి చంద్రం మామయ్య దగ్గరకు తీసుకెళ్ళవా? నేను చంద్రం మామయ్యనుండీ మరికొన్ని విత్తనాల పొట్లాలు తీసుకుని మా బడిలో అందరికీ పంచిపెడతా! అందరూ మొక్కలు పెంచితే ఈ ఊళ్ళో కాలుష్యం తగ్గిపోతుంది”, అంది సిరి.
“తప్పకుండా బంగారూ!”, అన్నాడు రాధారమణ తన మనవరాలి మంచి మనసుకు పొంగిపోతూ.
ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించిన జి.ఎస్.ఎస్. కళ్యాణి హైదరాబాద్లో పెరిగారు. ప్రస్తుత నివాసం అమెరికా. వీరి బాల్యమంతా ‘చందమామ’ కథలు చదువుతూ, అమ్మా, నాన్నా, అమ్మమ్మలు చెప్పిన కథలు వింటూ గడిచింది. తల్లిదండ్రులకు కర్ణాటక సంగీతమన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎంతో ఇష్టం ఉండడం వల్ల కళ్యాణి గారికి కూడా సంగీత సాహిత్యాలపట్ల అభిమానం ఏర్పడింది. వీరి మొదటి రచన టీటీడీ వారి ‘సప్తగిరి’ మాస పత్రికలో ప్రచురితమయింది. 2018వ సంవత్సరంలో ‘తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS)’ వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’లో వీరి మొట్టమొదటి కథ ‘సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం’ కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుంది. ఆ తరువాత వీరు రాసిన కథలు పలు వెబ్-పత్రికలలోనూ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక ‘భారత ఋషిపీఠం’లోనూ ప్రచురితమయ్యాయి. వీరు ఇంతవరకూ రాసిన కొన్ని కథలు ‘కదంబవన కుసుమాలు’ అన్న పేరుతో మూడు కథాసంపుటాలుగా ప్రచురించడం జరిగింది.