Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధిక్కారపు బాటలో ఆత్మగౌరవం దిశగా సాగిన ‘కొమ్ము దళిత కథ 2023’

[‘కొమ్ము దళిత కథ 2023’ అనే కథా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

జంబూ సాహితీ వారి దళిత కథా వార్షిక సీరిస్‌లో భాగంగా వరుసగా నాలుగవ సంవత్సరం వెలువడింది ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం. తొలిసారి 2020లో తొండం బొక్కెన కథా సంకలనం వెలువరించారు. చిందూ నేల సంకలనం 2021లోనూ, 2022లో సాక కథా సంకలనం వెలువడ్డాయి. ఈ సంకలనాలకి డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య గార్లు సంపాదకత్వం వహించారు.

‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనంలో 19 కథలున్నాయి. “ఇందులో లబ్ధప్రతిష్ఠులైన సతీష్ చందర్, జూపాక సుభద్ర వంటి కథకుల నుంచి ఇప్పుడిప్పుడే రాస్తున్న కథకుల కథలున్నాయి.” అనీ, “మనుషుల ఆచార, ఆహార, వ్యవహార సాంప్రదాయ అలవాట్లకు భరోసా ఇవ్వాలనీ, మనుషులందరూ ఏకవర్ణమే అనీ, సాటి మనిషిని మనిషిగా గౌరవించాలనీ ఊదుతున్న శబ్దమే ఈ కొమ్ము” అని సంపాదకులు తమ ముందుమాటలో పేర్కొన్నారు.

~

‘ముల్లు’ కథలో రోజమ్మ పాత్రని పరిచయం చేస్తూ గులాబీకి ముల్లులా, రోజీకి విసుగు రక్షణ కవచం అంటారు రచయిత. ఆమెకు అంత విసుగెందుకో కథ చదివాకా అర్థమవుతుంది. రచయిత అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు. అనుమానపు భర్తతో నరకం అనుభవించి, కడుపున పుట్టిన కూతురికో దారి చూపించే క్రమంలో విసుగు ఆమెకో ఆభరణమైపోతుంది. ఓ రోజు కూతురు ఎంత విసిగించినా, రోజమ్మ విసుక్కోదు. ఎట్టకేలకు అందుకు కారణాన్ని కూతురికి చెబితే, ఆ కారాణానికి కారణం తానేనని అసలు విషయం చెప్తుంది. “పువ్వు గట్టిబడ్డా పర్లేదు. ముల్లు మెత్తబడకూడదే” అని కూతురికి చెప్తుంది రోజమ్మ. ఈ కథలో రచయిత కొన్ని గొప్ప వాక్యాలు రాశారు. “ఓడిపోయినోడు కాదమ్మా, ఇంకెప్పటికీ గెలవలేనకునేవాడు ప్రమాదకరం”, “అద్దం ముందు చిన్నబోయిన ప్రతివాడు, అందాన్ని బంధించాలని చూస్తాడు”, “పేరు విక్టర్, కానీ పరాజితుడు” వంటివి కథలో సముచితంగా ఇమిడిపోయాయి.

జూపక సుభద్ర గారు రాసిన ‘అంటు – ముట్టు’ కథలో కథానాయకి కోమల పాత్రతో, పక్కింటి నీరజ మాట్లాడుతూ “మా మగాళ్ళు ఏమనుకుంటున్నావు కోమలా! ఆడాల్లని కూడా మగాళ్ళుగా తయారు చేసేసారు” అంటుంది. ఈ వాక్యం వెనుక ఎంతటి పరిశీలన ఉందో! నెలసరి సమయంలో తమని ఇంట్లో ఏదీ ముట్టుకోనీయకుండా దూరం పెడుతుంటే బాధపడుతూ, కోమల వాళ్ళకి అలాంటివేమీ లేవు బిందాస్ జీవితాలు అని నీరజ అంటే, అప్పుడు నిష్ఠురమైన నిజాన్ని కోమల చెప్తుంది. ‘ఇంటి ముట్టును గెలిసినంత యీజీనా లోకమ్ముట్టును గెల్సుడు.. అన్ని ముట్టులను గెలిసే కాలం గూడొస్తదిలే’ అనుకుంటుంది కోమల.

డా. పసుసూరి రవీందర్ రాసిన ‘బుచ్చయ్య బతుకుమర్మం’ మంచి కథ. ఊరందరూ పిసినారిగా చెప్పుకునే బుచ్చయ్య అంతరంగాన్ని అర్థం చేసుకున్నదెవరు? జీవితం పట్ల, జీవన విధానం పట్ల లోతైన అవగాహన ఉన్న బుచ్చయ్యని ఊరివారు పిసినారిగా జమకట్టి లోకువ చేస్తూంటారు. భార్య చనిపోతే, ఆమె ఒంటిపై నగల కోసం పోటీపడ్డ కూతురిని, కొడుకుని వారించి, తన చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా భార్య నోట్లో పెట్టి ఆమె శవాన్ని పూడ్చేస్తాడు. అన్నిటినీ పైపైన చూసే లోకానికి, ఆ పూట బతుకు మర్మమేదో బోధించాడనే వాక్యం నిజమని పాఠకులు కూడా అంగీకరిస్తారు.

ఇంటి నిర్మాణపు పనులకు తమ పిల్లల్ని దేశం పంపించే తల్లిదండ్రుల ఆవేదనని, ఆర్థిక లోటుని కళ్ళకు కట్టారు ఇండ్ల చంద్రశేఖర్ ‘బేల్దారి’ కథలో. నిరుపేద కుటుంబాల నిస్సహాయత – ఓ బాధగా మారి పాఠకుల మనసుల్ని తాకి కళ్ళని చెమరుస్తుంది. “ఎవురెవురియో ఇల్లు కట్టడం కాదు, బాగా డబ్బులు సంపాదించి, మీ ఇల్లులు కూడా మీరు అందంగా కట్టుకోవాలా” అని కథలో పాస్టర్ పిల్లలకి చెప్పినట్టు, కుటుంబానికి అండగా నిలవాలనుకున్న అలాంటి యువతీయువకులు నిజంగానే జీవితంలో నెగ్గుకురావాలని పాఠకులూ కోరుకుంటారు.

దొరతనపు దాష్టీకానికి ప్రకృతి, మర్రిచెట్టు కలిసి ఎలా ముగింపు పలికాయో మన్నె ఏలియా గారి ‘సాక్షి’ కథ చెబుతుంది. ఎండూరి భారతి గారి ‘పానాదరవ’ కథలో తోటివారితో తిరుమలకి వెళ్తూ జయక్క గురించి చెబుతుంది కథానాయకి. దైవభక్తి కంటే మానవ బలహీనతే మనుషులపై ఎక్కువ ప్రభావం చూపుతున్న వైనాన్ని ఈ కథ చెబుతుంది.

సోలమాన్‌ విజయకుమార్‌ గారు రాసిన ‘సిలమంతుకూరి రైలు గేటు దగ్గర కొజ్జా’ కథ మానవత్వానికి ప్రతిరూపమైన ఓ హిజ్రా గురించి, హృదయాలు కదిలించేలా చెప్తుంది. పుస్తకాలు ఏం చేయగలవో ఇంట్లోంచి వచ్చేసిన కుర్రాడికి చెప్తుందామె. హిజ్రా పాత్ర పాఠకుల్ని వెంటాడుతుంది.

కొన్ని జీవిత సత్యాలుంటాయి. వాటిని ఎందరు ఎలాగా, ఎన్నిసార్లు చెప్పినా బావుంటాయి. దృశ్య రూపంలో చూసినా, కథలో చదివినా, పాట రూపంలో విన్నా, మనసుకి తృప్తి కలుగుతుంది. అలాంటి వాటిల్లో ఒకటి – మనుషుల కంటే పెంపుడు జంతువులే విశ్వాసంగా, స్వార్థం లేకుండా ఉంటాయన్నది. రత్నాకర్‌ పెనుమాక గారి ‘కాండ్రేగుల రావలచ్చుం కొట్టుకాడ’ కథ ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. చివరి వాక్యం కథకి హైలైట్. రామలక్షి అత్తమ్మ పాత్ర పాఠకుల మనసులో నిలిచిపోతుంది.

రాజకీయాలని కెరీర్‍గా ఎంచుకునే యువత ఎంత జాగ్రత్తగా ఉండాలో, తెలివిగా ముంచేసే వ్యక్తులు సొంతవారైనా సరే, ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది కె.సి. లక్ష్మీ నరసింహా గారి ‘యువ నాయకత్వం’ కథ. కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడంలో, నితిన్ లాంటి స్నేహితులుంటే, సంజీవ లాంటి యువకులు తాము అనుకున్నది సాధించగలరని చెప్తుందీ కథ.

తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన దారుణానికి బలైపోయిన లలిత అనే అమ్మాయి బడి మానేస్తుంది. ఆ అమ్మాయి స్కూలుకి ఎందుకు రావడంలేదో కనుక్కుందామని సీత అనే నెలలు నిండిన టీచర్ వాళ్ళ ఊరికి వెళ్తుంది. చివరకు అసలు విషయం తెలుసుకుని, హెడ్ మాస్టర్ తోనూ, తన భర్త తోనూ లలిత ఆచూకి కనిపెట్టే ప్రయత్నం చేయిస్తుంచి. ఎట్టకేలకు, సీతకు పాప పుట్టిన నాడే, లలిత ఆచూకీ తెలుస్తుంది. పైకి లలిత చదువు పాడవకూడదు, డ్రాప్ అవుట్‍గా మిగలకూడదు అన్నట్టు ఓ విద్యార్థిని కోసం తపన పడ్డ టీచర్ కథలా అనిపించినా, అంతర్లీనంగా ఓ ఆడపిల్ల బతుకుని బాగుచేయాలన్న ఉద్దేశమే సీతా టీచర్‍లో వ్యక్తమవుతుంది. లలిత పట్ల ఆమె ఆవేదనకి కారణం అర్థమయ్యాకా, సీత పాత్ర పట్ల పాఠకులకు గౌరవం కలుగుతుంది. వృత్తిరీత్యా టీచర్‌ అయిన డి.జి. హైమావతి గారు రాసిన ‘మూసిన తలుపులు’ చక్కని కథ.

ఆర్కెస్ట్రా కళాకారుల వెతలను ప్రస్తావిస్తూనే, అంతర్లీనంగా కులవివక్ష, ఆడపిల్లలంటే రోత వంటి సమాజపు పెడ ధోరణులను చాటుతుంది డా॥ మండలస్వామి గారి ‘బతుకుగీత’. రచయిత కథకి శీర్షికని బాగా ఆలోచించి పెట్టారు. ప్రధాన పాత్ర పేరు గీత. ఎన్నెన్ని కష్టాలొచ్చినా గీతని బ్రతకమని చెప్తుంది శీర్షికలోని ఒక అర్థం. రెండోది కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు బోధించిన గీత నేపథ్యంగా జీవితానికి ఒక మార్గదర్శి అన్న అర్థం! మగాళ్ళని నమ్మలేని స్థితికి వచ్చేసిన గీత చివరకు వాసు ప్రతిపాదనని అంగీకరిస్తుంది.. తన కోసం కాదు.. అమ్మ కోసం, చెల్లెలి పిల్లల కోసం!

కెంగార మోహన్‌ గారి ‘నీ కృప నాకు చాలును’ కథలో అవినీతి నిరోధక శాఖ వారు చేసే రైడ్స్ ఎలా ఉంటాయో వివరంగా చెప్పారు. నిజాయితీపరుడైన ఈశ్వరప్ప సహకార శాఖలో పెయిడ్ సెక్రటరీ. అతని నిజాయితీ నచ్చని అధికారులు, రాజకీయ నాయకులు అతన్ని కులం పేరుతోనూ, ఇతర రకాలుగా వేధించి బదిలీలు చేయిస్తుంటారు. దళిత అధికారి సువార్తమ్మ అవినీతి గురించి ఆమె దగ్గరి వాళ్ళే ఎసిబికి ఉప్పందిస్తారు. ఆమె ఇంట్లో లభించిన నగదు, బంగారం, ఆస్తుల పత్రాలను జప్తు చేస్తున్న అధికారులను – రైడ్స్ దళితుల మీదే ఎందుకు జరుగుతున్నాయని ఓ విలేఖరి ప్రశ్నిస్తాడు. తమ శాఖకు వాళ్ళూ వీళ్ళూ అనే డిస్క్రిమినేషన్ ఉందదని చెప్తాడు డిఎస్‍పి. అగ్రకులాల్లో ఇలా జరగదని అనుకుంటాడు రైడ్ చేసిన సిబ్బందిలోని ఒక వ్యక్తి. ఈర్శ్యాసూయలకు కులం మతం పట్టింపులు ఉండవు.

డా॥ గాదె వెంకటేష్‌ గారి ‘దేశగురువు’ కథ మనిషిలో తమ మీద తనకి ఉండే నమ్మకం అద్భుతాలను చేయిస్తుందని చెబుతుంది. తాను చెప్పిన మాటపై కలిగిన ఓ చిన్న విశ్వాసంతో తననే రక్షించిన ఎంకడి తెగువకి నమస్కారం చేసుకుంటాడు గురువు.

రాజు దుర్గాని గారి ‘మాదిగ రాజయ్య’ కథలో ఓ ముస్లిం యువతి, మాదిగ యువకుడు ప్రేమించుకోడం పరువు హత్యకు దారి తీస్తుంది. ఇతర మతాలలో కులాలు లేవు, కుల విద్వేషాలు లేవు అని చెప్పుకున్నా, పైకి కనబడని అంతరాలు ఉంటూనే ఉన్నాయని ఈ కథ చెబుతుంది. “చనిపోయిన జరీనా మాదిగ రాజయ్య రూపంలో బ్రతుకుతూ, బ్రతికున్న రాజయ్య చనిపోయిన జరీనా లోకంలో విహరిస్తూ, ఒంటరిగా.. కాదు కాదు ఏకాంతంగా.” అన్న వాక్యాలు ఎంతో వేదనని నింపుతాయి.

పుట్టా పెంచల్దాస్‌ గారి ‘యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయ్యా’ కథ రాయలసీమ మాండలికంలో సాగుతుంది. యాచక కులాలకు చెందిన నిరుపేదలలో పండగలొస్తే ఉత్సాహం! ఎంతో కొంత సంపాదించుకోవచ్చని. ఆ కుటుంబంలో బాబాయితో పాటు వెళ్ళిన పిల్లాడు మాత్రం “వొక్క పండక్కన్నా యింటి కాడుండి, అరువుగా కొత్తగుడ్డలేసుకోని కుశాలగా సావాస గాల్లతో తిరిగేదే ల్యాకపాయ” అని బాధపడతాడు. కానీ భర్త లేని తన తల్లి సంపాదన ఎంత మాత్రమో ఆ అబ్బాయికి తెలుసు. కానీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి తల్లి, ఆ అబ్బాయికి, వాడి చెల్లెలికి కొత్తబట్టలు కొని ఉంచుతుంది. “ఆ గుడ్డలేసుకోని యిప్పుడీ చీకట్లో నా సక్కదనమంతా ఎవురికి సూపిచ్చేది. బండమిందకీ, వొంటి మిందకీ తప్ప గుడ్డలే లేని మాయమ్మ పాత కోకనే సలవ జేసి కట్టుకోనుండింది. మమ్మల్నట్ట పంపిచ్చి, ఆరోజంతా మాయమ్మ తినిందో లేదో ఎవురికి యెరుక?” అనుకుంటాడా పిల్లాడు.

తప్పెట ఓదయ్య గారి ‘పుట్టెడు ఎత’ కథ ఓ కుటుంబంలో రెండు మరణాల వల్ల మిగిలిన వ్యథను చాటుతుంది. అజ్ఞానం చాలా క్రూరమైనది. అజ్ఞానం వల్ల బిడ్డని నిద్దర్లో కుట్టింది పామో, ఎలుకో తెలియక నిర్లక్ష్యం చేసిన తల్లి – ఉదయాన్నే బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం దక్కదు. బిడ్డ దూరమైన బాధతో తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. కాలం విసిరిన సవాలును కొన్నిసార్లు కాలమే విప్పుతుందని అక్కడ గుమిగూడిన పెద్దమనుషులు అనుకుంటారు. మనసు భారమవుతుందీ కథ చదివాకా.

గుడిపల్లి నిరంజన్ గారి ‘రచ్చకట్ట’ కథలో కుక్కలను ప్రతీకగా తీసుకుని, మనుషుల్లోని అవలక్షణాలను ఎండగడతారు రచయిత. రచ్చకట్ట మీద దళితు యువకులు రాజకీయాలు చర్చిస్తూ, తనని చూసినా చూడనట్టు పట్టించుకోకపోవడంతో క్రుద్ధుడయిన పటేల్, ఆ రచ్చకట్టను ఎలాగయినా కూల్చేయాలనుకుంటాడు. అందుకు మాదిగల లోంచే ఒకరిని ఎంచుకుని బాగా తాగించి, రచ్చకట్టని కూలగొట్టిస్తాడు. కూలిన రచ్చకట్ట మాదిగ యువతలో పౌరుషాన్ని మరింత పెంచుతుంది. అధికారం దిశగా తొలి అడుగులు వేసి ఊరి సర్పంచ్ పదవిని దక్కించుకుంటారు. బహుజనులను రాజ్యాధికారం దిశగా నడుపుతుంది ఈ కథ.

డా॥ సిద్దంకి యాదగిరి గారి ‘నిలువెత్తు దుఃఖం’ కథ మనసుని మొద్దుబారుస్తుంది. కరోనా కాటేసిన ఎన్నో జీవితాలను మరోసారి గుర్తు చేస్తూ, ముంపు నిర్వాసితుల వ్యథలను ప్రస్తావిస్తుంది. ఆఖరి పేరా చదువుతున్నప్పుడు పాఠకుల కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లుతాయి.

వెతలనీ, వేదనలని వెల్లడిస్తూనే, చైతన్యం పొంది, తమ అస్తిత్వాన్ని చాటుకునేలా, అడ్డంకులను అధిగమించి, ధిక్కారపు బాటలో ఆత్మగౌరవం దిశగా సాగుతాయి ఈ కథల్లోని పాత్రలు! మనిషితనాన్ని పెంపొందించే దిశగా పడిన అడుగులు ఈ ‘కొమ్ము’ కథలు. అందుకే ఈ కొమ్ము శబ్దం ఎక్కువ దూరం వినిపించాల్సిన అవసరం ఉంది.

***

కొమ్ము దళిత కథ 2023
సంపాదకులు: డా. సిద్దెంకి యాదగిరి, శ్రీ గుడిపల్లి నిరంజన్, శ్రీ తప్పెట ఓదయ్య
ప్రచురణ: జంబూ సాహితీ
పేజీలు: 168
వెల: ₹ 180/-
ప్రతులకు:
నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/kommu-dalitha-katha-2023

 

 

 

~
‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం సంపాదకుల ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-kommu-dalita-katha-2023-editors/

Exit mobile version