[28 ఆగస్ట్ – గాయని ఎ. పి. కోమల గారి జయంతి సందర్భంగా ‘కోమల రాగాల కోయిల ఎ.పి.కోమల స్వరాలు’ అనే వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి].
“ఓ పంతులుగారూ! వినవేమయ్యా!” అని ‘పిచ్చిపులయ్య’ సినిమా కోసం ఆలపించిన స్వరమే “ఇక రానంటే రానే రానోయ్ మన ఋణమిక యింతేనోయ్!” అని ‘పాతాళభైరవి’ సినిమా కోసం ఆలపించింది.
“మధురానగరిలో చల్లనమ్మబోదూ! దారి విడుము కృష్ణా!” అని వేడుకున్న స్వరమే (నాగయ్య గారి త్యాగయ్య కోసం) “కరుణామయోనిధే!శరణంటినిరా విభో! కరుణించుమా ప్రభో!” అని ‘సతీసులోచన’ సినిమా కోసం, శరణు కోరింది.
‘శ్రీలక్ష్మమ్మ కథ’లో “తాళగజాలనురా! నా సామి జాలము చేయకురా! నా సామి వెలియాలినంచు తలచకురా!” అని ఆలపించిన స్వరమే “నటించినా? జగాలనే జయించనా? రసిక హృదయాలె తపించగా పలుకే కమ్మని గానమాయెను” అని ‘భట్టి విక్రమార్క’ సినిమా కోసం నెరజాణకు సరితూగునట్లు తన స్వరం నుండి వెలువరించింది.
తానాలపించిన ప్రతి పలుకు గానమయి ఆ రాగామృత ధారలను అందించిన స్వరం ఆర్కాట్ పార్ధసారథి కోమలది (ఎ.పి.కోమల).
ఆమె 1935 ఆగష్టు 25 వ తేదీన చెన్నపట్టణంలో జన్మించింది. లక్ష్మి, పార్థసారథులు ఆమె తల్లిదంద్రులు. అతి పిన్న వయసులోనే ప్రముఖ నాగస్వర విద్వాంసులు గొడవల్లి పైడి స్వామి గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించిన కోమల ఆకాశవాణిలో ‘లలిత సంగీత గాయని’ గా పేరు పొందడం విశేషం.
ఎ.పి. కోమల 1946 వ సంవత్సరంలో నాగయ్యగారి ‘త్యాగయ్య’ సినిమాలో కె.జమునా రాణితో కలిసి “మధురానగరిలో చలనమ్మబోదు-దారి విడుము కృష్ణా!” పాటను పాడి తెలుగు చిత్రసీమలో నేపథ్య గాయినిగా అడుగు పెట్టింది.
పలు ప్రేమ, హాస్య, సౌమ్య, రౌద్ర, వీర, పరాక్రమాలను వెలయించే గీతాలతో పాటు భక్తి పాటలను ఉడికింపు గీతాలను ఆలపించింది. శాస్త్రీయ సంగీత పోకడలను నిక్షిప్తం చేసి అలవోకగా, అద్భుతంగా, అనితర సాధ్యంగా పాడడం ఈమె ప్రత్యేకత.
“ఓ పంతులుగారూ! వినవేమయ్యా!” పాటని మొదట్లో వేడుకున్నట్లు ఆలపించి.. చివరకు డబాయింపులతో హాస్యాన్ని పండిస్తుంది.
‘మహానటి’ చిత్రం ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చి ఈ తరం వారిని కూడా అలరించిన మహానటి సావిత్రి సినీజీవితపు తొలి యుగళగీతం “ఇక రానంటే రానే రానోయ్!మన ఋణమిక యింతేనోయ్! ఓ మనకూ తీరని ఋణమే!” పాటని పిఠాపురంతో కలిసి సరదాగా ఆలపించింది కోమల.
ఇది ఉడికింపుతో కూడిన ప్రేమగీతం. సావిత్రితో పాటు ఈమె స్వరం కూడా ఈ పాటతో అజరామరమయింది.
‘భూకైలాస్’ సినిమా కోసం “అందములు విందులయే అవని యిదేగా కమలాసనుని కోటి బిళ్వ పూజా తోటి కూటమిదేగా!” అంటూ అవని అందాలను వెలయించింది.
“వసంతుడే రాగానే! వసుంధరే రాగాల ఊగే తూగాడెనో చిందే అందించే అందాలనూ ఓహ్హో! ఓ హ్హో హ్హో! – ఆ!ఆ!ఆ!ఆ!ఆ! కొమ్మల నీడ రంగుల పూల – రaుమ్మని పాడే తుమ్మెద వ్రాల కమ్మదనాల కోకిల కూయ – తెమ్మెర వీచె తన్మయ మీయ.. తెలిమబ్బులతో తేలిపోయి సోలిపోదామా! తేలిపోదామా! హాయి హాయి” అంటూ ‘కనకదుర్గ పూజా మహిమ’ సినిమా కోసం అలరించి, మురిపించి, మెరిపించిన వసంతగానం పాటల ప్రేమికులను హాయి హాయిగా ఆలపించి ఆమని అందాలను ఆస్వాదింపజేస్తుంది.
‘మహిషాసురమర్ధిని’ కోసం “వన్నెల పసికందా! మా వలపుల ఆనందా! తెలి పున్నమి రేయి వెన్నెల విందా మా కనువిందా! ఓ తేనియచిందా! మహారాజా మందిరానా మణి మాలా దీపమా! మా ఆశారూపమా!” అనే లాలి ఊయల పాటని సహగాయని పద్మతో కలిసి పాడిన తీరు, ప్రకృతి మమైకమై వీనుల విందు చేస్తుంది. ఈ పాటలోని అంత్య ప్రాసలను ఆలపించిన తీరు సహృదయ శ్రోతల మనస్సులలో చిందులు వేస్తూ.. ఆనందింపజేస్తుంది.
పై నాలుగు పాటలు కూడా ప్రకృతిని పరిఢవిల్లజేస్తూ ఆ ప్రకృతి పాటలను తన స్వరం నుండి ఆనందాతి రేకంతో, తోటి గాయనులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహం గెంతులు, చిందులు వేయిస్తూ పాడిన తీరు కడు హృద్యంగా వుంటుంది. ప్రేక్షక శ్రోతలు కూడా ప్రకృతి ప్రేమికులుగా మారి ఆస్వాదిస్తారు.
‘పెంపుడు కూతురు’ సినిమా కోసం “చిన్నారి చిట్టిపాపా! కన్నారె కనుపాపా!” పాటని; ‘పుట్టిల్లు’ సినిమా కోసం “జోజో కుమారా! మంగళాకారా! మాకు మాకు వెలుగు జూపు” వంటి జోలపాటలను అమ్మ ప్రేమతో లలితంగా ఆలపించారు.
‘రక్షరేఖ’ సినిమా కోసం ఘంటసాలతో ఈమె ఆలపించిన తొలి యుగళ గీతం “ఓహో రాజసుకుమారా!” మిక్కిలి ప్రాచుర్యం పొందింది.
‘చంద్రహారం’ సినిమా కోసం “ఎవరివో, ఎచట నుంటివో? ఓ సఖీ! నీలిమేఘమాలికలో మెరిసిపడే చంచలవో!” అంటూ నాయకుని కోసం ఘంటసాల ఆలపించిన పాటకి బదులుగా “సఖా! ఓ సఖా! వలపుపాట వినగానే నిలువలేక చేరితినోయ్! మనసు పడిన వరాలొసగి నిను తరింపజేతునోయ్‌సఖా! ఓ సఖా” అని ఆలపించిన ఖండిక ‘కోమలకు – సావిత్రికి’ exclusive song గా ప్రత్యేక గీతంగా చరిత్రలో నిలిచిపోతుంది.
‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమా కోసం పి.లీలతో కలిసి పోటా పోటీగా ఆలపించిన అద్భుతమైన పాట “వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా!.. ఎంత మంది ప్రజ ఏమైపోయిన ఇంత తృణీకరణా!” అనే గాననాదన గాయనీమణుల చేత సప్తస్వర సమ్మిళిత స్వరరాగవాదనలో మనమూ మమైకమై పరవశులమవుతాం.
‘సువర్ణ సుందరి’ సినిమా కోసం వివిధ గాయనీమణుల చేత పాటలు పాడించారు సంగీత దర్శకులు స్వర్గీయ పి.ఆదినారాయణరావు. శాస్త్రీయ గీతాలను ఎ.పి.కోమల చేతే పాడించడం విశేషం. ఆ పాటే “ఉదనతోం.. తన తన.. తాతా తకథి తాతై తకతై.. నాదిరితోం.. సదాగంనిస.. నిన్ను నా మదిని తలిచి మరి మరి ఎంతో కొలిచితినమ్మ!” ఈ పాటను కోమల చేత పాడించడమంటే ‘క్లాసికల్ టచ్’ తో పాడగలిగిన ఆమె గానపటిమ – గాత్ర గరిమే కారణం.
‘చంద్రహారం’ సినిమా కోసం “అలల శయ్యలు కలలు కనెదరా! ఓ కలువ చెలులారా! రారె నెలరాజు కొలువంగరావె – పరిమళ గంధాలు వెదజల్లు రావె – మన రాజు సేవించి విలసిల్లిరారె.. నవసరాగ రాగముతో రావె చెలీ! నవ వికాస హాసముతో నాట్యమాడ రావె చెలీ!” పాటలో కలువ చెలి నెలరాజుల బంధాన్ని సాత్వికంగా, సుత్తిమెత్తని కోయిలలా కోమలంగా ఆలపించారు.
“సరియా! మాతో సమరాన నిలువగలడా! పెదవుల వలపు సింగారమొలక.. కన్నుకొనల కోపానల మెరయ.. ధనువు గొనీ మనోహరునీ.. సరసనా నిలిచి.. నరకునీ గెలిచి బిరుదుగొనగ మానేనా” అంటూ ‘దీపావళి’ సినిమా కోసం ద్వంద్వ వైచిత్రి వెలయించునట్లు అలవోకగా ఆలపించారు. ఈ పాటలో శ్రీకృష్ణుని పట్ల ప్రేమానురాగాలతోను.. నరకుని పట్ల క్రోదాగ్నిజ్వాలలతోను ఈ పాట వ్రాసిన కవి హృదయభావనని అర్థం చేసుకుని పాడారు కోమల, సావిత్రి ఈ పాటలో ప్రదర్శించిన నాట్యాభినయం – కోమల గానం పోటీపడి ఈ సన్నివేశంతో ‘దీపావళి’ సినిమాని సుసంపన్నం చేశాయి.
‘పరదేశి’ సినిమా కోసం”రావో రావో తేటి రాజా నీ రోజా రాణి పిలిచింది.. సుందర రాజా! జీవితమంతా ప్రేమేనంటూ తీయని పాటలు పాడింది” అంటూ ప్రేమగీతాన్ని సున్నితంగా, హాయి గొలిపేరీతిన ఆలపించింది.
‘పిచ్చి పుల్లయ్య’ సినిమా కోసం “ఓ!మనసార ఒకసారి మాటాడవోయి! మదిలోని దిగులంత మరచిపోవోయి! ఈ మౌనమేలనోయీ! గతంచె మరచుట మేలోయీ! అని ప్రబోధిస్తూ సాగే గీతాన్ని అలవోకగా రసస్ఫోరకంగా ఆలపించి సన్నివేశాన్ని సుసంపన్నం చేసింది.
‘జయసింహ’ సినిమా కోసం కె.రాణితో కలిసి “మురిపెము తీర మీ కోరిక తీర వారంపిన కానుకలే! ఏ ఘడియా ఒకే యిదిగా విరాళిని వేగే కోమలిది” అని హుషారుగా ఆలపించారు.
‘శాంతి నివాసం’ సినిమా కోసం పి.లీలతో కలిసి ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరదాగా, హాయిగా గాలిలో అంబరంలో సంబరం రీతిగా ఆలపించిన “ఓ!ఓ!ఓ! సెలయేటి జాలు లాగ చిందేసే లేడి లాగ.. సరదాగా గాలిలోన తేలిపోదామా!.. సనసన్న జల్లై అల నీపై రాలనా!.. చినుకుల్లో సంబరాల నేనాడనా!” పాట వింటుంటే ఈ నాటికీ ప్రేక్షకుల హృదయాలు ఆనందంలో తేలియాడతాయి.
‘బాలనాగమ్మ’ సినిమా కోసం “ఎంతో ఎంతో వింతలే! సంతోషాల కేరింతలే! దేవుని కోట – పూవుల తోట – ఈ వనమెంతో హాయిలే! కొమ్మల కోయిలా కువకువలే – కోమలి మదిలో కోరికలే! గూట్లో రూపాయ్! నీ మొగుడు సిపాయ్! గుమ్మాన పాపాయ్! ఆడేమా!” అంటూ సంతోషాన్ని స్వర నిక్షిప్తం చేసి అలవోకగా వెలయించిన ఈ గీతం శ్రోతలను సంతోషాతిరేకంలో ముంచెత్తుతుంది.
రావు బాలసరస్వతీ దేవితో కలిసి ‘జయసింహ’ సినిమా కోసం ఆలపించిన “మనసైన చెలిపిలుపు వినరావేల ఓ చందమామా.. పిలిచే నిన్నే.. నేవలచాననా బిగిశేరూ మగవారలు.. తలచేరులే చెలి నినుసోకగా వలచే నను జాబిలి” పాటలో మగవారి నైజాన్ని వెలయింపజేస్తూ ఆలపించారు. పాటలో వెన్నముద్దలంత సున్నితంగా ఆలపించడం కోసం ఇరువురూ పోటీపడడం విశేషం.
భానుమతీ రామకృష్ణ దర్శకత్వంలోని తొలి త్రిభాషా చిత్రం’చండీరాణీ’ కోసం ఈమె ఆలపించిన పాట భానుమతే తక్కువ స్వరంలో పాడినట్లు అనిపించడం విశేషం. “ఈ నయార మీ విలాసమెహో రాజా రాజా నీదెరా! నీటు గోటులా! సరి తీసే మాటలా! సయ్యాటలోనా సాటిలేని జాణా నేనె రాజా!నేనే ఏలరా!” అంటూ సాగే ఈ పాట ముగ్ధమనోహరంగా సాగుతుంది.
‘దీపావళి’ లోని “యదుమౌళి ప్రియసఖి నేనే! నా గీటుదాటి జనగాలడుగా! లేదు భూమిని నా సాటి భామ సోగకన్నుల నవ్వారబోసి – పలుకు పంతాల బందీని చేసి” అనే త్రిగళగీతం పోటీపడి ఆలపించారు.
‘పరాశక్తి’ సినిమా కోసం “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” పాటని ఆలపించి రాష్ట్రగీతం గాయని అయారు.
ఇంకా ‘అమ్మలక్కలు’ సినిమా కోసం “కన్నెమావి తోటలోనా”, ‘ప్రేమ’లో “ఓ హో ఇదే కదా బ్యూటీ”, ‘పుట్టిల్లు’ సినిమాలో “ఓ హో హో బ్యూటీ, దిసీస్ మై డ్యూటీ” వంటి ఆధునిక పోకడలు వున్న పాటలను భావరస స్ఫోరకంగా ఆలపించారు.
పిల్లలు ఎప్పుడూ బడికి వెళ్ళడానికి మారాము చేస్తూనే వుంటారు. 1952 నాటి ‘పెళ్ళి చేసి చూడు’ సినిమా కోసం కె.రాణి, ఉడుత సరోజినిలతో కలసి ఆలపించిన పాట “అమ్మా నొప్పులే! అమ్మమ్మా నొప్పులే! ఫస్టు క్లాసులో ప్యాసవుదామని పట్టు పట్టి నే పాఠాల్ చదివితే పరిక్ష నాడె పట్టుకున్నదే! బడికెట్లా నే వెళ్ళేదే!” అంటూ మొదలవుతుంది. చివరకు గారెలు తినడం కోసం “అమ్మా! పాయెనే! అమ్మా! ఒక్కటే!, అమ్మమ్మ ఒక్కటే..” అని చివరకు “అమ్మా ఒక్కటే! అమ్మమ్మ ఒక్కటే! బుద్ధి వచ్చెనే, అమ్మా బడికి పోదునే – బాగా చదువు కొందునే!” అంటుంది.
చిన్నారి విద్యార్థుల మసస్తత్వాన్ని వెలయించే ఈ పాటని ఇతర గాయనులతో కలసి హాస్యపు అల్లరి వల్లరితో ఆలపించి సన్నివేశాన్ని సుసంపన్నం చేశారు. ఈ గీతం హాస్యగీతంగా క(అ)నిపించినా అంతర్లీనంగా ప్రబోధగీతమే.
“ఎక్కడోయీ ముద్దుల బావ? ఎక్కడోయీ ముద్దుల బావ?
చందమామ సొగసరిబావ చందమామ సొగసరిబావ
మోసపోతి నీ మాటలు నమ్మి పోసుకోలు వేషపుబావ”
అనే ఉడికింపు గీతాన్ని హాస్యవల్లరితో ఆలపించారు .చివరకు “వుండలేను నే ఒంటిపాటున తోడులేక బావ” అని ప్రేమతో ముగిసే ఈ పాటను ‘పాండు రంగ మహాత్మ్యం’ సినిమా కోసం పిఠాపురంలో కలిసి విభిన్న రసాల మేళవింపుతో ఆలపించి నవ్వుల పువ్వులు పూయించారు.
‘భక్త రామదాసు’ చిత్రం కోసం “అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి” అంటూ ఆలపించిన ఈమె ‘బంగారు పంజరం’ సినిమా ఆలసించిన రాముని పాట శ్రోతలను శ్రీరామ చరణదాసులను చేస్తుంది. “పదములె చాలు రామా! నీ పదధూళులె పదినేలూ! నీ పదమంటిన పాదుకలూ! మమ్మాదుకునీ ఈ జగమేలు – నా బ్రతుకొక నావ – దానిని నడిపే తండ్రివి నీవా!” అంటూ శ్రీరామ పాదాలు, శ్రీరామ పాదుకల గొప్పదనాన్ని సుతిమెత్తగా, భక్తి పరవశంతో ఆలపించారు.
‘శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం’ కోసం ఘంటసాలతో కలిసి ఆలపించిన “సత్యదేవునీ సుందరరూపుని నిత్యం సేవించండీ! నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రత మండీ!” అంటూ సత్యనారాయణ వ్రతమే సంసార భారాన్ని దాటించు నావ అని తెలియజేస్తుంది. ఈ బృందగీతం ఉత్సాహంగా సాగుతూ స్వామి దాసులను చేస్తుంది.
“సుందర నందకిశోరా! నీ అందము జూపగరాదా! మురళీగానము వినిపించుమురా! పరవశమొంద మురిపించుమురా!” అని ‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’ సినిమా కోసం; “జయమురళీలోలా! గోపాలా! మదవతులా మదిదోచిన రాగీ! మౌనల హృదయాల భాసించు యోగీ!” అంటూ ‘భక్తరఘునాధ్’ సినిమా కోసం ఆలపించిన పాట శ్రీకృష్ణభక్తులను అలరిస్తాయి.
“అక్కడే వుండే పాండురంగడు యిక్కడ వున్నాడు – శ్రీరంగడు యిక్కడ వున్నాడు.. యిక్కడ అక్కడ ఎక్కడ చూసిన తానయి యున్నాడు. శ్రీరంగడు తానయివున్నాడు” పాటని ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా కోసం ఈమె ఆలపించిన బృందగీతం పాండురంగని భక్తులను మైమరిపించి భజనలు చేయిస్తుంది.
‘భూకైలాస్’ సినిమా కోసం ఈమె ఆలపించిన “ఈ మేను మూడునాళ్ళ ముచ్చటోయి! తిత్తి వెన్నంటి తిరుగుతుంది. ఎరుగవేరా! అంతలోనె మానవా! యింత మరుపేలరా! ఐశ్వర్య దాస్యంబు మానుకోరా!” వేదాంతతత్వగీతం ఐహిక సుఖాలకు దూరంగా వుండమని ప్రబోధిస్తుంది.ఈమె పాడిన తీరు వేదాంతాన్ని స్వరంలో వెలయించింది.
తొలిసారి పాడిన “మధురానగరిలో చల్లనమ్మబోదు దారివిడుము కృష్ణా!” పాటను మళ్ళీ ‘అభిమానం’ సినిమా కోసం పి.సుశీలతో కలిసి ఆలపించింది.
ఈమెకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎన్.ఎ.టి. చిత్రాల ముహూర్తపు షాట్‌కు ఈమె చేత ప్రార్థన చేయించేవారు.
దక్షిణ భారతంలోనే కాదు యావద్భారతంలోను బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన భానుమతీ రామకృష్ణకు ప్లేబాక్ పాడిన ఘనాపాటి – అదృష్ణవంతురాలు.
పలుభాషలలో సినిమా పాటలు పాడినా తొలి పాట, చివరి పాట తెలుగు సినిమాలలోవే కావడం చారిత్రక విశేషం. “మధురానగరిలో చల్లనమ్మబోదూ!” తొలి పాటా శ్రీకృష్ణుని గురించే కదా!
చివరిపాట ‘యశోదకృష్ణ’ సినిమా కోసం పి.సుశీలతో కలిసి ఆలపించిన “కళ్యాణ వైభోగమూ, శ్రీకృష్ణ కళ్యాణ వైభోగమూ- కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలిసతి ఆయె – మణికై వెదుకా భార్యమణిగా మగువ జాంబవతీ మనువాడే!” ఈ విధంగా అష్ట భార్యలతో వివాహ వైభోగాన్ని వెలయించిన అద్భుతమయిన పాటతో తన సినీ పాటల ప్రస్థానాన్ని ముగించారీమె.
తమిళనాడు ప్రభుత్వం కలైమామణి, తెలుగు వారి నుండి అమృతగాన వర్షిణి వంటి బిరుదులను పొందిన ఈమె అసలు పేరు ‘ఆర్కాట్ పార్థసారధి సత్యభామ’. సినిమాలలో కోమలంగా గీతాలను ఆలపించే ‘కోమల’ గా మారింది. ఆమె అలవోకగా సత్యభామ. పాత్ర కోసం వెలువరించిన పాటలు అజరామరాలు.
ఆకాశవాణి ఉద్యోగిని కావడం మరిన్ని సినిమా పాటలకు ఆమెను, మనని దూరం చేసిందనడం అతిశయోక్తి కాదు.