Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొడిగట్టిన దీపాలు-26

విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 26వ భాగం.

51

తెల్లగా తెల్లవారింది. భానుడు ఉదయాచల రథాన్ని అధిరోహిస్తుంటే సప్త తురంగాలు ఆ రథాన్ని లాగుతూ ఏతెస్తున్న గుర్తుగా తూర్పు దిక్కున ఎరుపు రంగు పులుముకుంది.

క్రమంగా మేఘాల మాటు నుండి బాల భానుడు ఏతెంచాడు. అతని లేలేతకిరణాలు ధనస్సు నుండి విడిచిపెట్టిన బాణంలా వసుధ పైకి దూసుకొస్తున్నాయి. ప్రభాత కాలమనే గొల్లవాడు భూమి మీదకు కిరణాలు అనే గోవులను తోలుకొస్తున్నాడు. ఆ గోవుల నోటి నుండి వచ్చిన తెల్లని నురుగులా తెల్లని కిరణాలు పుడమినంతా పరుచుకుని ఉన్నాయి.

అటువంటి ప్రభాత సమయంలో చేతిలో అడ్రస్సు పేపరు పట్టుకుని రాజశేఖరాన్ని నడిపించుకుంటూ చైతన్య అడుగులు వేస్తున్నాడు. వాళ్ళిద్దరు మనస్సులో అనేక ఆలోచన్లు. ఎడతెరిపిలేని ఆలోచన్లు, ఆత్రుత, కుతూహలం, ఆరాటం ఇన్ని భావాలు కలగాపులగంగా అతని మదినంతా పరుచుకుని ఉన్నాయి.

అటువంటి ఉదయ కాలాన్ని తను చేరుకోవల్సిన గమ్యం దగ్గరవుతున్న కొద్దీ రాజశేఖరం మదిలో ‘సుజాతని ఇన్ని సంవత్సరాలకి చూడబోతున్నాను, ఎలా ఉందో? తనని అమె ఒక్కమారు చూసి ఎలా చలిస్తోందో? అప్పుడు ఆమె వదనంపై ఎటువంటి భావాలు కదలాడుతాయో’ ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు. చైతన్య అతని భావోద్వేగాలు గమనిస్తున్నాడు.

“ఆఁ!!! తాతయ్య! ఇదే ఆ ఆశ్రమం. ఏమని అడగాలి?” అన్నాడు చైతన్య. అతనికి కూడా సంకోచం కలిగి ఇదరూ ఆగిపోయాడు.

తెల్లారగానే ఆశ్రమ వాసులందరూ ఒక్కొక్కరూ లేచి చాలా సమయం అయింది. అందరూ తమ తమ పనిపాట్లలో మునిగిపోయారు. వారి పనితనాన్ని గమనించిన చైతన్య ‘సుజాతమ్మ ఎంత క్రమశిక్షణతో ఆశ్రమాన్ని నడుపుతోంది. ఎంతేనా రౌతుని బట్టే గుఱ్ఱం ఉంటుంది,’ అనుకున్నాడు.

“ఎవరు కావాలి బాబయ్యా!” వాచ్‌మన్ అడిగాడు.

“నుజాతమ్మగారు” చైతన్య అన్నాడు. రాజశేఖరం ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఉద్వేగంతో నోటి వెంబడి మాటలు రావటం లేదు.

“పాపం ఆ అమ్మగారికి కొద్దిగా వొంట్లో బాగోనేదు,” అని అన్నాడు.

“సుజాతకి ఏఁటయింది?” రాజశేఖరం ఆత్రుతగా అడిగాడు.

అతని ఈ సంబోధనకి వాచ్‌మన్ వెంకటస్వామికి చాలా విస్మయం కలిగించింది. ఆ అమ్మగారికి చాలా కావల్సినవారయ్యి ఉంటారు అని అనుకున్నాడు.

“సుజాకి ఏఁటయింది?” రెట్టించాడు. అతని కంఠంలో ఆత్రుత అగుపించింది.

“రాజశేఖరం గారుట, అతని గురించి పేపర్లో వచ్చిన వ్యాసం చదివిన తరువాత ఎన్నడూ ఆమె ముఖంలో అంత సంతోషం చూడలేదు. సంతోషంతో తన వయస్సుని కూడా మరిచిపోయి ఒక్కసారి లేవడానికి ప్రయత్నించి నాలుగడుగులు నడిచారో లేదో క్రిందపడ్డారయ్యా. కాలు ఎముక విరిగిందిట. కాలుకి కట్టు కట్టారు. మంచం మీదే ఉన్నారు ఆ అమ్మగారు.” ఓ ఆశ్రమవాసి ఆమె స్థితిని వివరించాడు.

“అయ్యో! ఎంత పనయింది,” రాజశేఖరం బాధగా అన్నాడు.

“మీరెవరయ్యా ఆమెకి తెలియ చేయాలి,” తిరిగి ఆశ్రమవాసి అన్నాడు.

“నేనే రాజశేఖరాన్ని,” నిర్లిప్తంగా జవాబిచ్చాడు రాజశేఖరం.

ఈ మాటలు వినగానే అక్కడున్న ఆశ్రమవాసులు చకితులయ్యారు. రాజశేఖరం ప్రస్తావన ఈ మధ్య విన్నారు ఆశ్రమవాసులు. సుజాతమ్మ జీవితంలో రాజశేఖరానికి ఉన్న ప్రాముఖ్యత గురించి విన్నారు. అందుకే రాజశేఖరంపై గౌరవ భావం కలిగింది. ‘ఈయన గారి కోసమే ఆ అమ్మ కళ్ళు కాయలే కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇతగాడ్ని చూసిన తరవాతేనా అమ్మగారు స్థిమితపడ్తారేమో,’ అనుకుంటున్నారు ఆశ్రమవాసులు.

రాజశేఖరం వచ్చిన వార్త విని సుజాతమ్మ దిగ్గున లేవడానికి ప్రయత్నించింది. కాని సాధ్యం కాలేదు. బాధతో విలవిల్లాడింది ఆమె. ఆమె కాలుకి కట్టుంది లేస్తే నొప్పి పుడ్తోంది. ఉస్సూరుమంటూ తిరిగి పడుకుంది.

రాజశేఖరానికి, సుజాతమ్మకి ఇన్ని సంవత్సరాలు ఎడబాటు సహించినా ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది. అనురాగముంది. ఈ అనురాగం ఆకారంలో మనకి కనిపించదు. మనకి కళ్ళున్నాయి. కళ్ళ ద్వారా సత్యాన్ని చూడలేము. ప్రేమని స్పర్శించలేము. ఆనందాన్ని పట్టుకోలేం. జీవితంలోని అమృత రహస్యమదే. అవి గాలి లాంటివి. హృదయ స్పందన లాంటివి. వాటి ద్వారా మానవునికి అర్థమవుతుంది. చూపులేని వారికి వెలుగు గురించి చెప్పలేము. వినికిడి శక్తి లేనివారికి శబ్దం గురించి అవగాహన చేయలేము. అలాగే కొన్ని అనుభూతులకి ఆకారాన్ని ఇవ్వలేము. అవి అనుభవించి తెల్సుకోవల్సిందే.

రాజశేఖరం సుజాతమ్మ మధ్య నున్న అనురాగం, ఆప్యాయత, ప్రేమ అలాంటివే. అనుభవించిన వారికే వాటి మధ్యనున్న విలువ తెలుస్తుంది.

సుజాతమ్మ మనస్సు రాజశేఖరం వచ్చాడన్న వార్త విని ఉద్వేగంతో ఊగిపోతోంది. తను ఎన్ని సంవత్సరాలకి అతడ్ని చూడగలుగుతుందో? అతను అగుపించగానే తను ఎలా స్పందిస్తుంది? అతను అగుపించగానే అతను ఎడబాటులో తను ఎంతగా కుమిలిపోయిందీ చెప్పాలి.

అతని సమీపంలో కరువుదీరా ఏడ్వాలి. అలా చేస్తే తన హృదయం తేలికపడుతుంది. తను ఇన్నాళ్ళూ అనుభవించిన మనస్తాపానికి ఉపశమనం లభిస్తుంది. అతని కోసం ఎదురు చూసి చూసి తన కనుదోయి ఏ విధంగా అలిసిపోయిందో తెలియ చేయాలి. జీవిత చరమాంకంలో అతని ఒదిలో తల పెట్టుకుని నిశ్చంతంగా కన్ను మూయాలనే తన కోరిక తెలపాలి.

ముఖ్యంగా ఇదంతా చైతన్య వలనే సాధ్యమయింది. ఆ చైతన్యే రాజశేఖరం గురించి వ్యాసం వ్రాసి పత్రికలో ప్రచురించకపోతే అతనికి తన ఉనికి తెలిసి ఉండేది కాదు. అతని ఉనికి తనకి తెలిసి ఉండేది కాదు. మొదట ఆ చైతన్యకి కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలి. ఇలాంటి ఆలోచన్లు ఆమె మదినిండా పరుచుకుని ఉన్నాయి.

52

మానవ జీవితం చాలా విచిత్రమయినది. ఈ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఎత్తైన కొండ మించి అమాంతంగా పడిపోవడం ఉండదు. అలాగే చిన్న రాయి మీద నిర్లక్ష్యంతో వేసిన అడుగే క్రిందకి కూలదీస్తుంది. జీవితంలోనూ అంతే, అమాంతంగా అధోపాతాళానికి జారిపోవడం ఉండదు కాని ఎదురయ్యే చిన్న చిన్న అవాంతరాలకి బెదిరిపోయినప్పుడే బ్రతుకులో విఫలమవుతాం.

సుజాతమ్మ తనకి జీవితంలో ఎదురయిన ఆటంకాలు, అవరోధాలు ధైర్యంతో అధిరోహించింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసింది. అందుకు ఆమె బ్రతుకు బాటలో విఫలమవలేదు. కొంతమంది అర్హత లేని పాత భావాలు గతం తాలూకా చేదు అనుభవాలు పదే పదిసార్లు గుర్తుకు తెచ్చుకుంటూ బాధలు అనే వేటగాడికి లొంగిపోతారు. ఎంతో అందంగా ఆనందంగా ఉండవల్సిన జీవితాన్ని బాధగా నిట్టూర్పు విడుస్తూ జీవిస్తూ ఉంటారు.

ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఇంతవరకూ జీవితాన్ని నెట్టుకొచ్చింది సుజాతమ్మ.

ఒక్కసారి రాజశేఖరాన్ని చూస్తున్న సుజాత కళ్ళలో ఆనందం తొణికిసలాడింది. అయితే రాజశేఖరం కళ్ళల్లో మొదట ఆనందరేఖలు తొణికిసలాడినా వెనువెంటనే విచార రేఖలు పొడచూపాయి.

పాపం సుజా, బొత్తిగా కర్పూరపుల్లలా హరించుకుపోయింది. అంతకు పూర్వం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారయింది. బాగా చిక్కిపోయింది.

ఆ లోతుకు పోయిన కళ్ళే చెప్తున్నాయి ఆమె జీవితంలో ఎంత అలిసిపోయింది. తమిద్దరూ జీవిత చరమాంకంలో ఉన్నారు. అతను అలా ఆలోచిస్తూ ఉంటే సుజాతమ్మ ఆలోచన్లు మరో విధంగా సాగిపోతున్నాయి.

జీవితంలో పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయారు. జీవితంలో వచ్చే సమస్యలు ఎదుర్కొని ఎదుర్కొని విసిగిపోయారు. ఈ ప్రపంచమే ఒక పోరాట క్షేత్రం. పోరుబాటలో జీవితం వరిగెడుతూనే ఉంటుంది. భావోద్వేగాలు, భావోద్రేకాలు, ఉరుకుతూ ఉంటాయి. సారథ్యం వహిస్తున్న అంతరంగం వాటికి గంతలు కట్టి దౌడుతీయమంటుంది. మానవ జీవితమే అంత.

తను జీవితంలో తల్లి ప్రేమ పొందలేకపోయినా తండ్రి అండ తనకి లభించింది. తరవాత జీవితంలో కూడా సంతృప్తికరమైన జీవితం లేకపోయినా తన జీవితం పరవాలేదు. రాజశేఖరం విషయంలో మాత్రం చిన్నప్పటి నుండి జీవన పోరాటమే. ఆర్థిక సమస్యలు – ఇబ్బందులు బాధ్యతలూ, బరువులూ జీవన సమరంలో వీరుడులా స్వాతంత్ర్య సమర యోధుడిగా ముందుకు అడుగువేసాడు. జీవితంతో అలుపెరగని పోరాటం చేశాడు .

“నా గురించే కదూ నీ ఆలోచనా? సుజా!” అతను మృదువుగా అన్నాడు. ఆ మాటల్లో తియ్యదనానికి, మాధుర్యానికి ఆమె ఆనందభరితురాలైంది. తన్మయత్వంతో ఆమె కనులు మూతలు పడి తిరిగి తెరుచుకున్నాయి.

“ఊఁ!!!” అంది ఆమె అతని ప్రశ్నకి సమాధానంగా.

“నీకేంటి ఈ అవస్థ? ఏనాడు ఎవ్వరికీ అపకారం తలపెట్టని నీకు ఏంటి ఈ శిక్ష?”

“రాజూ!” ఆమె ఆ పిలువుకి అతని శరీరం పులకరించింది. అపురూపంగా ఆమె ముఖం వేపు చూశాడతను. “ఏదీ మన చేతుల్లో లేదు ఎలా జరగవల్సింది అలా జరుగుతుంది.”

అతనికి ఆమె మాటల్లో వేదాంత భావం తొంగి చూసింది.

అతనికి ఆమె పరిస్థితి ఆందోళన కలిగించింది. అతని కనుకొలుకుల్లో నీరు పైకుబకగా అదే పరిస్థితిలో ఉన్న ఆమె నయనాల్లో కూడా నీటి తెర తళుక్కున మెరిసింది.

చైతన్య ఆశ్చర్యంగా అవలోకిస్తూ వారి మధ్యనున్న అనుబంధాన్ని అంచనా వేస్తున్నాడు.

“సుజా!” ఆమె చేతుల్ని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ పిలిచాడు.

అతని స్పర్శలో ఆనందం అనుభవిస్తూ “మీరు… మీరు… ఆరోజు…”

ఆమె మాటలు పూర్తవకుండానే తన విషయాలన్ని విపులంగా వివరించాడు. అతని మాటల్ని విప్పారిన నయనాలో వింటోంది ఆమె.

“సుజా! దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనం ఒకటవుదాం అని అనుకున్నాం, గుర్తుందా?”

“అది ఎలా మరిచిపోగలను?”

“ప్చ్…! మనం అలా అనుకున్నాం. ఆచరించాం, జీవితానికి సార్థకం లేకుండా చేసుకున్నాం. మనం అలా అనుకోడం, త్యాగం చేయడానికి ఇప్పుడు అర్థముందా అని అనిపిస్తోంది. దానికి విలువుందా అని అనిపిస్తోంది.

దేశ స్వాతంత్ర్య కోసం విదేశీ ప్రభుత్వంతో పోరాటం చేశాం. మన ప్రభుత్వంలోనే మన ప్రజానాయకుల పరిపాలనలోనే దేశానికే కాదు. మనిషికి కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేదు. ఈ పరిపాలన కోసమేనా మనం మన జీవితాలు బలి దీసుకున్నాం? అన్న బాధ ఆవేదన.

నేటి నాయకులకి కావల్సింది. నీతి కాదు, నిజాయితీ కాదు. పదవుల కోసం పరుగులు. కోట్లు గడించడానికి ఉరకలు. స్వార్థం, కల్మషం – కపటం, దౌర్జన్యం ఇవే నేటి ప్రజా నాయకులకి కావలిసిన క్వాలిఫికేషన్సు.

నేటి మన పరిపాలనలో ప్రజలకెవ్వరికీ సంతోషం లేదు. సుఖం లేదు. అసంతృప్తి.

నాకేంటి అనిపించిందో తెలుసా? మన ప్రజానాయకులు స్వార్థపరులు. వీరికి కావల్సింది దేశ ఉన్నతి కాదు. అభివృద్ది కాదు. ప్రగతి కాదు, పదవులు వాటిని అడ్డు పెట్టుకుని పలుకుబడి సంపాదిస్తారు. పరపతి సంపాదిస్తారు. దానితో పాటు డబ్బు సంపాదిస్తారు. అదే వాళ్ళ పరమావధి.

ఈ స్వార్థపూరిత మనుష్యులున్న సమాజంలో తల దూర్చకూడదు. అజ్ఞాతంగా నా ఉనికి, అస్తిత్వాన్ని ఎవ్వరికీ తెలియజేయకుండా ఉండి. అలాగే జీవితం గడిపేయాలనిపించింది. నా ఈ నిర్ణయం నీకు బాధ కలిగిస్తుందని తెలుసు అయినా ఏఁ చేయడం. ఈ సమాజంలో నేను కలవలేను. ఈ మనుష్యుల మద్య మనుగడసాగించలేను. ఇప్పుడు నీవే చూస్తున్నావు మన పరిపాలన ఎలా ఉందో? నిజాయితీ – నీతికి తావులేదు.

అన్ని రంగాల్లో అస్తవ్యస్త పరిస్థితులే. అన్ని రంగాల్లో సమస్యలే. అన్ని రంగాల్లో లోటుపాట్లే. అందరిలోనూ అసంతృప్తి. వైద్య రంగం, వ్యాపార రంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం, ఏ రంగం తీసుకున్నా సమస్యలే. అసంతృప్తే” అతను అలా చెప్పుకుపోతున్నాడు.

“నిజమే! ఈ సమాజంలో ఇటువంటి వాతావరణంలో నేను ఎలా నెట్టుకొచ్చానో మీరు ఆలోచించారా? ఒంటరి పోరాటం చేశాను. సమస్యల్ని ఎదుర్కున్నాను. సంఘర్షణ సమయంలో స్థిరంగా నిలబడ్డాను. ఆనాటి సమాజమే నాకు స్వార్థపూరిత సమాజంగా అగుపించింది. మరి నేటి సమాజమో?” ఎదురు ప్రశ్న వేసింది సుజాతమ్మ రాజశేఖరాన్ని.

ఆమె అలా ప్రశ్న వేస్తుందని అతను మొదట ఊహించలేదు. ఆమె ప్రశ్న విన్న తరువాత ఓ లిప్త కాలం మౌనంగా ఉండిపోయాడు.

“నీవు చెప్పింది నిజమే. నేటి రాజకీయ వాతావరణ సమాజ తీరుతెన్నులూ సంతోష జనకంగా లేవు. కార్మికుల పరిస్థితి బాగులేదు. కర్షకుల పరిస్థితి బాగులేదు. ఉద్యోగుల పరిస్థితి బాగులేదు. విద్యార్థుల పరిస్థితి బాగులేదు. ముఖ్యంగా ఆడదాన్ని పూజించవల్సిన మన దేశంలో, సమాజంలో ఆడదాని పరిస్థితి బాగోలేదు.

రోజు రోజుకి ఆడవాళ్ళు మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకూ అడది అంటే చాలు వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి కారణం సమాజంలో చోటు చుసుకున్న నూతన పోకడలు. అశ్లీల విలువలేని సినిమాలు, బూతు మాటలు, పాటలు, సంభాషణ, హింసతో కూడిన సినిమాల ప్రభావం యువత మీద పడుతోంది.

ఇంటర్నెటులు, సెల్‌ఫోను, వీడియో గేమ్స్ ఇవన్నీ యువతను చెడు మార్గం వేపు తీసుకువెళ్తున్నాయి. గర్భంలో ఉన్న ఆడపిల్ల అని తెలుస్తే చాలు అబార్షన్ చేయించుకుంటున్నారు. అందుకే ఆడపిల్లల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. పెళ్ళికాని మగవాళ్ళు ఎక్కువుగా ఉన్నారు. ఇలా పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళయిన కొంతమందికి ఆడది కావాలి. అందుకే మానభంగాలు, ఆ తరువాత హత్య చేయడం.

ప్రతీ రంగం ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలూ క్షీణ దశలో ఉన్నాయి. కార్పొరేటు పాఠశాలలు, కార్పొరేటు వైద్యశాలలు ప్రాబల్యం పెరిగిపోతున్నాయి. అన్ని రంగాలూ అంటే నేడు ప్రపంచీకరణ ఫలితంగా అన్ని రంగాల్లో మార్పులే. అన్ని రంగాల్లో అసంతృప్తి.

స్కాములు, నేరాలు, కోట్లకి కోట్లు దిగమ్రింగి దొరికిపోయిన ప్రజానాయకులు, పలుకుబడి ఉపయోగించి బెయిలు మీద విడుదల అయినవారు కొంతమంది అయితే, శిక్ష అనుభవించిన వారు మరికొందరూ. ఇదేనా మనం అప్పుడు ఆశించిన స్వాతంత్ర్య భారతదేశం? దేశ పరిస్థితి ఏం సంతృప్తికరంగా లేదు. అన్ని రంగాల్లో పేదలు, పేదలుగా మిగిలిపోయారు. ధనవంతులు మరింత కోట్లకి పడగలెత్తుతున్నారు. ప్రతీ రాజకీయ నాయకుడు ఓ పారిశ్రామికవేత్తే. అతని అధీనంలో వేల కొలది కార్మికులు. పని చేసిన వాళ్ళు కొందరయితే, వెట్టి చాకిరీ చేస్తున్న వారు మరికొందరు. ప్రజా సేవకుడని చెప్పుకుంటున్నా చోటా మోటు నాయకుడు నుండి పెద్ద నాయకుడు వరకూ అందరూ భూకామందులే,” ఇలా చెప్పుకుపోతున్న అతని ముఖం మీద నేటి రాజకీయ వ్యవస్థ మీద అసహ్యం, ఏవగింపు భావాలు అగుపడుతున్నాయి.

అతను చెప్తున్నది వింటున్న సుజాతమ్మ గాఢంగా నిట్టూర్పు విడిచింది.

“మీరు చెప్తున్నది నిజమే! నాకూ ఇలాంటి ఆవేశమే వచ్చేది ఒక్కొక్క పర్యాయము. అయితే ఆ ఆవేశాన్ని నా అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించేదాన్ని. పరిస్థితుల్తో రాజీపడేదాన్ని. మారుతున్న ఈ సమాజానికి అనుకూలంగా ఒక్కొక్క పర్యాయం నన్ను నేను మలుచుకోలేకపోయేదాన్ని,” గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అంది సుజాతమ్మ.

ఇలా రాజశేఖరం, సుజాతమ్మ తమకి జీవితంలో ఎదురయిన అనుభవాలు ఒకరికి మరొకరు ఎరుక పర్చుకున్నారు. సేద తీరారు. వారి మనస్సులు తేలికపడ్డాయి.

చైతన్య అసలే జర్నలిస్టు. అతనికి కావల్సినంత మేత లభించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version