[సెప్టెంబరు 10, 2025 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా, 17 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 07 సెప్టెంబర్ 2025 ఆదివారం వరకు – విశ్వనాథ సత్యనారాయణ గారిపై ప్రతి వారం ఒక ప్రత్యేక వ్యాసాన్ని అందించనున్నాము. ]
(ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య రచించిన ఈ వ్యాసం తొలుత జూన్ 1999లో ప్రవాహ వాణి పత్రిక అనుబంధంలో ప్రచురితమైంది.)
నేపథ్యం
‘కిన్నెరసాని పాటలు’ ఆవిర్భవించటానికి గుర్తు చేసుకోదగినంత పూర్వ రంగమున్నది. భద్రాచలం అడవుల్లో ప్రవహించే ఒకానొక వాగు ‘కిన్నెరసాని’. ఆ వాగు ఎంతందమయిందో, దాని పేరు అంతకన్నా మోహకమయింది. ‘కిన్నెర’ అనేది ఒక తంత్రీవాద్య విశేషం – ఒక రకమయిన వీణ. దానికి స్వామిని ఆ వాగు. ‘సాని’ శబ్దానికి మూల ప్రకృతి ‘స్వామిని’ కాగా, కిన్నెరసాని వాగు ప్రస్తరించే నాదం వీణానాదంగా ఉంటుందని తాత్పర్యం. అదీ ‘కిన్నెరసాని’ అంటే, సత్యనారాయణగారు ఆ వాగును చూసారు; ఆ వాగును విన్నారు. ఆ చూచిన, విన్న సన్నివేశం తీరిది:
సత్యనారాయణగారి తండ్రి శ్రీశోభనాద్రిగారు ఆ భద్రాచలం అడవుల ప్రాంతంలోని ‘కాటాపురం’ అనే ఊళ్లో కొంత పొలం కొని వ్యవసాయం చేయించటం మొదలు పెట్టారు. బీడు భూములను సాగు భూములుగా చేయడం, చేయించటమన్నది అప్పటిదాకా సత్యనారాయణగారి కుటుంబానికి తరతరాలుగా సంక్రమించిన విద్య. ఆ విద్యను సత్యనారాయణగారు సాహిత్య భూములకు అనువర్తింపజేయటం ఆయనతోటే ఆరంభమయింది. అదట్లా ఉంచి; శోభనాద్రిగారు కాటాపురంలో వ్యవసాయం చేయించటమన్నది ఇప్పటికి- అంటే, 1999 నాటికి ఇంచుమించుగా ఎనభై కిందటి మాట. ఆ రోజుల్లో ఆ ప్రాంతమంతా సాంద్రారణ్యాని. రాకపోకలకు చాలా, అంటే, చాలా ఇబ్బందిగా ఉండేది. కాలినడకే అక్కడ ఆనాటి ప్రయాణ విధానం. ‘బొగ్గు గుట్ట’ దగ్గరి నుంచి ‘గుండాల’ అడవులగుండా కాలినడకన కాటాపురం వెళ్లవలసి ఉండేది. ఆ దారిలోనే కొన్ని చిన్నాపెద్దా గుట్టలు, వాగులు, వరదలు. అక్కడే ఒక ప్రదేశం పేరు ‘వెన్నెల బయలు’. మరింత ముందుకు పోతే ‘రాళ్లవాగు’. ఆ ప్రాంతాల్లో పులులు మొదలయిన రకరకాల అడవి మృగాలు యథేచ్ఛగా తిరుగటం సర్వసాధారణం. అప్పుడప్పుడు ఆ అడవుల్లో కోయవాళ్లు పులులు చావటానికి మందు పెట్టేవారు. మరి, మందు తిన్న పులి తిరుగుతున్న ప్రాంతానికి పోవటమంటే కోరి కోరి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమన్నమాట. ఆ దారుల్లో పులుల అడుగుల గుర్తులు కన్పిస్తూనే ఉండేవి. కాగా, ఆ అడవి ప్రాంతాలు అంత భయంకరమయినవి.
ఒకసారి శోభనాద్రిగారు కాటాపురానికి ఒంటరిగా బయలుదేరారు. అది వేసవికాలం. పాఠశాలలకూ, కళాశాలలకూ సెలవుదినాలు. తండ్రిగారట్లా ఒంటరిగా బయలుదేరి వెళ్లటం సత్యనారాయణ గారికిష్టం లేదు. తానూ వెంట వస్తానన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ బయలుదేరారు. సత్యనారాయణగారు ఇట్లా బయలుదేరటంలో అట్లాంటి సాంద్రారణ్యాలను చూడాలని అంతరాంతరాల్లో మెదిలో ఉత్సుకత కూడా ఒక అవ్యక్త కారణం. ఈ విధమైన ఔత్సుకాలు ఆయనకు చాలా ఉండేవి. తుఫాను వచ్చినప్పుడు సముద్రం ఎట్లా ఉంటుందో చూడాలని, ఓసారి తుఫాను వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఆప్తమిత్రులను వెంటేసుకొని సాహసికంగా బందరు దగ్గర హంసలదీవి వెళ్లి అప్పటి ఆ తుఫానువేళ సముద్రం యొక్క అద్భుత దృశ్యాన్ని దర్శించారు. ఈ దర్శించింది వట్టిగా పోలేదు. ‘చెలియలికట్ట’ నవలలో చివరి ఘట్టంగా ఈ తుఫానులో సముద్ర దృశ్యాన్ని అద్భుతంగా సత్యనారాయణగారు చిత్రించారు. ఇట్లాంటి అసాధారణమయిన వాటి విషయంలో సత్యనారాయణగారికి అంతటి ఉత్సుకత చాలా సహజమయిన అంశాలు. అదట్లా ఉంచి:
తండ్రీకొడుకులిద్దరూ బొగ్గుగుట్ట దగ్గర దిగి కాలినడకన కాటాపురం వెళ్తున్నారు. శోభనాద్రిగారు చిత్రవిచిత్ర దేశీయ పౌరాణిక జానపద కథాకథన కోవిద గ్రామవృద్ధుడు. కథాకథనమంటే ఏదో వట్టిగా తోచినట్టు కథ చెప్పుకుంటూ పోవటంకాదు. అదొక విద్య. ప్రసక్తానుప్రసక్తంగా, కథకుని ప్రతిభా వ్యంజకంగా అనేకానేకాంశాల పోహళింపు, కథకు ప్రాణభూతమయిన అంశానికి గుర్తింపు ఆ కథాకథనంలో నిబిడంగా ఉంటుంది. ఆ విధమయిన కథనం వినేవారికి విజ్ఞాన వివేకాలను ఆ సంపాదించి పెడుతుంది. అందుకనే నన్నయగారు సూతుడిని ‘కథాకథన దక్షు’డన్నారు. అనంతర కాలాన సత్యనారాయణగారి సాహిత్యమంతటా వ్యాపించిన ‘అమృతోక్త్యంచిత.. కథాకథన శిల్పానేక మార్గాభిరామత్వా’నికి మూలధాతువు ఆయన తన పదమూడు, పధ్నాలుగేళ్ల వయస్సుదాకా తెలుగు పల్లెటూళ్లల్లో అనునిత్యం సాగే హరికథలు, పురాణ కాలక్షేపాలు, వీధి భాగవతాలు, జానపద కథాగానాలు, స్త్రీల పాటలు, వీటన్నిటికి తోడుగా శోభనాద్రిగారి కథనరీతులూ – ఈ మొదలయిన వాటి సమష్టిలోంచి ఉద్గతమయింది. ఆ తరువాత పురాంధ్ర సంస్కృత కవీంద్రుల కావ్యనాటకాదులూ, పాశ్చాత్య కథానవలా సాహిత్యం దీనికి తోడయి అనంత ముఖాలుగా పదును పెట్టి విజృంభింపజేసినాయి.
ఆ తండ్రీ కొడుకులట్లా కథలు చెప్పుకొంటూ, వింటూ ఆ అడవులలోంచి, ఆ చీకిరి బాకిరి మలకల దారుల వెంట కొండగుర్తులతో సాగుతూ ‘వెన్నెల బయలు’ దాటి, ‘రాళ్ల వాగు’ దాటి మరింత ముందుకుపోయి – అక్కడ, అక్కడ కిన్నెరసాని వాగును చూసారు. ఆ అడవులూ కొండలూ, చెట్లూ చేమలూ, ఆ పరిసరాలు, విచిత్రమయిన ఆ వాతావరణం, అక్కడ వెల్లివిరిసే ఒకానొక అప్రధృష్యమయిన ఆటవిక సౌందర్యం – అక్కడి గలగలమంటూ కలకల మనోజ్ఞనాదంతో ఒదుగులుపోతూ ఒయ్యారంగా ప్రవహించే అందాల వాగూ, మరీ అందమయిన ఆ వాగు పేరూ సత్యనారాయణగారి పరమ సుకుమారమయిన, సద్యః స్పందశీలమయిన హృదయాన్నీ, సునిశితమయిన నిత్యజాగృతమయిన బుద్ధినీ, ప్రతిభామయమయిన భావననీ విచిత్రంగా స్పందింపజేసాయి. అప్పటి ఆయన స్పందననూ, దాని విలక్షణమయిన తీరునూ ఎంతో కొంతయినా అవగతం చేసుకోవాలంటే –
రమ్యాణి వీక్ష్య మధురాంశ్చనిశమ్య శబ్దాన్
పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః
తచ్చేతసాస్మరతి నూన మబోధ పూర్వం
భానస్థిరాణి జననాంతర సౌహృదాని.
అన్న కాళిదాస శాకుంతల శ్లోక తాత్పర్యాన్ని మననం చేసుకోవలసి ఉంటుంది. ఆ కిన్నెరసాని ప్రసుప్త కల్పంగాసత్యనారాయణగారిలో ఉన్న జననాంతర సౌహృదాన్ని సుకుమారంగా స్పృశించి మేలుకొల్పింది. కాగా, ఈ విషయాన్నే వ్యక్తీకరిస్తూ –
వనములను దాటి, వెన్నెల బయలుదాటి;
తోగులను దాటి, దుర్గమాద్రులను దాటి;
పులుల యడుగుల నడుగులు కలుపు కొనుచు
‘రాళ్లవాగు’ దాటి, పథాంతరములు దాటి.
అచట కిన్నెరసాని – నాయాత్మయందు
నిప్పటికి దాని సంగీతమే నదించు
నన్నారు సత్యనారాయణగారు. అది కిన్నెరసాని సంగీతం, అది ఆత్మ సంగీతం. ఆ సంగీతం m యొక్క సాహిత్యరూపమే, కవిత్వాభివ్యక్తియే ‘కిన్నెరసాని పాటలు’. కిన్నెర కావ్య వస్తువును 2 సూచించగా, పాటలు అనేది కావ్యరూపానికి సూచన. కాగా, ఈ కావ్యం కిన్నెరసాని వాగుకు తెలుగు సాహిత్యంలో అజరామరమయిన, ఆత్మరమణీయమయిన జీవితాన్ని కల్పించింది.
ఈ సందర్భంలోనే సత్యనారాయణగారి సాహిత్య ప్రపంచంలో శాశ్వతత్వాన్ని సంపాదించుకొన్న మరొక వాగు గుర్తుకు వస్తుంది. తెలంగాణాలోని కరీంనగరానికి ఇంచుమించు ఇరవై కిలోమీటర్ల దూరాన ఒక వాగు ప్రవహిస్తూ ఉంది. కిన్నెరసాని వాగు తరువాత దాదాపు నలభయ్యేండ్లకు ఈ వాగు ఆయన దృష్టిలోకి వచ్చింది. ఆ వాగుకూడా ఆయనను అంతగా స్పందింపజేసింది. దానిపేరు ‘మ్రోయు తుమ్మెద’. అది కలిగించిన స్పందన సంగీత చరిత్రాత్మకమయిన, సంగీతాత్మక వ్యక్తి జీవితం వస్తువయిన ఒక నవలగా రూపొందింది. ఆ మహానుభావుని పేరు నారాయణరావు. ఆ నవల పేరు మ్రోయు తుమ్మెద. కిన్నెరసాని వీణానాదం కాగా, మ్రోయు తుమ్మెద బంభరీనాదం.
1927లో సత్యనారాయణగారు శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావుగారితో కలిసి ‘జయంతి’ అనే ఒక ద్వై మాసిక పత్రిక నిర్వహించారు. ఆ పత్రికలోనే తొలిసారిగా కిన్నెరసాని పాటలు ఒక్కొక్క ఖండంగా ఒక్కొక్క సంచికలో వెలువడ్డాయి. అట్లా వెలువడుతూ వెలువడుతూనే సహృదయుల మనస్సుల్ని సమ్మోహింపజేసినవి (‘కోకిలమ్మ పెళ్లి’ కావ్యం గూడా ఆ రోజుల్లోనే జయంతిలో వెలువడింది). ఆ తరువాత దాదాపు ఏడెనిమిదేళ్లకుగాని ఈ ‘కిన్నెరసాని పాటలు’ (‘కోకిలమ్మ పెళ్లి’తో సహా) పుస్తకరూపంలో వెలువడలేదు. ఇది పుస్తకరూపంలో వెలువడడానికి గూడా వెనుక మనస్సుల్ని కదిలించే సన్నివేశం ఒకటుంది.
కిన్నెరసాని వాగును దర్శించినంతలో సద్యోనిర్గతంగా, సద్యఃఫలంగా ‘కిన్నెరా’ అని సంబోధిస్తూ అయిదు పద్యాల ఖండిక ఒకటి సత్యనారాయణగారి హృదయంనుంచి ఉద్గమించింది. సహృదయ మనః ప్రీతికరమయిన ఆ పద్యాలివి:
అమృతపు జున్నులన్ బుజమునందున గట్టిన తాళితారి బ
త్తెము గొని పోయెదీ తెనుగు తీయని తోటల పుంతలందు, మ
వ్వములగు నేలపాటలను పాడుచు గిత్తల మూతి చిక్కముల్
తెమలుచు కాపు బాలకులదే వినుచుందురు నిన్ను కిన్నెరా!
ఎల మొక్కజొన్న కండెల తుట్టతుదపీచు
తీపి యెక్కించిన తేనెపాట
తలకంకె చను జొన్నదంటు ముక్కల యందు
చెరకు తీయన దెచ్చు చిన్నిపాట
తీరి దోరవాగుగా తిరిగిన యూచ బి
య్యమున పాలూరించు కొమరుపాట
తొలి యెఱ్ఱజిలమ పొట్టల మండెదింపని
చెలమనీర్ మెరపించు వెలుగుపాట
గంజి మడతల తలపాగ కావికుచ్చు
సోకు కుఱ్ఱలు నెదయుబ్బ చూచినారు
బొటనవ్రేళ్లపై నిలచి నీ పాలుపులెల్ల
ఓసి కిన్నెరా! నీ పాట యూపు వినుచు.
మద కలకంఠకంఠమున మాగులు తేరిన యేల పాట యూ
చెదవు రసానుకూలముగ చేతులు త్రిప్పుచు, గాలిదూలు ప
య్యెద తొగరంచు గూడలొలయింపగ జన్నుల పానవట్టమై
యిది శివమూర్తి నీ యెడద యెల్లము సత్కళ కాదిబీజమౌ.
ఔనే కిన్నెర! ఓసియోసి పటు గీతావేశ నిమ్మీలతా
క్షీ! నిష్యందిత గీతికా మధురసక్షీబా! ఓసీ బాటసా
రీ! నీతాంచిత భావమత్త గజవారీ! మోహనాలాప సం
స్థానీ! మాధుఝరీ పృషత్సుఖ రసజ్ఞ శ్రేణికా పాలనీ!
అరవ మ్మోడ్రము కన్నడ మ్మురుదు పై నాంగ్లేయమై దౌచు లా
హిరి యెక్కించిన స్వార్థరజ్జువుల మోహింపించినన్, దేనె సొం
పిరి నోనైన తెనుంగు సొంపులను నింపెన్ త్వత్సుధాగీతి; నీ
హరవుల్ సెల్లెడి నమ్మ! జానపదురాలా! నీకు దీర్ఘాయువౌ
కిన్నెరసాని ఏదో ఒక నీటిజాలు కాదు. ఆమె అచ్చమయిన తెలుగు జనపదురాలుగా సత్యనారాయణగారికి దర్శనమిచ్చింది. అమృతపు జున్నులను బత్తెంగా ఈ తెనుగు తీయని తోటలలో పుంతలలో అవిరామంగా పయనిస్తున్న బాటసారి. కాపు బాలకులు ‘మవ్వపు నేల పాటల’ను పాడుతున్నారు. అక్కడి పదాల కూర్పులో ఆ పాటలు ఏల పాటలూ, నేల పాటలుకూడా. జానపదుల అనంత విధాలయిన పాటలలో ‘ఏల పాటలు’ ఒక విధం. అదట్లా ఉంచి; అవి ఈ ‘నేల’ – ఈ భూమి పాటలు. ఇక్కడి ప్రకృతి, ఇక్కడి పరిసరాలు, ఇక్కడి వాతావరణం, ఇక్కడి మధురభావాలు- ఈ మొదలయినవాటి నన్నింటినీ రంగరించుకొన్న పాటలు. ఆ పాటలు పాడే గోపబాలకులు – దొంగ నాగరకతకు లొంగిపోని అమాయకులయిన గోపబాలకులు కిన్నెరను ఆమె పాటలను వింటున్నారు. అవి అచ్చంగా నేలలోంచి ఏలలుగా ఉబికి, పొంగి వచ్చిన పాటలు. వారు ఆమెను చూడవచ్చు; చూస్తున్నారు గూడా. మరి, ఆమెను ‘వినటమేమిటి? (వినుచుందురు నిన్ను, కిన్నెరా!) కిన్నెర రెండు విధాలుగా ఉందన్నమాట. ఒకవిధం దృశ్యమయిన జలరూపం; రెండు : శ్రవ్యమయిన ధ్వనిరూపం. అంటే, ఆమె రూపం రెండంతస్తుల్లో వారి అనుభవానికి అందుతున్నది. అంతేకాదు, ఆ జలాన్ని వాళ్లు ముట్టుకుంటున్నారు. దాన్ని వాళ్లు తాగుతున్నారు. ఆ మట్టిలోంచి, నీళ్లల్లోంచి ఉద్గమిస్తున్న వాసనలను పీలుస్తున్నారు. అంటే, పంచేంద్రియాలూ తర్పితమవుతున్నాయన్నమాట. ఈ అనుభవమంతా ఏకత్రితమయి వారి మనస్సుల్ని సమ్ముగ్ధపరుస్తున్నది. ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తున్నది. అందుకనే వాళ్లు – గంజి మడతల తలపాగ కావికుచ్చు సోకు కుఱ్ఱవాళ్లు బొటనవ్రేళ్లమీద నిలిచి ఆమె తీరులను చూసారు. ఆమె పాటయూపు విన్నారు. కవి కూడా తత్కాలంలో ఆ గోపబాలకుల్లో, ఆ సోకు కుఱ్ఱవాళ్లల్లో ఒకడయిపోయినాడు.
అచ్చంగా దేశ్యమయి సాగిన రెండవ పద్యంలో కిన్నెరసాని పాడుతున్న పాట తేనెపాటగా, చిన్నిపాటగా, కొమరుపాటగా, వెలుగుపాటగా ప్రక్కపొలాల నేపథ్యంలో సాగుతున్నట్లుగా భావించటం, ఆ తరువాతి పద్యాల్లోనూ పాట, లేదా గీతి ప్రస్తావన గమనిస్తే కిన్నెరసానిని ఆ జానపద నేపథ్యం గల పాటల్లో చిత్రించాలనే ఆకాంక్ష సత్యనారాయణగారి అంతరాంతరాల్లో మెసలుతున్నట్టు స్ఫురిస్తుంది. ఆమెను కావ్యనాయిక చేయాలనుకున్నట్టు కన్పిస్తుంది. అందుకే ఆయనకు ఆమె పటుగీతావేశ నిమ్మిలితాక్షి; ఆమె నిష్యందిత గీతికా మధురస క్షీబ; ఆమె మోహనాలాప సంస్థాని; అంతేకాదు; ఆమె ఆవేశపూరిత గీతికాలాప మధుఝరీ పృషత్సుఖ రసజ్ఞ శ్రేణులను పరిపాలిస్తున్నది. కిన్నెరసానిని గూర్చి భావించబడిన ఈ అంశాలన్నీ ఆ ఆవిర్భవించబోయే పాటలలో పరవళ్లుగా సాగే అంశాలకు గూడా స్ఫూర్తి. ఆ శివమూర్తి అచ్చంగా తెలుగుదనమై వెల్లివిరుస్తుంది. తెలుగునాడును మూడువైపులనుంచి మూడు భాషలు ఒత్తుకొంటుండగా, ఇది చాలనట్టు తెలంగాణాపై ఉరుదు, తదితరాంధ్ర ప్రాంతాలపై ఇంగ్లీషు రుద్దబడినాయి. ఇవి విపరీతంగా మత్తెక్కిస్తున్నాయి. తెలుగు సాహిత్యరంగంమీద ఖదం తొక్కుతున్నాయి. అయితే, ఈ అన్నింటి మోహాలను చీల్చుకుంటూ కిన్నెరసాని తన అందాల తెలుగు తేనెపాటలను మనఃపర్వంగా వినిపిస్తున్నది. ఆమె జానపదురాలు గదా మరి! నాగరకులను చుట్టుముట్టిన, కమ్ముకొన్న స్వార్థమోహాలు ఆమెనంటలేదు. ఆమె దీర్ఘయుష్కురాలు. అవును, ‘కిన్నెరసాని పాటలు’ ద్వారా తెలుగు సాహిత్యంలో, తద్వారా తెలుగువారి హృదయాల్లో ఆమె దీర్ఘాయుష్కురాలు.
ఈ పద్యాలు కిన్నెరసాని పాటలకు పూర్వం రచింపబడినవి కాగా, తరువాత మరి పది గీతపద్యాలు రచింపబడ్డాయి. అవి:
వనములను దాటి ‘వెన్నెల బయలు’ దాటి
తోగులను దాటి దుర్గమాద్రులను దాటి
పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు
‘రాళ్ళ వాగు’ దాటి పథాంతరములు దాటి
అచట కిన్నెరసాని – నా యాత్మయందు
నిప్పటికి దాని సంగీతమే నదించు
ముక్త రోథోచ్ఛ సైకతంబుల పసిండి
చాయలను ముగ్ధవనలక్ష్మి చాదుకొనియె
ఆ భయంకరాటవుల మధ్యంబునందు
ఆ మహావ్యాఘ్ర పాద చిహ్నములయందు
ఆ కుటిల మార్గముల యందు నమృత శాంత
మైన గీతిక కిన్నెరసాని మ్రోయు
ఉరక రమ్మందు, నివ్వెరవోయి నీవు
పులులు వచ్చునుబో నీరమును గ్రహింప
ఎగువ పర్వతాగ్రముల వర్షించి ఝరిణి
అగును లెమ్ము జలప్రళయమ్ము; పొమ్ము.
అసువులీ దేహమున నున్నంత వరకు
నేను విడలేను కిన్నెరసాని వాగు
నా మనస్సును లాగుకొన్నదది లోక
దివ్యమోహనముగ బాడి తెనుగుపాట.
ఓయి రసహీనుడా! కాలువాయిది? సరి,
నిడివిగా ద్రవ్వెనేమి దీని నెవడేవి?
తెల్లత్రాచు చకచ్ఛక దీప్తి పొలుచు –
మేన చనునట్లు కిన్నెరసాని వాగు.
రెండువైపుల వ్యాఘ్ర దరీవృతమ్మ
యయిన యడవిని జూపి భయమ్ము పెట్టె;
దగును, మృత్యువును జయించినపుడె కాని
యమృత కలశమ్ము నీ చేతి కందబోదు.
ఏమి; నేనింతగా వచియించుచుండ
నాననంబున నది మందహాస ముద్ర.
అవునులే; నిక్కువమ్ము, నీ కది తెలియదు,
ఎంత సంస్కారముండిన నెరుగ వలయు?
ఇతర దేశమ్ములను గ్రహించు నదుల
జూచి, కిన్నెర నట్లుగా జూడ నలతు;
తెనుగు వంపు, తెనుంగు మెత్తన, తెనుంగు
ప్రతిభ కిన్నెరసానిలో ప్రతిఫలించు.
చాలునింక ననాంధ్ర సంస్కార రహిత
బుద్ధి కిన్నెరసానిపై పోవనిమ్ము
ఆంధ్రనది గౌతమీ ప్రవాహంబునకును
నిత్యజీవన దాత్రి కిన్నెరలసాని.
ఈ పద్యాల్లో మొదటి ఒకటిన్నర పద్యం ‘కిన్నెరసాని పాటలు’ కావ్యం మొదట ఉన్న ‘కల్పన’ కు చివర కన్పిస్తుంది. అదట్లా ఉంచి; ఈ పద్యాల తీరుచూస్తే తన కవితా విధానాన్ని గూర్చి ఆనాళ్లలో అవహేళనగా మాట్లాడే వాళ్ల నెవెళ్లనో ఉద్దేశించినట్లుగా కన్పిస్తుంది. “తన కవితాశైలియొక్క శిల్పప్రాధాన్యాన్ని వివరిస్తూ చెప్పిన పద్యాలివి. కాలువయాయిది? ఎవడైన నిడివిగా త్రవ్వేనా దీని? అని అందు ప్రశ్నించాడు. కవితాశైలి ప్రసన్నంగా కమ్మచ్చు తీర్చినట్లుండాలనే వారికి ఆ పద్యాల్లో సమాధానం చెప్పారు సత్యనారాయణ గార”ని విశ్వనాథ వెంకటేశ్వర్లుగారన్నారు. (‘నేనూ – మా అన్నగారు’ – విమర్శిని -2. జనవరి 1977, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు) వీటిలో నాలుగో పద్యాన్ని చూస్తే ఆయన రచనా శిల్పాన్ని ‘విమర్శిం’చేవారి తీరు వ్యక్తమవుతుంది. ఆ రోజుల్లోనే – అంటే కిన్నెరసాని పాటలు రచించిన తరువాతినాళ్లల్లోనే (1927) సత్యనారాయణగారు ‘శ్రీ హర్షుడు’ అనే ఒక ఖండిక రచించారు. అందులో – తనను గురించి లోకం సామాన్య ధోరణిలో రకరకాలుగా నిందా, నిరసన తీరులో మాట్లాడుతూ ఉంటే, తన కవితా శక్తియొక్క ఔన్నత్యాన్నీ ‘లోకం’ గుర్తించటం లేదన్న తన వేదనను శ్రీహర్ష భట్ట సుకవి నెపంగా సత్యనారాయణగారు సరస్వతీదేవితో చెప్పినప్పుడు ఆ సరస్వతి ఆయనతో ఈ విధంగా అంటుంది:
నీ కావ్యమ్ముల శబ్దగౌరవము తన్నిర్ణీత మర్దమ్ము వే
ళా కోళమ్ములు గావు, త్వత్కృత రసాలంకార శయ్యాదులున్
నాకుం గేళి విహార భూములు; చల న్మందార రక్తాంబుజా
శోకానేక మరందముల్ వలచు నీ సూక్త్యర్థముల్, సత్కవీ!
చికిలి మెరుంగు సన్న నగిషీపని బంగరుసేత మెచ్చలే,
రకలుషమౌ వనాంతర మహాఝరిణీ పరివేగ మోర్వలే,
రకృత పరిశ్రముల్ శ్రమగతాలస బుద్ధులు వారి మెచ్చుకో
లోక పనిపెట్టుకొంటి, నవు, లోకము నిన్నిక మెచ్చులే, కవీ!
(‘భ్రష్టయోగి’ ఖండకావ్య సంపుటి విశ్వనాథ సత్యనారాయణ, విజయవాడ 1970)
కిన్నెరసానికి సంబంధించిన గీత పద్యాల్లో వ్యక్తమయ్యే వివిధాంశాలకూ ఈ పద్యాల్లోని చాలా అంశాలకూ సాజాత్యం కన్పిస్తూనే ఉన్నది. ఆ గీతపద్యాలలోని కిన్నెరసాని సత్యనారాయణగారి అనంతముఖ కవితా రచనా శిల్ప విన్యాసాలలో ఒక రీతికి ప్రతీక. కాగా, ‘కిన్నెరసాని పాటలు’ కావ్యాన్ని అనుశీలించటంలొ స్పష్టపరుచుకోవలసిన అంశాలు ప్రస్తుతానికి మూడు. ఒకటి: దృశ్య ప్రపంచంలో కిన్నెరసాని ప్రకృతిలోని ఒక వస్తువు – ప్రవహించే ఒకానొక నీటి జాలు; రెండు: భావనా ప్రపంచంలో ఒక స్త్రీమూర్తి – ఉద్విగ్న ప్రకృతి గల ఒకానొక అందాల యువతి; మూడు: కావ్య ప్రపంచంలో ఒక శైలికి – చికిలి మెరంగు సన్న నగిషీ పని బంగరసేతకు ప్రతీక. ఈ మూడింటి సమన్విత సమష్టి ‘కిన్నెరసాని పాటల’కు భూమిక.
కిన్నెరసాని ‘పాటలు’ అనగానే దేనికది విడివిడిగా – ముక్తకాలుగా ఉన్న ఒక పాటల సంకలనం అని అనుమానించటానికి వీలున్నది. అంతకు ముందు తెలుగు సాహిత్యంలో వెలువడిన వేరువేరు సంకలనాల స్వరూపం ఈ విధమయిన అనుమానానికి కారణం. వల్లూరి జగన్నాధరావుగారి కోడి పాటలు, గొల్లపాటలు, నండూరి సుబ్బారావుగారి యెంకి పాటలు, బసవరాజు అప్పారావుగారి ‘గీతాలు’ మొదలయినవాటిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. అంతేకాదు, భావకవితా విధానం వ్యాప్తిలో ఉన్న ఆ రోజుల్లోని ఏ కవితా సంకలనాన్నయినా ఉదాహరించుకోవచ్చు. గిరికుమారుని ప్రేమగీతాలు, కృష్ణపక్షం, దీపావళి మొదలయినవన్నీ ఆ కోవలోవే. అయితే, కిన్నెరసాని పాటలు వాటన్నిటికన్నా భిన్నమయిందీ, విలక్షణమయింది కూడా. ఇది సత్యనారాయణగారే భావ కవిత్వాన్నిగూర్చి చెబుతూ ఒకచోట “- కవియొక్క అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్ని గూఢతాపము, ఒక చిన్న కావ్యములో ఊదబడిన” (లిరికల్ పొయెట్రీ, భారతి, అక్టో. 1939) తరహాకు చెందింది కాదు. ఆద్యంతం కథావస్తుపరమయిన స్పష్టమయిన అనుస్యూతిగల అఖండ కావ్యమిది. ఒక నిర్దిష్ట ప్రయోజనాభిముఖంగా, ఆది మధ్యాంత సమన్వయంతో, కథావస్తుపరమయిన ఉద్దీప్తితో నిర్వహించబడిన ‘కావ్యం’ కిన్నెరసాని పాటలు.
ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య