Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఖాళీ కుర్చీ..!!

[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘ఖాళీ కుర్చీ..!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ముప్పై ఏళ్ల నాటి సంగతి. వనజ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ.లో చేరింది. అప్పటివరకు స్కూలు, కాలేజీ చదువు మొత్తం ఆడపిల్లల మధ్యే. ఎం.ఏ.లో కో-ఎడ్యుకేషన్ అంటే భయంగా ఉండేది. ఎవరు పలకరించినా మాట్లాడాలంటే మొహమాటం. మొదటి రోజు క్లాసులో ప్రొఫెసర్ అందరినీ వాళ్ళ పరిచయం చెప్పమన్నారు. ఒక్కొక్కరే నిల్చుని తమ గురించి చెపుతున్నారు. వనజ కూడా ఎలాగో అయిందనిపించింది.

ముప్పైకి పైగా ఉన్న విద్యార్థుల్లో పది మంది దాకా అమ్మాయిలున్నారు. వాళ్లలో ఇద్దరే డే స్కాలర్లు. ఇంటినుంచి వచ్చే వాళ్ళు. మిగతా అంతా హాస్టలే. ఆ ఇంకో అమ్మాయి నిల్చుని తన పరిచయం చెపుతోంది. తన పేరు కమల అని, తీర్ధకట్ట వీధిలో ఉంటున్నట్లు చెప్పింది. ‘అంటే మా ఇంటికి దగ్గరే’ అనుకుంది వనజ. ఆ అమ్మాయి నల్ల కళ్లద్దాలు పెట్టుకుంది. వనజ పక్కన కూర్చున్న సరోజ ‘తను బ్లైండ్’ అంది నెమ్మదిగా వనజ చెవిలో. వనజకు ఆశ్చర్యం వేసింది. ఎలా చదువుతుంది? ఎలా పరీక్షలు రాస్తుంది? అనుకుంది. తనెప్పుడు కమలలాంటి వాళ్ళను చూడలేదు.

వనజ డిగ్రీ వరకు పల్లెటూళ్ళో వాళ్ళ పిన్ని దగ్గర ఉండి చదువుకుంది. తిరుపతిలో ఉన్న అమ్మనాన్నల దగ్గరకు ఎం.ఏ. చదవటానికి వచ్చింది.

ఆ రోజు క్లాసులయ్యాక బైటకి వస్తుంటే, కమల, వాళ్ళ నాన్నగారు కనిపించారు. కమల, వనజ గురించి చెప్పినట్లుంది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు.

“అమ్మా! మీరు రాములవారి గుడి దగ్గర ఉంటారుట కదా!” అన్నారు ఆయన.

“అవును అంకుల్, మీరు తీర్ధకట్ట వీధిలో ఉంటారా?” అంది వనజ.

“అవునమ్మా”, అన్నారు.

హాయ్ అంది కమల. వనజ కూడా హాయ్ చెప్పింది.

కమల వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నారుట. వనజా వాళ్ళ కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు.

రోజూ బస్సులో తీసుకుని వచ్చి కమలని వాళ్ళ నాన్నగారు క్లాసులో వదిలి వెళ్లేవారు. మళ్ళీ క్లాసులు అయ్యే టైం కి వచ్చేవారు.

ఒక పదిహేను రోజుల తర్వాత క్లాసులో ప్రొఫెసర్లు రెండు పేపర్లకు నోట్స్ చెప్పారు. వనజ, కమలల పరిచయం ముందుకు సాగలేదు అప్పటివరకు. ఆ రోజు సాయంత్రం కమల, వాళ్ళ నాన్నగారు కలిసి వనజ ఇంటికి వచ్చారు. వనజ అమ్మ, అక్క అందరూ కమలను ఆశ్చర్యంగా చూస్తూనే అది పైకి కన్పించకుండా బాగా మాట్లాడారు.

కమల వాళ్ళ నాన్నగారు వనజ రాసుకున్న నోట్స్ రాసుకుని ఇస్తానని తీసుకువెళ్లారు. వనజని తమ ఇంటికి రమ్మన్నారు. వనజ ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళింది.

కమలకు తల్లి తన చిన్నప్పుడే చనిపోయింది. అప్పటినుండి వాళ్ళ నాన్నగారే తల్లి తండ్రి అయి పెంచుకుంటూ వచ్చారు. కమలకు ప్రతిరోజూ జరిగే పాఠాలు చదివి వినిపిస్తారు. వనజ దగ్గర నోట్స్ తీసుకుని రాస్తారు. వంట చేస్తారు. కమలే ఆయన ప్రపంచం! కమలకు సంగీతం కూడా నేర్పించారు.

తిరుపతిలో ఎక్కడ సంగీత కచేరీలు జరిగినా తీసుకువెళ్లేవారు.

నెమ్మదిగా వనజ, కమలల స్నేహం బలపడటం మొదలయ్యాక, యూనివర్సిటీ నుంచి ఇద్దరూ కలిసి వచ్చేసేవారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నగారే తీసుకువెళ్లేవారు.

కమలా వాళ్ళింట్లో ఒక పడక్కుర్చీ ఉండేది. ఎరుపు, ఆకుపచ్చ చారల క్లాత్‌తో ఆకర్షణీయంగా ఉండేది. వనజ ఒకరోజు “ఈ కుర్చీ చాలా బాగుంది” అంటే, కమల, “అది నాన్నకు చాలా ఇష్టమైన కుర్చీ. కావాలని కొనుక్కున్నారు. ఇంట్లో ఉన్నపుడు అందులోనే కూర్చుంటారు” అంది. వనజ, కమల వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తను సంగీత సాధన చేసుకుంటున్నప్పుడో, బ్రెయిలిలో రాసుకుంటున్నప్పుడో ఆయన పడక్కుర్చీలో కూర్చుని ఏదైనా చదువుకుంటూ ఉండటం చూసింది. అది ఎప్పుడూ వాల్చే ఉండేది.

వనజకు వాళ్ళ నాన్నతో అంత చనువు లేదు. ఎప్పుడూ ఆయన క్యాంపుల్లో ఉండేవారు. ఇంట్లో ఉన్నా తక్కువ మాట్లాడేవారు. వనజ, మా నాన్న కూడా ఇలా అన్నిచోట్లకు తీసుకువెళ్తే ఎంత బాగుంటుంది!, అనుకునేది.

ఒకసారి కమలకు జ్వరం వచ్చింది. డాక్టరుకు చూపించారు. మందులు వాడారు. తగ్గటానికి నాలుగు రోజులు పట్టింది. వాళ్ళ నాన్నగారు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయారు. వనజకు ఇదంతా అద్భుతంగా అనిపించేది. బంధువులంతా ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆ వచ్చే ఆవిడ కమలను బాగా చూసుకోదేమోనని చేసుకోనన్నారుట.

పరీక్షల సమయంలో రాత్రి 12 దాకా కమల నాన్నగారు చదివి వినిపించేవారు. పరీక్షలు నిజంగా ఆయనకే! మంచి స్క్రైబర్ దొరకటం కూడా కమలకు వరమయింది.

కమల, వనజ ఇద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు.

ఇద్దరూ పీహెచ్. డి. చేసారు. నిజంగా డాక్టరేట్ ఆయనకు ఇవ్వవలసిందే! కమలను తీసుకుని ఫీల్డ్ వర్క్‌కి వెళ్లారు. లైబ్రరీలకు వెళ్లి రాసేవారు. గైడ్ రమ్మనప్పుడు వెళ్లేవారు. తన ఆఫీస్‌కి సెలవలు బాగా పెట్టేవారు.

తర్వాత కమల బి.ఇడి. చేసింది. హైదరాబాద్ నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న పల్లెటూళ్ళో తనకి టీచర్ ఉద్యోగం వచ్చింది. చాలా బాధతో కమల, వనజ విడిపోయారు. కమల వాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ ఇల్లు కొనుక్కున్నారు.

రోజూ కమలని వాళ్ళ నాన్నగారు బస్సులో స్కూల్‌కి తీసుకువెళ్లి అక్కడే ఉండి సాయంత్రం తీసుకువచ్చేవారు. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు.

వనజ పెళ్లయి హైదరాబాద్ చేరుకుంది. ఉండేది దూరమైనా తరచూ కలిసేవారు.

రోజంతా రేకుల బళ్ళో కూర్చుని, ఇంటికి బస్సులో వచ్చేటప్పటికి కమల నాన్నగారు అలిసిపోయేవారు. కమల వనజతో ఎప్పుడు మాట్లాడినా, “నాన్న స్కూల్‌కి తీసుకెళ్లలేకపోతున్నారు. నా వల్ల ఆయనకు ఒక్క సంతోషమైనా లేదు. ఎవరైనా తీసుకెళ్ళేవాళ్ళు దొరికితే బాగుండును”, అంటోంది. రోజంతా ఆ స్కూల్లో తనతో ఉండిపోవాలంటే ఎవరు వస్తారు? ప్రయత్నించినా దొరకలేదు. పొద్దున్న ఏడింటికి స్కూలుకి బయలుదేరతారు. ఆ లోపలే వంట, టిఫిన్ అన్నీ చేసుకుని డబ్బాల్లో కట్టుకుని వెళ్ళాలి. రాత్రి వచ్చేటప్పటికి ఎనిమిది అయిపోయేది. వీళ్ళ సమయాలు కుదరక పనమ్మాయి కూడా లేదు. అసలు వాళ్ళ నాన్న లేకపోతే కమల పరిస్థితి ఏమిటి? అని వనజ అనుకుంటూ ఉండేది. ఆయన పెళ్లి ప్రయత్నాలు చేసినా కమల తనకిష్టం లేదని చెప్పేసింది.

కళ్ళు లేకపోవటం కమలకు పెద్ద దురదృష్టం అయితే, అటువంటి కంటికి రెప్పలా కాపాడుకునే, తన కళ్ళు కూతురి కళ్లుగా చేసి లోకాన్ని చూపించి, లోకజ్ఞానాన్ని, ఉన్నత విద్యను ఇచ్చిన తండ్రి ఉండటం కమల అదృష్టం అంటుంది వనజ, భర్తతో.

వనజ భర్తకి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ అయింది. కమల దిగులు అంతా ఇంతా కాదు. వాళ్ళ నాన్నగారు నీరసంగా వుంటున్నారు. బలవంతాన కమలను స్కూలుకు తీసుకువెళుతున్నారు. ఇంట్లో ఉంటే పడక్కుర్చీలో పడుకునే వుంటున్నారు. బహుశా, తన తర్వాత కూతురు పరిస్థితి ఏమిటి అనే మానసిక దిగులు, వయసు రీత్యా తగ్గిన శరీర బలం కావచ్చు.

“వనజా, నువ్వు కూడా లేకపోతే ఎలా?” అంటూ ఏడ్చేసింది. వనజ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే తండ్రీ కూతుళ్ళ దగ్గర సెలవు తీసుకుంది. ఢిల్లీ వెళ్ళాక ఫోన్ చేస్తూనే ఉంది.

ఒకరోజు గుండె పగిలే వార్త! కమల ఫోన్ చేసింది. హార్ట్ ఎటాక్‌తో వాళ్ళ నాన్న పోయారని. వనజకు కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేసింది.

కమల వాళ్ళింట్లో వాళ్ళ పిన్ని, బాబాయి ఉన్నారు. కమల దుఖాన్ని ఆపటం వనజ వల్ల కాలేదు. వాళ్ళ పిన్ని “మాతో రమ్మంటే రానంటుంది. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటానికి మాకు వీలవదు. ఇంట్లో బాధ్యతలు. నువ్వు చెప్పమ్మా కాస్త,” అంది. వనజ, కమలతో “వెళ్లి పది రోజులుండిరా. ఇప్పుడు కాదంటే తర్వాత ఎవరూ రారు”, అని పంపించింది.

పదిరోజులుండి కమల ఇంటికి వచ్చేసింది. వనజతో ఢిల్లీ వెళ్లి అక్కడా పది రోజులుంది. వనజ వచ్చి దింపి ఇల్లంతా సర్ది జాగ్రత్తలు చెప్పి, ఇరుగుపొరుగులను కాస్త చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళింది.

కమల పరిస్థితి చూసి హైదరాబాద్‌లో స్కూలుకి ట్రాన్స్‌ఫర్ చేసారు. ఆటోలో రోజూ వెళ్ళివస్తుంది. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు గుండెలవిసేలా ఏడ్చిన కమల అతి స్వల్పకాలం లోనే, ఆయన భౌతికంగా లేరన్న దుఃఖం నుండి బయటపడి, తన ఉద్యోగాన్ని, జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో సాగించటం చాలా ఆశ్చర్యం అనిపించింది వనజకు.

కమల వాళ్ళ నాన్నగారు కూర్చునే, ఆయన కిష్టమైన కుర్చీని ఎప్పుడూ వాల్చే ఉంచుతుంది. దాంట్లో ఎవరూ కూర్చోరు. అది అందరి దృష్టిలో ఖాళీగా ఉన్నట్లు.

“కాని నాన్న అందులో కూర్చుని వున్నట్లే ఉంటుంది నాకు”, అంటుంది. “దాని వెనక ఉన్న గోడపై నిలువెత్తు ఫోటోలో నుంచి నాన్న నన్ను చూస్తూ నాతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నా దినచర్య నాన్న మాటలతో ప్రారంభమై, రోజంతా సాగి, రోజు కూడా ఆయన మాటలతోనే ముగుస్తుంది. ఇక ఆలోచనా తీరుమారటం నాన్న వల్లనే.

ఆయన మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నప్పుడు ఆయన లేరన్న భావన నాకెలా వస్తుంది.. వనజా! రానే రాదు.!

కాపీ ఇదిగో..రెడీ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దాం.. యూనివర్సిటీకి వెళ్ళాలి.. లేదా గుడికి వెళదాం.. తలనొప్పిగా ఉందా, అమృతాంజనం రాయనా.. జ్వరం వచ్చినప్పుడు తడి గుడ్డ ఆరగారగా వేసే నాన్న.. కాళ్ళు పట్టే నాన్న..  పిరియడ్స్ వచ్చినప్పుడు ఆ పాడ్స్‌ను తీసుకువెళ్ళిన నాన్న.. వంట గదిలోకి ఎప్పుడు అడుగుపెట్టని ఆయన వంట నేర్చుకుని అద్భుతంగా చేసి.. అమ్మలోటును నాకెన్నడూ కలుగనీయని నాన్న.. తన నిద్రాహారాలు సుఖం ఎప్పుడైనా ఆలోచించారా..! అలా నా ఆలోచన, నా మనసు, నా చూపు అన్నీ ఇపుడు ఆయనే! ..వనజా!” అంటుంది ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కమల.

కమల మాటల్లో గాద్గద్యం ధ్వనించలేదు వనజకు. తన తండ్రి మరణించలేదు తనతోనే ఉన్నారన్న ఆత్మవిశ్వాసం, ఆ తండ్రి ప్రేమ ఇచ్చిన ధైర్యం కమల మాటల్లో కన్పించి, ఇంక కమల గురించి దిగులు పడవలసిన పని లేదని, తను ముందు జీవితాన్ని సునాయాసంగా గడపగలదని అర్థమై, వనజకు తృప్తిగా, ఊరటగా అనిపించింది.

Exit mobile version