[బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ 2025 ఆగస్ట్ 4, 5 తారీఖులలో ‘ఆచార్య కె. ఆశాజ్యోతి సాహిత్యం – సమాలోచనం’ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులలో ఆత్మీయ అతిథిగా ‘కీలకాంశాల పట్టు, పొత్తు తెలిసిన కీలకోపన్యాసాల ఆశాజ్యోతి’ శీర్షికన విశ్వర్షి డా. వాసిలి వసంతకుమార్ చేసిన ప్రసంగపు పాఠాన్ని అందిస్తున్నాము.]
నా అవగాహనలో కీలకోపన్యాసం అంటే – విషయ ప్రాధాన్యంగా ఉంటూ – ఆ విషయ వివరణలో, విశ్లేషణలో కీలకోపన్యాసకుల అభినివేశం, అనుభవం కలగలిసి – ఆ విషయంలోని విభిన్న కోణాలను, దాని అనుపానులను – వెలుగుపరచటం. ఆ విషయంపై అసమాన ప్రామాణికతను నెలకొల్పటం. అయితే సాధికారతను సంతరించిపెట్టే దిశలో ఉపన్యాసకులు ఏ మలుపులోనూ ఏకపక్షంగా మొగ్గుచూపకూడదు. సమ దృక్పథం, సరి తూకం సాధ్యమైనవారే సిసలైన కీలకోపన్యాసం చేయగలుగుతారు.. సదస్సు లక్ష్యాలను, ప్రయోజనాలను సిద్ధింపచేయగలుగుతారు.
కీలకోపన్యాసం ఆకర్షణీయంగాను, అద్భుతంగాను, ప్రతిభాప్రాభవంతోను, ప్రభావవంతంగాను, ఉపన్యాసకర్త దృష్టికోణాలను, కీలకాంశ దృక్పథాలను, ఆ అంశ సృజనశీలి అభినివేశాన్ని ఆవిష్కరించే విధంగాను ఉండాలి. ఏ విధంగానూ నేల విడిచి సాము చేయకూడదు. నిజానికి, కత్తి మీద సాము వంటిది కీలక ప్రసంగం. ఒకవిధంగా, ప్రేక్షకుల ఆలోచనలు మరోవైపు మరలకుండా వర్తమాన విషయంపైనే మగ్నమై ఉండేలా ప్రసంగించటం అనివార్యం. శ్రోతలు, పాఠకులు ఆశించే కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కీలకోపన్యాసకులు తమ సమాచార సందర్భంలోనే పసిగట్టి వాటిని సందర్భానుసారం ప్రసంగ సమయంలో ఆవిష్కరించటం జరగాలి. అలాగే తాము ఉపన్యసిస్తున్న విషయంపై శ్రోతల దృష్టికి మరో కొత్త దృష్టిని జతచేయగలగాలి. పాఠకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు తెలిసిన విషయాలనే వల్లెవేయకుండా కొత్త కొత్త విషయాలను వెలికితీసి చూపాలి.
ఒక విధంగా విశ్వవిద్యాలయాలలోనుండి, పరిశోధనా సంస్థలలోనుండి వెలుగుచూసే కీలకోపన్యాసాలు సరికొత్త పరిశోధనలకు తెర తీసేలా ఉండాలి. అంటే, కీలకోపన్యాసకర్తకు ఎంతో లోచూపు, విస్తృత అవగాహన ఉంటే తప్ప ఇటువంటి పరిశోధనా పాటవం కీలకోపన్యాసంలో చోటు చేసుకోదు.
అసలు, కీలకోపన్యాసకులు అంటే – సదరు విషయంపై సమగ్ర అవగాహన, అనుశీలన, అభినివేశం ఉన్నవారు అని మాత్రమే కాక అనుభవజ్ఞులు, పరిశోధకులు, ప్రామాణికులు అని కూడా. వీరికి తులనాత్మక అధ్యయనం తప్పనిసరి. సమకాలీన సాహిత్య ధోరణులు, సమకాలీన సామాజిక వర్తనలు తెలిసి ఉండాలి. అనేక సిద్ధాంతాల, అనేకానేక ఆవిష్కరణల పరిజ్ఞానం ఉండాలి. విషయ ప్రామాణికతకు ఆధారాలను చూపే సందర్భంలో ఎంతో అభిజ్ఞతతో ఉటంకింపులు సాధ్యం కావాలి. పండితుల, ప్రామాణికుల అభిప్రాయాలను, ఆలోచనలను మనముందుంచుతూనే తమ ఆలోచనలను, తమ అభిప్రాయాలను తమవి అంటూ స్పష్టంగా చెపుతూ కీలకోపన్యాసం చేయగలగాలి. మొత్తానికి సదస్సు లక్ష్యాలకు, ప్రయోజనాలకు అనుగుణంగా ఉపన్యసిస్తూ అదే రంగంలో అవకాశమున్న మరికొన్నింటిని సూచించగలగటమూ, అవసరానికి మార్గనిర్దేశనం చేయగలగటమూ సాధ్యం కావాలి.
నేను చేసిన కీలకోపన్యాసాల ప్రస్థానంలో నేను అనుసరించిన కొన్ని అంశాలు, ఇంకొన్ని లక్షణాలు, మరికొన్ని అనుసరణలు ఇవి. నేను విన్న, చదివిన కీలకోపన్యాసాల ద్వారా అవగాహన చేసుకున్న ప్రామాణికతలు ఇంకొన్ని. మొత్తానికి కీలకోపన్యాసాల విషయంలో వలసిన కొన్ని కీలక అంశాల ప్రస్తావన ఇది.
***
కీలకోపన్యాసకురాలిగా ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి కీలక మూర్తిమత్వాన్ని మీముందు నిలపాలనుకున్నప్పుడు నాలో సుడులు తిరిగిన ఆలోచనా లయ ఇది. ఆశాజ్యోతి కీలకోపన్యాసాలు కొన్ని చదివాను.. ఇంకొన్ని విన్నాను.. మరికొన్ని ప్రత్యక్షంగా చూస్తూ, వింటూ, తలకెక్కించుకుంటూ హృదయస్థం చేసుకున్నాను. ఈ మూడిరటి సమ్మేళనంతో కీలకోపన్యాసకురాలిగా ఆశాజ్యోతి గరిమను మీముందుంచే ప్రయత్నం చేస్తాను.
కీలకోపన్యాసకురాలిగా ఆశాజ్యోతిలో నాకు నచ్చిన – మొదటి అంశం – ఇవి నా అభిప్రాయాలు, ఇవి ఇతరుల అభిప్రాయాలు, ఇవి సాహిత్య సిద్ధాంతకర్తల అభిప్రాయాలు, ఇవి విమర్శకుల అభిప్రాయాలు, ఇవి పండితుల అభిప్రాయాలు, ఇవి పరిశోధకుల అభిప్రాయాలు – అంటూ విడదీసి చెప్పటం. ఎక్కడా దాపరికం ఉండదు, ఇంకెక్కడా మసి పూయటం ఉండదు, మరెక్కడా మొగ్గుచూపటం ఉండదు. అంటే పక్షపాత వైఖరి, పాక్షిక దృష్టి లేని సంపూర్ణ కీలకోపన్యాసకురాలు, విమర్శకురాలు, పరిశోధకురాలు, ఆచార్యులు డా. కొలకలూరి ఆశాజ్యోతి.
రెండవ అంశం – సంయమనంతో, సమయపాలనతో సమగ్ర సమాచార సేకరణ చేయటం. ఎంతటి వ్యయప్రయాసలకు లోనైనా – కష్టంగా కాక ఇష్టంగా ఎంత సమయాన్నయినా వెచ్చించి – కీలకాంశ సారాన్ని అక్షరబద్ధం చేయటం. ఆమె చేసే కీలకోపన్యాసం ఆశాజ్యోతి అస్తిత్వాన్ని మనముందు నిలిపితే – ఆ అస్తిత్వం ప్రకటితమయ్యే ప్రస్థానంలో ఆమె పడ్డ సంఘర్షణ – ఆ అస్తిత్వ పూర్వస్థితి అయిన స్తత్వంగా మన మేధస్సుకు అందుతుంది. ఇలా, పరిశోధకులకు ఉండవలసిన సమగ్ర వ్యక్తిత్వాన్ని ఆశాజ్యోతిలో చూడగలం.
మూడవ అంశం – ఎంతటి పరిశోధకులకు అయినా, ఎంతటి మేధావులకు అయినా, ఎంతటి విద్యావంతులకు అయినా ప్రతీ అంశమూ, ప్రతీ విషయమూ, ప్రతీ సందర్భమూ కరతలామలకం అయివుండదు. ఇది నా పరిథిలో లేనిది, నా అవగాహనలో లేనిది, నాకు అందుబాటులో లేనిది, నా చదువుసంధ్యలలో తారసపడనిది అన్న ఎరుక, ప్రకటన కీలకోపన్యాసకుల స్థాయిని పెంచుతుంది. వారి ఎదుగుదలకు పతాక సన్నివేశంలా నిలుస్తుంది. అలా కీలకోపన్యాసకురాలిగా ఆశాజ్యోతి పరిశ్రమ ఉత్కృష్టమైంది. ఇలా, ఆశాజ్యోతిది నోబెల్ లిటరరీ పర్సనాలిటీ, అంటే ఆమెది సాహితీ వ్యక్తిమత్వం.
నాల్గవ అంశం – ఒక సాహిత్యరచననైనా, ఒక సాహిత్యకర్తనైనా తన కీలకోపన్యాసంతో ప్రత్యక్షర, ప్రత్యంగ పరిశోధనతో, పరిశీలనతో వివరిస్తూ, విశ్లేషిస్తూ రచన వైవిధ్యాన్ని, రచయిత విభిన్నతను విస్తరిస్తూ సాహిత్య చరిత్రలో స్థాననిర్దేశం చేయటం, ఈనిర్దేశనానికి కావలసిన అంతటి సామగ్రిని మనముందు కుప్పపోయటం – ఆశాజ్యోతి చాలా సమర్థవంతంగా చేయగలరు. కారణం, నాలుగు దశాబ్దాలుగా బోధనా రంగంలోనూ, పరిశోధనా రంగంలోనూ తలమునకలై ఉండటం.
అయిదవ అంశం – ఆశాజ్యోతి తమ కీలకోపన్యాసాన్ని మన మెదడులోకి మాత్రమే ఇంకించరు. వారు వెలిబుచ్చే అభిప్రాయాలు మన మనస్సులను తట్టి లేపుతాయి. వారు మన ముందు పరిచే సంఘటనలు హృదయాలను తడి చేస్తాయి. వారివే అయిన కొన్ని వ్యక్తిగతమైన ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తీకరణలు కీలకాంశ సంబంధితాలే అయినా మనల్ని భావోద్విగ్నుల్ని చేస్తాయి. ఈ మలుపులో ఆశాజ్యోతి అనుభవమూ, అభినివేశమూ మనల్ని సంపూర్ణంగా లోబరచుకుంటుంది.
ఆరవ అంశం – ఆశాజ్యోతి కీలకోపన్యాస పత్ర రచన ఒక ఎత్తుతో సాగితే – ప్రసంగించే సమయంలో ఆ పత్రం విస్తృతం అవుతుంటుంది. విషయ వివరణలో ఉటంకింపులు ఎక్కువవుతుంటాయి. వాటి పరిథీ పెరుగుతుంది.
ఏడవ అంశం – సిద్ధాంతాలను విశ్లేషిస్తున్నప్పుడు వారి వాయిస్ ఎంత గంభీరంగా ఉంటుందో విషయాన్ని శ్రోతలకు, పాఠకులకు చేరవేసే సందర్భంలో అదే వాయిస్ ఎంతో మార్దతను పొదువుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆర్ద్రంగాను అనిపిస్తుంది. ఎంతో కన్విన్సింగ్ గానూ ఉంటుంది.
ఎనిమిదవ అంశం – ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి కీలకోపన్యాసాలలో ప్రామాణికత, సాధికారతలతో పాటు ఆమెదే అయిన ఒక ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. She can influence and impact. కీలకోపన్యాస రచనను ప్రారంభించి నిర్మాణాత్మకంగా రచించుకుంటూ తాము ఎంచుకున్న అంశానికి న్యాయం చేయటమూ, సదస్సు లక్ష్యాన్ని చేరుకోవటమూ మనం గమనించగలం.
తొమ్మిదవ అంశం – శ్రీమతి కొలకలూరిలో ప్రారంభం నుండి ముగించేంతవరకు ఉపన్యాస గతిని ఒకే టెంపోతో క్రమగతిన ఫలప్రాప్తి సిద్ధించేవరకు అక్షరయానం చేయటం మనకు అవగతమవుతుంటుంది.
పదవ అంశం – సాహితీవేత్తగా తన పాత్ర ఎంతవరకో, పరిశోధకురాలిగా తన రంగప్రవేశం ఎంతవరకుండాలో, విమర్శకురాలిగా తన పరిథి ఏమిటో, తన అనుభవం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే కీలకోపన్యాస విషయంలో ముందడుగులు వేసుకుంటూ చరించటం ఆశాజ్యోతికి బహు చక్కగా తెలుసు.
ఆచార్య ఆశాజ్యోతి కీలకోపన్యాసంలో నేను గుర్తించిన మేలిమి పది పట్టులు ఇవి. వారి కీలకోపన్యాసాల విజయకేతన రెపరెపలలో దాగిన రహస్య పొత్తు ఇదే.
***
అసలు, నేను ‘కీలకాంశాల పట్టు, పొత్తు తెలిసిన కీలకోపన్యాసాల ఆశాజ్యోతి’ అన్న నిర్ణయానికి రావటానికి కారణమైన ఆ ఆరు కీలకోపన్యాసాలలో వారు కనబరచిన వారి కౌశలాన్ని కాస్త వీక్షిద్దాం –
తెలుగు సాహిత్యంలో నా ‘నేను’ దీర్ఘ కావ్యం యౌగిక కావ్యంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో ‘తెలుగు సాహిత్యం: తొలి యౌగిక కావ్యం’పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సప్తపథ సమాలోచనా సదస్సులలో ఆశాజ్యోతి ‘ఆధునిక దీర్ఘకావ్యాలు : అద్వితీయ ‘నేను” శీర్షికన కీలకోపన్యాసానికి ఉద్యుక్తమవుతూ –
“అందరికీ పెద్ద ప్రశ్న అయిపోయింది – ‘నేను’ అనగానే- ‘నేను’ నేనేనా? ఈ కవి ఏమి చెప్పాలనుకుంటున్నాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? మాట్లాడుతున్నదంతా మనకు మనసులోకి ఇంకుతోందా? ఇంకుతున్నట్టు అనిపిస్తూ ఇంకకుండాపోతోందా? ఎంతవరకు జీర్ణం చేసుకోగలిగాము? అనేటటువంటి ఆలోచనలలోకి రావటానికి ముందు..” అంటూ సూటిగా కావ్యాన్ని గురించి పుట్టుకొస్తున్న ప్రశ్నలతో ప్రారంభించి సదస్సులోని ప్రతిఒక్కరిని తమవైపు తిప్పుకుంటూ, కీలక అంశం నుండి మరలకుండా చేస్తారు. ఒక డిఫరెంట్ టోన్ లో ఆ ఎత్తుగడ ఉంటుంది. ఆ టోన్ ఎక్కడా మారకుండా, తన మార్క్ ను పోగొట్టుకోకుండా ముగింపు వరకు కొనసాగుతుంది.
దీర్ఘ కావ్యాన్ని గురించి ప్రబలంగా ఉన్న లక్షణాలను ఉటంకిస్తూ –
“నాకు ‘నేను’ అన్న దీర్ఘకావ్యాన్ని గురించి ఆలోచిస్తుంటేబీ నాకు భౌతికంగా లేదా సిద్ధాంతపరంగా ఈ ‘నేను’ ఇజ్రా పౌండ్ చెప్పిన చట్రంలోకి ఇమడలేదేమో అని ఒకింత అనిపించినా, కాదు ఇముడుతోంది అని స్పష్టంగానే అనిపిస్తోంది. ఎందుకు అంటే- ఇంత పెద్దదైనటువంటి భారతదేశపు సమూహాన్ని ఒక తెలుగు కవి.. ఒక వాసిలి ‘నేను’ అని తన గురించి చెప్పుకుంటున్నట్లుగా అనిపిస్తూ.. ఒక్క తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల గురించి కాకుండా.. మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నాడు అని అనిపించి, మరింత లోతుగా వెళ్లేసరికి మన దేశం చుట్టూ పరచుకున్నటువంటి ప్రపంచదేశాలలోని వ్యక్తుల సమూహాలను గురించి కూడా మాట్లాడగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సందర్భాన్ని నేను చూసాను.” అంటూ తానే సాధికారతకు ప్రామాణికమై తమ అక్షరాలను, తమ స్వరాలను మునుముందుకు నడిపిస్తారు.
“ ‘నేను’ అంటూ వాసిలి నిన్నూ, నన్నూ, స్త్రీ పురుషులు అందరినీ.. అంతేకాకుండా పసిపిల్లల్ని, తల్లుల్ని, తల్లిగర్భంలో ఉన్నటువంటి గర్భస్థ పిండాన్నీ, చుట్టుపక్కల ఉన్నటువంటి మన చెట్లనీ, మనతోబాటు పెరుగుతున్న జంతుజాలాన్నీ, అందరినీ ఒక సమూహంగా చేసుకుని .. ఆ సమూహాలిస్తున్నటువంటి ఒక శక్తితో ‘నేను’ అంటూ ప్రతీ మనిషీ నేను, తాను అని అనుకోగలిగేటటువంటి ఒక ఆలోచనా స్థితిలోకి తీసుకెళ్లగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి, కొత్తదైనటువంటి, ప్రయోగశీలమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేయటం చాలా బాగుంది అనిపించింది. ఇటువంటి కావ్యాలు ఇంతకుముందు వచ్చాయి అని అనటానికి నాకైతే ఎక్కడా పెద్ద ఆధారాలు దొరకలేదు .. నేను చదువుకున్నటువంటి నా చదువు వరకు నాకున్నటువంటి ఆలోచనా పరిజ్ఞానం వరకు – విశ్వమానవ దృక్పథంతో రచనలు తెలుగులో వచ్చాయి – అని నేనైతే అనుకోవటం లేదు.” అంటూ తాము ఒక నిర్ణయానికి రాగలగటానికి తమకున్న ఉపబలాలను మన ఎరుకలోకి తీసుకురావటంలో ఏమాత్రం సంశయించరు. పైగా ఒక అజెర్టివ్ వాయిస్ తో వేదిక నుండి వినవస్తారు.
“ ‘నేను’ అని వాసిలి రాసినప్పుడే అతను మనందరినీ తన వ్యక్తులుగా చేసుకుని, తన జాతిగా చేసుకుని, తన సమూహంగా చేసుకుని రాయటంలో ఒక మెట్టు పైన ఉన్నాడు. ఆ మెట్టునుంచి మనందరినీ చూసి తనవాళ్లుగా అనుకుంటున్నాడు, తన వాళ్లని అందుకుంటున్నాడు. ఆ అందుకునే ప్రక్రియలో, ఆ అందుకునే ప్రయత్నంలో హెచ్చుతగ్గులు కానివ్వండి, గ్రాఫ్ లాగా పైకి వెళ్లి ఒక సందర్భం వచ్చినప్పుడు క్రిందికి దిగటం కానివ్వండి, భాష పరంగా కానివ్వండి కొంత వ్యత్యాసం నాకు కనిపించినా రచన మాత్రం ఖచ్చితంగా గొప్పది. ఇటీవలికాలంలో నేను చదివినటువంటి కొత్తదైనటువంటి ఒక రచనగా నేను భావించేటటువంటి పరిస్థితిని తీసుకువచ్చినటువంటి దీర్ఘకావ్యంగా నేను భావిస్తున్నాను.” అంటూ మరో సాక్షిసంతకం అవసరంలేకుండా ‘రచన మాత్రం ఖచ్చితంగా గొప్పది’ అంటూ సాహిత్యసంతకం చేస్తారు ఆచార్య ఆశాజ్యోతి.
“మన చుట్టూ వున్నటువంటి ఇంతటి దుర్మార్గాలు, ఇంతటి మోసాలు.. ప్రతీ మనిషీ సమాజంలో ఈ వ్యవస్థ ఇంత దారుణంగా వుంది, ఈ వ్యవస్థ ఇంత దురాగతాలతో నిండిపోయింది అని అందరూ అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మనకెందుకులే అని మనం వెళ్లిపోతుంటే ‘యోగం’ అన్నటువంటి ఒక స్థితిని వాహికగా చేసుకుని నేనున్నాను అంటూ ‘నేను’ను తీసుకొచ్చినటువంటి వాసిలి నిజంగా ప్రశంసనీయులు అని నాకనిపిస్తూ ఉంది. యోగం ద్వారా ఒక కవి కవిత్వాన్ని వెలువరించటమన్నది ఒక నూతనమైనటువంటి సాహిత్యప్రక్రియగా నేను పరిగణిస్తున్నాను.” అంటూ నా ‘నేను’ కావ్యాన్ని “ఒక నూతనమైనటువంటి సాహిత్యప్రక్రియగా నేను పరిగణిస్తున్నాను” అంటూ విశ్వవిద్యాలయ అధికారపీఠం నుండి ప్రకటించటం ‘నేను’ కావ్యానికి తెలుగు సాహిత్య చరిత్రలో తొలి యౌగిక కావ్యంగా ముద్ర వేయటమే.
“ ‘నేను’ రాసిన వాసిలి విశ్వానికి, ఈ భూలోకానికి.. భౌతిక ప్రపంచానికీ, అధిభౌతిక ప్రపంచానికీ మధ్య కాళిదాసు చెప్పినట్లు ‘దిన క్షపేన మధ్యగతేవ సంధ్య’లా ఉన్నాడనిపించింది. ఎందుకు అంటే ఆ వెలుగును తీసుకుంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి చీకటినీ తీసుకుంటున్నాడు.. ఆ రెంటి కలయికతో ఒక కొత్తదైనటువంటి ఆలోచనాధారను, భావాన్ని, భావసారళ్యాన్ని మనకందజేస్తున్నాడు.” అనీ, “ఒక రూపము.. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, రెండు కళ్లు, ఒక తల, ఒక మెదడు, ఒక ముక్కు, ఒక నోరు ఉన్నటువంటి ఒక మనిషి.. వాసిలి.. నువ్వూ నేనూ ఆలోచించినట్టుగా కాకుండా ఇంకోలా ఆలోచించగలగటం.. ఎంత మథనపడివుంటే ఆ ప్రయత్నం చేసివుంటాడు” అనీ; “అందరం నేనులమే కదా.. మన మనందరమూ నేనులమే కదా.. నీకు నువ్వూ నేనే.. నాకు నేనూ నేనే. అయినప్పటికి మన బాహ్య చక్షువుకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని లేదా ఒక పదార్థాన్ని లేదా ఒక అంశాన్ని వాసిలి చూడటం అద్భుతమైన విషయంగా నేను పరిగణిస్తున్నాను.” అనీ ఆశాజ్యోతి కితాబు నివ్వటం తెలుగు నేనులు చేసుకున్న అదృష్టమే.
ఇక, నా ‘నేను’ యౌగిక కావ్య విశిష్టతను, ప్రత్యేకతను, నవీనతను, శైలీ రామణీయకతను, ప్రయోగ వైశిష్ట్యాలను అవుపాసన పట్టిన ఆశాజ్యోతి “పిడికెడు గుండెలో ఇన్ని భావాలను, ఇంత ఆర్ద్రతను, ఇంత సౌందర్యాన్ని, ఇంత కమనీయతను, ఇంత పఠనీయతను నింపుకోవటానికి వాసిలి హృదయం భూగోళమంతటి విశాలమైనదైతే తప్ప మనకు అర్థం కావు.” అంటూ ఒక సందర్భంలోనూ; “ ‘వృక్షమా, మిత్ర పక్షమా’ – బ్యూటిఫుల్ అండి. అంటే, ప్రాచీన కవులకు వచ్చిందో లేదో మనకు తెలీదు, అటువంటి భావం.. అటువంటి ఆలోచనా విధానం నేనెక్కడా చూడలేదు.. నాకున్నటువంటి, నేను చదువుకున్నంతలో.” అని మరొక సందర్భంలోనూ; “ఈ కావ్యాన్ని హడావిడిగానో లేదా కంగారుగానో, ఏదో ఒక పేపర్ ప్రెజెన్టేషన్ కోసమో, నాలుగు ముక్కలు రాసేసి ముగించేద్దాము అని అనుకుంటే మాత్రం ఈ కవి ఎక్కడా మనకు అర్థం కాడు. వాసిలి రాసినటువంటి ఏ అక్షరం మనకు అందుబాటులోకి రాదు అన్నది నా వ్యక్తిగత అనుభవం, అనుభావిస్తున్నాను కూడా.” అంటూ ఇంకొక సందర్భంలోనూ ఎటువంటి తొట్రుపాటు లేకుండా, ఎటువంటి దాపరికం లేకుండా తమ రసజ్ఞతను, తమ ఉద్విగ్నతను అక్షరబద్ధం చేస్తారు.
“ఈ విశ్వం నేనే, ఈ భూగోళం నేనే, అంతా నేనే, అంతటా నేనే – అనగలిగేటటువంటి, విస్తారమైనటువంటి ఆలోచనాతత్వం కలిగిన వాసిలి ఆల్ఫ్రెడ్ కంటే ఎంతో ఉన్నతంగా కనిపించాడు.” అనీ, “ఖలీల్ జిబ్రాన్ అభిప్రాయం ప్రకారం – మనం ప్రాచీనంగాను, కాలాతీతంగాను ఒక చట్రంలో, ఒక పరిధిలో బ్రతికేస్తూ ఉంటాం. అయితే నిజానికి ఎలా బ్రతకాలి మనం? ప్రేమించగలుగుతూ, దయా కరుణా అనే లక్షణాలతో జీవించగలగాలి అనేటటువంటి తత్వంతో మనం జీవించాలి అన్న ఖలీల్ జిబ్రాన్ మాటలను వాసిలికి అన్వయించుకున్నాను – ఖలీల్ జిబ్రాన్ లాగా వాసిలి నాకు కనిపించాడు.” అనీ ఆల్ఫ్రెడ్, జిబ్రాన్‌ల సహపంక్తిన కుర్చుండబెట్టిన ఆచార్య ఆశాజ్యోతి తులనాత్మక అధ్యయనానికి అచ్చెరువొందుతూ “మనం ఎక్కడా వాసిలిని సందేహించాల్సిన పని లేదు” అంటూ “ఎందుకంటే, యోగానికి సంబంధం లేకుండా అంతర్మథనానికి, అంతర్చక్షువులకు, అంతర్దృక్పథాలకు, సంబంధంలేకుండా విశ్వాంతరాళాలతో సంబంధం లేకుండా వాసిలి ఏదీ మాట్లాడడు. అయినప్పటికీ కూడా ఆ మానవతా హృదయం, ఆ మానవతా దృక్పథం, ఆ మానవీయ కోణం బయట పెట్టుకోలేని సందర్భాలలో మనకు వాసిలి కనిపిస్తాడు.” అంటూ నా వ్యక్తిమత్వాన్ని, అక్షరతత్వాన్ని వెలికితీసిన ఆశాజ్యోతి సాహితీ ప్రతిభకు జోహార్లు పలుకుతున్నాను.
***
ఆశాజ్యోతిగారి మరికొన్ని కీలకోపన్యాసాలనూ ఒకింత పరిశీలిద్దాం –
మద్రాస్ విశ్వవిద్యాలయం – తెలుగు శాఖ 2022 అక్టోబర్ 10, 11 న నిర్వహించిన ‘విశ్వర్షి వాసిలి సాహిత్యం – వ్యక్తిత్వం, యౌగిక తత్త్వం’ అంతర్జాతీయ సదస్సులలో ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి ‘అధిభౌతికవాది డా. వాసిలి వసంతకుమార్’ అంటూ చేసిన కీలకోపన్యాసం ఈ ఏడాదే ప్రచురించిన తెలుగు కన్నడ సాహిత్య విమర్శ అయిన ‘ఆశాజ్యోతి వ్యాస విపంచి’ సంకలనంలో తొలి వ్యాసంగా రూపించటం కాకతాళీయమే అయివుండొచ్చుకానీ నావంటి అక్షరయాత్రీకునికి అతులిత ఆనందాన్నిచ్చే ఒక ఉద్విగ్న సందర్భం. నిజానికి, కొలకలూరివారి నాటి కీలకోపన్యాసం ఆత్మీయంగాను, ఉద్వేగభరితంగాను, పరిశీలనాత్మకంగాను, పరిశోధనాత్మకంగాను, సద్విమర్శనాయుతంగాను సాగిందనటం నా అభిప్రాయమే కాదు నాడు పాల్గొన్న సాహితీమూర్తులందరి అభిప్రాయం కూడా.
ఒక కీలకోపన్యాసానికి ఇంతటి సమాచార సేకరణ, అక్షరయాత్రీకుని అనేక రచనలను సాధ్యమైనంతగా అనుశీలించటం, మక్కువతో వాటిలోని మెచ్చుతునకలను ఆవిష్కరించటం, జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత రచయితల సిద్ధాంతాలతో అభిప్రాయాలతో తాము అనుశీలిస్తున్న గ్రంథకర్త అభిప్రాయాలను సిద్ధాంతాలను తులనాత్మకంగా అధ్యయనం చేయటం, సాహిత్యస్రష్ట వ్యక్తిమత్వ నిర్మాణం, సామాజిక అధ్యయనంలో రచయిత ఉన్మీలన, అక్షరశీలికి సాహిత్యంలో ఇవ్వవలసిన స్థానాన్ని నిర్థారించటం, ముఖ్యంగా అక్షరయోధుని సాహిత్యాన్ని అలుపెరుగక సమగ్రంగా అధ్యయనం చేయటం, సాహిత్యకారుడు స్పృశించిన అంశాలు తమ పరిథిలోనివి లేదా తమ ఎరుకలోనివి లేదా తమ అవగాహనలోనివి కాకపోయినా వాటి అనుపానులు తెలుసుకోవటం అనేవి ఆశాజ్యోతిగారికి పుష్కలంగా వున్న సజీవ స్వభావాలు, సాహితీ సహజాతాలు.
విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులను ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో, ఏ ఫలితాన్ని, ఏ ప్రయోజనాన్ని ఆశించి నిర్వహిస్తున్నాయో ఆ అంశాలపై కేవలం విహంగ వీక్షణంలా కాక, స్థాలీపులాక న్యాయంగా కాక, సమగ్రంగా సంపూర్ణంగా సప్రమాణంగా సాధికారికంగా విమర్శనాదృక్పథంతో, పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా అనుశీలించి కీలకోపన్యాసానికి, కీలకోపన్యాస అంశానికి సర్వసమగ్రంగా న్యాయం చేకూర్చటం అన్నది ఆచార్య ఆశాజ్యోతి సాహిత్య పరిశోధనాత్మక వ్యక్తిమత్వం, కీలకోపన్యాసకురాలిగా సాహిత్యాత్మక విజయ కేతనం.
నేను-నా రచనల విషయంలో – ఆశాజ్యోతి అనుశీలన బహుముఖీనంగా సాగి – సాధారణంగా విమర్శకులు నా సాహిత్యాన్ని చదివి నన్ను బహుముఖీనుడ్ని చేస్తుంటే – ఆశాజ్యోతి మాత్రం నన్ను నఖశిఖ పర్యంతం తెలిసిన వ్యక్తిలా, నా అక్షర క్రమవికాసనాన్ని అవుపోసనపట్టిన సాహితీదిగ్గజంలా ‘విశ్వర్షి వాసిలి ఏకోన్ముఖ జీవి’ (పుట 1) అన్న ఏకవాక్యంతో తమ కీలకోపన్యాసాన్ని ప్రారంభించారు. నా వైయక్తిక, వ్యవస్థాగత, మానసిక, అధిమానసిక ప్రవృత్తిని నా అక్షరాల నుండి జల్లెడపట్టగలిగితేనే ఇటువంటి నిర్ధారణకు రావటం సాధ్యపడుతుంది.
“కాలంతో సాగిపోక కలంతో కొత్త దివిటీలను వెలిగించిన వైవిధ్య వ్యక్తిత్వం ఉన్న కవి” (పుట 1) అని ప్రకటించటం – కలంతో కొత్త దివిటీలను వెలిగించటం అనటంతో ఉన్న మార్గాలు కాక సరికొత్త మార్గాలు అన్న అర్థాన్ని స్ఫురింపచేయటం, నా అక్షరమాల ఎలా సమాజానికి మార్గదర్శకమవుతోందో చూపటం, కాలంతో సాగిపోక అనటంతో అనుకరణ కాదని స్పష్టంగా నా వ్యక్తిమత్వ, సాహితీవ్యక్తిత్వ కోణాలపై తమ అక్షరవెలుగును ప్రసరిస్తారు. “తన చుట్టూ ఉన్న సమాజం కూడా తాను ఆవాహన చేసుకున్న తత్వాన్ని అర్థం చేసుకోవాలనీ, ఆచరించాలనీ అపేక్షించిన అధిభౌతికవేత్త” (పుట 2) అంటూ నా లక్ష్యాన్ని అందరి ముందుంచుతారు.
“ఆత్మజ్ఞతతో జ్ఞానులం కాగలమన్నది వాసిలి ఉవాచ” (పుట 2) అంటారు. “దేహ ధర్మం ఆత్మ దర్శనానికి పునాది అని డా. వాసిలి అభిప్రాయం” (పుట 6) అని నా ‘కొత్తకోణంలో గీతారహస్యాలు’ సంపుటాలను విశ్లేషిస్తూ చెబుతారు. నా “అభ్యుదయకర ఆలోచనలు నిజంగానే గీతను కొత్తకోణంలో ఆవిష్కరించాయి” అనీ, “ఇది వాసిలి ఔచిత్య గ్రహణకు నిదర్శనం” (పుట 4) అనీ నా రచనలోని నిజతత్వాన్ని ఆవిష్కరిస్తారు. అరవైయేళ్ల జీవితానుభవసారంతో శ్రీమతి ఆశాజ్యోతి “దాంపత్యానికి ఆలుమగల శారీరక, మానసిక సాన్నిహిత్యం ఎంత అవసరమో వివరించే రచన” అంటూ నా ‘పెళ్లి మైనస్ పెటాకులు’ పుస్తక వైశిష్ట్యాన్ని ఎత్తిచూపుతూ “జీవితాన్ని కాచి వడబోసిన అనుభవ సారం ఇందులో కనబడుతుంది” (పుట 8) అని స్పష్టం చేస్తారు.
‘విశ్వర్షి వాసిలి ఏకోన్ముఖ జీవి’ (పుట 1) అంటూ ఈ కీలకోపన్యాసాన్ని ప్రారంభించిన ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి ఆ ఏక వాక్యానికి వ్యాఖ్యానంగా తమ ముగింపు వాక్యాలను ఇలా మూటగడతారు – “పుట్టుక కలిగిన ప్రతి మనిషీ అనుసరించి ఆచరించవలసిన విషయాలను వాసిలి తదేక మనసుతో వ్యక్తీకరిస్తాడు. ధ్యానం, యోగం, భౌతికత, అధిభౌతికత, ఆత్మజ్ఞానం సాధించడానికి అంతులేని సహనం కావాలి. వాసిలి సహనశీలి. మానవ సమూహాన్ని తనదిగా చేసుకోవడానికి, తన మార్గంలో సమాజం నడవడానికి విశ్వమంత సహనం ప్రదర్శిస్తాడు. అధిభౌతికతను ఆస్వాదిస్తూ, భౌతిక సమాజాన్ని విశ్వాంతరాళాలలోకి సెలెస్టియల్ బ్యూటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ పరిచయం చేసి, ఆత్మప్రయాణానికి అధిభౌతిక దారులు వేసి, సుగమం చేసిన ఆత్మచోదకుడు. వీరి సాహిత్యమంతా ఆత్మ దివ్యత్వాన్ని ప్రవచించేదే. ఆత్మను అర్థం చేసుకున్న అద్భుత సాధకుడుగా, డీప్ అనాలిటికల్ పర్సనాలిటీగా డా. వాసిలి కనబడతారు” (పుట 9) అంటూ వారు తమ నా అక్షర దర్శనాన్ని అక్షరబద్ధం చేస్తారు.
“తరచి తరచి చదివితే తప్ప డా. వాసిలి కానీ, డా. వాసిలి పదప్రయోగాలు కానీ అంతు చిక్కవు. అర్థం కావు. అక్షరాలన్నీ వర్ణమాలలోనివే, ఐనా సృజించిన పద రూపాలన్నీ సామాన్య మెదడుకు త్వరగా అందనివి. ఐతే చదివే కొద్దీ, ఆస్వాదించే కొద్దీ శరీరంలోకి, మెదడులోకి ఇంకడం ప్రారంభం అవుతుంది” అంటూ నా పదవిన్యాస వాస్తవాన్ని విశ్లేషిస్తూ నా జీవనప్రస్థానంలోని నిర్మాలిన్యాన్ని, సమాజగత సమాజహిత అంతులేని పోరాటాన్ని, యోగాత్మకజీవన ప్రస్థాన తపనను – ఆత్మానుభూతిని అందుకున్న ఈ విశ్వజీవిలో ఉందంటూ, నా కలం నుండి మరింత సమాజహిత సాహిత్య సృజనను ఆకాంక్షిస్తూ తమ కీలకోపన్యాసాన్ని ముగిస్తారు.
***
2015 సెప్టెంబర్ 29న విక్రమసింహపురి విశ్వవిద్యాలయం – నెల్లూరు జాషువా కవితా పీఠం సంయుక్తంగా నిర్వహించిన జాషువా 125వ జయంతి సందర్భంగా ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి ‘జాషువా కవిత్వం – వేదనా మాధుర్యం’ శీర్షికన చేసిన కీలకోపన్యాసం ఈ సంకలనంలోని రెండవ పత్రం. నిజానికి జాషువా కవిత్వం వేదనామయ అక్షరాలకు పుట్టిల్లు. ఎవరికైనా బయటి ఎంతటి వేదన అయినా పుట్టినింట మాధుర్యంగానే మారుతుంది. తెలుగింటి ఆడపడుచుగా ఆశాజ్యోతి ఈ వాస్తవికతా ఎరుక కలవారు కాబట్టే “ఆధునిక తెలుగు పద్యానికి చీర సారెలు పెట్టి, గుండె నిండుగా ప్రేమించి, తెలుగు పద్యమనే స్త్రీమూర్తికి వడిబియ్యం చెరుగు నిండుగా పోసి సాహిత్య కుటుంబంలోకి పాదం మోపించి ఘనకీర్తిని మూటగట్టుకొన్న జాషువా తిరుగులేని చైతన్యశక్తి!” (పుట 23) అంటూ ఈ కీలకోపన్యాసాన్ని ముగించారు.
వృత్తపద్య రచనలో జాషువా కవన కౌశలాన్ని వివరిస్తూ “మొదటి మూడు పాదాలలో విషయవివరణతో విస్తరణ చేసి.. నాల్గవ పాదంతో పద్యాన్ని పతాక స్థాయికి తీసుకుపోవటం జాషువా కవితా శాబల్యతకు నిదర్శనం” అంటూ జాషువా కవిత్వ తీరుతెన్నులను మథించిన ఆచార్య ఆశాజ్యోతి జాషువాను ఆధునిక తెలుగు కవుల తొలి వరుసన కూర్చుండబెడతారు. “వ్యక్తావ్యక్త స్థితిలో అర్థనిమీలిత యోగస్థితిని కలిగిస్తాడు జాషువా” అంటూ మనల్నీ జాషువా ధ్యాసలో మగ్నం చేస్తారు. జాషువా కవిత్వాన్ని కరుణరసభరితం చేసిన ఇతివృత్తం ఆకలి. జాషువా ఆకలిలో కరకరమనే ప్రేవుల కడుపుమంట వస్తువై “సర్వమానవ సమానత్వాన్ని సమతను ఆశించింది. ఆక్రోశించింది. కన్నీటి చెలమను ఊరించింది.” అన్న ఆశాజ్యోతి గళమే “ప్రతీ పేదవాడికి ప్రేమ వాత్సల్యాలను పంచిన మనీషి జాషువా” (పుట 14) అంటూ పలవరించింది.
అలా పలవరిస్తూనే “అక్షరాన్ని ఏడిపించగల ధీరుడు జాషువా” (పుట 12) అని మనసులోని మాటను అక్షరబద్ధం చేస్తూనే “తన కవిత్వంలో తాను ప్రతిఫలించి చూపాడు” (పుట 12) అంటూ కవిగా జాషువాకు వందకు వంద మార్కులు వేస్తారు. “శ్రీకృష్ణదేవరాయలు బ్రతికుంటే జాషువా కవిత్వం వింటే కరిగి కన్నీరవుతాడేమో! ధూర్జటి పలుకుల్లోని మాధుర్యం ఆస్వాదించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ గుండెలు పిండేసే కవిత్వానికి ఏ గౌరవాలనందించేవాడో!” (పుట 15) అంటూ వాపోతారు. “వేదనా మాధుర్యంగా, హృదయ దఘ్నంగా రాసి అఖండ కీర్తి పొందాడు జాషువా” (పుట 16) అని తేల్చేస్తారు. “తన సమకాలికులు చూపించని విశ్వమానవ లక్షణం జాషువా చూపించగలిగాడంటే ఎంతటి క్రాంతదర్శనం ఉండాలో – వ్యక్తికి ఎంతటి చైతన్య లక్షణం ఉండాలో తన జీవితాన్ని ఉదాహరణంగా చూపిన కవి జాషువా!” (పుట 19) అంటూ ఆశాజ్యోతి అక్షరాంజలి ఘటించారు.
***
2023 డిసెంబర్ 29, 30 తారీఖుల్లో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించిన ‘శ్రీ మహాభాగవతం – భక్తితత్వం’ రెండు రోజుల జాతీయ సదస్సులలో 29న ‘శ్రీమదాంధ్ర భాగవతం – పోతన వ్యక్తిత్వం’ శీర్షికన ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి చేసిన కీలకోపన్యాసం ఈ సంకలనంలో పదవ పత్రంగా కనిపిస్తుంది. ఉపోద్ఘాతంలోనే “పోతన భక్తి కవి మాత్రమే కాదు ప్రజల కవి కూడా. కారణం భక్తితో పాటు ఆయా సందర్భాలలో ప్రజా సమస్యలతో పాటు అవసరమైనప్పుడు ముక్కుసూటిగా మాట్లాడడమే కాకుండా అవసరమైన సందర్భాలలో తిరగబడడం, అనుకున్నది సాధించడం, తన మాట మీద నిలబడడం వంటి ప్రాథమిక లక్షణాలతో పాటు, ప్రజాకవిగా నిలబడి భక్తి నేపథ్యంగా ప్రజలను తన వెంట భక్తి తాదాత్మ్యంలోకి తీసుకెళ్లగలిగాడు” (పుట 78) అంటూ నాలుగు వాక్యాలలో పోతన వ్యక్తిత్వాన్ని మనముందు నిలుపుతారు. “భాగవతంలో ప్రతి అక్షరంలో పోతన కబడతాడు. కవిగా పోతన్న శైలి, మృదుమధురమైన పదాల పోహళింపు అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి తీసుకెళుతుంది. ఇటువంటి అనుభవైకవేద్యమైన అనుభూతిని అందించే అనేక సందర్భాలలో పోతన వ్యక్తిత్వం తనదైన ముద్రను బలంగా నిరూపిస్తుంది.” (పుట 80) అని మరొక సందర్భంలో పోతనకు అక్షర నీరాజన మిస్తారు ఆశాజ్యోతి.
ఈ కీలకోపన్యాసంలో ఆచార్య ఆశాజ్యోతి పోతన విషయంలో నిగ్గుదేల్చిన కొన్ని అంశాలు –
- ఇష్టదేవతా ప్రార్థన అద్వితీయంగా చేసిన ఘనత పోతనది. (పుట 81)
- పోతన నడిపిన పద్య శైలి అనితరసాధ్యం. (పుట 81)
- పద్యానికి మాధుర్యాన్ని అలదిన సందర్భాలు భాగవతంలో ఇబ్బడి ముబ్బడిగా కనబడతాయి. (పుట 82)
- భార్యాబిడ్డల పోషణార్థమై కావ్యకన్యకను కూళలకు ఇచ్చి ఆ పడుపు కూడు భుజించడం కంటే కవులు రైతులైనా ఫర్లేదు; అడవుల్లో పుట్ట తేనె, కందమూలాలను తెచ్చుకున్నా ఫర్లేదు అని చెప్పడంలో – స్థిర నిర్ణయం, మొక్కవోని ధైర్యం, తెగింపు కనబడ్డమే కాదు, కుటుంబ పోషణకు మరెన్నో దారులున్నాయని, ముఖ్యంగా వ్యవసాయం రాజు దయాదాక్షిణ్యాల కంటే శ్రేష్ఠమైందని మనసా వాచా కర్మణా నమ్మాడు. రాజ ప్రాపకమే ఆధారం కానక్కర లేదు అనడంలో తిరుగులేని స్థిర చిత్తం కనబడుతుంది. (పుట 83)
- మొసలి పట్టును, గజరాజు పోరాటాన్ని లయాత్మకంగా పోతన నడిపిన తీరు అజరామరం. గజరాజు ఆర్తి, మొసలి పట్టు – ఒకదానితో ఒకటి చేసే పోరాటం దృశ్యకావ్యంలా నడిపిన పోతన రచనా శైలి అనితరసాధ్యం. (పుట 84)
- పసి బాలుడు, తండ్రి హిరణ్య కశిపుడు మధ్య సాగే వాదోపవాదాలు బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో ఎక్కడా లేదు అనడంలో సందేహం అవసరం లేదు. (పుట 84)
- ‘రుక్మిణి కళ్యాణం’లో రుక్మిణి గుండె ధైర్యం స్త్రీ పరంగా చూస్తే అద్భుతమనిపిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి రమ్మనడంలో, వచ్చేస్తానని బ్రాహ్మణుడితో కబురు పంపుతుంది. రాక్షస వివాహానికి సిద్ద పడుతుంది. స్త్రీ మనస్సును సరిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా పోతన కనబడతాడు. (పుట 85)
- పోతన మానవ మనస్తత్వం లోతుగా అర్థం చేసుకున్న మానసిక నిపుణుడు అనిపిస్తాడు. (పుట 86)
ఇక, ‘ముగింపు’లో కొలకలూరి ఆశాజ్యోతి అవగాహన – “తెలుగు వర్ణమాల పోతనకు భక్తితో దాసోహమన్నది.”; “పరుషాలైన కచటతపలు కూడా సరళాలై హరినామ స్మరణలో లెక్కకు మించిన పద్యాలు అజరామరంగా నిలిచిపోయాయి.”; “ఇతర కవులలో కనబడే తీవ్రత, ఉగ్రత ఏమాత్రం కనబరచకుండా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం, మృదుమధురంగా చెప్పడం పోతనలోని రసావేశ వైశద్యానికి, పద్య రచనా కౌశలానికి, ప్రసన్న మధురమైన భావ ఫణితికి, వీనుల విందైన శబ్ద సంధానానికి, హృదయ మార్దవానికి ముకుళితహస్తులు కాని తెలుగు పాఠకుడు లేడు.” (పుట 87).
చివరి మాటలుగా ఆశాజ్యోతిగారు “పోతనలా కవిత్వాన్ని మరే కవి పలికించలేదనడంలో సందేహం లేదు” అని అలవోకగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ “పోతన పునర్జన్మ లేకుండా చేసుకోవాలనుకున్నాడు. నిజమే, పోతనకు పునర్జన్మ లేదు. కారణం, పోతనకు మరణం లేదు. ప్రతి తెలుగు లోగిళ్లలో భాగవతం పద్య రూపేణా అజరామరంగా నిలిచిపోయింది. పోతన ప్రతీ మదిలో తరాల అంతరాలను దాటి విశ్వాంతరాళాల సాక్షిగా నిలిచాడన్నది అక్షర సత్యం.” (పుట 87) అంటూ తమ భక్తిని పోతన భక్తిమత్వంలో నింపి ఈ కీలకోపన్యాసాన్ని మనకు అందించారు. ఆశాజ్యోతిగారు “పోతనకు మరణం లేదు” అన్నప్పుడు నాకు మా మాస్టర్ సి.వి.వి. యోగ లక్ష్యంగా చెప్పుకునే ‘ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ’ అన్న పదం స్ఫురించింది. ‘ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ’ని భౌతిక అమరత్వం అని పద అర్థంలో చెప్పుకుంటున్నప్పటికీ ఆశాజ్యోతిగారు చెప్పినట్టుగా ‘అజరామరం’ అని చెప్పుకోవచ్చుకదా అనిపించింది. పోతన భక్తి మార్గంలో అజరామరుడయితే యోగమార్గంలో పోతనది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ.
***
2022 అక్టోబర్ 28, 29 తేదీలలో పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ‘తెలుగు సాహిత్యం – జాతీయోద్యమ ప్రభావం’ అంతర్జాతీయ సదస్సులలో చేసిన ‘జాతిని జాగృతి పరచిన జాతీయోద్యమ సాహిత్యం’ కీలకోపన్యాసం ఈ సంపుటిలో పదహారవ పత్రంగా ప్రచురితమైంది.
“జాతీయోద్యమ సాహిత్యం ఒక జాతి అస్తిత్వాన్ని, సార్వభౌమ తత్వాన్ని, ఆత్మ తత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, జాతి ఏకత్వాన్ని ఏకమొత్తంగా ఒక సంఘటిత లక్షణాన్ని తెలుపుతుంది” (పుట 126) అంటూ ప్రారంభంలోనే జాతీయోద్యమ సాహిత్య లక్షణాన్ని చెప్పటమే కాక ఆ లక్షణమే జాతీయోద్యమ సాహిత్య ప్రయోజనమూ, ప్రభావమూ అన్న అర్థం స్ఫురించేలా తమ కీలకోపన్యాసాన్ని ప్రారంభించారు ఆశాజ్యోతి.
జాతీయోద్యమ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ “బ్రిటిష్ వ్యతిరేక కవిత్వానికి 1895లో కాకినాడలో బీజం పడిరది. ఈ సభలోనే చిలకమర్తి 14 పద్యాలు చదివారు” (పుట 127) అంటూ చారిత్రక నేపథ్యం నుండి “మూఢాచార నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలన, గతవైభవ పునర్నిర్మాణం, నాటి రాజకీయ నాయకుల నిర్యాణ స్మృతి, సమకాలీన రాజకీయాంశాలతో ఎందరో కవులు జాతీయోద్యమ స్ఫూర్తిని సమాజంలో తమ కవిత్వంతో నింపారు.” (పుట 128) అంటూ జాతీయోద్యమ కవిత్వాంశల ప్రస్థానాన్ని పేర్కొంటారు. తొలిగా “దళిత అస్తిత్వ చైతన్య స్ఫూర్తిని రగిలించిన దళిత కేతనం కుసుమ ధర్మన్న”ను గురించి చెబుతూ, కుసుమ ధర్మన్నలో భారత జాతీయాభిమానమే కాక, ఆంధ్రాభిమానమే కాక “నల్ల జాతీయులకు కనుక అధికారం వస్తే నిచ్చెన మెట్ల వ్యవస్థ సమాజంలో దళితుల బతుకులు మరింత దీనతకు గురవుతాయని మూడో కోణాన్ని దర్శించిన దార్శనికుడు కుసుమ ధర్మన్న” (పుట 129) అని నొక్కి చెబుతారు.
అలాగే “దళిత చైతన్యంపై, దళితులు సాధించబోయే విజయాలపై అసాధారణ నమ్మకం కలిగిన వ్యక్తిగా మంగిపూడి గణనీయమైన వ్యక్తిత్వంతో చరిత్రలో మిగిలారు” (పుట 130) అంటూ భవిష్యవాణిని మనముందు వినిపిస్తారు. జాతీయోద్యమంలో గీతాలు, పత్రికల పాత్రను వివరిస్తూ “జాతీయోద్యమ ప్రచారానికి పత్రికలు ప్రధాన వాహికలని భావించిన సర్వోత్తమరావు ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించాడు. రాజకీయ నేరానికి శిక్ష అనుభవించిన తొలి సంపాదకుడు గాడిచర్ల వారే” (పుట 131) అంటూ సంపాదకుల పాత్ర ఎంత బలమైందో చూపుతారు.
జాతీయోద్యమంలో నవలల పాత్రను గురించి చెబుతూ బెంగాలీ నవలల ప్రభావం తెలుగు ప్రాంతంపై అధికంగా ఉందంటారు. గాంధేయ వాదాన్ని, జాతీయోద్యమాన్ని నేరుగా ప్రతిబింబింప జేసిన నవల 1920లో వేలూరి శివరామశాస్త్రి రాసిన ‘ఓబయ్య’ అని అంటూ; జాతీయోద్యమ తత్వం, దాని భిన్న దశలను ఉద్వేగంతో మనసుకు హత్తుకునేలా సాగిన ‘మాలపల్లి’ నవలను ఉన్నవ లక్ష్మీనారాయణ బలంగా చిత్రించారంటారు. 1924లో రచించిన ‘కుటీర లక్ష్మి’ తొలి జాతీయోద్యమ కథగా పేర్కొంటారు ఆశాజ్యోతి. విస్తృతమైన నాటక సాహిత్యం జాతీయోద్యమ చైతన్యాన్ని రగల్చటమే కాక, స్వాతంత్య్ర కాంక్షను పురికొల్పాయి అన్నది జాతీయోద్యమ ప్రభావాలలో నాటకాల పాత్ర విషయంలో ఆశాజ్యోతి విశ్లేషణ.
“వీరుల త్యాగాల ఫలం నేటి మన స్వేచ్చాభారతం” (పుట 134) అంటూ ఒకటి రెండు పేరాలలో జాతీయోద్యమంలో జానపద సాహిత్యాన్ని స్పృశించి వదిలేస్తారు. జానపదం అంటే ఎక్కడలేని ఉత్సాహంతో చైతన్య భాసురమయ్యే ఆశాజ్యోతిగ ఇలా పొడిపొడిగా జానపదసాహిత్యాన్ని తడమటం అంతగా జానపదుల సాహిత్యంలోకి జాతీయోద్యమం రాకపోవటమే అయ్యుండొచ్చు. జాతీయోద్యమంలో స్త్రీల సాహిత్యాన్ని విశ్లేషిస్తూ “దువ్వూరి సుబ్బమ్మతో మొదలై కొత్త లక్ష్మీ రఘురామయ్య వరకు సుమారు 68మంది స్వాతంత్య్ర సమరంలో తెలుగు మహిళలు పాల్గొన్నారు” అంటూ “స్త్రీ విద్యను ఆకాంక్షించిన సుమారు 92 మంది రాసిన కథలు మనకు ‘దిద్దుబాటలు’ కథాసంకలనంలో కనబడతారు” (పుట 135) అంటూ జాతీయోద్యమంలో స్త్రీల సాహిత్యాన్ని గురించి విఫులంగానే పేర్కొంటారు. జాతీయోద్యమ సాహిత్యం బహుముఖాలుగా విస్తరించటం, పదునైన ఆలోచనలతో ఊపిరి లూదటం చేయటమే కాక జాతీయోద్యమానికి ముందు, తర్వాత అని చూసే స్థితి-గతి కల్పించిన అజరామరమైన సాహిత్యం అంటూ ఆచార్య ఆశాజ్యోతి ఈ కీలకోపన్యాసానికి స్వస్తి వచనం పలుకుతారు.
***
2024 మార్చ్ 4 నాడు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘వైష్విక్ పరిపేక్ష్య మే హిందీ అనువాద్’ పేరిట జరిగిన జాతీయ సదస్సులో ఆంగ్లంలో ఇచ్చిన కీలకోపన్యాసం “Literary Translation is an Art” 33వ పత్రంగా 39 పత్రాలున్న ‘ఆశాజ్యోతి వ్యాస విపంచి’లో ప్రచురింపబడిరది.
కన్నడ సాహిత్యం – అనువాదాలు విషయ ప్రధానంగా సాగిన కీలకోపన్యాసం ఇది. ప్రారంభంలోనే – “Translation is a re-creation to a creation.. Translation is always a beautiful panorama depicts the essence of Literature & Culture of a language.. Translation connects people and languages.. Literary Translation is a text in a target language that represents other pre-existing text in some other language” (Page 276) అంటూ అనువాద ప్రయోజనాలను గుదిగుచ్చే ప్రయత్నం చేశారు. తమ ఈ ప్రయత్నానికి పొడిగింపుగా –
“Translation expands the horizon of knowledge, conveys new cultural modes and fosters understanding and goodwill between them. Different cultures and literatures of the world have been coming closer through translation. Literary translation is the most important and powerful instrument for bringing about a cultural integration between the nations with diverse literary conventions, languages and linguistic cultures and art forms.” (Page 277) అంటూ సాహిత్యానువాద ఆవశ్యకతను విడమరిచి చెబుతారు.
కన్నడంలో వచ్చిన అనువాదాలను, కన్నడంనుండి అనువదింపబడ్డ రచనలను సమగ్రంగా అందించే ప్రయత్నం ప్రారంభానికి ముగింపుకి మధ్యనున్న భాగంలో చూడగలం.
Writers make national literature, while translators make universal literature అని Jose Saramago అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ అనువాద సాహిత్యంపై తమ కీలకోపన్యాసాన్ని ముగిస్తూ –
- Literary translation is a necessary and ongoing activity and in spite of its inadequacy remains one of the most important and worthiest concern in the totality of translation work.
- Humanity, human feelings and emotions play key role in translation along with context and culture.
- Literary translation bridges the two different communities and enable to enjoy the sensitivity and sensibility of the source language.
అంటూ ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి నుడివిన కొన్ని అంశాలు మనం అనువాద విషయంలో సదా గుర్తుంచుకోదగ్గవి.
***
మొత్తానికి ఆచార్య ఆశాజ్యోతి – కీలకోపన్యాసాల ప్రస్థానంలో – ఒక టోన్, ఒక ప్రత్యేక ముద్ర గల సాహితీ వ్యక్తిత్వ సంపన్నురాలు అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ప్రసంగ పరంగా ఒక సమతూకాన్ని సాధ్యం చేసుకుంటూనే ఒక ఎమోషనల్ స్టేట్ లోనూ ప్రసంగించగలరు. పైన ప్రస్తావించిన కీలకోపన్యాసాలలో నా “నేను” యౌగికకావ్యంపై చేసిన ప్రసంగంలోనూ, ‘అధిభౌతికవాది డా. వాసిలి’ అంటూ చేసిన కీలకోపన్యాసంలోనూ, ‘భాగవతం’పై చేసిన ప్రసంగంలోనూ, ‘జాషువా’పై చేసిన ప్రసంగంలోనూ ఈ ముద్ర స్పష్టంగా చూడగలం. ‘జాతీయోద్యమ సాహిత్యం’, Literary Translation పై చేసిన కీలకోపన్యాసాల పరంగా ఆశాజ్యోతి సేకరించిన సమాచారం, విషయ విశ్లేషణ, తులనాత్మక అధ్యయనం ఎంతటి విలువైనవో స్పష్టంగా అగుపిస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే – ఆచార్య ఆశాజ్యోతి కీలకోపన్యాస కర్తృత్వంలో ఒక ఆదర్శ సృజనశీలి మాత్రమే కాకుండా కీలకాంశాల పట్టు, పొత్తు తెలిసిన కీలకోపన్యాసాల ఆశాజ్యోతి – అన్నది నా గాఢ అభిప్రాయం.
‘విశ్వర్షి వాసిలి’ పూర్తి పేరు వాసిలి వసంతకుమార్. పుట్టింది 1956 జులై 10 న. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. అందుకున్నారు. వీరు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలకు తమ వీక్లీ కాలమ్స్ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా చిరపరిచితులు. వీరి “నేను” అనే యోగిక కావ్యం తెలుగులో తొలి యోగిక కావ్యంగా పరిశోధకుల, విమర్శకుల మన్ననలు పొందింది. వీరి రచనలు 77 సాధనారహస్యాలు, 56 ఆత్మదర్శనాలు, కొత్తకోణంలో గీతారహస్యాలు, ప్రజ్ఞానరహస్యాలు, అతీంద్రియరహస్యాలు : బ్లవట్స్కీ మొదలైన తాత్విక యోగ గ్రంథాలు అనేకముద్రణలు పొంది బహుప్రసిద్దాలు. ఇవికాక వ్యక్తిత్వవికాస పుస్తకాలైన విన్నర్ : గెలవాలి గెలిపించాలి, సిగ్గుపడితే సక్సెస్ రాదు, టైం ఫర్ సక్సెస్, ఒత్తిడి ఇక లేనట్లే, లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం, మనసును గెలవాలి, మనకే తెలియని మన రహస్యాలు మొదలైనవి. ప్రస్తుతం సికింద్రాబాద్ లో యోగాలయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వీరిని 93 93 93 39 46 సెల్ నెంబర్ పైన సంప్రదించవచ్చు.